పటిష్టమైన స్టార్టప్‌కు 10 సూత్రాలు !

-

పటిష్టమైన స్టార్టప్‌కు 10 సూత్రాలు !

Saturday November 07, 2015,

5 min Read

గెస్ట్ రచయిత - సుచి అగర్వాల్.


నా అనుభవాలను ఇతరులతో పంచుకుని.. వాళ్లకూ కనువిప్పు కలిగించేందుకే నేను ఈ ఆర్టికల్ రాస్తున్నాను. నేను కొన్ని స్టార్టప్స్‌లో పనిచేశాను. రెండు స్టార్టప్స్‌ ఇప్పుడు సొంతంగా నిర్వహిస్తున్నాను కూడా. వీటిల్లో పనిచేయడం చాలా ప్రోత్సాహరకరంగా, ఆనందంగా ఉంటుంది. స్టార్టప్ వాతావరణంలోనే ఏదో తెలియని.. ఎనర్జీ ఉంటుంది. ఎంత సేపైనా పనిచేయాలని అనిపించడమే కాదు.. ఏ విభాగంలోకైనా దూరిపోయి.. అన్ని పనులూ మనమే చేయడం కూడా మాంచి కిక్ ఇస్తుంది. నేర్చుకోవడమనేది మన దినచర్యలో భాగమైపోతుంది. స్టార్టప్‌లో పనిచేయడం వల్ల వచ్చే ఎక్స్‌పోజర్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు.. అది కూడా సిలికాన్ ఆఫ్ ఇండియా అయిన బెంగళూరులో..

నేను చివరగా పనిచేసిన స్టార్టప్‌ అనుభవం చాలా షాకింగ్‌గా ఉంటుంది. ఆ కంపెనీ చేరిన మొదటి రోజు చాలా పాజిటివ్‌గా ఉంది. నాకు తెలిసిన విషయాలన్నింటినీ.. అత్యుత్సాహంతో కంపెనీ టెక్నికల్ పార్ట్‌నర్‌తో పంచుకున్నాను. ఓ టిపికల్ స్టార్టప్ రూపొందించాలనే ఆత్రంతో ఆ తర్వాత రోజుల్లో నాకు చుక్కలు కనిపించాయి. ప్రొఫెషనలిజం పరిధులు దాటి మరీ.. వ్యవహారం శృతి మించింది.

ఆఫీస్ ఫ్రిడ్జ్‌లో బీర్ క్యాన్స్‌తో పాటు పూర్తిస్థాయిలో బార్ తరహా టేబుల్ కూడా ఉంది. నేను చేరిన మొదటి వారంలోనే అక్కడ జరిగిన ఓ ఘటన నాకు దిమ్మతిరిగినంత పనైంది. ప్రొఫెషనల్‌గా దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ జీర్ణించుకోలేకపోయాను. సీఈఓతో మీటింగ్ జరుగుతోంది. ఆయన నా ఎదురు డెస్క్‌లో కూర్చుకున్నారు. మా కలీగ్.. (సారీ.. తనో లేడీ) మా బాస్‌ తల మర్దనా చేస్తోంది. అది కూడా ఆయిల్ మసాజ్. అది చూసి నాకు... ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదో మాట్లాడదామని వెళ్లి.. ఆ పరిస్థితి చూసి వెనక్కి వచ్చేశాను.

image


ఇలా ఒక్కటేమిటి.. ఎన్నో.. ఎన్నెన్నో. కానీ పరిస్థితి చేజారిపోకముందే.. నేను బయటకు వచ్చేశాను. స్టార్టప్స్‌లో మరీ స్ట్రిక్ట్‌గా ఉండే వాతావరణమైనా ఉంటుంది.. లేకపోతే.. ఇలా ఎవరూ ఊహించనంత ఫ్రీ హ్యాండ్ అయినా ఉంటోంది. కానీ కనీస క్రమశిక్షణ అనేది ఏ సంస్థకైనా చాలా ముఖ్యం. ఆ బాధ్యత మాత్రం పూర్తిగా వ్యవస్థాపకులదే. వాళ్లే టీంలో ఆ డిసిప్లిన్‌ నింపాలి.

రూల్ # 1

ఫ్రెండ్స్ వేరు.. కలీగ్స్ వేరు

ప్రతీ స్టార్టప్ ఫౌండర్ పాటించాల్సిన ముఖ్యమైన మొట్టమొదటి రూల్ ఇది. మీ స్నేహితులు, బంధువులు ఎవరైనా కంపెనీలో చేరి మీ జర్నీలో భాగం కావొచ్చు. కానీ ఇతరుల మాదిరే వాళ్లూ తమ ఫ్రొషెషనల్ సత్తాను చాటుకోవాలి. ఇక్కడ తరతమ బేధాలు పాటించకూడదు.

రూల్ # 2

లీగల్ ఫార్మాలిటీస్‌ను లైట్ తీసుకోవద్దు

మీది ఓ స్టార్టప్ అయిండొచ్చు. ఎవరూ కాదనరు. అలా అనీ కనీస ఫార్మాలటీస్ పాటించకుండా ఉండొద్దు. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా మీ స్నేహితులు కంపెనీలో చేరొచ్చు. కానీ ఇతరులు కనీసం ఓ ఆఫర్ లెటర్ అయినా మీ సంస్థ నుంచి కోరుకుంటారు. అందుకే పేపర్ వర్క్ విషయంలో పక్కాగా ఉండండి. రేపు ఈ టీం మీ సంస్థతో ఉండకపోవచ్చు.. కానీ మీ గురించి మాత్రం వాళ్లు గొప్పగా చెప్పుకునేట్టు ఉండాలి.

రూల్ # 3

ఉద్యోగులను గౌరవించండి. మీ అవసరం కోసం వాళ్లను నియమించుకున్నారు.

ఉద్యోగులు వాళ్ల పనితనాన్ని కనబర్చేందుకు ఓ అవకాశం ఇవ్వండి. వెంటనే.. ఓ నిర్ణయానికి వచ్చేయకండి. మీ కంపెనీ, వాతావరణం, మీ సంస్థ సంస్కృతిని అర్థం చేసుకుని కంఫర్ట్ జోన్‌లోకి వచ్చేందుకు వాళ్లకు కొంత సమయం పడ్తుంది. వాళ్లను, వాళ్ల పనితనాన్ని నమ్మండి. మీ ప్రొడక్ట్‌ను మెరుగుపర్చేందుకు వాళ్లు ఏదైనా సలహా ఇస్తే వాటిని పాటించే అవకాశం ఉందేమో పరిశీలించండి, ఊరికే కొట్టిపారేయొద్దు.

రూల్ # 4

ఉల్లాసభరితమైన ఆఫీస్ సంస్కృతిని రూపొందించండి, అసహ్యించుకునేలా కాదు.

హెడ్ మసాజ్‌లకు స్ట్రిక్ట్ నో .. నో ! ఈ స్ట్రెస్ ఉద్యోగాల మధ్య జోకులు, పిచ్చాపాటి కబుర్లు, ఫన్.. వంటివి ఒక స్థాయి వరకూ ఓకె. కానీ దానికీ ఓ పద్ధతుంది. క్రమశిక్షణ గీత దాటకుండానే. ఇక్కడ ముఖ్యంగా వ్యవస్థాపకులే.. మార్గదర్శకులుగా నిలవాలి. ఉద్యోగులతో మరీ కరకుగా ఉండడం, లేదంటే.. మరీ అలుసు ఇచ్చే చులకనైపోవద్దు. ఉద్యోగాలతో వ్యక్తిగత విద్వేషాలు పెంచుకోవద్దు.

రూల్ # 5

సరళంగా ఉండండి, మీ ఉద్యోగులేం పనిదొంగలు కాదు.

కంపెనీ పెరిగే కొద్దీ ఉద్యోగుల నిర్వాహణకు కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. మహిళల విషయంలో ఇది మరీ ముఖ్యం. మీ దృష్టిలో పని చాలా ముఖ్యమే.. కానీ వ్యక్తిగత జీవితం కూడా అంతకంటే అవసరం. అందుకే ఎప్పుడైనా వర్క్ ఫ్రమ్ హోం అవకాశాన్ని కల్పించడమో.. లేకపోతే.. ఎప్పుడో ఓ సారి త్వరగా ఇంటికి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వడమో చేయండి.

రూల్ # 6

ఒకరిపై అభిమానం చూపి ఇతరుల్లో విద్వేషాలు రెచ్చగొట్టద్దు

ప్రతీ ఉద్యోగీ మీ సంస్థకు ముఖ్యం. ఓ వ్యవస్థలో ఎవరి అవసరం, ఎవరి ప్రాముఖ్యత వాళ్లకు ఉండనే ఉంటాయి. ప్రతీ ఒక్కరికీ ఒకే రకమైన బలం, బలహీనతలు ఉండవు. ఎవరి సత్తా ఏంటో తెలుసుకుని.. వాళ్లను అక్కడ నియమించి పనిచేయించుకోవడం ఒక ఆర్ట్. దాన్ని తెలుసుకోండి. ఉద్యోగిని అర్థం చేసుకోండి. లేకపోతే.. ఒకరికి ఒకరు రేస్ గుర్రాల్లా ఉంటారు అంతే.. ! అందులో గెలిచేది ఒకరే.. కానీ.. ఓడిపోయింది ఎంత మందో.. దాని వల్ల నష్టమెంతో బేరీజు వేసుకోండి.

రూల్ # 7

సున్నితంగా వ్యవహరించండి.

మీ కంపెనీకి వచ్చిన, వస్తున్న ఆదాయం గురించో.. లేకపోతే ఫండింగ్ గురించో.. ఎక్కువ, తక్కువ మాట్లాడకండి. మీ ఉద్యోగుల ముందు షో ఆఫ్ వద్దు. ఒకప్పుడు మీ దగ్గర ఇంత డబ్బు, హోదా ఉండి ఉండకపోవచ్చు. మీకు విజయాన్ని అందించడానికి మీ టీం అంతా రాత్రింబవళ్లు ఎంత కష్టపడ్తున్నారో గుర్తుంచుకోండి.

రూల్ # 7

శక్తియుక్తులు పెంచుకోండి. బలాబలాలు తెలుసుకోండి.

ఓ స్టార్టప్ సిఈఓ అంటే.. ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. ఒక్కోసారి ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు.. కొన్ని ప్రాధమిక విషయాలపై కూడా మీకు అవగాహన ఉండకపోవచ్చు. వాటిని తెలుసుకోండి, నేర్చుకోండి. అన్నీ నాకే తెలుసు అనే ట్యాగ్ తగిలించుకుని తిరగడం వల్ల నష్టం మీకూ, మీ కంపెనీకే. ఉద్యోగులకు ఓ మంచి రోల్ మోడల్... ఎదురుగా కనిపిస్తే... వాళ్లనే అనుసరిస్తారు. వాళ్లలా చేయాలని అనుకుంటారు. అలాంటి రోల్ మోడల్ మీరే ఎందుకు కాకూడదు ?

రూల్ # 9

మీ భాష, మీ భావాలతో భయపెట్టొద్దు

మీరు వాడే భాష, మీ బాడీ లాంగ్వేజ్ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. మీ ఆఫీస్ వాతావరణమంతా దానిపైనే ఆధారపడి ఉంటుంది. టీమ్ సభ్యులను అందరి ముందూ తిట్టడం, అరవడం, ఆవేశపడిపోడం చేయొద్దు. దీనివల్ల ఉత్పాదకత తగ్గిపోతుంది. కొత్త ఐడియాలు మీతో పంచుకునేందుకు.. వాళ్లు సిద్ధపడకపోవచ్చు. కంపెనీ మిషన్‌లో వాళ్లూ పాల్గొనేందుకు సంసిద్ధత చూపకపోవచ్చు.

రూల్ # 10

సానుభూతి అవసరం.

ఉద్యోగులకు ఏదైనా అవసరమొచ్చినప్పుడు ఆదుకుంటారనే భరోసా నింపాలి. కష్టాల్లో సాయం అందించాలి. మీ స్టార్టప్ అభివృద్ధిలో వాళ్లూ భాగమే అని గుర్తుంచుకోండి. ఒకవేళ ఎవరైనా ఉద్యోగిని తీసేయాల్సి వస్తే... మొహమాటపడొద్దు. అదే సమయంలో డిగ్నిటీ పాటించండి. రాత్రికి రాత్రే ఎవరినైనా పంపించేయాల్సి రావొచ్చు. కానీ.. ఈ ప్రాసెస్ అంతా సాఫీగా సాగేలా చూడండి.


ఇప్పుడు దేశంలో స్టార్టప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కానీ చాలా మంది వ్యవస్థపాకులు బేసిక్స్ కూడా పాటించడం లేదు. ఒక్కోసారి అమితమైన అధికారం చూపించడం, నిధులు వచ్చిన వెంటనే.. ఆలోచనలు మారిపోవడం వంటివి ఒక ఎత్తైతే.. కంపెనీ పెరుగుతున్నకొద్దీ.. కనీస మానవతా విలువలు మర్చిపోయే స్థితి దాపురిస్తోంది. తమ శక్తియుక్తులను సరైన దారిలో ఉపయోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

గూగుల్, ఫేస్ బుక్ వంటి సంస్థల్లా.. మీ స్టార్టప్‌ కూడా ఓ రోల్ మోడల్‌లా ఉండేందుకు చూడండి. మార్క్ జుకర్‍బర్గ్, లారీ పేజ్ వంటి వాళ్లు గొప్ప ఫౌండర్స్ అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి.

(Disclaimer: The views and opinions expressed in this article are those of the author and do not necessarily reflect the views of YourStory.)

Suchi Agarwal

Suchi Agarwal, a graduate from SIMC, Pune, has over a decade of experience in marketing. She has worked in multiple MNCs and even started her own company over the last five years.