ఆ యాప్‌తో అన్నీ ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ..
కామెడీ కాదు.. నిజంగానే ఫ్రీగా ఇస్తున్నారు..
బంపరాఫర్. సూపరాఫర్. కత్తిలాంటి ఛాన్స్. ఖతర్నాక్ అవకాశం.
ఆలస్యం చేసిన ఆశాభంగం. రండిబాబూ రండి..
మంచి తరుణం మించిన దొరకదు..
మార్కెటింగ్ మార్మోగిపోతుంది.
టీవీల్లో.. పేపర్లలో.. ఇంటర్నెట్‌లో.. ఎక్కడ చూసినా ఆ యాడ్ గురించే.
ఏవండీ.. 12వేల రూపాయల ఫోన్ 10 వేలేనట! ఓ ఇల్లాలి ఆరాటం.
డాడ్.. ఈసారైనా కొనేయండి.. ఓ పిల్లాడి ఆత్రం..
అమ్మాయేదో అంతగా అడుగుంటే సణుగుతావేంట్రా.. ఓ తాతయ్య చిరుకోపం..
అనుకున్నట్టే అంతా ఎగబడ్డారు.. ఆ బ్రాండ్ మార్కెట్‌లోకి రిలీజ్ చేశారు. అసలు సంగతి కొన్నాక కానీ తెలియలేదు. ఆ పదివేల నంబర్ పై పే..ద్ద స్టార్ మార్క్.. క్వశ్చన్ మార్క్‌లా మారిపోతుంది. ఇంతకీ ఏంటీ స్టార్?
వ్యవహారమంతా అక్కడే ఉంది! ఆ స్టార్‌మీద రాసి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఫాలో అయితే.. ముచ్చటపడిన ఆ పన్నెండువేల ఫోన్ అటూ ఇటుగా మళ్లీ పన్నెండువేలే అవుతుంది. ఆఫర్ల పేరుమీద జరిగే మాయాజాలమే ఇది. కాకపోతే ఈ మధ్యకాలంలో స్టార్ మార్కుల హడావుడి తగ్గి.. కూపన్స్ హవా నడుస్తోంది. మనం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే ప్రతీ వస్తువుపైనా కచ్చితంగా ఏదో ఒక డీల్ దొరుకుతుంది. సరిగ్గా ఈ కాన్సెప్ట్‌ని స్టడీ చేసిన ముగ్గురు యువకులు.. నిజంగానే అన్నీ ఫ్రీగా ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు. చేయడమే కాదు.. దాన్ని బిజినెస్ మోడల్‌గా మార్చేసి సక్సెస్ బాటలో దూసుకెళుతున్నారు.
అలా మొదలైంది..
రోహిత్ లాలా, అంకిత్ మూర్జానీ, ఆదిత్ దావే. స్కూల్ నుంచి జిగిరీ ఫ్రెండ్స్. 15 ఏళ్ల స్నేహం. ప్రస్తుత యూత్‌కు నిత్యం అవసరమయ్యే.. వాళ్లు ఎప్పుడూ తలుచుకునే ఓ బ్రాండ్ తయారు చేయాలని కోరిక. అందుకే ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా కస్టమర్లకు ఏదైనా ఫ్రీగా అందిచే గ్రాబ్‌స్టర్ సంస్ధను స్ధాపించారు. రోహిత్ డెలాయిట్‌లో ఐటీ ఇంజినీర్‌గా పనిచేస్తుంటే.. జేపీ మోర్గాన్‌లో అంకిత్ ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా వర్క్ చేసేవాడు. గతంలో టోటల్ స్పోర్ట్స్ ఏషియాలో పనిచేసి, పూర్తిగా ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాడు ఆదిత్. ముగ్గురూ మూడు స్ట్రీమ్స్ నుంచి రావడం.. వ్యాపారంలో సక్సెస్ కావడానికి సహకరించింది, ఈ మధ్యకాలంలో ప్రతీ ఈకామర్స్ పోర్టల్ డిస్కౌంట్లంటూ ఊదరగొట్టేస్తోంది. అందుకే ఇదే కాన్సెప్ట్ మీద వర్కవుట్ చేశారు.
“ప్రతీదాన్ని ఉచితంగా ఇవ్వడం అక్విజిషన్ కాదు. అది మా బిజినెస్ మోడల్. చాలా కంపెనీలు ఆఫర్ల పేరుతో పబ్లిక్‌ను మోసం చేస్తున్నాయి. కానీ ఎలాంటి నియమాలు లేకుండా కచ్చితంగా ఫ్రీగా స్టఫ్ అందిస్తున్న ఏకైక సంస్ధ గ్రాబ్‌స్టర్. ఏవీ కూడా ఉచితంగా ఇవ్వడం అనే పద్ధతిలో పనిచేయడంలేదు. అందుకే.. మేం ఈ పద్ధతిని ఎంచుకున్నాం”-రోహిత్.
అంతా ఇవ్వడం.. తీసుకోవడమే!
తమతో పార్ట్‌నర్లుగా ఉన్న బ్రాండ్స్‌కు సంబంధించి ప్రతీ వారం లక్కీ డ్రా తీయడం, గెలిచిన వారికి ఏదో ఒక వస్తువు, లేదా ఆఫర్‌ను పూర్తిగా ఫ్రీగా అందించడం చేస్తోందీ గ్రాబ్‌స్టర్. అయితే, ఈ లక్కీడ్రాలో పాల్గొనాలంటే ఆయా బ్రాండ్‌కి సంబంధించి 15 సెకన్ల షార్ట్‌ఫిలింను తప్పనిసరిగా చూడాలి. ఫ్యాషన్ వస్తువుల దగ్గర్నుంచి రెస్టరెంట్ వోచర్లు, ఎలక్ట్రానిక్స్ దగ్గర్నుంచి ఎంటర్‌టైన్మెంట్ పాస్‌లు.. స్పా, సెలూన్, మొబైల్ రీచార్జ్.. ఇలా రకరకాల ఆఫర్లను నడుపుతోంది.
“ తమకు తాముగా ప్రొడక్ట్స్‌ను అడ్వర్టయిజ్ చేసుకోవడానికి, సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులర్ అవ్వడానికి, కొత్త కస్టమర్లను రీచ్ కావడానికి మా బిజినెస్ మోడల్ ఎంతగానే ఉపయోగపడుతుంది. కస్టమర్లు, బ్రాండ్ల మధ్యలో సరైన వారధిలా మేం పనిచేస్తున్నాం. మా వల్ల ఇద్దరికీ ఉపయోగకరమే”- రోహిత్
ప్రతీ సోమవారం మధ్యాహ్నం 12గంటలకు ఫ్రీ ఆఫర్ మొదలవుతుంది. ఒక కస్టమర్ మూడు లక్కీ డ్రాల్లో ఏదైనా ఒక దానికి అప్లయ్ చేసుకునే వీలుంటుంది. గెలిచిన వారి వివరాలను ఆదివారం సాయంత్రం యాప్‌లోనే ప్రకటిస్తారు.
ఆ ప్రొడక్ట్‌కి సంబంధించిన వాల్యూని బట్టి ఫ్రీ గిఫ్ట్ ఎంతమందికి ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. ఎలాంటి ప్రైజ్‌ని సెలక్ట్ చేసుకోవాలో కూడా యూజర్ చేతుల్లోనే ఉంటుంది. మొదటిస్ధాయిలో రూ.10నుంచి రూ.100 వరకూ రీచార్జ్‌లు, త్రీడీ గ్లాస్‌లులాంటివి సొంతం చేసుకోవచ్చు. ఈ స్ధాయిలో గెల్చుకునే అవకాశాలు ఎక్కువ. రెండో లెవెల్‌లో రూ.200 నుంచి రూ.500 వరకూ విలువ ఉండే బీర్‌లు, మీల్స్, మూవీ టిక్కెట్లు, పాస్‌లు పొందవచ్చు. ఈ లెవెల్‌లో గెలుచుకునే అవకాశం 10 నుంచి 30శాతం మాత్రమే ఉంటుంది. థర్డ్ లెవెల్‌లో రూ.500 నుంచి రూ.5000 విలువ ఉండే ఫ్యాషన్ యాక్ససరీస్, హెడ్‌ఫోన్స్, స్పా వౌచర్స్ గెలుచుకోవచ్చు. అయితే, వీటికి 1 నుంచి 10శాతం మాత్రమే అవకాశం! ఆఫర్లను తమ ఫేస్‌బుక్ వాల్‌లో పోస్ట్ చేసిన వారికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఎన్నిసార్లయినా ఆఫర్లకు అప్లయ్ చేసుకోవచ్చు.
రెవెన్యూ మోడల్
ప్రతీవారం నిర్వహించే లక్కీ డ్రాకు బ్రాండ్స్ దగ్గర్నుంచి కొంత మొత్తం వసూలు చేస్తారు. కస్టమర్లు చూసే ఫ్రీ యాడ్స్ నుంచి ప్రధానంగా రెవెన్యూ వస్తుంది. ప్రస్తుతానికి ముంబైలోని దాదాపు 75 బ్రాండ్స్. గ్రాబ్‌స్టర్ కస్టమర్లుగా ఉన్నాయి. రాబోయే నెలల్లో వీడియో యాడ్ క్యాంపెయిన్లు చేయడంతో పాటు.. ప్రతీరోజు, ప్రతీ నెలా కూడా డ్రాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఐదునెలల్లో 21వేల యాప్ డౌన్‌లోడ్స్‌తో ప్రతీవారం 20శాతం వృద్ధిని సాధిస్తోంది ఈ కంపెనీ. ఇప్పటిదాకా ఆరువేలమందికి రూ. 6లక్షల విలువగల గిఫ్ట్‌లను ఇచ్చింది. ముంబైను దాటి విస్తరించడంతో పాటు.. ఇన్వెస్టర్ల కోసం ఎదురుచూస్తోంది గ్రాబ్‌స్టర్..!