సొంతూరు మిఠాయిల కోసం ఆరాటపడే వారి కోసమే 'స్వీట్స్ ఇన్‌బాక్స్'
మిఠాయివాలాల ఈ -కామర్స్పేరొందిన స్వీట్స్ షాపులతో ఒప్పందాలుఆర్డర్ చేసిన 4-5 రోజుల్లో డెలివరీఆహార భద్రతా ప్రమాణాలు అమలు చేస్తున్న స్వీట్స్ ఇన్బాక్స్విదేశాల నుంచి వందల కొద్దీ ఆర్డర్స్
అభినవ్ ఖండేల్వాల్ యూరోప్‌లో ఐటీ కన్సల్టెంట్‌గా విధులు నిర్వహించేవారు గతంలో. ఆ సమయంలో స్విట్జర్లాండ్‌కి వెళ్లేపుడు 4 కేజీల స్వీట్లు, స్నాక్స్ పార్సెల్ చేయించుకుని పట్టుకెళ్లేవారు. అందుకోసం అభినవ్, ఆయన భార్య రాధికా చాలా కష్టపడాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారం చూడాలని అప్పట్లోనే భావించేవాళ్లు వారిద్దరూ.
వారి కుటుంబంలోనే కాక, స్నేహితులు-బంధువులకూ ఇలాంటి అనుభవం అనేకమార్లు ఎదురవడాన్ని వాళ్లు గుర్తించారు. దీనిపై వారిద్దరూ చాలాసార్లు చర్చించుకున్నారు. సొంత ప్రాంతానికి దూరంలో నివసించేవారికి వారి ఊరి రుచులు చూపించేలా ఓ వేదిక రూపొందిస్తే... అది మంచి వ్యాపారమవుతుందని గ్రహించారు అభినవ్. యూరోప్ నుంచి ఆయన స్నేహితులు కూడా ఫోన్ చేసి, ఇండియాలో ఎక్కడ రుచికరమైన స్వీట్లు ఉంటాయోనని ఎంక్వైరీ చేయడం వాళ్ల ఆలోచనకు మరింత జీవం పోసింది.
ప్రారంభమేంటి ? నాంది ఎప్పుడు ?
2014 ఆగస్టులో పూనేలో ప్రారంభమైన 'స్వీట్స్ ఇన్‌బాక్స్' సంస్థకు అభినవ్, రాధికలు సహ వ్యవస్థాపకులు. భారతీయ మిఠాయిలు, స్నాక్స్, చాకొలేట్స్, కుకీస్‌ను ఆన్లైన్లో విక్రయించే సంస్థ ఇది. స్థానికంగా పేరొందిన మిఠాయి షాపుల ద్వారా జరిగే ఈ-విక్రయాలు... డోర్ డెలివరీ అయ్యేలా తమ ప్రాజెక్టును డిజైన్ చేశారు.
నిజానికి స్వీట్స్ ఇన్‌బాక్స్ ప్రాజెక్టును 2012లోనే ప్రారంభించినా.. ఈ రంగంపై మరింతగా పరిశోధన జరిపి ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకుంది. పూర్తిస్థాయి ఆన్లైన్ ప్లాట్‌ఫాంగా తీర్చిదిద్దేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా మంది స్నేహితులు ఆగ్రాలోనే దొరికే పేఠా, పూనేలో లభించే కరంజీ వంటి వాటి రుచుల కోసం నోరూరేలా ఎదురుచూస్తున్న సంఘటనలు.. వారికి మరింత బలాన్నిచ్చాయి.
ఫాస్ట్‌ఫుడ్ యుగంలో పాతకాలం స్వీట్లు
ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ యుగం. రెడీమేడ్‌గా దొరికే ఐస్ క్రీమలుు, కేక్స్ వైపే యువత మొగ్గు చూపుతున్నారు. అయితే చాలా మందికి వారి ఊరి మిఠాయిల రుచి కూడా తెలియడం లేదు. కారణం ఆ ప్రాంతాలకు వారి కుటుంబాలతో సంబంధాలు లేకపోవడమే. రాధిక తండ్రి బిలాస్పూర్లో ఓ స్వీట్ షాప్ ఓనర్. అక్కడి నుంచి వేరే ఊళ్లకు వెళ్లి స్థిరపడ్డవారి నుంచి దీపావళికి స్వీట్లు పంపాలంటూ ఆయనకు ఆర్డర్లు వచ్చేవి. అయితే, రవాణా అయ్యే వస్తువులపై ఉన్న నిబంధనలు, ఆంక్షల కారణంగా ఇది సాధ్యపడలేదు. ఈ సమస్యలకు పరిష్కారం చూడాలనుకున్నారు అభినవ్, ఆయన భార్య.
వెబ్సైట్ కాన్సెప్ట్‌ను తయారు చేస్తున్న సమయంలోనే అంటే 2014 జనవరి -ఆగస్టుల మధ్య ఐఐఎం-బెంగళూరులో ఆంట్రప్రెన్యూర్షిప్ కార్యక్రమంలో శిక్షణ పొందారు అభినవ్. ఆ సమయంలో ఆ ఆలోచనకు ఊహించిన దానికంటే ఎక్కువ మద్దతు, గైడెన్స్ లభించడం విశేషం. ఆలోచనను లాభసాటి వ్యాపారంగా మార్చుకోవడం ఎలాగో.. ఆయన ఐఐఎం-బీ లోనే తెలుసుకున్నానని చెబ్తుంటారు.
స్వీట్లు సాధారణంగా త్వరగా పాడయ్యే వస్తువులు కావడంతో.. కనీసం 10రోజుల పాటు నిలవుండే వాటినే ఎంచుకోవాలని భావించారు. అలాగే కొరియర్ సంస్థ ఫెడెక్స్‌తో ఇండియాలో ఎక్కడికైనా 3-4 రోజుల్లోనే డెలివరీ చేసేందుకు ఒప్పందాలు కూడా చేసుకున్నారు.
ఎవరెవరు ? ఎలా ఒప్పించారు ?
వాళ్లకి ఎదురైన మొదటి కష్టం ప్రధాన నగరాల్లో పేరొందిన విక్రయందారుల వివరాలు తెలుసుకోవడం, వాళ్లని ఒప్పించగలగడం. చాలామంది యజమానులు కొత్త ఆలోచనను సమర్ధించలేదు. అందులోనూ 20-30 ఏళ్లనుంచి షాపులు నడుపుతున్న వృద్ధులైన ఓనర్లున్న షాపుల్లో... ఇది ఇంకా కష్టమైంది. అయితే ఆయా వ్యక్తుల యంగ్ జనరేషన్‌ను కలుసుకోవడం, వాళ్లని ఒప్పించగలగడం కొంత కష్టమైనా చివరకు సాధ్యం చేయగలిగారు. ఈ-కామర్స్‌పై అవగాహన కల్పించి మిఠాయిల వ్యాపారాన్ని ఆన్‌లైన్‌లోకి తెచ్చేశారు. ప్రస్తుతం స్వీట్స్ ఇన్‌బాక్స్ సంస్థ అనేక నగరాల్లో పేరొందిన సంస్థలకు చెందిన రుచికరమైన స్వీట్లను ఆన్లైన్ ద్వారా విక్రయాలు చేస్తోంది. ప్రధాన నగరాల్లోని కొన్ని కంపెనీల వివరాలు ఇవి.
- పూనే : చితాలే బంధు, లక్ష్మీ నారాయణ్ చివ్డా, కాకా హల్వా
- ముంబై : ఘసీతారం స్వీట్స్
- అహ్మదాబాద్ : గ్వాలియా స్వీట్స్
- ఇండోర్ : రతన్ సేవ్ భండార్
- హైద్రాబాద్ : కరాచీ బేకరీ
- ఆగ్రా : ఆఘ్రా పీఠావాలా
- బిలాస్పూర్ : మౌసాజీ స్వీట్స్
విక్రేతలను ఎంపిక చేసుకోవడంలో స్వీట్స్ ఇన్‌బాక్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. ప్రాంతీయ స్వీట్ల తయారీలో పేరొందిన సంస్థల జాబితా తయారు చేసుకుని, స్థానికులని సర్వే చేయించారు వీరు. ఆయా స్టోర్ల నుంచి శాంపిల్స్ సేకరించి ఫుడ్ బ్లాగర్లకు సరఫరా చేసి, రుచులపైనా సర్వే జరిపారు. విమర్శకుల నుంచీ కూడా అభిప్రాయాలు సేకరించారు. వారి అన్ని పరీక్షలు పాసయ్యాకే... ఆయా స్వీట్లను ఆన్లైన్లో అమ్మకాలకు ఉంచేవారు.
క్వాలిటీ చెకప్ ఇక్కడితో అయిపోలేదు. ప్యాకేజింగ్ సమయంలో ఎక్కువ కాలం నిలువ ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఎక్స్పైరీ డేట్ ప్యాకేజ్‌పై ఉండేలా విక్రేతలు చర్యలు తీసుకునేలా చేశారు. ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
స్వీట్ ఫ్యూచర్
ఆగస్టు 2014లో ప్రారంభమైన స్వీట్స్ ఇన్‌బాక్స్ ఏడు నగరాల్లో సేవలందింస్తోంది. ఒక్క పూనేలోనే 15 స్టోర్లున్నాయి. 2015 చివరినాటికి 30నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచించారు. వీళ్లు భారత్‌లోనే కాకుండా... అమెరికా కూడా ఎగుమతులు చేస్తున్నారు. విదేశాలనుంచీ వందలకొద్దీ వస్తున్న ఆర్డర్స్... వారికి మరింతగా ప్రోత్సాహమిస్తున్నాయని చెబ్తుంటారు అభినవ్. చాలామంది కస్టమర్లు మళ్లీ, మళ్లీ ఆర్డర్ చేస్తూండడం విశేషం.
పోటీలోనూ మేటిగా..
ఈ రంగంలో ఇప్పటికే పోటీ ఉంది. పాకుమానియా, మిఠాయిమాతే, జస్ట్రఫ్స్లతో పాటు.. శ్రీకృష్ణ స్వీట్స్, ఆనంద్ స్వీట్స్ వంటి సంస్థల నుంచీ గట్టి పోటీ ఎదురవుతోంది. అయితే.. ఒక్క సంస్థకే పరిమితం కాకుండా... పేరొందిన స్వీట్ షాపులతో ఒప్పందాలు చేసుకుని వీలైనంత వేగంగా అభివృద్ధి చెంది, విస్తరించాలని అభినవ్, రాధికల జంట నిర్ణయించుకుంది. అలాగే హోలీ, దీపావళి వంటి పండుగలకోసం ప్రత్యేకమైన ప్యాకేజ్‌లు అందించాలని డిసైడ్ అయ్యారు. తమ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందని అభినవ్ ఖండేల్వాల్ నమ్మకంతో ఉన్నారు. ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగంలో హైక్వాలిటీ ప్రోడక్ట్స్ అమ్మే కంపెనీల జాబితాలో తాము ప్రముఖస్థానం దక్కించుకుంటామని చెబ్తారాయన. "భారత్‌లో స్వీట్స్ వ్యాపారం స్థాయి ఏటా రూ. 50 వేల కోట్లకు పైగానే. ఇందులో వీలైనంత స్థాయిలో మార్కెట్‌ని దక్కించుకుంటా"మంటారు అభినవ్.
ప్రపంచంలో మీరెక్కడున్నా సరే.. మైసూర్ పాక్, జిలేబీ, కాజు కల్టీ, చిక్కి... ఇలాంటివి తినాలనిపిస్తే.. జస్ట్ స్వీట్స్ ఇన్‌బాక్స్‌కి ట్యూనయితే చాలని.. అందరూ అనుకునేలా ఎదగడమే లక్ష్యంగా చెబ్తోందీ సంస్థ.