ప్రమాదం జరిగితే ఇంటికి సమాచారం.. స్మార్ట్ హెల్మెట్ తయారు చేసిన హైదరాబాదీ
ఓవర్ స్పీడ్, స్మోకింగ్, మొబైల్ డ్రైవింగ్, తాగి నడిపినా, హెచ్చరించే హెల్మెట్. దొంగలించబడితే లోకేషన్ చూపించే హెల్మెట్.
కలలు కలమని కలాం చెప్పిన మాటలు యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయనడానికి ఈ కధ మంచి ఉదాహరణ. ఆయన బాటలో నడవాలనే తపన, ఆయన్ని ఆదర్శంగా తీసుకుని సైన్స్ సహకారంతో ఈ దేశానికి సేవ చేయాలనే కోరిక ఈ యువకుడిలో ఉంది.
చిన్నప్పుడు ఆరవ తరగతిలో డీసి జెనరేటర్ తయారు చేసినప్పటి నుండి ఇప్పుడు ఇంజినీరింగ్ చదువుతూ స్మార్ట్ హెల్మెట్ కిట్ తయారు చేసేంత వరకూ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాడు హైదరాబాదీ యువకుడు జవాద్ పటేల్.
లార్డ్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న జవాద్ పటేల్‌కు ఎలక్ట్రానిక్స్ అంటే ప్రాణం, కేవలం చదువుకోవడమే లక్ష్యంగా పెట్టుకోకుండా, ఏదైనా కొత్తగా చేయాలనే తపన అతనిలో నిత్యం కనిపిస్తుంది.
నగరంలో పెరుగుతున్న యాక్సిడెంట్స్ జవాద్‌ను బాధపెట్టేది, దీనికి పరిష్కారం ఆలోచించిన అతడు స్మార్ట్ హెల్మెట్ కనుగొన్నాడు. రెండు భాగాల్లో ఉండే ఈ కిట్‌లో హెల్మెట్‌కు ట్రాన్స్మిటర్ ఉండగా, బైక్‌లో దాని రిసీవర్ మాడ్యూల్ ఉంటుంది.
“హెల్మెట్ కీ లాంటిది, అది వేసుకుంటే తప్ప మీ బైక్ స్టార్ట్ కాదంటున్నారు జవాద్. 20 నుండి 2000 పీపీఎం CO-gas కాన్సన్ట్రేషన్స్ పసిగట్టే MQ7 సెన్సార్ ఇందులో అమర్చారు. ఇది రైడర్ మద్యం సేవించి ఉన్నాడా లేదా పసిగడుతుంది. ఒకవేల అలా ఉంటే బైక్ స్టార్ట్ కాదు, అంతే కాకుండా రైడర్ డ్రైవింగ్ సమయంలో స్మోకింగ్ చేస్తున్నా, ఫోన్ లో మాట్లాడుతున్నా సరే వెంటనే ఓ అలర్ట్ పంపిస్తుంది”.
ఈ హెల్మెట్ ప్రత్యేకత ఇంతటితో ఆగదు, “మీరు ఓవర్ స్పీడ్ చేస్తే, హెల్మెట్ హెచ్చరిస్తుంది. అప్పటికీ వాహనం నడిపే అతను స్పీడ్ తగ్గించక పోతే, ఆ బైక్ దానంతట అదే స్లో అయిపోతుంది. అంతే కాకుండా మీ బైక్ దొంగతనానికి గురైనా, మీ ఫోన్లో దాని లొకేషన్ తెలిసిపోతుంది. అలానే ఓ వేళ యాక్సిడెంట్‌కి గురైతే అందులో ఫీడ్ చేసి ఉన్న ఎమర్జెన్సీ నంబర్‌కు మెసేజ్‌తో పాటు లొకేషన్ కూడా పంపిస్తుందంటున్నారు జవాద్”.
ఈ హెల్మెట్ తయారీకి దాదాపు రూ.5 వేలు ఖర్చైందని, నాలుగు నెలల కూడా సమయం పట్టిందని జవాద్ చెబ్తున్నారు. రీసెర్చ్ ఖర్చు పక్కకుబెడితే.. భవిష్యత్తులో ఇలాంటి స్మార్ట్ హెల్మెట్ తయారీకి రూ.2 వేల వరకూ ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రోటోటైప్పై ఇంకా పూర్తిస్థాయి పరిశోధనలు జరుపుతున్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులో అన్నీ అనుకూలిస్తే.. ఏదైనా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని పెద్ద ఎత్తున వీటిని తయారు చేసి జనాల ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో ఉన్నారు.
లాభార్జన సంగతి పక్కకుబెడితే తన వల్ల సమాజానికి ఎంతో కొంత మేలు జరుగుతుందనే తృప్తే తనలో ఎక్కువ ఆనందం కలిగిస్తుందని చెప్తున్నారు. స్మార్ట్ హెల్మెట్ సహా వివిధ ప్రాజెక్టులపై ఇంకా పరిశోధనలు చేస్తున్నట్టు జవాద్ వివరించారు.
పేటెంట్ సంపాదించిన జవాద్
ఎలక్ట్రానిక్స్ లో ఇంజినీరింగ్ చేస్తున్న జవాద్, ఇప్పటికే ఈ హెల్మెట్ పై కేంద్ర ప్రభుత్వం నుండి ప్రొవిజనల్ పేటెంట్ నంబర్ కూడా సంపాదించారు.
ఇతర ఆవిష్కారాలు
స్మార్ట్ హెల్మెట్ తో పాటు, ఇంకా చాలా పరికరాలు కనుగొన్నారు జవాద్. నిత్యం తాళాలు మరిచిపోయే తన స్నేహితుడి కోసం పాస్ వర్డ్ సెక్యురిటీ సిస్టం కనుగొన్నాడు. తాళాలు లేకపోయినా, డోర్ దగ్గర పాస్ వర్డ్ కొడితే చాలు , డోర్ తెరుచుకుంటుంది. ఇక రైతుల కోసం ఏదైనా చేయాలనుకున్న తను, ఆటోమేటిక్ స్ప్రింక్లర్ తయారు చేసారు. అక్కడి భూమి వాతవరణానికి అనుకూలంగా ఈ స్ప్రింక్లర్ నీళ్లను చల్లుతుంది.
మంచి నీళ్లు తాగడం మరిచిపోయే వారికి నీళ్లు తాగమని చెప్పే వాటర్ బాటిల్ కూడా కనుగొన్నారు. నీళ్లు వృధా కాకుండా ఉండటానికి ఆటోమెటిక్ వాటర్ ట్యాంక్ సిస్టం కూడా తయారు చేసానంటున్నారు జవాద్.
భవిష్యత్తు ప్రాజెక్ట్స్
ఇన్ని అద్భుతాలు చేస్తున్న జవాద్, భవిష్యత్తులో బ్రెయిన్ వేవ్స్ ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నారు బ్రేన్ వేవ్స్ తోనే పరికరాన్ని సమాచారం అందించే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నరు. ఇక డీఆర్ డీఓ, ఇస్రో, నాసా లాంటి ప్రముఖ సంస్ధల్లో సైంటిస్ట్ గా ఎదగాలనే కోరిక ఉందంటున్నారు జవాద్.