ఆ ముగ్గురూ కరేజ్‌కు కేరాఫ్ అడ్రస్ !
ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు మీదపడినా ఎదురొడ్డి నిలబడడం. కష్టకాలంలో నిలదొక్కుకోవడమే ధైర్యం. ఇతరులపైకి దేన్నైనా తోసేయకుండా మొదట మీరే ముందుండి నడిపించడం ఆ ధీరత్వానికి సంకేతం. పడిపోయిన ప్రతీసారీ.. అంతేవేగంగా పైకి సాధ్యమైనంత త్వరగా మళ్లీ కదనరంగంలోకి దూకడం ధైర్యం. అలా.. కరేజ్‌కు కేరాఫ్ అడ్రస్‌కు నిలిచిన ముగ్గురు ధీరవనితల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ల నుంచి మనం ఏమేం నేర్చుకోవచ్చో చూద్దాం.
నీరజా భానోత్ -
ప్యాన్ యామ్ ఫ్లైట్‌లో సీనియర్ ఫ్లైట్ పర్సూయర్. సెప్టెంబర్ 7,1986న తన 23వ పుట్టిన రోజు జరుపుకునేందుకు ముంబైలోని తమ తల్లిదండ్రులకు వాగ్దానం చేసిన నీర్జా.. సరిగ్గా రెండు రోజులకు ముందు అంటే.. సెప్టెంబర్ 5వ తేదీన న్యూయార్క్ వెళ్తున్న ప్యాన్ యామ్ ఫ్లైట్ స్టాప్ ఓవర్ కోసం కరాచీలో ఆగింది.
ఇక కాసేపట్లో ఫ్లైట్ బయలుదేరుతుంది అనగా, జిన్నా ఇంటర్నేషనల్‌లోకి చొరబడిన నలుగురు సాయుధ ఉగ్రవాదులు ఆ ఫ్లైట్‌ను హైజాక్ చేశారు. విషయాన్ని అత్యంత వేగంగా పసిగట్టిన నీర్జా కాక్ పిట్ టీమ్‌ను అలర్ట్ చేయడంతో, వాళ్లు వాళ్లు ఓవర్ హెడ్ హ్యాచ్ ద్వారా తప్పించుకున్నారు. ఈ హైజాక్ ప్రోటోకాల్‌లో భాగంగా పైలెట్లు తప్పించుకోవడంతో, ఉగ్రవాదులు విమానాన్ని అక్కడి నుంచి తరలించేందుకు వీలులేకుండా పోయింది. సీనియర్ క్రూ సిబ్బంది అంతా వెళ్లిపోవడంతో, అప్పుడు నీర్జా ఒక్కరే ఇంఛార్జ్‌గా మిగిలారు. ప్రయాణీకులందరి పాస్‌పోర్టులూ తీసుకోవాల్సిందిగా ఉగ్రవాదులు సిబ్బందిని గదిమారు. చేసేది లేక పాస్‌పోర్టులు తీసుకుంటుండగా.. వాళ్ల టార్గెట్ అమెరికన్స్ అనే విషయాన్ని ఆమె పసిగట్టింది. దీంతో కొంతమంది అమెరికన్ల పాస్‌పోర్టులను తీసుకుని తాను దాచేసింది.
ప్యాసింజర్లతో పాటు క్రూ సిబ్బందిని 17 గంటలపాటు ఫ్లైట్‌లోనే నిర్భందించిన టెర్రరిస్టులు, కొంత మంది అమాయకులను కాల్చిపారేశారు. అవకాశాన్ని చూసి ఎమర్జెన్సీ హ్యాచ్‌ను తెరిచి కొంతమంది ఆ ఫ్లైట్‌ను తప్పించారు. తాను మొదట దిగి వెళ్లిపోయే అవకాశమున్నా, తన కర్తవ్యాన్ని మాత్రం మరిచిపోలేదు నీర్జా. ముగ్గురు పసిపిల్లలపై టెర్రరిస్టులు నిర్దాక్షిణ్యంగా కాల్పులకు దిగబోతుంటే.. చూసి అడ్డుపడి వాళ్లను ప్రాణాలకు తన జీవితాన్ని అడ్డుపెట్టింది నీర్జా. ఆమె చేసిన ప్రాణత్యాగానికి, చూపిన తెగువ, సమయస్ఫూర్తికి ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి. 400 మంది ఉన్న ఆ ఫ్లైట్‌లో 20 మందిని మాత్రం ముష్కర మూకల నుంచి కాపాడలేకపోయింది నీర్జా.
నీర్జా తెగువను గుర్తుచేసుకుంటూ తన స్మృత్యర్థం నీర్జా భానోత్ - ప్యాన్ యామ్ ట్రస్ట్ ద్వారా ఏటా రూ.1.5 లక్ష విలువ చేసే రెండు అవార్డులను ప్రధానం చేసేందుకు ముందుకొచ్చారు ఆమె తల్లిదండ్రులు. సామాజిక అసమానతలను ఎదుర్కొన్ని ఉన్నత స్థానానికి ఎదిగిన ఓ మహిళకు, అసమాన ప్రతిభ, ధైర్యాన్ని చూపిన ఓ ఎయిర్ లైన్ క్రూ సిబ్బందికి ఏటా ఈ అవార్డులను ప్రధానం చేస్తారు. స్వార్థంలేని తన ధైర్యసాహసాలకు మెచ్చి ప్రభుత్వం ఆమెకు మరణానంతరం అశోక చక్ర బిరుదును ప్రకటించింది.
నీరజా భానోత్
లక్ష్మి
ఓ యాసిడ్ దాడితో దారుణంగా హింసకు గురైన బాధితురాలు. పట్టుమని పదహారేళ్లు కూడా నిండని ఆ అమ్మాయిపై ఓ దుర్మార్గుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యాసిడ్ దెబ్బకు ఈమె మొహమంతా కాలిపోయింది. ఆ మూర్ఖుడి నుంచి అప్పుడు ప్రాణాలతో బయటపడినా.. నిత్యం సమాజంతో ఆమె పోరాడాల్సి వచ్చింది. గుండెను రాయి చేసుకుని.. ధృడంగా నిలబడి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఆమె కలిగించిన చైతన్యం, చేసిన పోరాటం చూస్తే.. ఎవరైనా శభాష్ అనాల్సిందే. చివరకు పుట్టిన బిడ్డ.. తనను చూసి భయపడుతుందేమో, అసహ్యించుకుంటుందేమో.. అనే ఆందోళన మధ్య నలిగిన లక్ష్మి.. ఇప్పుడు ఎంతో హుందాగా మనందరి ముందూ నిలుచుంది.
లక్ష్మి తన జీవన క్రమంలో అలోక్ దీక్షిత్ అనే సామాజిక కార్యకర్తతో ప్రేమలో పడింది. కానీ ఇద్దరూ పెళ్లి చేసుకోలేదు. సహజీవనం చేయడానికే మొగ్గుచూపారు. పెళ్లి చేసుకోకపోతే.. ఏమవుతుంది.. సమాజం ఏం అంటుంది... అనే మొండి ధైర్యం ఆమెలో కనిపించింది. వాళ్లకు ప్రేమకు ప్రతిరూపంగా ఏడు నెలల క్రితం ఓ అమ్మాయి పుట్టంది. ఆ పాపకు పిహు అని నామకరణం చేసుకున్నారు. పత్రిక అనే సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను లక్ష్మి పంచుకున్నారు. కడుపుతో ఉన్నప్పుడు ఆమె పడిన వేదన వింటే.. ఎవరికైనా మనస్సు చివుక్కుమంటుంది. పుట్టిన బిడ్డ తనను చూసి దగ్గరకు వస్తుందా ? భయపడి ఏడుస్తుందా.. ? అనే ప్రశ్నలు.. నవమాసాలూ ఆ తల్లిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కానీ ఇప్పుడు ఆ పడిన వేదనంతా పటాపంచలైపోయింది. తన తల్లి లక్ష్మిని చూడగానే.. పిహు.. కళ్లలో వెలుగు కనిపిస్తుంది. మొహం ఇంత పెద్దది చేసుకుని..చక్కగా నవ్వుతాడు. ఇది చాలు.. తల్లిగా.. లక్ష్మి కొండంత బలం ఇవ్వడానికి. యాసిడ్ అమ్మకాలపై నిషేధం విధించాలంటూ ఓ పిటిషన్ కూడా దాఖలు చేసింది. 27,000 మందితో సంతకాలు సేకరించింది. దీంతో కేసు విచారించిన సుప్రీంకోర్టు యాసిడ్ అమ్మకాలను నియంత్రించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అంతేకాదు పార్లమెంటు కూడా ఈ విషయమై చర్చించింది. యాసిడ్ దాడి కేసులను సత్వరం పరిష్కరించేందుకు చట్టాలను సవరించింది. నిజంగా దీని వెనుక లక్ష్మి కృషి ఎంతో ఉందని చెప్పొచ్చు.
కన్నబిడ్డతో లక్ష్మీ
భన్వరీ దేవి
రాజస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓ మహిళాభివృద్ధి ప్రాజెక్టులో ఓ క్షేత్రస్థాయి ఉద్యోగి భన్వరీదేవి. తన ఉద్యోగంలో భాగంగా నీటి కొరత, నిరక్షరాస్యత, ఆరోగ్యం వంటి అంశాలపై ఉన్న సమస్యలను గ్రామస్తులతో చర్చించి ఓ పరిష్కారాన్ని మార్గాన్ని కనుక్కునేవారు. ఓసారి బాలికల వివాహాలపై ఆమె పోరాటం మొదలుపెట్టడంతో, 1992లో గ్రామస్తుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురైంది. అక్రమంగా సాగుతున్న ఈ బాల్య వివాహాలను ఆమె అడ్డుకోవడంతో కొంతమంది దుర్మార్గులను ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర అనారోగ్యం పాలైనా సరే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ అంశాన్ని సుదీర్ఘకాలంపాటు కోర్టుల్లో ఎదుర్కొన్నారు. డాక్టర్లు, పోలీసులు, న్యాయవ్యవస్థలోని కొంతమంది నుంచి ఆమె అనేక ఛీత్కారాలను ఎదుర్కొన్నారు. తనపై జరిగిన పైశాచిక దాడిని ఓ మహిళ బయటకువచ్చి చెప్పడాన్ని అప్పడు వాళ్లంతా జీర్ణించుకోలేకపోయారు. దీంతో సంఘ బహిష్కరణ దాకా వెళ్లింది ఆమె వ్యవహారం. అయినా ఆమె కేసు సృష్టించిన సంచలనంతో రాజస్థాన్‌లో ఏకంగా ఓ మహిళా ఉద్యమమే చెలరేగింది. ఆ తర్వాత ఎంతో మంది బాధితల మహిళలు న్యాయంకోసం రోడ్డెక్కిన పరిస్థితులున్నాయి.
1994లో ఆమెకు నీర్జా భానోత్ మెమొరియల్ అవార్డుతో సత్కారం జరిగింది. ఆమెకు న్యాయం జరగకపోగా, నిందుతులు మాత్రం ఈ కేసునుంచి తప్పించుకుని బయటపడ్డారు. కానీ భన్వరీదేవి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. కొన్ని మహిళాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి విశాఖ అనే ఓ సమూహాన్ని ఏర్పాటుచేసి సుప్రీం కోర్ట్ మెట్లెక్కారు. ఈ ఉద్యమమే ఉద్యోగాల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండేలా 2013లో చట్టానికి నాంది పలికింది.
ఈ మహిళలంతా ఒక్కో సామాజిక పరిస్థితి, ఆర్థిక స్థితిగతుల నుంచి వచ్చి ఉండొచ్చు. కానీ వీళ్లందరిలో ఉన్న కామన్ పాయింట్ మాత్రం కరేజ్. వాళ్లు అందరిలానే పరిస్థితులకు లొంగిపోయి నలుగురూ నడిచే దారిలో నడిచి ఉండొచ్చు, కానీ ఎదురొడ్డి ఢీకొట్టారు. అందుకే మనందరికీ స్ఫూర్తిగా నిలిచారు.