భావితరాలకు వెలుగుబాటలు పరుస్తున్న దీపాలయ !
అసహనం! ఇప్పుడీ మాట చుట్టూ దేశంలో అనేక చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. దాడులు జరిగిన సందర్భాలూ లేకపోలేదు. వాటి వెనుక కారణం ఏదైనా కానీ! ఎవరి అభిప్రాయం ఏదైనా ఉండనీ! హర్యానాలోని సోలాపట్టి అనే ముస్లిం గ్రామంలో మతం మచ్చుకైనా లేదు. మనసున్న మంచిమనుషులంతా వాళ్ల దృష్టిలో దేవుళ్లు. మానవత్వమే వారు నమ్మే మతం. సర్వమత సమైక్య సహజీవనం ప్రతిబింబిస్తుంది. ముస్లిం ఆధిపత్యం ఎక్కువగా ఉంటే ఆ ఊరిలో- ఓ హిందూ హెడ్ మాస్టర్, ఓ క్రిస్టియన్ హాస్టల్ వార్డెన్ కలిసి చేసిన కృషి భావితరాల తలరాతనే మార్చింది.
వెలుగు దారులు పంచే దీపాలయ
సోలాపట్టి. హర్యానాలోని ఓ కుగ్రామం. ముస్లిం జనాభా ఎక్కువ. చట్టుపక్కల ఊళ్లు కూడా ముస్లిం ఆధిపత్య గ్రామాలే. సోలాపట్టి సహా చుట్టూ ఏ ఊరిలోనూ చదువు అనే మాటే వినిపించదు. స్కూలు, పుస్తకాలు అనే మాటలు కూడా ఎవరూ పలికే సాహసం చేయరు. అబ్బాయి అయితే పొలంలో ఉండాలి. పాప అయితే వంటింట్లో పాచిపని చేయాలి. అలాంటి దీనస్థితిని పూర్తిగా మార్చేసింది దీపాలయ! కూతురిని బడికి పంపిస్తే తలపొగరు పెరుగుతుందట! ఇది సోలాపట్టి గ్రామస్తుల అపోహ! దాన్ని కంప్లీట్ గా తుడిచేశాం అంటున్నారు దీపాలయ హెడ్ మాస్టరు ఇంద్రజిత్ కుమార్.
సోలాపట్టి. అక్కడికి వెళ్లాలంటే మనెసర్ కొండలు ఎక్కి దిగాలి. చుట్టూ పచ్చని వాతావరణం. చెట్లు, పొలాలు, పక్షుల కిలకిలా రావాలు. మధ్యలో ఎర్రటి ఇటుకలతో కట్టిన ఒక చిన్నబడి. అడుగు పెట్టగానే పిల్లలు వల్లెవేస్తున్న ఎక్కాలు, పద్యాలతో సందడిసందడిగా అనిపిస్తుంది. 14 ఏళ్లకే పెళ్లి అనే ఊబిలో దిగకుండా హాయిగా చదువుకుంటున్న షహీన్: 15 సంవత్సరాలు వచ్చినా పొలం తప్ప పలకా బలపం తెలియని తాహిల్: ఇలా ఎందరో చిన్నారులు అక్షరాలు అనే వెలుగుదారిలో నడుస్తున్నారు.
మొదట్లో ఎంత కష్టం అయిందంటే..
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే! నడుస్తున్నా కొద్దీ దారులు అవే పరుచుకుంటాయి. దీపాలయ విషయంలో అదే జరిగింది. మొదట్లో పిల్లలను బడిదాకా తీసుకురావడమే గగనమయ్యేది. తల్లిదండ్రులను ఒప్పించడం తలకుమించిన భారం. వాలంటీర్లు ఇంటింటికీ తిరిగేవారు. అయినా ఒప్పుకునేవారు కాదు. ఇలా అయితే లాభం లేదని చదువు గురించి ప్రాక్టికల్ గా వివరించడం మొదలుపెట్టారు. మీ పిల్లాడిని కనీసం డ్రైవర్ గా చూడాలనుకున్నా 8వ తరగతి పాస్ కావాలి! ఒక ఫ్యాక్టరీలో వర్కర్ గా పనిచేయాలన్నా కనీస అర్హత పది పాస్ కావాలి! ఇలా చెప్పేవారు! నయాన్నో భయాన్నో ఒప్పించేవారు. అలా పిల్లలంతా ఇప్పడు బడిబాట పట్టారు. అబ్బాయిల విషయంలో అయితే ఏవో తంటాలు పడి ఒప్పిస్తారు. కానీ అమ్మాయిల విషయంలోనే కొంచెం కష్టం. ఆడపిల్ల చదువుకుంటే తలబిరుసుగా ప్రవర్తిస్తుందని అక్కడి గ్రామస్తుల పిచ్చి నమ్మకం. అదొక్కటే కాదు. అమ్మాయి చదువుకుంటే తమకు నచ్చిన అబ్బాయితో లేచిపోయి పెళ్లిచేసుకుంటుందట! ఆడవాళ్లంటే వాళ్ల దృష్టిలో -వినయంగా మసులుకుని- చెప్పినవాడితో తాళి కట్టించుకుని- ఒక భార్యగా భర్త అడుగుజాడల్లోనే జీవితాంతం మెదలాలి. ఇదే సోనాపట్టి గ్రామ ప్రజల సిద్ధాంతం. ఈ స్థాయిలో అభిప్రాయాలున్నవారిని ఒప్పించాంటే ఎంత కష్టమో ఒక్కసారి ఊహించండి! అయినా సరే దీపాలయ వెనకడుగు వేయలేదు.
కో-ఎడ్ కష్టాలు
ఒప్పుకున్నారు సరే! కానీ మగపిల్లలతో కలిసి అమ్మాయిలు పాఠాలు చదవడం- మగపిల్లలతో కలిస స్కూల్ కి రావడం అంటే మాత్రం ససేమిరా అన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు పక్కపక్కన కూచోడానికే ఇష్టపడలేదు. అక్కా చెల్లీ అని మాత్రమే పిలవాలని రూలు పెట్టారు. ఆ షరతు మీదనే అమ్మాయిల్ని బడికి పంపారు. తల్లిదండ్రుల ఇష్టం ప్రకారమే దీపాలయకు ఉన్న మూడు బస్సుల్లో ఒకదాన్ని బాలికల కోసం కేటాయించారు. అన్నట్టు నెల ఫీజు కూడా చాలా తక్కువ. అమ్మాయిలకు 75 రూపాయలు. అబ్బాయిలకు 225.
అభిప్రాయాలు మారుతున్నాయి
అక్కడ ఇప్పుడిప్పుడే వాతావరణం, అభిప్రాయాలు మారిపోతున్నాయి. గ్రామస్తులు టీచర్-పేరంట్ మీటింగ్ కు హాజరవుతున్నారు. గత నెలలో 81 మంది స్కూల్‌కు వచ్చారు. మొత్తం 1103 మంది పిల్లలుంటే కేవలం 81 మంది రావడం తక్కువే అయినా అదే గొప్ప. ఈ 81 మందిలో కూడా చాలామంది ఫీజుల గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చినవారే. అయినా అదీ శుభపరిణామమే. తల్లిదండ్రులు స్కూల్ మెట్లు ఎక్కడమంటే మంచిదే కదా. ప్రస్తుతం స్కూల్లో బాలబాలికల నిష్పత్తి 60:40. ప్రతియేటా స్కూల్ ఫీజుల రూపంలో 12 లక్షల రూపాయలు వస్తున్నా.. ఖర్చు మాత్రం 70 లక్షలకు పైమాటే. విరాళాలతో నెట్టుకొస్తున్నామని హెడ్ మాస్టర్ అంటున్నారు.
అనాథల కోసం హాస్టల్ వసతి
ఇంటినుంచి పారిపోయి వచ్చిన చిన్నారులు, అనాథల కోసం స్కూల్ కు అటాచ్ గా ఓ హాస్టల్ ను కూడా నిర్వహిస్తున్నారు. దానికి వార్డెన్ జాన్ రమేశన్. అతనొక క్రిస్టియన్. భార్య పిల్లలంతా అదే హాస్టళ్లో ఉంటారు. ఇలా ఒక క్రిస్టియన్ హాస్టల్ వార్డెన్, హిందూ స్కూల్ హెడ్ మాస్టర్ కలిసి ముస్లిం ఆధిపత్యం కలిగిన క్లస్టర్ లో విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే- ఇక్కడ ఎవరూ మతం గురించి మాట్లాడరు. క్రిస్టియన్లమని, హిందువులమని ముస్లింలమని ఎవరికీ చెప్పరు. గుచ్చిగుచ్చి అడిగితే తప్ప. ఇంకా చెప్పాలంటే మతం గురించి ఎవరూ పట్టించుకోరు. ఎవరు ఏ మతాన్ని ఆచరిస్తున్నారో ఎవరికీ అక్కర్లేదు. మానవత్వమనే మతం. మంచి మనుషులే దేవుళ్లు. దేశంలో అసహనం మీద చర్చోప చర్చలు జరుగుతున్నాయి. దాడులు కూడా చోటుచేసుకుంటున్నాయి. కానీ సోలాపట్టిలో మాత్రం గంగా జెమునా సంస్కృతి కనిపిస్తుంది. పరస్పరం సహకరించుకుని జీవించే విధానం అబ్బుర పరుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి వాతావరణం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీపాలయా వాలంటీర్లు సాధించిన ఈ విజయం ఊహకందనిది. అసలు గెలుపు అంటే వారు చెప్పే నిర్వచనమే వేరు. దీపాలయా దృక్పథం అలాంటిది.
(దీపాలయ 1979లో ప్రారంభమైంది. ఐఎస్ఓ 9001-2008 సర్టిఫైడ్ ఎన్జీవో సంస్థ. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలతో కలిసి పనిచేస్తుంది. ఈ సంస్థ ప్రాజెక్టులు ఢిల్లీ, హర్యానా, ఉత్తారఖండ్, యూపీలలో ఉన్నాయి. ఇప్పటివరకు 2,70,000 మంది పేద చిన్నారులకు విద్యను అందించింది. పేదపిల్లల పాలిట విద్యాదాయినిగా మారిన ఈ సంస్థకు విరాళాలు అందించాలనుకున్నా, వాలంటీర్ గా పనిచేయాలనుకున్నా సంప్రదించండి- [email protected], [email protected])
(గమనిక: పిల్లల రక్షణ కోసం వారి అసలు పేర్లు మార్చడం జరింది)