పాతికేళ్ల కుర్రాళ్లు.. బడ్జెట్ హోటల్స్ పెట్టి మార్కెట్ దున్నేస్తున్నారు..
ఏదైనా కొత్త ప్రాంతానికి టూర్ వెళ్లినప్పుడు అక్కడ మంచి హోటల్స్ ఉన్నాయో లేవో చూస్తాం. ముందుగా కాస్ట్ గురించి తెలుసుకుంటాం. ఎక్కువ రోజులు ఉండాల్సివస్తే బడ్జెట్ హోటల్ తప్పనిసరి.. ఐదు నక్షత్రాల హోటల్లో దిగితే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. ఈ సమస్యకు చెక్ పెట్టాలనుకున్నారు ఇద్దరు యువ ఇంజినీర్లు. ప్రమాణాల విషయంలో రాజీపడకుండా మధ్యతరగతి జీవులకు అందుబాటులలో బడ్జెట్ హోటల్స్ ఏర్పాటు చేశారు. తిరుగులేని పరిశుభ్రత, ఏ చీకూచింతాలేని భద్రత, మర్యాదపూర్వక సిబ్బందిని మెయింటెయిన్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు.
మనదేశంలో బడ్జెట్ హోటల్స్ అనేది చాలా లేటెస్ట్ కాన్సెప్ట్. మధ్యతరగతి హాలిడే ట్రావెలర్స్ కోసం ఏర్పాటయ్యాయి. లాడ్జిల్లో సౌకర్యాలుండవు. పెద్ద హోటల్స్ లో పర్సు గుల్ల అయిపోతుంది. అందుకే మధ్యేమార్గంగా బడ్జెట్ హోటల్స్ వచ్చాయి. యూరప్, ఆస్ట్రేలియాల్లో ఇవి చాన్నాళ్లనుంచే ఉన్నాయి. జోస్టల్, వైహెచ్ ఏఐ, ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ హాస్టల్, ముస్టేచ్ హోటల్ మనదేశంలోని బడ్జెట్ హోటల్స్ గా చెప్పుకోవచ్చు.
ఆలోచన ఎలా వచ్చింది?
వేదాంత పేరుతో బడ్జెట్ హోటల్స్ ను స్థాపించారు పాతికేళ్ల రిషబ్ గుప్తా, ఆదిల్. రిషబ్ ప్రఖ్యాత డెలాయిట్ కంపెనీలో, అదిల్ మెరిల్ లించ్ లో కన్సల్టెంట్లుగా పనిచేశారు. రిషబ్ న్యూయార్క్ లో, అదిల్ సిడ్నీలో సేవలందించారు. 2009లో ఇద్దరూ కలిసి ఆస్ట్రేలియాలో రెండు నెలలపాటు హాలిడే ట్రిప్ కు వెళ్లారు. అక్కడ ఒక బడ్జెట్ హోటల్ లో దిగి- రోజుకు 20 డాలర్లు మాత్రమే అద్దె చెల్లించారు. అప్పుడే అనిపించింది భారత్ లోనూ అలాంటి బడ్జెట్ హోటల్ స్థాపించాలనుకుున్నారు.
“ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు బడ్జెట్ హోటల్ లేదా హాస్టల్ అంటే ఏమిటో మొదటిసారి తెలిసింది. మేం పెట్టిన డబ్బుకు న్యాయం జరిగిందనిపించింది. హాలిడేయర్స్ కోసం మన దేశంలోనూ ఏదో ఒకటి చేయాలనుకున్నాం. స్వదేశీయులు, విదేశీయులు తక్కువ ఖర్చుతోనే హాలిడే ట్రిప్స్ ఎంజాయ్ చేసేలా చేయాలన్నదే మా ఉద్దేశం” రిషబ్
వేదాంత పేరుతో తొలి హోటల్ ను కేరళలోని కోచిలో ఏర్పాటు చేశారు. ఖర్చు తక్కువ, సదుపాయాల్లో రాజీలేదు. దీంతో వేదాంత హోటల్ కు మంచి డిమాండ్ వచ్చింది. కస్టమర్స్ ను కింగ్స్ లా చూడటం మొదలు పెట్టడంతో ఆదరణ మరింత పెరిగింది. వినియోగంలోలేని బిల్డింగ్స్, నష్టాల్లో ఉన్న చిన్న హోటల్స్ ను లీజ్ కు తీసుకుని వాటిని బడ్జెట్ హోటల్స్ గా మారుస్తున్నారు. నగరాలు, టూరిస్ట్ స్పాట్స్ లో అందరికీ అందుబాటులో ఉండే ప్రాంతాలను ఎంచుకుని అక్కడ బడ్జెట్ హోటల్స్ ను స్థాపిస్తున్నారు.
హోటల్స్ ఏర్పాటు కోసం భారీగా ఆస్తులను కొనుగోలు చేయడం లేదు. అదే వేదాంత సక్సెస్ మంత్ర. 20 నుంచి 30 రూమ్స్ ఉండే హోటల్ ఏర్పాటుకు 45 లక్షల రూపాయలకన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టడంలేదు. టెక్నాలజీ, హౌస్ కీపింగ్ సౌకర్యాలపై దృష్టిపెట్టారు. కేరళలో, తమిళనాడులో 18 వేదాంత బడ్జెట్ హోటల్స్ స్థాపించామని రిషబ్ చెప్పారు. సింగిల్ గా ట్రావెల్ చేసేవారికి డార్మెటరీ సదుపాయం, గ్రూపులుగా వెళ్లే కాలేజ్ విద్యార్థులకు హాల్స్ ఫెసిలిటీ కల్పిస్తోంది వేదాంత.
వేగంగా విస్తరణ
వచ్చే మూడేళ్లలో కనీసం వంద బడ్జెట్ హోటల్స్ స్థాపనే లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్, ముంబై, పుణెలాంటి మహానగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అంతేకాదు, పెద్దగా హోటల్ సదుపాయం లేని చిన్న పట్టణాలు, టూరిస్ట్ – రెలిజియస్ డెస్టినేషన్స్, ఇండస్ట్రియల్ హబ్స్ లో హోటల్స్ పెట్టనున్నారు.
“2018 నాటికి దేశంలలోనే అతిపెద్ద బడ్జెట్ హోటలల్ గ్రూప్ గా మారడమే మా లక్ష్యం. 7 వేల 3వందల డార్మ్ బెడ్స్, 19 వందల ప్రైవేట్ రూమ్స్ అందుబాటులోకి తెస్తాం. 107 హోటల్స్ పెడతాం” రిషబ్
ఇండియాలో హాలిడేస్ మార్కెట్
బడ్జెట్ హోటల్స్ ఓయో, ట్రీబో, జిప్ రూమ్స్ మనదేశంలో మంచి విజయం సాధించాయి. 2013లో ప్రారంభమైన జోస్టల్ అయితే అతి తక్కువ టైంలోనే దూసుకుపోతోంది. వియత్నాంలోనూ జోస్టల్ స్టార్టప్ ఏర్పాటు చేసింది. త్వరలో బెర్లిన్ కు చెందిన మెయినిజర్ గ్రూప్ దేశంలో బడ్జెట్ హోటల్స్ పెట్టేందుకు సన్నద్ధమవుతోంది. కాక్స్ అండ్ కింగ్స్ సంస్థ ఇందుకు సహకరిస్తోంది. అతిథి దేవోభవ అంటూ పర్యాటకులను చూసుకోవాలేగానీ ఈ రంగంలో తిరుగుండదు.