ఆఫీస్ లంచ్ సమస్యలకు టిన్‌మెన్‌తో పుల్ స్టాప్
ఇంటి నుంచి లంచ్ తెచ్చుకుందామంటే వండేవాళ్లు లేరు. ఒక వేళ ఉన్నా.. మన టైంకి అందివ్వలేరు. ఇక ఆఫీసుల్లో రోజూ పెట్టే ఫుడ్డు సంగతి అందరికీ తెలిసిందే. మొదట వారం, పది రోజులు బాగున్నా.. క్యాటరింగ్ ఫుడ్ అనగానే మొహం మొత్తేస్తుంది. అలా అని పస్తులు ఉండలేరు. బయటకు వెళ్లి తెచ్చుకుందామంటే టైం వేస్ట్, ఖరీదైన వ్యవహారం. ఈ సమస్యలన్నింటికీ హైదరాబాద్ కంపెనీ పరిష్కారం చూపింది. యాభై రూపాయలకే లంచ్ ప్రొవైడ్ చేస్తూ.. తన ప్రత్యేకత చాటుకుంటోంది.
ఫుడ్ బిజినెస్ ఎందుకు ?
ఆఫీసుల్లో లంచ్ సమస్యలను ఎదుర్కొన్న నలుగురు యంగస్టర్స్ దీన్ని ఏర్పాటు చేశారు. ఐఐటి, ఆక్స్‌ఫర్డ్, బిట్స్.. వంటి ఉన్నత యూనివర్సిటీల్లో చదువుకున్న వాళ్లంతా ఏకమై హైదరాబాద్ జాబ్ హోల్డర్ల సమస్యలను తీర్చే ప్రయత్నం మొదలుపెట్టారు.
ఎలా పనిచేస్తుంది ?
టిన్ మెన్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని మన వాలెట్‌లో మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వారమంతా ఏం కావాలో జస్ట్ సెలెక్ట్ చేస్తే.. మధ్యాహ్నం ఒకటిన్నర కల్లా లంచ్ డెలివర్ అయిపోతుంది. ఒక వేళ ఆ రోజు వద్దనుకుంటే ఉదయం తొమ్మిది లోపు పాస్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. యాభై రూపాయల నుంచి మొదలయ్యే లంచ్ ఐటెమ్స్ మెనూలో ఉన్నాయి. డెలివరీ కూడా ఉచితంగానే చేస్తున్నారు.
క్వాలిటీని నిలబెట్టుకుంటూ.. కొత్త రుచులను పరిచయం చేయడానికి ఆహారాన్ని వండే బాధ్యతను ఔట్‍సోర్స్ చేస్తోంది టిన్‌మెన్. స్థానిక రెస్టారెంట్లు, హోం చెఫ్స్‌తో ఇందుకు ఒప్పందం కుదుర్చుకుంది. చెఫ్స్ పేరుతోనే వంటలను మెనూలో పెడ్తున్నారు. భవిష్యత్తులో చెఫ్స్‌కు రేటింగ్ ఇవ్వడం వల్ల క్వాలిటీ తగ్గితే ఇతరులను ఎంపిక చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
టిన్‌మెన్ వెనుక టీం -
ముకేష్, చైతన్య, అనూష, మధుర.. టిన్‌మెన్ టీం.
ముకేష్.. ఐఐటి ఖరగ్‌పూర్‌లో బిటెక్ పూర్తిచేశారు. ఒరాకిల్, అమెజాన్ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. గతంలో క్విక్ బాస్కెట్ అనే ఆన్‌లైన్ గ్రాసరీ డెలివరీ సంస్థను ఏర్పాటు చేసి చేదు అనుభవాన్ని చవిచూశారు. దాని నుంచి నేర్చుకున్న పాఠాలతో టిన్‌మెన్‌ను వృద్ధి చేశారు. ఓటమి నుంచి కుంగిపోకుండా.. రెండు నెలల్లోనే కొత్త ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి సక్సెస్ రుచిని చూస్తున్నారు.
చైతన్య - ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబిఏ పూర్తిచేశారు. క్రిసిల్, డెలాయిట్ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఇతను కూడా క్విక్ బాస్కెట్‌లో కో ఫౌండర్‌గా ఉండేవారు.
మధుర.. ఫిలిప్పీన్స్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబిఏ పూర్తిచేశారు.
అనూష రెడ్డి. బిట్స్ పిలానీలో చదువుపూర్తిచేసి.. qafe bistro అనే కాఫీ హౌస్‌ను నడిపిన అనుభవం ఉంది. వినూత్నంగా మహిళల కోసమే దీన్ని ఏర్పాటు చేసి కొద్దికాలం నడిపించారు.
ఇలా వివిధ రంగాల నుంచి నలుగురూ వచ్చినప్పటికీ.. అందరినీ కలిపే కామన్ పాయింట్ మాత్రం ఫుడ్ ఒక్కటే. ఎందుకంటే వీళ్లందరూ ఫుడ్ లవర్స్. ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడు మంచి లంచ్ కోసం ఎంత తహతహలాడాల్సి వచ్చేదో వీళ్లందరికీ తెలుసు. అందుకే నలుగురూ ఏకమై టిన్‌మెన్ ఏర్పాటు చేశారు.
రెస్పాన్స్ ఎలా ఉంది ?
ఏప్రిల్‌లో ఐడియా వచ్చినా రెండు నెలల పాటు కస్టమర్ల ఫీడ్ బ్యాక్ తీసుకుని యాప్ రూపొందించామంటారు ముకేష్. మొదట తయారైన ప్రొడక్ట్‌కీ ఇప్పుడు ఉన్న దానికీ పోలికే లేదని చెప్తారు. యూజర్స్ ఫీడ్ బ్యాక్‌తో ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ చేసుకంటూ వెళ్లడం వల్ల మంచి ప్రొడక్ట్ వచ్చిందని వివరిస్తారు.
'' క్విక్ బాస్కెట్ ఫెయిల్ అయిన అనుభవం బాగా పనికి వచ్చింది. ప్రొడక్ట్ తయారీకి ఎక్కువ కాలం తీసుకోవద్దు. కస్టమర్లకు ఏం కావాలో మనం ఎక్కువ ఆలోచించవద్దు. వాళ్లకే ఏం కావాలో వాళ్లనే డిసైడ్ చేయాలి. అప్పుడే ప్రొడక్ట్ క్లిక్ అవుతుంది'' అంటారు ముకేష్.
జూన్ 15వ తేదీన యాప్ లాంచ్ అయింది. ప్రస్తుతానికి మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లోని ఆఫీసులకు లంచ్ డెలివర్ చేస్తున్నారు. త్వరలో వివిధ ప్రాంతాలకూ విస్తరించాలని యోచనలో టిన్‌మెన్ ఉంది.
ఇప్పటివరకూ 2500 సైన్ ఇన్స్ అయ్యాయి. రోజుకు 100 ఆర్డర్లను డెలివర్ చేస్తున్నారు. ఆ ఆరువారాల కాలంలో 1300 లంచ్స్ డెలివర్ చేసినట్టు ముఖేష్ వివరించారు. వినూత్నమైన ప్యాకింగ్, పేపర్ బ్యాగ్, కరెక్ట్ టైమ్‌కు డెలివరీ ఆకట్టుకుంటోందని ముకేష్ చెబ్తున్నారు. కస్టమర్స నుంచి ఇప్పటివరకూ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని వివరించారు.
మార్కెట్ సైజ్
బెంగళూరులో స్పూన్ జాయ్ వంటి సంస్థలు ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. హైదరాబాద్‌లో హోం ఫుడ్ డెలివరీలో కిచెన్స్ ఫుడ్స్ కూడా ముందంజలో ఉంది. ఇక స్విగ్గీ, ఫుడ్ పండా, టైనీ ఔల్ ఉండనే ఉన్నాయి. అయితే వీళ్లందరితో పోలిస్తే.. మన కాన్సెప్ట్ వేరని, కాస్ట్ కూడా వాళ్లందరి కంటే తక్కువగా ఉండడం ప్లస్ పాయింట్ అనేది టిన్‌మెన్ మాట.
'' మాకు కాస్ట్ వర్కవుట్ అవుతోంది. సాధారణంగా డెలివరీకి ఇప్పుడు కంపెనీ 30-40 ఖర్చు చేస్తున్నాయి. కానీ ఒకే ఆఫీసులో ఎక్కువ మందికి లంచ్ అందివ్వడం వల్ల మాకు ఖర్చు కలిసొస్తోంది. ఒక్కో బాయ్ సగటున ఆరు లంచ్స్ డెలివర్ చేస్తున్నాడు. ఒక్కో లంచ్ డెలివరీకి రూ.8 వరకూ ఖర్చు అవుతోంది. వాల్యూమ్స్ పెరిగితే మాకు మరింత లాభం ఉంటుంది '' - ముకేష్.
తమ అంచనాల ప్రకారం హైదరాబాద్ వంటి నగరాల్లో లక్షన్నర మంది ఉద్యోగులు మధ్నాహ్నం లంచ్ బయట చేసే అవకాశముందని, వీళ్లంతా తమ టార్గెట్ కస్టమర్లే అంటోంది. ఆరు నెలల్లో రోజుకు 2 వేలు, ఏడాదిలో రోజుకు ఎనిమిది వేల మీల్స్ డెలివర్ చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు ముకేష్ వివరించారు.
ప్రస్తుతానికి సొంత నిధులతోనే కంపెనీని నిర్వహిస్తున్న సంస్థ.. తాజాగా ఆగస్ట్ ఫెస్ట్‌లో మంచి కాన్సెప్ట్‌కు గాను ఐదు లక్షల రూపాయలు గెల్చుకుంది. నిధుల కోసం కొంత మంది ఇన్వెస్టర్లతో చర్చలు ప్రారంభించారు.
భవిష్యత్ లక్ష్యాలు
- హైదరాబాద్ సిటీ అంతా విస్తరించాలి
- బెంగళూరు లాంటి నగరాల్లో ఏడాదిలో కాలుమోపాలి
- ఎక్కువ మంది హోం చెఫ్స్‌ను తీసుకోవాలి
- స్నాక్స్, డిన్నర్ కూడా యాడ్ చేయాలి.
- కార్పొరేట్లకు ప్రత్యేక ప్లాన్లు ఆఫర్ చేయాలి.