నందిత ఆత్మవిశ్వాసం ముందు తలవంచిన టీబీ !
టీబీతో పోరాటం చేస్తున్న ధీర వనిత
జీవితంలో చిన్న సమస్య ఎదురైతేనే భయపడిపోతాం. భవిష్యత్తుపై బెంగ పెట్టుకుంటాం. కానీ దశాబ్దకాలం నిత్యం నరకయాతన అనుభవించిన ఆ యువతి మాత్రం ఏ రోజు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. భవిష్యత్తుపై ఆశ, జబ్బును జయించాలన్న పట్టుదల ఆమెను విజేతగా నిలబెట్టింది. ఎందరికో స్ఫూర్తి నింపిన నందిత విజయగాథ ఇది.
కాళ్ల కింద భూమి కదిలినంత పనైంది
ఫ్రెండ్స్ తో పిచ్చాపాటి కబుర్లు, సినిమాలు, షికార్లు. కాలేజ్ డేస్ లో చాలా మంది యువత చేసేది ఇదే. కానీ తన తోటి వారంతా జాలీగా గడుతున్న సమయంలో నందితా వెంకటేషన్ మాత్రం తనకొచ్చిన మాయదారి జబ్బుతో పోరాటం మొదలుపెట్టింది. ముంబైకి చెందిన 26 ఏళ్ల నందితకు అందరి అమ్మాయిల్లాగే భవిష్యత్తుపై ఎన్నో కలులున్నాయి. జీవితంలో ఏదో సాధించాలన్న తపన ఉంది . కానీ విధి చిన్నచూపు చూసింది.
2013 నవంబర్. నందిత తన 24వ పుట్టినరోజు జరుపుకుని రెండు రోజులు గడిచాయి. రోజూలాగే నిద్రలేచిన నందితకు ప్రపంచమంతా మూగబోయిన ఫీలింగ్. అమ్మ తనకు ఏదో చెబుతోంది కానీ తనకేమీ వినిపించడం లేదు. నందితకు కాళ్ల కింద భూమి కదిలినంత పనైంది. టీబీ (క్షయ) ట్రీట్ మెంట్ కోసం వాడిన మెడిసిన్స్ చూపించిన ఎఫెక్ట్ అది.
2007 ఆగస్టులో డిగ్రీలో చేరింది నందిత. కాలేజీలో జాయిన్ అయిన నెల రోజులకు హెల్త్ ప్రాబ్లెం రావడంతో డాక్టర్ ను కలిశారు. పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమెకు అబ్డామినల్ కోచ్ (కడుపులో క్షయ) ఉన్నట్లు గుర్తించారు. ట్రీట్ మెంట్ తీసుకోవడంతో అప్పటికి వ్యాధి తగ్గింది. కానీ దురదృష్టం కొద్దీ 2013లో అది తిరిగబెట్టింది. అప్పుడు వాడిన మందులు చూపిన సైడ్ ఎఫెక్ట్స్ వినికిడి లోపానికి కారణమైంది.
పోరాటం మొదలు పెట్టింది.
వ్యాధితో పోరాటం ఒకవైపు. వినికిడి లోపం మరోవైపు. ఇలాంటి పరిస్థితులు పరిస్థితి ఎదురైతే ఎవరైనా కుంగిపోక మరేం చేస్తారు. భవిష్యత్తుపై ఆశలు వదులుకుంటారు. కానీ నందిత మాత్రం అలా కాదు. పంటి బిగువున బాధను భరించింది. పోరాటం మొదలు పెట్టింది. తనకెంతో ఇష్టమైన డ్యాన్స్ ను బాధ నుంచి ఉపశమనం పొందే మార్గంగా మార్చుకుంది. మ్యూజిక్, లిరిక్స్ వినపడవు. అయినా స్టేజ్ పై డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమని నందిత నిరూపించింది.
ముంబైలో పుట్టి పెరిగిన నందిత 2010లో రామ్ నారాయణ్ రుయ్యా కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. 2011లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకుంది. అదే ఏడాది ఢిల్లీలో ది ఎకనామిక్ టైమ్స్ లో కెరీర్ జర్నలిస్టుగా ప్రయాణం మొదలుపెట్టింది . ఫైనాన్షియల్ జర్నలిస్టుగా స్థిరపడాలన్నది ఆమె ఆశయం. ఆ కల నిజం చేసుకునేందుకు జాబ్ కు రిజైన్ చేసి 2012 నవంబర్ లో తిరిగి ముంబైకి చేరుకుంది. ఫైనాన్స్ కోర్సు చేస్తూనే.. ఉద్యోగంలో చేరింది. 7 ఏళ్ల వయసులో ముంబైలోని నటన ప్రియ డ్యాన్స్ ఇన్ స్టిట్యూట్ లో భరతనాట్యం నేర్చుకున్న నందిత ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక మళ్లీ ఆ వైపు దృష్టి సారించింది. కానీ ఆమె ఆనందం ఎంతో కాలం నిలవలేదు.
టీబీ మళ్లీ పగబట్టింది.
2013 మే. నందిత ఆరోగ్యం మళ్లీ పాడైంది. డాక్టర్లు పరీక్షించి క్షయ పేగులకు పాకిందని చెప్పారు. క్యూర్ అయ్యేందుకు చాలా కఠినమైన ట్రీట్ మెంట్ తీసుకోవాలన్నారు. 14 నెలల పాటు చికిత్స తీసుకోవాల్సి వచ్చింది.
“టీబీ ఎంత భయంకరమైనదో దాంతో పోరాడుతున్న వారికే తెలుసు. ట్రీట్ మెంట్ లో భాగంగా రోజు 10 నుంచి 15 ట్యాబ్లెట్లు మింగాల్సి వచ్చేది. ఆ మందులతో వికారం, వాంతులు ఒక్కోసారి డిప్రెషన్ వచ్చేది. టీబీ తిరగబెట్టడం కన్నా భయంకరమైన అనుభవం మరొకటి ఉండదు.”- నందిత
రెండోసారి టీబీ అటాక్ చేసినప్పుడు మెడిసిన్స్ ఎఫెక్ట్ చూపలేదు. తీవ్రమైన కడుపునొప్పి, ఆకలి మందగించింది. బరువు తగ్గడం మొదలైంది. ఎన్ని మెడిసిన్స్ వాడినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇన్ఫెక్షన్ సోకిన పేగు భాగాన్ని తొలగించాలని డాక్టర్లు డిసైడయ్యారు. ఆపరేషన్ తర్వాత తిరిగి సాధారణ జీవితం గడపొచ్చని, చదువు కొనసాగించని డాక్టర్లు ధైర్యం చెప్పడంతో సర్జరీ చేయించుకుంది.
“తల్లిదండ్రులు, సోదరుని బలవంతంతో మొదటి సారి హాస్పిటల్ లో అడుగుపెట్టాలను. తొందరలోనే అక్కడి నుంచి బయటపడతానని నాకు నేనే సర్థి చెప్పుకున్నాను. హాస్పిటల్ ఓ కొత్త అనుభవాన్ని ఇస్తుందనుకుంటూ ఆపరేషన్ థియేటర్ లోకి అడుగుపెట్టాను.” -నందిత
సర్జరీ సక్సెస్ కానీ..
సర్జరీ సక్సెస్ అయిందని డాక్టర్లు చెప్పారు. పది రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. కానీ ఇంటికొచ్చిన తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. వారం తర్వాత నందిత పరిస్థితి విషమంగా మారింది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. అప్పటికి ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది.
“డాక్టర్లు మళ్లీ సర్జరీలు చేయాలన్నారు. రోజులు, నెలలు గడిచాయి. నాలుగు సర్జరీలు పూర్తయ్యాయి. పూర్తిగా బెడ్ కే పరిమితమైపోయాను. జుట్టు ఊడిపోయింది. ఫేస్ అందవికారంగా మారింది. ఆ క్షణం నాకింకా గుర్తింది. నన్ను నేను గుర్తుపట్టేలేకపోయాను. నన్ను నేను చూసుకుని భయపడ్డాను. అసలు బతుకుతానా అనిపించింది. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటమిని అంగీకరించవద్దని నిర్ణయించుకున్నాను.” -నందిత
హాస్పిటల్ లో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నందిత డిసైడైంది. పుస్తకాలు చదవి తన తనకొచ్చిన వ్యాధి, ప్రస్తుత పరిస్థితి గురించి అవగాహన పెంచుకుంది. ఆత్మవిశ్వాసంతో ఆరోగ్య పరిస్థితి, ట్రీట్ మెంట్ గురించి వివరాలను స్వయంగా డాక్టర్లను అడిగి తెలుసుకోవడం మొదలుపెట్టింది. హాస్పిటల్ లోఉన్న సమయంలో సంగీతం, సానుకూల ధృక్పథం గురించి చాలా విషయాలు తెలుసుకుంది. రెండు నెలల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి మళ్లీ ఇంటి ముఖం చూసింది. మరో 8 నెలల తర్వాత జరిగిన ఫైనల్ సర్జరీకి మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది.
“టీబీ కారణంగా అప్పటికి 22 కేజీల బరువు కోల్పోయాను. ముఖం పాలిపోయి కాంతి విహీనంగా మారింది. మెడిసిన్స్ చాలా దుష్ప్రభావాన్ని చూపించాయి. ఇన్ని సమస్యలను ఎదుర్కొని ఇంటికి చేరుకోవడం ఆనందం కలిగించింది.”- నందిత
మూగబోయిన ప్రపంచం
2014 నవంబర్. నందిత హాస్పిటల్ నుంచి డిశ్చార్జై నెల గడిచింది. ఆ రోజు నిద్రలేచిన నందితకు ప్రపంచం మూగబోయిన అనుభూతి కలిగింది. ఎవరు ఏం మాట్లాడినా ఆమెకు వినిపించడం లేదు. మెడిసిన్స్ కారణంగా ఆమె వినికిడి సామర్థ్యం 70శాతం కోల్పోయింది.
“అమ్మ నాకు ఏదో విషయం చెబుతోంది. కానీ నాకు ఏమీ వినబడటం లేదు. అంతా గందరగోళం అనిపించింది. అప్పటికే నాలుగు సర్జరీలు కావడంతో తీవ్రమైన నొప్పితో బాధ పడుతున్నాను. అందుకే ముందు కొన్ని రోజుల వరకు వినికిడి సామర్థ్యం కోల్పోయిన విషయం అర్థం కాలేదు. త్వరలోనే పరిస్థితి అర్థమైంది. డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడటం కూడా కష్టంగా మారింది. నాకిష్టమైన మ్యూజిక్ వినడం, టీవీ, సినిమాలు చూడటం, మాట్లాడటం ఇలా అన్నింటికీ దూరమయ్యాను. ఒక్కోసారి నాపై నాకు జాలి కలిగేది” - నందిత
ఆత్మవిశ్వాసంతో ముందుకు
రోజులు గడిచే కొద్దీ నందితలో మార్పు వచ్చింది. వినికిడి లోపం గురించి ఆలోచించడం, తనపై తాను జాలి చూపించుకోవడం మానేసి భవిష్యత్తుపై దృష్టి పెట్టింది. బాధలోంచి బయటపడేందుకు డ్యాన్స్ ను మించిన ప్రత్యామ్నాయంలేదని నందితకు అర్థమైంది. అదే ఆమె జీవితానికి కొత్త అర్థాన్నిచ్చింది. అక్టోబర్ లో నటన ప్రియ నిర్వహించిన డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు రెడీ అయింది. కానీ మ్యూజిక్ కు అనుగుణంగా డ్యాన్స్ చేయడం కత్తిమీద సాములా మారింది. తోటి డ్యాన్సర్ల స్టెప్పులను అనుసరిస్తూ వారితో కలిసి డ్యాన్స్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆరు సర్జరీలు, ఏడాది పాటు బెడ్ కే పరిమితమైపోవడంతో ఆమె శక్తి హరించుకుపోయింది. అయినా వెనకడుగు వేయకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించింది. హియరింగ్ ఎయిడ్స్ సాయంతో రిథమ్ వైబ్రేషన్స్ కు అనుగుణంగా డ్యాన్స్ చేసి శెభాష్ అనిపించుకుంది.
“కొన్నాళ్ల క్రితం వరకు ఒకరి సాయం లేనిదే నడవలేని పరిస్థితిలో ఉన్న నేను ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే స్థాయికి చేరడం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఇదే పట్టుదలతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నా. వినికిడి లోపం ఉన్న లండన్ కు చెందిన బ్యాలెట్ డాన్సర్ లాంటి వారి అనుభవాలు ఆత్మవిశ్వాసం పెంచాయి.” -నందిత
భవిష్యత్తుపై నమ్మకం.
అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత జరుగుతున్న మొదటి ప్రదర్శన. స్టేజ్ పైకి వెళ్లిన నందితను ఎన్నో భావోద్వేగాలు చుట్టుముట్టాయి. భవిష్యత్తుపై నమ్మకం కలిగించాయి.
“ మ్యూజిక్ వినిపించకపోవడం పెద్ద సమస్య అనిపించలేదు. డ్యాన్స్ చేయాలన్న తపనతో ముందుకెళ్లాను. ప్రదర్శన ఉద్వేగభరితంగా సాగింది. కొత్త ఉత్సాహం, విశ్వాసంతో జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించేందుకు డ్యాన్స్ సహకరించింది.” -నందిత
వినికిడి లోపం కారణంగా నందిత ఇప్పటికీ కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. అయినా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతోంది. పేరెంట్స్, సోషల్ మీడియా సాయంతో బయటి ప్రపంచంలో విషయాలను తెలుసుకుంటోంది. ప్రస్తుతం నందిత ఆరోగ్యం చాలా వరకు మెరుగైంది. తొందరలోనే ఫ్రీలాన్సర్ గా కెరీర్ ను మళ్లీ ప్రారంభించాలనుకుంటోంది. ప్రస్తుతం నందిత ఫైనాన్స్, ఇండియన్ ఎకానమీపై ఫీచర్లు, ఆర్టికల్స్ రాస్తోంది.
"కలలు కనాలి. వాటిని నిజం చేసుకోవాలి. సమస్య ఎదురైందని భయపడొద్దు. జీవితంలో చిన్న చిన్న విషయాలే మనకు ఎంతో ప్రేరణనిస్తాయి. హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఆరోగ్యం కుదుటపడి నా అంతట నేను తిని, లేచి నడిస్తే చాలు అని కోరుకున్నా. ఈ ఏడాది పూర్తి ఆరోగ్యవంతురాలినై డ్యాన్స్ తో పాటు కెరీర్ ను ప్రారంభించాలనుకుంటున్నా".-నందిత
కొత్త సంవత్సరం లో కోటి ఆశలు
2016 ఏడాదిపై నందిత ఎన్నో ఆశలు పెట్టుకుంది. కొత్త నృత్య రీతుల్ని నేర్చుకోవాలని అనుకుంటోంది. జీవితంలో అత్యంత దారుణమైన దశను దాటి వచ్చిన ఆమె ఏ సమస్యనైనా ఎదుర్కొనే సత్తా వుందన్న ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తోంది. ప్రతి క్షణం ఎంతో విలువైందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నది నందిత మాట. ప్రతి అనుభవం నుంచి పాఠం నేర్చుకుని దాన్ని బలంగా మలుచుకోవాలనుకుంటున్న నందిత భవిష్యత్తులో కోరుకున్నవన్నీ సాధించాలని మనమూ కోరుకుందాం.