ఫిట్‌నెస్‌తో వావ్ అనేంత బిజినెస్ చేస్తున్న బెజవాడ అమ్మాయి..!
సెంచురీ మార్క్ వెయిట్ నుంచి సెలబ్రిటీ ట్రైనర్ అయిన పూర్ణిమ
మహిళలకు గర్భధారణ పునర్జన్మ లాంటిదే. ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్లు మళ్లీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించాల్సిందే. శరీరంలో జరిగే చాలా మార్పులు ఆడవారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తాయి. అందుకే ప్రతీ స్త్రీ జీవితంలో ఈ దశ అత్యంత సంతోషాన్నే కాదు.. ఊహించనన్ని కష్టాలను, ఒక్కోసారి మోయలేన్ని భారాన్ని కూడా తెచ్చిపెడ్తుంది.
మండవ పూర్ణిమ ఇందుకు మినహాయింపేమీ కాదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వాలీబాల్ ఆడినా, మైళ్లకొద్దీ దూరాన్ని ఏ మాత్రం అలుపు లేకుండా పరిగెత్తినా.. అవేవీ ఆమెను ఆదుకోలేకపోయాయి. ఎంతో ఫిట్‌గా ఉన్న ఆ అథ్లెట్ బాడీ.. ఆవిరి కుడుమును ఊరిపోయింది. పెళ్లై.. పిల్లలు పుట్టిన తర్వాత ఆమె ఏకంగా సైజ్ జీరో నుంచి సైజ్ 104కు చేరువైంది. నాలుగు అడుగులు కూడా వేయలేని స్థితిని చూసి తనపై తనకే జాలేసింది. అప్పుడు ఆమె తీసుకున్న ఓ కఠినమైన నిర్ణయమే.. కానీ డెసషన్ నేడు వందలాది మంది మహిళలకు ఆసరాగా నిలుస్తోంది. వాళ్లు ఆరోగ్యంగా ఉండేందుకు కారణమవుతోంది. ఓ చిన్న ఆలోచనతో మొదలైన జిమ్.. ఇప్పుడో పెద్ద ఫిట్‌నెస్ క్లబ్‌లా మారి ఇండస్ట్రీలో ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.
ఇంతకీ ఎవరీ పూర్ణిమ
ఆమె ఓ సెలబ్రిటీ ట్రైనర్, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్, కార్పొరేట్ స్పీకర్, న్యూట్రిషనిస్ట్.. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి. ఫేస్ బుక్‌లో చాలా యాక్టివ్‌గా తనను, తన స్టార్టప్‌ను ప్రమోట్ చేసుకునే పూర్ణిమ.. ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టాలే పడ్డారు. తనకు సంబంధం లేని రంగంలో అడుగుపెట్టి.. తనను తాను ప్రూవ్ చేసుకోవడం వెనుక ఏడేళ్ల కష్టం దాగుంది.
సిక్స్ ఫీట్ స్పెషల్
మండవ పూర్ణిమది కృష్ణా జిల్లా విజయవాడ. అయితే పుట్టింది, పెరిగిందీ అంతా హైదరాబాద్‌లోనే. ఎగువ మధ్యతరగతి కుటుంబం, తల్లిదండ్రులిద్దరూ ఉన్నతోద్యోగులు. అయితే అందరిలా మామూలుగా ఉంటే.. ఆమె కూడా ఓ ఆర్డినరీ పర్సన్ అయిపోయేవారు. కానీ పూర్ణిమకు హైట్.. చాలా ప్లస్ అయింది. సాధారణంగా అధ్లెట్స్, మోడల్స్‌కు సూట్ అయ్యేంత పొడవు తనది. ఏకంగా సిక్స్ ఫీట్. దీంతో చిన్నప్పటి నుంచి కోచ్‌లు, పీఈటీ మాస్టార్ల ఫోకస్ అంతా తనపైనే ఎక్కువుండేది. వాళ్ల అంచనాలను తగ్గట్టుగానే చదువుతో పాటు వాలీబాల్‌లో 33 జాతీయ, 8 అంతర్జాతీయ టోర్నమెంట్స్‌లో ఆడారు.
ఇదే సమయంలో బిఎస్‌ఈ కెమిస్ట్రీ, ఉస్మానియా నుంచి హెచ్.ఆర్., మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ పూర్తిచేశారు పూర్ణిమ. ఆ తర్వాత ఇన్ఫోటెక్ (ఇప్పుడు సైయెంట్) సంస్థలో హెచ్.ఆర్. విభాగంలో కొంతకాలం పనిచేశారు. 9 టు 5 జాబ్ కొద్దిరోజులు బాగానే అనిపించినా.. ఎందుకనో అది తనకు సూట్ కావడం లేదని తెలుసుకునే సమయానికి పెళ్లైపోయింది. జీవితంలోకి రాఘవేంద్ర అడుగుపెట్టగానే.. ప్రెగ్నెన్సీ, డెలివరీ అన్నీ ఒన్ బై ఒన్ చకచకా జరిగిపోయాయి.
సైజ్ '0' టు సైజ్ '104'
డెలివరీ తర్వాత అప్పటి దాకా నాజూగ్గా ఉన్న శరీరం కాస్తా ఆమె మాట వినడం మానేసింది. ఏకంగా 72 కిలోల నుంచి 104 కిలోల మార్కుకు చేరింది. దీంతో తనపై తనకే ఎక్కడలేని కోపం, జాలి, బాధ. ఎన్నో ఫీలింగ్స్ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. గ్రౌండ్‌లో ఎన్నో రౌండ్స్ వేసినా రాని ఆయాసం.. నాలుగు అడుగులకే చెమటలు పట్టించింది. బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్.. ఇలా ఒక్కటేమిటి.. ఏ పార్టులో ఏ డిఫెక్ట్ ఉందో తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది.
అయితే అలా అని అందరిలా రాజీపడి జీవితాన్ని గడిపేసి ఉంటే.. ఇప్పుడు మనం పూర్ణిమా రాఘవేంద్ర గురించి ఇంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. 104 కేజీల అంతు చూడాలని జిమ్‌లో చేరారు. మళ్లీ మామూలుగా మారాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. కానీ ఏడెనిమిదేళ్ల క్రితం మహిళల కోసం ప్రత్యేకంగా అన్ని వేళల్లో తెరిచి ఉంచే జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లు పెద్దగా లేవు. మామూలు సమయాల్లో వెళ్తే మిగిలిన మగాళ్ల మధ్య ఎక్సర్‌సైజులు చేస్తుంటే.. వాళ్ల చూపులు తనలో మరింత ఇన్ఫీరియర్ కాంప్లెక్స్‌ను నింపాయి. సరే ట్రైనర్‌ను పెట్టుకుందామని అనుకున్నా.. పెద్దగా అనుభవం ఉన్నవాళ్లెవరూ కనిపించలేదు.
కంటెంట్‌కు ముందు కటౌట్ ఆకర్షించేది !
చివరకు తన కోసం తానే ఓ జిమ్‌ను తెరవాలని నిర్ణయించారు పూర్ణిమ. తాను ఫిట్‌గా మారి మరో పది మందిని ట్రైన్ చేయాలని భావించారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడబెట్టిన డబ్బుతో పాటు కొంతమంది దగ్గర అప్పు తీసుకుని రూ. 12 లక్షలతో ఓ జిమ్ మొదలుపెట్టారు. ఓపెనింగ్ జరిగింది కానీ.. కస్టమర్లే పుష్కరాలకు వచ్చే భక్తుల్లా అప్పుడప్పుడూ కనిపించారు. ఈలోగా అధైర్యపడకుండా తన ఫిట్‌నెస్ మీద శ్రద్ధపెడ్తూనే అమెరికన్ కాన్సెప్టులు, ఏరోబిక్స్, యోగా సర్టిఫికేషన్ కోర్సులు చేస్తూ వచ్చారు.
అథ్లెట్ కావడం, అప్పటికే జాతీయ స్థాయి గేమ్స్ ఆడడం, చూడగానే అంతెత్తు ఫ్లెక్సీలా ఉండడం.. పూర్ణిమకు మరోసారి కలిసొచ్చింది. ప్రత్యేకించి మహిళల కోసమే జిమ్ తెరవడంతో కొంతమంది ఓసారి ట్రై చేద్దామని రావడం.. ఇలా మొదలైంది. అప్పట్లో నెలకు రూ.800 ఫీ తీసుకుని శిక్షణ ఇచ్చేవారు పూర్ణిమ. అయితే అందరిలా కేవలం ట్రెడ్ మిల్, సైక్లింగ్.. నాలుగు ఏరోబిక్ ఎక్సర్‌సైజులకు పరిమితం చేయకుండా.. ఓ ప్రత్యేకమైన అప్రోచ్ అవసరమని భావించారు. ఒక్కో మహిళ సాధకబాధకాలు అర్థం చేసుకుంటూ వాళ్ల ఆరోగ్య స్థితిని అవగాహన చేసుకుంటూ ట్రైన్ చేయడం మొదలుపెట్టారు.
ఇంత చేసినా.. మొదటి ఏడాదిలో కనీసం షాపు రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిని కొన్ని సందర్భాల్లో ఎదుర్కొన్నా అంటారు పూర్ణిమ.
వావ్ అనేంత బిజినెస్
క్లైంట్ల అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టారు పూర్ణిమ. అమ్మాయిలకు ప్యూబర్టీ మొదలు.. మెనోపాజ్ వరకూ ఉంటే వివిధ దశలు, ఆయా సమయాల్లో వచ్చే ఇబ్బందులు, వాటిని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా తెలుసుకున్నారు. ఫిట్‌గా ఉండడం అంటే వెయిట్ తగ్గడం మాత్రమే పరిష్కారం కాదు.. అనే విషయాన్ని క్లైంట్లకు అర్థమయ్యేలా చెప్పారు. ఓ క్రమపద్ధతిలో అవలంభించే విధానాన్ని వాళ్లకు అలవాటు చేయడం మొదలుపెట్టారు.
'' హెల్త్ రిపోర్ట్స్, ఆరోగ్య సమస్యలు, వెయిట్, లైఫ్ స్టైల్ వంటివన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతే క్లైంట్‌కు ట్రైనింగ్ ఉంటుంది. కడుపు కాల్చుకుని, అన్నం తినకుండా ఉండమని మేం అసలు చెప్పం. తినాలి, కష్టపడాలి.. ఫిట్‌నెస్ సాధించాలి''.
ఒక్కో ఏడాది గడుస్తున్న కొద్దీ క్లైంట్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఐబీఎం, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌ఎస్‌బీసీ వంటి కార్పొరేట్ సంస్థలు కూడా ఆమె శిక్షణ కోసం ఎదురు చూశాయి. తమ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలని ఆయా పూర్ణిమ చేత క్లాసులు ఇప్పించాయి.
ఇప్పటిదాకా 5,800 మందిని ట్రైన్ చేసినట్టు చెబుతారు పూర్ణిమ. కార్పొరేట్ క్లాసుల ద్వారా సుమారు 10,000 మందికి అవగాహన కల్పించారు.
ఏడెనిమిదేళ్ల కష్టం తర్వాత, తనపై తనకు మరింత నమ్మకం పెరిగింది. భర్త సహకారం కూడా పూర్తిస్థాయిలో అందడంతో ఈ మధ్యే 'వావ్ ఫిట్‌నెస్' పేరుతో ఓ సెంటర్‌ను ప్రారంభించారు పూర్ణిమా రాఘవేంద్ర. సొంతంగా దాచుకున్న సొమ్ముతో పాటు కొంతమంది స్నేహితులు, బంధువుల నుంచి డబ్బు సమీకరించిన రూ.60 లక్షలతో అంతర్జాతీయస్థాయి ఫిట్‌నెస్ సెంటర్ మొదలుపెట్టారు. కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా దీన్ని తీర్చిదిద్దారు. జిమ్, యోగా, జుంబా, ఏరోబిక్స్, క్రాస్ ఫిట్, కిక్ బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ వంటి వాటిల్లో శిక్షణనిస్తున్నారు.
సుమారు 8,000 చ.అడుగుల్లో, ఓపెన్ టు స్కై యోగా స్డూడియో, వర్కవుట్ ప్లేస్ సహా.. అనేక సదుపాయాలు కల్పిస్తున్నారు. కొత్త సెంటర్‌లో ప్రస్తుతం 298 మంది క్లైంట్లకు సేవలు అందిస్తున్నారు. అవసరాన్ని బట్టి నెలకు రూ. 1500 నుంచి రూ.18,000 వరకూ ఫీజులను వసూలు చేస్తున్నారు.
వెనకుంది ఐఐటి బ్రెయిన్
పూర్ణిమ భర్త రాఘవేంద్ర ఐఐటి మద్రాసులో ఎంటెక్, ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ పూర్తిచేశారు. కాగ్నిజెంట్ వంటి కంపెనీల్లో పనిచేసిన ఆయన.. ఇప్పుడు వావ్ ఫిట్‌నెస్ సీఈఓగా వ్యవహరిస్తూ మార్కెటింగ్, ఆపరేషన్స్‌ను చూసుకుంటున్నారు. మరో జాతీయస్థాయి బాస్కెట్ బాల్ ప్లేయర్ సతీష్... యాప్స్, టెక్నాలజీపై దృష్టిసారించారు. త్వరలో యాప్‌ను తీసుకురావాలని వావ్ ఫిట్‌నెస్ టీం కసరత్తు చేస్తోంది.
ఫ్యూచర్ ప్లాన్స్
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక్క ప్రాంతానికే పరిమితమైన స్టూడియోలను నాలుగుకు పెంచాలని చూస్తున్నారు. ప్రత్యేకించి మహిళల కోసం ఎవరూ దృష్టిసారించకపోవడం తమకు చాలా కలిసొచ్చే అంశం అంటున్నారు పూర్ణిమ. అందుకే ఇక్కడ చాలా పొటెన్షియల్ ఉందని ధైర్యంగా చెబ్తున్నారు. త్వరలో మరో మెట్రో నగరానికి కూడా విస్తరించాలనే యోచనలో ఉన్నట్టు వివరించారు.
'' ఏడాదిన్నరలోగా ఇతర ప్రధాన నగరాలకు విస్తరించాలనేది మా ఆలోచన. ఇందుకోసం ప్రొఫెషనల్ ఇన్వెస్టర్లను సంప్రదిస్తున్నాం. ఇప్పుడు మొదలుపెట్టిన హైదరాబాద్ స్టూడియో కూడా ఆరు నెలల్లోనే బ్రేక్ ఈవెన్‌కు వస్తామనే ధీమా ఉంది. ఈ మార్కెట్‌కు అంత డిమాండ్ ఉంది. అందులో సందేహం లేదు''- పూర్ణిమ రాఘవేంద్ర
సెలబ్రిటీ రూట్
ఫిట్‌నెస్‌కు ప్రాణమిచ్చే సెలబ్రిటీలంతా పూర్ణిమకు ఫ్యాన్స్ అయ్యారు. ఆమె నుంచి ఎన్నో సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. రకుల్‌ప్రీత్ సింగ్, అనుష్క, రాణా, నాని వంటి వాళ్లు కొంతమంది నిత్యం ఆమెకు టచ్‌లో ఉంటారు. అన్నం, నెయ్యి తింటూ కూడా ఈ ఫిట్‌నెస్ ఫీట్ సాధించడంలో సహాయపడ్డారు.
''టేపులు, వెయింగ్ మెషినల్లో కొలతలు చూసుకోవడం మానేయండి. ఆరోగ్యంగా ఉండడం అంటే సన్నగా ఉండడమే అనే భ్రమ తొలగించుకోండి. శరీరంలో ప్రతీ భాగం ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. అందుకు ఏం చేయాలో ఆలోచించుకోవాలి అంతే. శుభ్రంగా అంత పప్పులో ఇంత నెయ్యి వేసుకుని అన్నం తింటూ కూడా సిక్స్ ప్యాక్ తెచ్చుకోవచ్చు. అందులో సందేహం లేదు '' అంటూ సలహా ఇస్తారు పూర్ణిమ.