పుట్టినవాడు గిట్టక తప్పదు. మరి మీరు పుట్టిన తర్వాత కష్టపడి కూడబెట్టినదంతా గిట్టాక ఎవరో కొట్టుకుపోతే ? అలా కాకుండా మీరు కోరుకున్నవారికి మాత్రమే మీ ఆస్తి దక్కేలా చేయడానికి.. ఆన్ లైన్ విలునామా రాసుకోవచ్చు.
మనిషి అత్యంత నిస్వార్థంగా చేసేవిగా భావించే పనుల్లో ‘విల్’ ఒకటి. దీనివల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి-మీరు కోరుకున్న వారికే మీ ఆస్తి దక్కుతుంది. రెండు-అదే సమయంలో ఆస్తి విషయంలో మీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం లేకుండా చేస్తుంది.
ఈ-కామర్స్ ప్రపంచాన్ని ఏలుతున్న ఈ రోజుల్లో, వీలునామా రాసే వారి అవసరాలకు అనుగుణమైన ‘రెడీ మేడ్’ వీలునామాలు ఆన్ లైన్లో సిద్ధంగా ఉంటున్నాయి.
ఆన్ లైన్ విల్లులు నెమ్మదిగా భారతీయ ప్రజల ఆదరణను పెంచుకుంటున్నాయి. రోజు రోజుకూ మరింత చేరువవుతున్నాయి.
ఆన్‌లైన్ వీలునామాతో ప్రయోజనాలివీ..
సాధారణంగా, ఎక్కువ ఆస్తి కలిగిన ఉన్నత కుటుంబాలవారు తమ మరణం తర్వాత ఆస్తి దుర్వినియోగం కాకుండా చూసే పనిముట్టులా ఉపయోగపడే ఈ ఆన్ లైన్ విల్లులు.. విద్యావంతులు, ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువ పాపులర్ అవుతున్నాయి. ఈ రంగంలో మూడు కంపెనీలు సేవలు అందిస్తాయి. ఇవన్నీ ఈ-విల్లు సేవలు.. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌పై మరింత సులువు చేశాయి.
‘‘దీనివల్ల కలిగే పెద్ద ప్రయోజనమేంటంటే.. ఏ వ్యక్తి అయినా తన ఇంట్లో కూర్చొనే తన అవసరాలకు తగిన విల్లును రాయించుకోవచ్చు. అంటే.. అర్ధరాత్రి కూడా ఎవరినీ డిస్టర్బ్ చేయకుండా, ఎవరికీ తెలియకుండా కూడా తన వీలునామాను రాయించుకోవచ్చు. పదే పదే లాయర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. కేవలం ఇది రాయడానికే భారీ మొత్తంలో డబ్బు వెచ్చించాల్సిన అవసరమూ లేదు ’’ అని ‘వార్మోండ్ ట్రస్టీస్ అండ్ ఎగ్జిక్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఎండీ, సీఈఓ గోకుల్ దాస్ అంటారు. ఈ రంగంలోని మూడు పెద్ద కంపెనీల్లో వార్మోండ్ కూడా ఒకటి.
ప్రతి వీలునామాను కంపెనీ లీగల్ బృందంలోని సీనియర్ నిపుణులే రూపొందిస్తారు. ఆ తర్వాత దీనిపై లోతుగా సమీక్షిస్తారు. డ్రాఫ్ట్ విల్లు రూపొందడానికి ముందు ఎంతో ఎక్సర్‌సైజ్ చేస్తారు. డ్రాఫ్టు రూపొందించాక, వీలునామా రాసే వ్యక్తికి పంపి అంతా ఓకే అన్నాకే దాన్ని ఖరారు చేస్తారు. ఖరారైన తుది విల్లును ఈ-మెయిల్ ద్వారా సంబంధిత వ్యక్తికి పంపుతారు. అప్పుడు ఆ వ్యక్తి దాన్ని ప్రింటవుట్ తీసుకొని ఇద్దరు వ్యక్తుల సమక్షంలో సంతకం పెట్టాల్సి ఉంటుంది.
ఈ రంగంలో ప్రముఖులు
ప్రస్తుతం, ఈ రంగంలో నైపుణ్యం కలిగిన కంపెనీలు మూడే ఉన్నాయి. ఒకటి-ముంబైలోని వార్మోండ్ ట్రస్టీస్ అండ్ ఎగ్జిక్యూటర్స్‌తో కలిసి ఎన్ఎస్ డీఎల్ జాయింట్ వెంచర్(Ezeewill.com). మిగతా రెండింటిలో హెడీఎఫ్‌సి సెక్యూరిటీస్ వారి ఈ-విల్, ఎస్బీఐ వారి ‘మై విల్ సర్వీస్ ఆన్ లైన్’ ఉన్నాయి.
‘‘ఇటీవలి కాలంలో భారత్ సంపదలో గణనీయమైన వృద్ధి కనిపించింది. విద్యావంతులు, వయసు పైబడినవారు సాధారణంగా ఇలాంటి ఆన్‌లైన్ విల్లువైపు మొగ్గు చూపుతున్నారు’’ అని గోకుల్ చెప్పారు. దక్షిణ భారత దేశంలో ఆన్‌లైన్ విల్లులకు ఎక్కువ ఆదరణ లభిస్తోందని, ఇక్కడ క్రమేపీ ఈ-విల్లులు రాసేవారు పెరుగుతున్నారని పేర్కొన్నారు. 40 ఏళ్లకు అటు ఇటుగా ఉన్నవారు వీటిపై మక్కువ చూపుతున్నారని తెలిపారు.
ఏడాది కిందట ప్రారంభించిన తమ సంస్థకు, తమ ద్వారా ఆన్ లైన్ విల్లు రాయించుకున్నవారిలో 81 ఏళ్ల వృద్ధుడే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తి అని తెలిపారు.
ఎలా పని చేస్తుంది
ఎవరైనా సరే తమ ఆస్తుల సమగ్ర వివరాలు, లబ్ధిదారులు, మతం వంటి వ్యక్తిగత సమాచారం సమర్పిస్తే.. అందుకు అనుగుణంగా, దేశంలో చట్టాలను దృష్టిలో ఉంచుకొని వీలునామా రాస్తారు. ఈ-విల్లులు రాయడానికి నిపుణులైన లాయర్ల బృందాలను సర్వీసు ప్రొవైడర్ కంపెనీలు నియమించుకొని ఉంటాయి. దరఖాస్తును బట్టి వారే అవసరానికి తగినట్టుగా డాక్యుమెంట్లను సిద్ధం చేస్తారు.
విల్లు రాత పూర్తయిన తర్వాత సంబంధిత వ్యక్తికి ఒక సాఫ్ట్ కాపీ పంపిస్తారు. ఆ తర్వాత తుది కాపీ చేతికి అందుతుంది. దాన్ని ఇద్దరు సాక్షుల సమక్షంలో సంతకం చేసి భద్రంగా దాచుకోవాలి. Ezeewillలో అయితే విల్లు టెంప్లేట్ రూపంలో ఉండదు. ఎవరి అవసరాలకు తగిన విధంగా అప్పటికప్పుడు విల్లు ప్రత్యేకంగా రాసుకోవాల్సి ఉంటుంది.
నిదానంగా.. జోరందుకుంటూ..
ఆన్ లైన్ వీలునామా రాసే ట్రెండ్ ఎగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఇప్పుడిప్పుడే జోరందుకుంటోంది. అయితే కాస్త నిదానంగా ఈ ప్రక్రియ జరుగుతోంది. ఫిక్సెడ్ డిపాజిట్లు, షేర్లు వంటి అధునాతన పెట్టుబడి పద్ధతులు పెరుగుతున్న నేపథ్యంలో విల్లు రాయడం క్రమేపీ తప్పనిసరి అవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
‘‘గతంలో అయితే సామాన్యులు పెద్దగా వీలునామా రాసేవారు కాదు. ఎందుకంటే పదే పదే లాయర్ల దగ్గరకు వెళ్లాల్సి రావడం దానికి ఓ కారణం. ఎవరైనా సరే పదే పదే లాయర్ దగ్గరకు వెళ్లి ఇలాంటివి రాయిస్తున్నారని కుటుంబంలోని ఎవరైనా గ్రహిస్తే.. అది సంబంధ బాంధవ్యాల మధ్య పొరపొచ్చాలు తెచ్చే ప్రమాదముంది. ఆన్ లైన్ విషయంలో లాయర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పైగా, తమ విల్లును ఒకసారి రాశాక, సంబంధిత వ్యక్తికి మేం 30 రోజుల గడువు ఇస్తాం. ఆ సమయంలో ఏమైనా మార్పు చేర్పులుంటే చేసుకోవచ్చు. 30 రోజుల తర్వాతే సాఫ్ట్ కాపీ, ఎన్‌క్రిప్టెడ్ విల్లు పంపుతాం’’ అని SBICAP ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ సీఈఓ వి.మురళీధరన్ చెప్పారు.
ఆన్ లైన్ విల్లు రాయడం వల్ల మరో ఉపయోగం కూడా ఉందని మురళీధరన్ అన్నారు. ‘‘ఈ విల్లు రూపొందించాక, గోప్యంగా ఉంచాల్సిన వివరాలను సైట్ నుంచి తొలగిస్తాం. అంటే ఎవరైనా తమ విల్లును ఒకసారి పోగొట్టుకుంటే, అతడు/ఆమె కొత్తగా మళ్లీ డ్రాఫ్ట్ విల్లు రాయించుకోవాలి’ అని వెల్లడించారు.
20-40 ఏళ్ల మధ్య వయసున్న టెక్-సావీ గ్రూపు వారే ఎక్కువగా ఈ సేవలు వినియోగించుకుంటున్నారని మురళీధరన్ అంటున్నారు. వచ్చే పదేళ్లలో తమ విల్లును తామే రాసుకునే స్థాయి వచ్చినప్పుడు ఈ ఆన్ లైన్ విల్లుల రంగం మరింత జోరందుకుంటుందని అభిప్రాయపడ్డారు. హెచ్ డీ ఎఫ్ సీ, ఎన్ ఎస్ డీ ఎల్ లు రూ.4000 వరకు చార్జ్ చేస్తుండగా, ఎస్బీఐ తన ఆన్ లైన్ విల్లు డ్రాఫ్టుకు రూ.2500 వరకు చార్జీలు వసూలు చేస్తోంది.