ఈ టెక్నాలజీ వాడితే వెయ్యి రోజులైనా సరే ఆహారపదార్ధాలు కుళ్లిపోవు
గోదాముల్లో భద్రపరిస్తే ఎలుకల బాధ. బయట ఆరబొస్తే వాన భయం. పోనీ కోల్ట్ స్టోరేజీలో పెడదామంటే- అది కొన్ని రోజులు మాత్రమే. కావాల్సినన్ని రోజులు పంటను నిల్వ చేసుకొని, రేటొచ్చినప్పుడే అమ్ముకుంటే ఎంత బాగుంటుంది? రైతుకు అలాంటి మంచి రోజులు త్వరలోనే రాబోతున్నాయి. ఎందుకో మీరే చదవండి
రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను రైతులు రోడ్డు మీద ఎందుకు పారబోస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? గిట్టుబాటు ధర రాక, పోనీ వచ్చినప్పుడు అమ్ముకుందామంటే- పంట నిల్వ చేసుకునే సదుపాయాల్లేక అన్నదాతలు తమ కష్టాన్ని నేలపాల్జేస్తున్నారు. టన్నుల కొద్దీ టమాటాలు, క్వింటాళ్ల కొద్దీ ఉల్లిగడ్డలను రోడ్డ మీద పారబోసే దృశ్యాలు నిత్యం ఎక్కడో ఓ చోట కనిపిస్తూనే ఉంటాయి. అయితే రైతుకు ఇక ముందు ఆ ఇబ్బంది ఉండదు. రేటు రాకపోయినా సరే పంట పారబోసుకునే దుస్థితి మాత్రం రాదు. బ్లాక్ బాక్స్ అనే టెక్నాలజీ రైతుల పాలిట వరమే అని చెప్పాలి. ఎందుకంటే, ఈ విధానంలో పంటను నిక్షేపంగా నిల్వ చేసుకోవచ్చు. నెలా రెణ్నెల్లు కాదు. ఏకంగా వెయ్యి రోజులు. అంటా రమారవి మూడేళ్లపాటు తాజాగా భద్రపరుచుకోవచ్చు.
ఆశ్చర్యంగా వుంది కదా. ఇదంతా బ్లాక్ బాక్స్ టెక్నాలజీ మహిమ. వ్యవసాయ ఉత్పత్తులను వెయ్యి రోజుల వరకు తాజాగా ఉంచడమంటే మాటలు కాదు. ఎలాంటి ఆహార పదార్థమైనా సరే అస్సలు పాడవదు. కుళ్లిపోయే ఛాన్సే ఉండదు. ఇంత ప్రత్యేకమైన పరిజ్ఞానాన్ని స్పెయిన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఫ్యాక్టరీ లేదా ప్లాంట్.. ఎక్కడైనా సరే ఈ టెక్నాలజీని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. సాధారణంగా కోల్డ్ స్టోరేజీల్లో నైట్రోజన్ సాయంతో పదార్థాలను నిల్వ చేస్తుంటారు. బ్లాక్ బాక్స్ పద్ధతిలో అలాంటిదేదీ వుండదు. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉపయోగించరు. అందుకే ఇది ప్రత్యేకమైన టెక్నాలజీ! ఈ విధానంలో నిల్వ ఉంచిన పదార్థాలు వెయ్యి రోజుల వరకు సహజత్వాన్ని కోల్పోవు. పోషక విలువలు చెక్కుచెదరవు. పండ్లు, కూరగాయలు, మాంసమే కాదు.. ఎలాంటి ఆహార పదార్థమైనా వెయ్యి రోజుల వరకు తాజాగా నవనవలాడుతుంటుంది.
అమెరికాలో పేటెంట్ కలిగి ఉన్న బ్లాక్ బాక్స్ టెక్నాలజీని ప్రపంచమంతా వాడి చూసింది. ఇప్పుడిది మన దేశానికి కూడా వచ్చింది. విజ్తార్ అగ్రిటెక్ కంపెనీ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంది. ఇందుకోసం స్పెయిన్ కు చెందిన నైస్ ఫ్రూట్స్ కంపెనీతో టై అప్ అయింది. భారత్ లోని కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లకు ఈ సరికొత్త టెక్నాలజీ అనుసంధానం చేయబోతున్నారు. అందులో మొదటి రెండు యూనిట్లు మన హైదరాబాదులో ఏర్పాటు కాబోతుండటం విశేషం! ఇండియాలో ఏర్పాటయ్యే బ్లాక్ బాక్స్ కోల్ట్ స్టోరేజీలకు విజ్తార్ కంపెనీ టెక్నాలజీ అండ్ ఈక్విటీ భాగస్వామిగా ఉండబోతోంది. హిందుస్థాన్ ఎల్ఎన్జీతో కలిసి హైదరాబాదులో రెండు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్లు తెరవబోతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో మామిడిపండ్ల నిల్వ కోసం మరో రెండు ప్లాంట్లు పెట్టబోతున్నారు.
బ్లాక్ బాక్స్ టెక్నాలజీ ద్వారా రైతుల ఆదాయం నాలుగు రెట్లు పెరుగుతుందంటున్నారు విజ్తార్ అగ్రిటెక్ కంపెనీ ప్రతినిధి సాహిల్. ధరలు పడిపోగానే రైతులు పంటంతా రోడ్ల మీద పారబోసే సంఘటనలు ఇక ముందు కనిపించవని ఆయన నమ్మకంగా చెప్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను రెండున్నరేళ్ల పాటు నిక్షేపంగా భద్రపరుచుకోవచ్చని తెలిపారు. మంచి రేటు వచ్చినప్పుడు కోల్ట్ స్టోరేజీ నుంచి తీసి పంట అమ్ముకోవచ్చని వివరించారు. ఒకవేళ రేటు రాకపోతే తామే విదేశాలకు ఎగుమతి కూడా చేసి పెడతామని తెలిపారు. దీనివల్ల అటు రైతులకు లాభం చేకూరుతుంది, ఇటు దేశానికీ విదేశీ మారక ద్రవ్యం సమకూరుతుందని సాహిల్ అభిప్రాయపడ్డారు. ముందుగా రోజుకు 30 టన్నుల నిల్వ సామర్థ్యం గల ప్లాంట్లను ఏర్పాటు చేసి, క్రమంగా వెయ్యి టన్నులకు పెంచాలని విజ్తార్ కంపెనీ భావిస్తోంది. బ్లాక్ బాక్స్ స్టోరేజీ ప్లాంట్ల రాక కోసం రైతులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.