సంకలనాలు
Telugu

ద లిటిల్ ఫ్లీ... బిగ్ సక్సెస్

Devi
9th Oct 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

2006 సంవత్సరం. ఢిల్లీ ఐఐటీలో చదువుతున్న అలంకార్ జైన్ చదువును మధ్యలోనే నిలిపేశాడు. సొంతంగా వ్యాపారం చేయాలన్నది అతని సంకల్పం. కార్పొరేట్ కంపెనీలో హెచ్ఆర్‌లో పనిచేస్తున్న ప్రియాంకా పంజాబీ.. కూడా హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేసింది. తనకు అసలు జీవితంలో ఏం కావాలి? అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కునే పనిలో పడిందామె. అయితే, అనుకోకుండా కలసిన వారిద్దరి వ్యాపార ఆలోచనలూ ముంబై ప్రజల మనుసు దోచే మంచి మార్కెట్ ను సృష్టించాయి. అదే ‘లిటిల్ ఫ్లీ’మార్కెట్. పేరుకే లిటిల్ అయినా.. సక్సెస్ మాత్రం పెద్దదే. కానీ ఇది దక్కడానికి వారికి ఆరేళ్ల సమయం పట్టింది.

image


ద లిటిల్ ఫ్లీ

ఏదో సాధించాలన్న బలమైన కాంక్ష ఒకవైపు.. చిన్న చిన్న వాటి నుంచి కూడా అద్భుతాలు సృష్టించగలమన్న నమ్మకం మరోవైపు.. అలా తమ ఆలోచనలకు పదును పెట్టిన వారిద్దరికీ ఓ మంచి వ్యాపార అవకాశం కనిపించింది. ముంబై నగర గల్లీల్లో ఎవరి గుర్తింపునకూ నోచుకోకుండా మరుగున పడిపోతున్న సృజనాత్మకతే ఆ వ్యాపార అవకాశం. షాపింగ్, ఫుడ్, మ్యూజిక్ ఫెస్టివల్ అంటే పడిచచ్చే ముంబై నగర ప్రజలకు వాటన్నిటినీ ఒకే చోట అందించే మార్కెట్ వేదికగా ‘ద లిటిల్ ఫ్లీ’ అవతరించింది.

షాప్, ఫుడ్, ఫన్

సృజనాత్మక వ్యక్తులు, డిజైనర్లు, ఆర్టిస్టులు పైసా పెట్టుబడి పెట్టకుండా తమ ప్రతిభను వేలాది మందికి పరిచయం చేసుకునే అవకాశమివ్వడమే లిటిల్ ఫ్లీ ప్రాధాన్యాంశం. నిజానికి సృజనను కనుగొని వెలికి తీయడమే ఈ స్టార్టప్ ప్రధాన లక్ష్యం.

‘లిటిల్ ఫ్లీ’ క్రమేణా పలు ఫెస్టివల్స్‌కు ఒక వేదికగా మారింది. ఇదొక షాపింగ్ ఫెస్టివల్ దేశంలోని కొత్త కళాకారులు, డిజైనర్లు రూపొందించిన వందలాది వస్తువులను మీరిక్కడ చూడొచ్చు. కొనుక్కోవచ్చు. బహుశా బయట ఏ షాపింగ్ మాల్‌లోనూ ఇన్ని రకాల వెరైటీలు, క్రియేటివ్ వస్తువులు మీకు దొరక్కపోవచ్చు. ఇదొక ఫుడ్ ఫెస్టివల్ కూడా. ప్రపంచ రుచులతో ప్రయోగాలు చేసే నలభీములు వండే రక రకాల వంటకాలను మీరిక్కడ రుచి చూడొచ్చు. అంతే కాదు ఇదొక మ్యూజిక్ ఫెస్టివల్ అడ్డా కూడా. తమ గానంతో గుండె లోతుల్ని తడిమే గాయకులను, పాటల రచయితలను, సంగీతకారులను మీరిక్కడ కలుసుకోవచ్చు.

లిటిల్ ఫ్లీలో ఏమిటి విభిన్నం ?

అలంకార్, ప్రియాంకలిద్దరికీ ఒక విషయంలో బలమైన నమ్మకముంది. అదేంటంటే.. 100 శాతం తమ శక్తినంతా వెచ్చించి పని చేసినప్పుడు మాత్రమే తాము అనుకున్నది సాధించగలమని. మొదటి నుంచీ సొంత డబ్బులే పెట్టుబడిగా పనిచేస్తున్నప్పటికీ.. పార్టిసిపెంట్లు, విజిటర్లకు తగిన లాభం చేకూర్చడంలోగాని, నాణ్యతలోగాని ఏనాడూ వీరు రాజీపడలేదు.

‘‘కొన్నిసార్లు చిన్న మెరుగులు.. ఆవిష్కరణలు..కొత్త అందాలను తీసుకొస్తాయి’’ అంటారు అలంకార్.

లిటిల్ బుక్ ఎక్స్ఛేంజ్, సందర్శకులందరికీ ఉచిత విత్తన ప్యాకెట్ల పంపిణీ, సమాజ సేవ కోసం పాటలు పాడి చందాలు పోగుచేసే కళాకారుల కోసం ఏర్పాటు చేసిన ‘ఆర్ట్ ఫర్ కాజ్’ విభాగం వంటి కమ్యూనిటీ ఇనీషియేటివ్‌లు కూడా సందర్శకులను బాగా ఆకట్టుకుంటాయి.

‘‘ఫెస్ట్‌కు వచ్చి వెళ్లిన వారిని మేం సర్వే చేస్తే.. తమకు ఈ షాపింగ్ ఫెస్టివల్ చాలా సంతృప్తినిచ్చిందని 95 శాతం మందికిపైగా చెప్పారు. మాకు మంచి రేటింగ్ ఇచ్చారు’’ అని ప్రియాంక వెల్లడించారు.

తెర వెనుక హీరోలు ?

ఏడు నుంచి 10 మంది సభ్యులు కలిగిన కోర్ టీంలో వ్యూహ బృందం కూడా ఉంటుంది. తదుపరి ఏం చేయాలి ? లిటిల్ ఫ్లీ మార్కెట్లోకి తీసుకురావాల్సిన ఆవిష్కరణలు ఏమిటన్నదాని గురించి ప్లాన్ చేస్తుంది. క్యూరేషన్ టీమ్.. తమ వేదికపై స్టాల్స్ పెట్టడానికి దరఖాస్తు చేసుకున్నవారి నుంచి అత్యుత్తమమైన ఆవిష్కరణలున్నవారిని ఎంపిక చేయడంపై దృష్టి పెడుతుంది. సోషల్ మీడియా మార్కెటింగ్, గ్రాఫిక్స్, మార్కెటింగ్ వ్యూహాల గురించి మార్కెటింగ్ టీమ్ కృషి చేస్తుంది. వేదికను అలంకరించి, స్టాల్స్ ఎక్కడ ఏవేవి ఉండాలన్నది ప్రొడక్షన్, డెకరేషన్ టీమ్ చూసుకుంటుంది. పన్నెండు మందికిపైగా ఫ్రీలాన్సర్లు, వంద మందికిపైగా వలంటీర్లు ఈవెంట్ సందర్భంలో వీరికి తోడుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారు. మొత్తానికి, కంపెనీలో కార్య్రకమాలన్నీ చాలా పారదర్శకంగా జరుగుతాయి. మొత్తం కీలక నిర్ణయాలన్నిటిలో అన్ని టీమ్ లూ పాలుపంచుకుంటాయి.

image


స్టార్టప్ కంపెనీ కావడంతో, పార్ట్‌నర్ లిద్దరూ చాలా అంశాల్లో కీలక పాత్ర పోషిస్తుంటారు. అయితే ప్రియాంక ప్రధానంగా.. స్టాల్ పార్టిసిపెంట్ల అవసరాలకు తగిన ఏర్పాట్లు, కంపెనీలో హెచ్ఆర్ వ్యవహారాలు చూసుకుంటుండగా.. మార్కెటింగ్ వ్యూహాలు, ఆర్థిక, తయారీ సంబంధిత అంశాలను అలంకార్ చూసుకుంటారు. ‘‘వ్యూహాలు, ఐడియాలపైనే నాకు చాలా ఆసక్తి. ఈ ఆలోచనలకు హంగులద్ది అద్భుతంగా మార్చడంలో ప్రియాంక దిట్ట.’’ అని చెప్పారు అలంకార్.

ఐదేళ్ల తర్వాత లిటిల్ ఫ్లీ..

ముంబైలో బలమైన పునాదులు వేసుకున్న ఈ కంపెనీ.. ఇతర నగరాల్లో కూడా పాగావేయాలని చూస్తోంది. కళాకారులకు ఓ వేదిక కల్పించడంలో ఓ పనిముట్టుగా ఉండాలన్నదే వీరి లక్ష్యం. అక్టోబరు నుంచి ఏప్రిల్ వరకు ముంబైలో నాలుగు ఎడిషన్లు తేవాలని, ఢిల్లీలో కనీసం ఒకటైనా తేవాలని వారు ప్లాన్ చేశారు.

వెబ్‌సైట్

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags