కెమిస్ట్రీ టీచర్ కుంచె నుంచి మధుబని మెరుపులు !
మధుబని కళాకారిణిగా మారిన రసాయన శాస్త్ర అధ్యాపకురాలు విదూషిణీ ప్రసాద్ ఆకర్షణీయమైన కథ ఇది.
కోల్‌కతాలో పుట్టిన విదూషిణి ప్రసాద్.. పదో తరగతి వరకూ విద్యాభ్యాసం అక్కడే చేశారు. విదూషిణి తండ్రి.. సినిమా డిస్ట్రిబ్యూటర్ కావడంతో.. ఆయనకు పాట్నాలోనే ఎక్కువగా పని ఉండేది. దీంతోపాటు ఆమె పూర్వీకులు కూడా పాట్నాకి చెందిన వారే కావడంతో.. తిరిగి అక్కడికే చేరుకుంది ఆమె కుటుంబం. పాట్నా యూనివర్సిటీలో రసాయన శాస్త్రంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విదూషిణి.. ఆ తర్వాత ఉపాధ్యాయ వృత్తి ఎంచుకున్నారు.
పాట్నాలో ఉండగా ఉన్నత తరగతి విద్యార్ధులకు మేథమేటిక్స్, సైన్స్ బోధించేవారు విదూషిణి. పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె ఢిల్లీకి మారాల్సి వచ్చింది. ఢిల్లీలో కూడా కొన్నేళ్ల పాటు టీచర్ వృత్తిని కొనసాగించినా.. కొడుకు పుట్టిన తర్వాత ఆమె కెరీర్‌కి బ్రేక్ వచ్చింది. అప్పుడు తన కలలను అందుకునేందుకు.. విదూషిణికి సొంత వెంచర్ ప్రారంభించి ఆంట్రప్రెన్యూర్‌గా మారాలనే ఆలోచన వచ్చింది.
"ఇంటి దగ్గరి నుంచే పని చేయగలిగేలా ఏదైనా వృత్తిని ఎంచుకుందామని భావించాను. అందుకే పెయింటింగ్ ప్రారంభించాను. మొదట మా ఇంటిని అలంకరించుకునేందుకు.. స్నేహితులు, బంధువులకు అందించేందుకే దీన్ని ప్రారంభించాను. అందరూ నా పెయింటింగ్స్‌ని, కళని ఇష్టపడ్డంతోపాటు.. దీన్నే ఓ ప్రొఫెషన్‌గా తీసుకోవాలని ప్రోత్సహించారు"-విదూషిణి
ఇలా పదిమంది నుంచి లభించిన ప్రోత్సాహం.. విదూషిణిని మధుబని పెయింటింగ్స్‌వైపు ఆకర్షితురాలయ్యేలా నడిపించింది. “బొమ్మలకు ఎక్కువగా కనిపించే ఫీచర్స్, షార్ప్‌గా ఉండే ముక్కు, జటిలంగా కనిపించే గీతలు, డిజైన్లు... చూడ్డానికే కాదు గీసేందుకు కూడా మధుబని పెయింటింగ్స్ ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. అందుకే కాలేజ్ రోజుల నుంచే వీటిని గీయడం నేను నేర్చుకున్నాన”ని చెప్పారు విదూషిణి.
ఈ ఆలోచన వచ్చాక కూడా కొంతకాలంపాటు కెరీర్ లాంఛర్లో కరిక్యులం డెవలప్మెంట్ విభాగంలో పనిచేశారామె. అయితే.. ఇంటి దగ్గరే పెయింటింగ్స్ వేస్తూ.. తన ఇంట్రెస్ట్‌ను మాత్రం కొనసాగించారు విదూషిణి. ఉద్యోగం వదిలేశాక తన వెంచర్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టగలిగారు.
మధుబని పెయింటింగ్ విషయంలో విదూషిణి ఎలాంటి శిక్షణా పొందలేదు. అయితే.. దీన్ని నేర్చుకునేందుకు పెద్దగా కష్టపడలేదంటున్నారామె. ఈ కళ తమ సంస్కృతిలో ఒక భాగమని, అందుకే తేలికగా ప్రారంభించగలిగానని అంటారు. మధుబని కళను నేర్చుకోవాలని అనుకునే ఔత్సాహికుల కోసం ఆమె వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటారు. ఫేస్బుక్లో దీని కోసం ఓ ప్రత్యేకమైన పేజ్ కూడా ప్రారంభించగా.. దీని ద్వారా మధుబణి కళ గురించి తెలుసుకునే అవకాశముంది.
నోవికాలో రిజిస్టర్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు
2006 నుంచి పూర్తిస్థాయిలో పెయింటింగ్ పైనే దృష్టి పెట్టారు విదూషిణి. కొడుకు పుట్టిన తర్వాత ఆమెకో అద్భుతమైన ఆఫర్ వచ్చింది. అంతర్జాతీయ కళాకారులను కలిపే ఆన్లైన్ గ్లోబల్ మార్కెట్ ప్లేస్ 'నోవికా'లో రిజిస్టర్ చేసుకునే ఛాన్స్ వచ్చాక.. వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.
2007లో బెంగళూరుకు నివాసం మారిన విదూషిణి.. అక్కడి ఆర్ట్ గ్యాలరీలలో ప్రదర్శనల ఏర్పాటుకు ప్రయత్నించారు. అయితే వారి నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో కొంతకాలంపాటు తనకు కళాకారురాలిగా గుర్తింపునిచ్చిన నోవికా ద్వారానే తన వ్యాపారాన్ని కొనసాగించారు. వారి దగ్గర నుంచి ఆర్డర్స్ ఒకేసారి ఎక్కువగా రావడం కూడా ఒక కారణమే అని చెప్పచ్చు. నోవికాకు ప్రొడక్టులు పంపాక.. వారు ఈ కామర్స్ ప్లాట్‌ఫాం ద్వారా విక్రయిస్తారు. చాలావరకు విదూషిణి పెయింటింగ్స్‌ను ఆన్లైన్ ద్వారానే విక్రయిస్తుండగా.. ఎ హండ్రెడ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థతోపాటు ఏకా లైఫ్ స్టయిల్ కూడా అమ్మకాల్లో సహాయపడుతోంది.
వీటితోపాటు బెంగళూరులోని రెనైసాన్స్ ఆర్ట్ గ్యాలరీ, కేరళలోని ఫోర్ట్ కొచ్చి సమీపంలో ఉన్న డేవిడ్ హాల్ ఆర్ట్ గ్యాలరీలతోపాటు పలు ప్రాంతాల్లో తన మధుబని పెయింటింగ్స్‌ను ప్రదర్శిస్తున్నారు విదూషిణి.
బెంగళూరు ఐఐఎంలో నిర్వహించిన ప్రీమియర్ బిజినెస్ ఫెస్టివల్ విస్టాలోనూ ప్రదర్శన ఏర్పాటు చేసి, తన కళకు మరింత ప్రచారం లభించేందుకు కృషి చేశారు విదూషిణి. కేంద్ర ప్రభుత్వంలోని టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ నిర్వహించే సెంట్రల్ కాటేజ్ ఎంపోరియంలో.. ఈమె లిస్టెడ్ కళాకారిణి కూడా కావడం గమనార్హం.
ఓ సృజనాత్మక ఆంట్రప్రెన్యూర్ ప్రయాణం
"ఇదో అద్భుతమైన ప్రయాణం అని చెప్పడానికి నేను ఏ మాత్రం సంకోచించను. నేనిక్కడ బెంగళూరులో కూర్చుని పెయింటింగ్స్ వేస్తున్నా.. దేశవ్యాప్తంగా ఆర్డర్స్ వస్తున్నాయనే విషయం నాకు తెలుసు. అంటే ఈ కళకు ఆదరణ, అవగాహన పెరుగుతున్నాయని అర్ధం" అంటున్నారు విదూషిణి.
“పెయింటింగ్స్ వెనుక కళాకారుని కష్టాన్ని చాలామంది గుర్తించరు. అందుకే వీలైనంత వరకూ ధర తగ్గించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది కొంత నిరుత్సాహం కలిగించే విషయం”అంటున్నారు విదూషిణి.
పెయింటింగ్స్‌కి ఉపయోగించే పేపర్, కాన్వాస్‌లను బెంగళూరు లోకల్‌గానే కొనుగోలు చేస్తున్న విదూషిణి.. అవసరమయ్యే పాళీలను మాత్రం పాట్నా నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుంటారు.
కళాకారిణి సంతృప్తి
తను ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధించడంపై విదూషిణి సంతృప్తిగా ఉన్నారు.
" పనిభారం పెరగడంతో.. ప్రస్తుతం పని ఎక్కువ, ఎంజాయ్మెంట్ తక్కువ అని చెప్పాలి. అయినా సరే నాకు సంతృప్తినిచ్చే పనులను చేయగలగడం చాలా సంతోషాన్ని ఇస్తోంది"అంటున్నారు విదూషిణి.
మధుబని పెయింటింగ్స్‌కు సంబంధించిన ఓ హ్యాండ్‌బుక్‌ని కూడా విదూషిణి రూపొందించారు. దీనిలో దేశవ్యాప్తంగా ఈ కళకు సంబంధించిన పలు రూపాలు ఉంటాయి. ఆయా కళారూపాలను ఎలా చేయాలి, ఎలా విక్రయించాలి, ఎగుమతి చేయాలి, దేశవ్యాప్తంగాను, విదేశాల్లో మార్కెటింగ్ అవకాశాలు ఎలా ఉంటాయనే వివరాలు హ్యాండ్‌బుక్‌లో ఉంటాయి. దీనికోసం అనేకమంది కళాకారులను ఆమె ఇంటర్వ్యూ కూడా చేశారు. తన లక్ష్యం ఏంటో విదూషిణికి స్పష్టంగా తెలుసు. అందుకే ఆమె ప్రయాణం కూడా సాఫీగానే ఉంది. తనను తాను ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఈ కళకు ఎలా ప్రచారం చేయాలనే అంశాలపైనే విదూషిణి దృష్టి కేంద్రీకరించారు.