సంకలనాలు
Telugu

స్టార్టప్ విప్లవం దూసుకొస్తోంది..! ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయా..!?

సై అంటున్న పారిశ్రామికవేత్తలు... సర్కార్ కోర్టులో బాల్..

అనామిక
16th Jan 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

ఇప్పుడెక్కడ చూసినా స్టార్టప్ మంత్రమే వినిపిస్తోంది. ఒక్క మనదేశంలోనే కాదు.. మారుతున్న పరిణామాలతో అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త ఆలోచనలతో వస్తున్నారు. ఇప్పటికే స్టార్టప్ ఎకోసిస్టమ్ లో చైనా, ఇజ్రాయెల్ దేశాలను దాటేసి యూకె, యూఎస్ ల తర్వాత భారత్ మూడో అతి పెద్ద దేశంగా నిలబడింది.

కార్పొరేట్ ఉద్యోగమెందుకు? సొంత బిజినెస్ ఎందుకు మొదలు పెట్టకూడదు.. ? టెక్నికల్ నాలెడ్జ్ కమాన్ అంటోంది. మేనేజ్ మెంట్ స్కిల్స్ గో ఏ హెడ్ అని ఉత్సాహపరుస్తున్నాయి. ఉడుకు రక్తం పారిశ్రామికవేత్తలుగా పరుగులు తీయమంటోంది. ఈ పరిణామాలకు తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం కూడా స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా అని పిలుపునిస్తోంది. ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే దేశ స్వరూపాన్ని మార్చిన 1990ల నాటి లిబరలైజేషన్ తర్వాత ఇది మరో పెద్ద మలుపు కాబోతోందనే అంచనాలున్నాయి.

స్టార్టప్ ఇండియా.. స్టాండప్ ఇండియా..

స్టార్టప్ ఇండియా.. స్టాండప్ ఇండియా..


ఎంత ఉత్సాహం ఉన్నా ప్రోత్సాహం కూడా కావాలి. పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. ప్రభుత్వాల నుండి ఎంతో కొంత ఆసరా కూడా కావాలి. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాలసీలు వివిధ రకాలుగా ఉన్నాయి. కొన్నిరాష్ట్రాలు స్టార్టప్ లకు ఊతాన్నిస్తే, మరికొన్ని రాష్ట్రాల్లో నియమ నిబంధనల కారణంగా స్టార్టప్ లకు పెద్దగా ప్రోత్సాహం కనిపించని పరిస్థితి నెలకొంది.

దేశంలో ఉత్తరాదితో పోలిస్తే, దక్షిణాది రాష్ట్రాలు స్టార్టప్ లకు చాలా సపోర్ట్ గా నిలుస్తున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇచ్చేలా పాలసీలను రూపొందించటంలో, వాటిని అమలు చేయటంలో కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే చాలా ముందున్నాయి. మరీ ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, ఆయా రాష్ట్రాల్లోని పలు ముఖ్య పట్టణాలను పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా అభివృద్ధి చేయటంలో దక్షిణాది దూసుకుపోతోంది.

నవంబర్ 2015లో తొలి అడుగులు వేసిన కర్ణాటక, తన సొంత స్టార్టప్ పాలసీని రూపొందించుకున్న మొదటి రాష్ట్రంగానిలిచింది. ఎంపిక చేసిన కళాశాలల్లో ఇంక్యుబేటర్స్ ఏర్పాటు చేయటంతో పాటు వాటిని రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సంస్థలతో అనుసంధానం చేస్తోంది. 2013లో మొదటి స్టేట్ లెవెల్ స్టార్టప్ వేర్ హౌస్ ఏర్పాటు చేసిన కర్ణాటక, రెండవది 2015లో ఏర్పాటు చేసింది. మొత్తానికి స్టార్టప్ లను ప్రోత్సహించటానికి కర్ణాటక వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నదనే చెప్పాలి.

కేరళ ప్రభుత్వం తన స్టార్టప్ పాలసీని, కేరళ ఐటి మిషన్ ని 2014లో ప్రకటించింది. 5వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించటమే ధ్యేయంగా పెట్టుకుంది. దేశంలో మొదటి టెలికామ్ ఇంక్యుబేటర్ స్టార్టప్ విలేజ్ ని 2012లోనే స్థాపించింది. అంతే కాదు.. స్టార్టప్ లకు ప్రోత్సాహం ఇచ్చేలా 10 అంశాల ప్రతిపాదనతో పాటు, 10లక్షల చదరపు అడుగుల ఇంక్యుబేషన్ స్పేస్ ని కూడా ఇస్తానంటోంది. వాటితోపాటు 2019 వరకు ఏటా ఆ రాష్ట్ర బడ్జెట్ లో ఒక శాతాన్ని యూత్ ఆంట్రప్రెన్యూర్ షిప్ యాక్టివిటీస్ కోసం కేటాయించబోతోంది. యువ పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ ప్రాజెక్టులకు ఆర్థికంగా సపోర్ట్ చేసేలా బ్యాంకులను ప్రోత్సహించటంతో పాటు, సెబి నిర్ధారించిన ఎర్లీ స్టేజ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ లో ప్రభుత్వం కూడా భాగమయ్యే అవకాశాలున్నాయి.

తెలంగాణ కూడా స్టార్టప్ ల ప్రోత్సాహంలో ఉత్సాహంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) పేరుతో శిక్షణ కూడా ఇస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ టీ-హబ్ కూడా ఏర్పాటు చేసింది.

ఇక ఆంధ్రప్రదేశ్ 17 వేల చదరపు అడుగులను టెక్నలాజికల్ రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ పార్క్ కోసం కేటాయించింది. అంతే కాదు 100కోట్ల ఇనిషియల్ ఇన్నోవేషన్ ఫండ్ ని కూడా యువ పారిశ్రామికవేత్తల కోసం కేటాయించింది. సింగిల్ విండో క్లియరెన్స్ యూనిట్ ని త్వరితగతిన అనుమతులు ఇవ్వటానికి ఏర్పాటు చేయబోతోంది.

ఇక మధ్య ప్రదేశ్ రాష్ట్రం స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి రూ. 200 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేసింది. ఇందులో రూ. 75 కోట్లు అక్కడి ప్రభుత్వం సమకూర్చింది.ఇక వెస్ట్ బెంగాల్ కూడా తన స్టార్టప్ పాలసీని ప్రకటించింది. ఆంట్రప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ సెంటర్ నెట్ వర్క్ ని ఉన్నత విద్యాసంస్థలతో కలిపి ఏర్పాటు చేస్తానని ప్రకటించింది.

రాజస్థాన్ తన స్టార్టప్ పాలసీని 2015 అక్టోబర్ లోనే లాంఛ్ చేసింది. స్టార్టప్ ఒయాసిస్ ని మొదలు పెట్టిన తర్వాత, రాజస్థాన్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ కు చెందిన ఇంక్యుబేషన్ సెంటర్ స్టార్టప్ సిస్టమ్ బాధ్యతలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఐడియా స్టేజ్ స్టార్టప్ లకు నెలకు రూ. పదివేలు చొప్పున ఏడాది వరకు ప్రోత్సాహకంగా ఇస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇలా వివిధ దశలలో ఉన్న స్టార్టప్ లకు వాటి అవసరాలకు తగ్గట్టు ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది రాజస్థాన్ ప్రభుత్వం.

ఇక దేశంలోనే వ్యాపారం అంటే మారు పేరుగా నిలిచే గుజరాత్ లో ప్రభుత్వం స్టార్టప్ పాలసీలపై పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పాలి. వస్తు తయారీ రంగంపై మాత్రమే ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటోంది. ఇక బీహార్ ప్రభుత్వం రూ.500కోట్లను వెంచర్ క్యాపిటల్ ఫండ్ కింద కేటాయించింది. బీహార్ ఆంట్రప్రెన్యూర్స్ అసోసియేషన్ కూడా రూ. 50 కోట్లు సమకూర్చి ప్రభుత్వానికి సపోర్ట్ గా నిలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలే కీలకం..

రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలే కీలకం..


ప్రభుత్వాల తీరు మారుతోంది... ప్రోత్సాహం పెరుగుతోంది.

ఓవరాల్ గా చూస్తే ప్రభుత్వాల తీరులో గతంతో పోలిస్తే చాలా మార్పు కనిపిస్తోంది. స్టార్టప్ విప్లవానికి తగ్గట్టుగా కాస్త ముందు వెనుకా అన్నట్టు పాలసీలు రూపొందిస్తున్నాయి. ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. పలువురు యువ పారిశ్రామికవేత్తలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మేం ఇప్పటివరకు కలిసిన ప్రభుత్వ అధికారులంతా చాలా సపోర్ట్ గా నిలిచారు. చాలా సహాయం చేశారు.- సుజాయత్ ఆలి, ఫ్యాషన్ డిస్కవరీ అండ్ షాపింగ్ యాప్ వూనిక్, కో ఫౌండర్, బెంగళూరు.
మధ్య ప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని చాలా ప్రోత్సహించింది . స్టార్టప్ లకు అనువైనట్టుగా, కొత్త ఆలోచనలను స్వాగతిస్తూ యువ పారిశ్రామికవేత్తలకు ఊతమిస్తోంది. 2013లో డేటా సెంటర్ లాంచ్ చేసినపుడు చాలా సవాళ్లు ఎదుర్కొన్నాం. ప్రభుత్వ సహకారంతో వాటిని అధిగమించగలిగాం -నరేంద్ర సేన్, రాక్ బ్యాంక్ డేటా సెంటర్ ఫౌండర్, ఇండోర్.
ఇక తెలంగాణ స్టార్టప్ లకు చాలా ఆశావహంగా కనిపిస్తున్న రాష్ట్రం. టీ హబ్ యువ పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలుకుతోంది. స్టార్టప్ సిటీగా హైదరాబాద్ ను ముందు వరుసలో నిలుపటానికి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేనన్ని అవకాశాలు ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నాయి.- ఆదిత్య వుచి, ఫౌండర్ జిప్పర్ యాప్ .
స్టార్టప్ లకు ప్రోత్సాహం....

స్టార్టప్ లకు ప్రోత్సాహం....


ప్రభుత్వాలు చేయాల్సింది చాలా ఉంది...

ఎక్కువ మంది యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నా, స్టార్టప్ లు పట్టాలెక్కాలన్నా ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని పన్ను రాయితీలు, మరిన్ని ప్రోత్సాహకాలు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇప్పటివరకు జరుగుతున్న హ్యాకథాన్ కి చాలా పరిమితులు కనిపిస్తున్నాయి. దీనికున్న పరిమితులు తొలగాలి. అదే సమయంలో స్టార్టప్ లను దిశానిర్దేశం చేసేలా అనుభవజ్ఞుల సలహాలు కూడా అవసరమే. ఇది ప్రభుత్వం కల్పించాలి.-ఆదిత్య వుచి, ఫౌండర్ జిప్పర్ యాప్. 
ఇంకా చాలా చోట్ల పాతకాలం పద్ధతులే సాగుతున్నాయి. ఆ డాక్యుమెంట్ అని, ఈ డాక్యుమెంట్ అని రోజుల తరబడి తిప్పటం లాంటి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇలాంటి అంశాల్లో చాలా మార్పు కావాలి.-సుజాయత్ ఆలి, ఫ్యాషన్ డిస్కవరీ అండ్ షాపింగ్ యాప్ వూనిక్, కో ఫౌండర్, బెంగళూరు.

మరో పక్క కేరళ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తున్నామంటున్నా, యువ పారిశ్రామికవేత్తల నుండి చాలా ఫిర్యాదులు కూడా వినిపిస్తున్నాయి. 

అనుమతుల కోసం పదే పదే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావటం చాలా ఇబ్బందిగా మారుతోంది. సింగిల్ విండో విధానం అవసరం చాలా ఉంది.-హనీఫ్, ఆన్ లైన్ గ్రోసరీ స్టోర్ కడా కో ఫౌండర్

స్టార్టప్ లకు ఎంత ప్రోత్సాహం ఇస్తున్నామని చెప్తున్నా, అనుమతుల విషయంలో సడలింపు చాలా అవసరం. కంపెనీస్ యాక్ట్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. 

స్టార్టప్ ల కోసం స్పష్టమైన, సరళమైన విధానాలు అవసరం.-సంజయ్ ఆనంద్ రామ్, స్టార్టప్ ఎక్స్ పర్ట్
మొదటిదశలో ఉన్న స్టార్టప్ లకు ఫండింగ్ అనేది చాలా పెద్ద విషయం. మూడేళ్ల క్రితం తొలి అడుగులు వేస్తున్న స్టార్టప్ తో నేను పెట్టుబడులకోసం చాలా ప్రయత్నాలు చేశాను. కోటి రూపాయల అప్పు సంపాదించటానికి 10 నెలలు పట్టింది. అది కూడా ఆస్తి తనఖా పెడితేనే . ఓ పారిశ్రామికవేత్త రూ. 10, 20 లక్షలు బ్యాంకు నుండి స్టార్టప్ కోసం పొందితే అది చాల పెద్ద విషయం.- షణ్ముగవేల్ శంకరన్, ఫౌండర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ స్టార్టప్ ఫిక్స్ నిక్స్, వెల్లూర్.
ప్రభుత్వం ఫండ్ మేనేజర్స్ విషయంలో ఫెసిలిటేటర్ గా ఉండాలి తప్ప తానే అంతా అన్నట్టు వ్యవహరించ కూడదు. అంతే కాదు, బ్యాంకులు స్టార్టప్ లకు ఫండింగ్ ఇవ్వటం కాకుండా, భాగస్వాములు కావాలి. అప్రూవల్ ప్రాసెస్ ని డిజిటైజేషన్, ఆటోమేషన్ చేయటం ద్వారా పనులు త్వరితగతిన అయ్యేలా చేయవచ్చు.అదే సమయంలో పారిశ్రామికవేత్తలు షార్ట్ కట్స్ వెదికి కరప్షన్ కి కారణం కాకూడదు..”-- సంజయ్ ఆనంద్ రామ్, స్టార్టప్ ఎక్స్ పర్ట్
ఇక్కడ స్టార్టప్ సక్సెస్ అవటానికి చాలా కష్టపడాలి. అనుకున్నది జరిగితే ఫర్వాలేదు. కానీ, ఫెయిల్ అయితే, అక్కడా మళ్లీ సమస్యే ఎదురవుతోంది. పేపర్ వర్క్ పెద్ద తలనొప్పిగా మారుతోంది. ప్రభుత్వం స్టార్టప్ లను ఎంకరేజ్ చేసినట్టే, ఫెయిల్ అయిన వాటి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలి.-సాహిల్ కిని, మాజీ పారిశ్రామికవేత్త.

ఉడుకు రక్తం సై అంటోంది... ప్రభుత్వాల ప్రోత్సాహమే ఆలస్యం.

భారత్ లో స్టార్టప్ బూమ్ అనుకోకుండా వచ్చిన పరిణామమేమీ కాదు. చాలా మంది ఊహించిన విషయమే. ఒక్క 2015లోనే 850 స్టార్టప్ లు, 1005 ఒప్పందాలు, 9 బిలియన్ డాలర్ల భారీ మొత్తం... ఇదే భారత స్టార్టప్ బూమ్ స్థాయిని చెప్తోంది. కానీ ఎనాలసిస్ లు మాత్రం భారత్ లో స్టార్టప్ లకు ఉన్న అనేక అడ్డంకులను స్పష్టం చేస్తున్నాయి.

దేశం ఇప్పుడున్న పరిస్థితిలో స్టార్టప్ లను ప్రోత్సహించటం చాలా అవసరం. ఎందుకంటే దేశంలో 80 శాతం జనాభా 40 ఏళ్ల లోపే ఉంది. మరోపక్క నిరుద్యోగం భారీగా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఉద్యోగాల కంటే స్వయం ఉపాధివైపు యువత చూసేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు పెంచాలి. సింగపూర్, ఇజ్రాయెల్, యూకె లాంటి దేశాలు ఆర్ అండ్ డీ పైన, ఇన్వెస్టర్లకు ఇస్తున్న ఇన్సెంటివ్స్ పైన ఎలా వెచ్చిస్తున్నారో గమనించాల్సి ఉంది.

అభివృద్ధి అన్ని రంగాల్లో కనిపించాలి. దేశంలో టాలెంట్ కు కొదవ లేదు. నిజాయితీ, నిబద్ధత ఉన్న యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి, అహరహం శ్రమించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బాల్ ప్రభుత్వాల కోర్టులో ఉంది. ఆయా రాష్ట్రాలు ఎలాంటి పాలసీలు రూపొందిస్తాయో, ఏ విధమైన ప్రోత్సాహకాలు ప్రకటిస్తాయో వేచి చూడాలి. అంతా సవ్యంగా జరిగితే, యూఎస్ , యూకెలను దాటి భారత్ మొదటి స్థానంలో నిలబడటం పెద్ద విషయమేమీ కాదు..

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags