నీటి కరువును తరిమికొడుతున్న చిన్నారులు
వయసు చిన్నదే కానీ, ఆలోచన పెద్దది..
వారంతా పిల్లలు! లోకం తీరు తెలియని చిన్నారులు! అయితేనేం? బడిలో అక్షరాలు దిద్దే వయసులోనే దేశానికి పాఠాలు నేర్పుతున్నారు! కరువుతో అల్లాడుతున్న మహారాష్ట్రలో స్కూల్ విద్యార్థులు ఒక గొప్ప ఉద్యమం చేపడుతున్నారు. బూంద్ బూంద్ మే... అంటూ వాటర్ సేవ్ చేస్తున్నారు!
కరువు కరాళ నృత్యం!
10 రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు! అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు! దేశంలోని 91 ప్రధాన రిజర్వాయర్లలో 24 శాతం నీరు మాత్రమే మిగిలి ఉందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆందోళనకర కథనం! వెరసి దేశవ్యాప్తంగా భయానక పరిస్థితులు. 2014, 2015లో వర్షపాత లోటు కారణంగా దేశంలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. నీటి చెమ్మ అథ:పాతాళానికి జారిపోయింది. వాన చినుకుల మీదే ఆధారపడి బతుకుతున్న రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా మహారాష్ట్ర రైతుల బాధలు వర్ణనాతీతం! చెరకు, పత్తి లాంటి వర్షాధార పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. 1972 నాటి కరువు కన్నా మహారాష్ట్రలో నేటి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
భారమైన అప్పులు మహారాష్ట్ర రైతులకు ఉరితాళ్లు పేనుతున్నాయి! గత ఏడాది మరఠ్వాడా ప్రాంతంలో 1,100 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్న హెచ్చరికలు నిజంగా ఆందోళనకరం!
చల్లని కబురు కోసం..
ఇప్పుడు రైతులంతా భారత వాతావరణ శాఖ అంచనాల మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు ఉంటాయన్న అంచనాలు నిజం కావాలని అన్నదాతలు ఆశపడుతున్నారు. ఈసారి సాధారణ వర్షపాతం నమోదు కావడానికి 30 శాతం, అధిక వర్షపాతం నమోదు కావడానికి 34 శాతం అవకాశం ఉందని ఐఎండీ ఈమధ్యే చల్లని మాట చెప్పింది.
7 వేల మంది విద్యార్థులతో..
రైతులనే కాదు మహారాష్ట్రలో కరువు పరిస్థితులు చిన్న పిల్లలను సైతం కదిలించాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా వాటర్ సేవ్ చేయడానికి స్కూల్ విద్యార్థులు నడుం కట్టారు. తాము వాడుకోగా మిగిలిన నీటిని వృథా చేయకుండా డ్రమ్ముల్లో నిల్వ చేస్తున్నారు. ఆ నీటిని స్కూల్లో చెట్లు పెంచడానికి, టాయిలెట్స్ క్లీన్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. తద్వారా నీటిని పొదుపు చేస్తున్నారు. పుణెలోని వివిధ స్కూళ్లకు చెందిన 7 వేల మంది విద్యార్థులు, టీచింగ్ సిబ్బంది ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకుంటున్నారు. మరికొంత మంది విద్యార్థులు సేవ్ వాటర్ ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు.
నీటి ఉద్యమానికి ఊపిరి ఆ ఇద్దరు..
నీటి పొదుపు ఉద్యమం వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వేదాంత్ గోయల్, యూసుఫ్ సోని! సామాజిక పరిస్థితులపై ఇద్దరికీ అవగాహన ఉంది. ఇంతకుముందు కూడా వీళ్లిద్దరూ పలు ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించారు. 1,011 మంది విద్యార్థులతో సామూహికంగా టీత్ బ్రష్ చేయించి, పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. ఈ ఫీట్ సాధించినందుకు వేదాంత్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించారు. ప్రస్తుతం వేదాంత్, యూసుఫ్ ఇద్దరూ కలిసి పుణె పాఠశాలల్లో వాటర్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు.
10 వేల మంది విద్యార్థులను నీటి పొదుపు ఉద్యమంలో భాగం చేయడమే మా లక్ష్యం. ఇప్పటికే 7 వేల మంది ఇందులో చురుగ్గా పాల్గొంటున్నారు. నీటి ప్రాధాన్యం, వనరుల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. రోజంతా విద్యార్థులు ఉపయోగించిన నీటిని ఒక డ్రమ్ములో స్టోర్ చేస్తాం. దానిని ఇతర అవసరాలకు వినియోగిస్తాం. దీని ద్వారా పిల్లలకు సహజ వనరుల విలువేంటో తెలిసేలా చేస్తున్నాం- వేదాంత్
పుణెలోని చాలా పాఠశాలలు వాటర్ క్యాంప్ ఉద్యమంలో పాల్గొంటున్నాయి. అందులో డాక్టర్ దాదా గుజ్జర్ హై స్కూల్, సాధనా హై స్కూల్, విద్యానికేతన్ హై స్కూల్ కూడా ఉన్నాయి. ఇంకా అనేక పాఠశాలలు ఉద్యమానికి మద్దతిస్తున్నాయి. వేదాంత్, యూసుఫ్ ప్రతి శనివారం స్కూళ్లన్నీ సందర్శిస్తారు. నీటి ప్రాధాన్యం గురించి పిల్లలకు వివరిస్తారు. తాత్కాలికంగా కాకుండా దీన్నొక నిరంతర ఉద్యమంలా కొనసాగించాలన్నదే వీళ్ల ఉద్దేశం.
ఇప్పుడు స్కూళ్లకు సమ్మర్ హాలీడేస్ నడుస్తున్నాయి. పిల్లలు ఇంటి దగ్గర కూడా వాటర్ సేవ్ చేస్తున్నారు. వారి తల్లిదండ్రులకు కూడా నీటి ప్రాముఖ్యత గురించి చెప్తున్నారు. నీరు అనేది దీర్ఘకాలిక సమస్య. మానవ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించలేం. ఈ విషయంలో పిల్లలను ఎడ్యుకేట్ చేయడం మంచిదే అయ్యిందంటారు వేదాంత్.
మా ఇద్దరికీ ఇంకా ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నాయి. డబ్బు పొదుపు చేయడంపై ముంబై స్కూల్ చిల్డ్రన్ కు అవగాహన కల్పిస్తాం. రైతులకు సాయం చేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. కరువు ప్రాంతాలకు రైళ్లలో నీరు తరలిస్తాం- యూసుఫ్
మహారాష్ట్ర కరువు బాధితులను ఆదుకోవడానికి హాకీ ఇండియా, బీసీసీఐ, ఐపీఎల్ టీమ్స్ కూడా ముందుకొచ్చాయి. వీళ్లే కాదు గుక్క నీళ్లు దొరక్క అల్లాడుతున్న అభాగ్యులకు మనసున్న ప్రతీ మనిషి సాయం చేయాలి!