ఈ సౌర సైనికులు గ్రామాల్లో ఉంటే విద్యుత్‌కు లోటుండదు
అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామనుకుంటున్న తరుణంలో, మనం కనీస సౌకర్యాలు వైపు ఎంతవరకూ దృష్టి పెడుతున్నాం అన్నది ప్రజలుగా మనం, నాయకులుగా రాజకీయ వేత్తలు, పాలకులుగా ప్రభుత్వమూ ఆలోచించాల్సిన విషయం. రాత్రిపూట వెలుగుకి నోచుకోని గ్రామాలు ఎన్నో ఉన్న మన భారత్ లో అటువంటి గ్రామాలను ఎంపిక చేసుకుని క్రౌడ్ ఫండింగ్ విధానంతో సౌర విద్యుత్ అందిస్తున్న సంకల్ప్ ఎనర్జీ సంస్థ కథ ఇది.
చింకి చీర కట్టుకున్న ఓ ముసలావిడ ఒక మట్టి ఇంటి చూరు కింద కూర్చుని ఉంది. నుదిటి మీద ఉన్న లోతైన గీతలు, అడుగంటి పోయిన తన ఆశలకి ప్రతిరూపం గా ఉన్న ఆమె, ఒక్కసారి తలెత్తి వదులుగా ఉన్న వైర్లకి వేళ్ళాడుతున్న బల్బుకేసి చూసింది. తన జీవిత కాలంలో ఆ బల్బు వెలగడం ఏదో రెండు, మూడు సార్లు చూసుంటుందేమో అంతే! వేళ్ళాడుతున్న ఆ గాజు బల్బు తన ఇంటిని లేదా కొడగట్టి పోతున్న తన జీవితాన్ని కానీ వెలుగులతో నింపాలన్న ఆశలేదు తనకి. కానీ...ఆ ముసలి మనసులో ఓ చిన్న ఆశ, కనీసం తన మనుమలు, ముని మనుమలైనా వేళ్ళడుతున్న ఆ గాజు వస్తువుని ఉపయోగించుగోగలుగుతారా అని.
ఇది ఏ సినిమా సన్నివేశమో కాదు, లేదా ఏదో ఒక అభివృద్ధి చెందని దేశంలో పేదరికపు దురవస్థని వర్ణిస్తూ ఒక ప్రముఖ పత్రిక మీద వేసిన ముఖచిత్రము అంతకన్నా కాదు. ఇది మన దేశంలో విద్యుత్ సదుపాయం కల్పించాము అని ప్రత్యేకంగా చెప్పుకునే కొన్ని గ్రామాలలో ఉన్న వాస్తవ స్థితి. ఇళ్లకు విద్యుత్ సరఫరా అవుతోందా లేదా అన్న విషయం తో నిమిత్తం లేకుండా, మనదేశంలో ఒక గ్రామం లో 10% ఇళ్ళకి విద్యుత్ కనెక్షన్ ఉంటే ఆ గ్రామం విద్యుదీకరణ జరిగినట్టే లెక్క.
"గులాబ్ గంజ్" ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న ఒక కుగ్రామం. ఇది భారత దేశం లో అతి ఎక్కువ జనాభా కలిగి విద్యుత్ కలిగిన గ్రామంగా ప్రసిద్ధి. కానీ వాస్తవానికి ఈ గ్రామానికి విద్యుత్ ప్రసారం మాత్రం లేదు. ఈ గ్రామ నివాసితులు తమ గ్రామంలో రాత్రిపూట వెలుగేదైనా చూసారా అంటే, గత పాతిక సంవత్సరాలుగా పునమి వెన్నెల రాత్రులు కురిపించే వెలుగునే చుశామంటారు. పైగా ఈ గ్రామం అంబేడ్కర్ గ్రామం.. అంటే ప్రభుత్వ సంక్షేమ పధకాలు సంపూర్ణంగా అందుతాయి. ప్రభుత్వాలు చేసే ఉత్తుత్తి వాగ్దానాలు, తమ ఆశలకి గండి కొట్టే స్థానిక మరియు రాష్ట్ర రాజకీయ నేతల చేతలకి విసిగిన ఈ గ్రామ ప్రజలు తమ గ్రామానికి విద్యుత్ ఇస్తాము అన్న వాగ్దానాలని నమ్మడం ఎప్పుడో మానేసారు. అసలు గ్రామానికి విద్యుత్ కి సంబంధించిన ఏ సంక్షేమ పధకాలనీ పుచ్చుకోవడంలేదు.
"సంకల్ప్ ఎనర్జీ" వ్యవస్థాపకురాలు కనిక ఖన్న, ఆమె బృందం ఈ గ్రామం లో పర్యటించి 'మీ గ్రామానికి విద్యుత్ ఇస్తాము అని అంటే, ఇవన్నీ మేము ఎప్పటినుంచో వింటున్నదే అనే అప నమ్మకంతో వీరినీ చూసారు ఆ గ్రామ ప్రజలు. సౌర శక్తి ద్వారా మీ గ్రామానికి కావాల్సిన విద్యుత్ ని అందిస్తాము అని ఈ సంస్థ సభ్యులు చెప్పినప్పుడు ఆ గ్రామ ప్రజలు అప నమ్మకంతో చూసిన చూపులు ఒక్కసారి ఊహించుకోండి'.
"సంకల్ప్ ఎనర్జీ " సౌర శక్తి ద్వారా విద్యుత్ సదుపాయం కల్పించే ఓ సంస్థ. అందుకోసం అవసరం ఉన్న గ్రామాలని ఎంపిక చేసి వాటి విద్యుత్ అవసరాలని తీరుస్తుంది. లక్షకి పైగా గ్రామాలు, విద్యుత్‌కి దూరంగా ఉన్న భారతదేశంలో ఇటువంటి గ్రామాలని ఎంపిక చెయ్యడం వీరికి అసాధ్యమేమీ కాదు. ఈ సంస్థ విద్యుత్‌కు నోచుకోని గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లో సౌర విద్యుత్ వెలుగులు నింపడానికి ఓ బృందాన్ని తయారు చేసింది, వీరే "సౌర సైనికులు".
ఈ "సౌర సైనికులు" గులాబ్ గంజ్ గ్రామంలో విద్యుత్ సమస్య పై పోరాటానికి మొదట, చందాల ద్వారా ప్రాజెక్టు కి కావాల్సిన నిధుల్ని సమకూర్చారు. ఈ నిధులు సమీకరణా, నిర్వాహణా నిధులు వీరికి పెద్ద సమస్య కాదు, ఎందుకంటే వీరు ఆ ఖర్చులని సౌర విద్యుత్‌ని వాడుకుంటున్న గ్రామస్థులే చెల్లించేటట్లు చూస్తారు. దానితో గ్రామస్థులే తమకి కావాల్సిన విద్యుత్ వాడుకుంటూ ఈ సౌర శక్తి కేంద్ర నిర్వాహణని కొనసాగిస్తారు.
ఒకో ఇంటికీ 2 కిలోవాట్ల విద్యుత్.. అంటే రెండు లైట్లు, ఒక ఫ్యాన్, ఒక చార్జింగ్ పాయింటు అందేటట్లుగా చూడాలి అని ఈ సౌర సైనికుల ప్రణాళిక. ఇళ్ళకే కాకుండా పాఠశాలలూ, దుకాణాలూ ఇలా ఎవరికి అవసరమయితే వారికి సౌర సైనికులు సౌరవిద్యుత్‌ని అందిస్తారు. కానీ గ్రామస్థులలో ఒకరు, మీటర్ల నిర్వాహణ మరియు బిల్లుల సేకరణని చూసుకోవాల్సిఉంటుంది.
తాను అనుకున్న దానికంటే ఎక్కువ సవాళ్ళు ఎదురవ్వడంతో మొదట్లో కుంగిపోయానని చెబుతూ, "గ్రామస్థులు మొదట మమ్మల్ని నమ్మలేదు. గ్రామస్థులకి మా ఉద్యమం గురించి వివరించి , ఒప్పించి పంచాయితీ అమోదం తీసుకోవడానికి కాస్త సమయం పట్టింది. క్రౌడ్ ఫండింగ్ అంటే ప్రజల ద్వారానే నిధులు సేకరించడమనేది ఇండియాలో అభివృద్ధి చెందిన నగరాలకే కొత్త. ఇంక అలాంటిది గులాబ్ గంజ్ లాంటి ఒక కుగ్రామస్థులని ఒప్పించడం అంటే మాటలు కాదు. మొత్తానికి 93% గ్రామస్థులని విద్యుత్ ఉపయోగించుకోవడానికి ఒప్పించి పంచాయితీ ఆమోద ముద్ర తీసుకోవడంతో మా అడ్దంకులు తొలిగాయి" అని కనిక అన్నారు.
కింది స్థాయి నుండీ మీటర్ల సక్రమ నిర్వాహణ , సమర్ధవంత మైన గ్రిడ్ ఏర్పాటు మరియు మీటర్ చౌర్యాలని అరికట్టడం మీద సౌర సైనికులు శ్రమిస్తున్నారు. ఈ ప్రాజెక్టు తొలి పెట్టుబడి లో కావాల్సిన 20% కోసం 2500 US డాలర్లు పోగు చేసారు. తమ ఐదుగురు సభ్యుల బృందానికి వస్తున్న ప్రతిస్పందనే వీరిని ముందుకు నడిపిస్తోందని కనిక చెబుతారు.
మీరు కూడా ఈ బృహత్ కార్యం లో భాగస్వాములవ్వాలంటే, ఒకరి జీవితం లో "వెలుగు" రేఖలు నింపినవారు అవ్వాలనుకుంటే ఆలస్యం ఎందుకు? పదండి ముందుకు.