Brands
Discover
Events
Newsletter
More

Follow Us

twitterfacebookinstagramyoutube
ADVERTISEMENT
Advertise with us

యానిమేషన్‌ రంగంలో సంచలనం ఏక్‌సౌరస్ !

యానిమేషన్‌ రంగంలో సంచలనం ఏక్‌సౌరస్ !

Monday October 24, 2016 , 4 min Read

కలలు కనండి.. సాకారం చేసుకోండి.. అబ్దుల్ కలాం చెప్పినట్టుగానే కేరళకు చెందిన సురేశ్ ఇరియత్ కూడా ఆ దిశగానే అడుగులే వేశాడు . అందరూ వెళ్తున్న ఐఐటీ బాటలో నడవకుండా తనకు నచ్చిన యానిమేషన్ రంగంలోకి అడుగుపెట్టి విజయం సాధించారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, మధ్యలోనే కలలను వదిలేయకుండా విజయతీరాలకు చేరుకున్నారు.

సురేశ్ ఇరియత్‌ది కేరళలోని కొచ్చి శివారు ప్రాంతమైన త్రిపునింతర అనే చిన్న గ్రామం. చిన్నప్పటి నుంచే చిత్ర కళ అన్నా, మ్యూజిక్ అన్నా ఆయనకు చాలా ఇష్టం. చిన్మయ స్కూల్‌లో చదువుతున్న సమయంలోనే వాటిపై అభిరుచి పెరిగింది. తల్లిదండ్రులు, టీచర్ల నుంచి మంచి సపోర్ట్ లభించింది.

చిత్ర కళ మంచి హాబీయే అయినప్పటికీ, సంపాదన పరంగా అంత ఉపయోగకరం కాదని చదువుతున్నప్పుడే సురేశ్ గ్రహించారు. దీంతో తన దృష్టిని ఐఐటీ-జేఈఈవైపు మళ్లించారు. అయితే కాంపిటీషన్లలో పాల్గొనడం మాత్రం మానలేదు. అలా అహ్మదాబాద్‌లోని ప్రఖ్యాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) గురించి ఆయన తెలుసుకున్నారు. కుటుంబ మద్దతు ఉన్నప్పటిక అటు ఎన్‌ఐడీలో ప్రవేశానికి, ఇటు ఐఐటీకి ప్రిపేర్ కావడం సురేశ్‌కు నచ్చలేదు.

image


తొలిరోజు ఐఐటీ జేఈఈ ఎగ్జామ్‌కు అటెండ్ అయి వచ్చాను. అదే రోజు సాయంత్రం సీటు వచ్చినట్టు ఎన్‌ఐడీ నుంచి కబురొచ్చింది. అంతే రెండోరోజు ఐఐటీ ఎగ్జామ్‌కు డుమ్మా కొట్టేశాను. నెలరోజులపాటు మా కుటుంబంతో ఆనందంగా గడిపి ఆ తర్వాత ఎన్ఐడీలో చేరేందుకు అహ్మదాబాద్ వెళ్లాను అని సురేశ్ వివరించారు.

యానిమేషన్ సృష్టికర్త...

అది 1998వ సంవత్సరం. దేశంలో యానిమేషన్ రంగం అప్పుడప్పుడే పురుడు పోసుకుంది. ఆ సమయంలోనే సురేశ్ యానిమేషన్ డివిజన్‌ను ప్రారంభించేందుకు ముంబైలోని ప్రఖ్యాత ఫేమస్ స్టూడియోతో ఒప్పందం కుదుర్చుకున్నారు. భారతీయ పురాణాలు, చరిత్రకు సంబంధించి కొత్త కొత్త క్రియేషన్లు రూపొందించేందుకు అంగీకరించారు. ఫేమస్ స్టూడియోస్‌లోనే ఫిల్మ్ మేకింగ్, యానిమేషన్ వ్యాపారంలో మెళకువలు, నేర్చుకున్నారు. తొలి ప్రాజక్టే ఛత్రపతి శివాజీ జీవితానికి సంబంధించినది. ‘లెజండ్ ఆఫ్ శివాజీ’ పేరిట మూడు భాగాల యానిమేషన్ ఎపిసోడ్‌ను తొలిసారి రూపొందించారు.

image


తొలి ప్రాజక్టే ఫ్లాప్..

దురదృష్టవశాత్తూ ‘లెజండ్ ఆఫ్ శివాజీ’ విఫలమైంది. అరగంట ప్రొగ్రామ్‌కు 70 వేల రూపాయల కంటే ఎక్కువ ఇచ్చేందుకు బ్రాడ్ కాస్టర్లు అంగీకరించలేదు. ఆ తర్వాత ఫేమస్ స్టూడియో కూడా తన యానిమేషన్ డివిజన్‌ను మూసేసింది. ఇన్ని అడ్డంకులు ఎదురైనా సురేశ్‌ వెనుకడుగు వేయలేదు. తనకు రెండో అవకాశమివ్వమని ఫేమస్ స్టూడియోస్‌తో సంప్రదింపులు జరిపారు. అదే సమయంలో తన టీమ్‌కు తెలియకుండానే యాడ్ ఏజెన్సీల చుట్టూ తిరిగి ప్రాజెక్ట్‌లు ఇవ్వమంటూ విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా చిన్న చిన్న ప్రాజెక్టులు రావడం మొదలయ్యాయి. కానీ అవేవి సురేశ్ సంతృప్తినివ్వలేదు.

చాలా కష్టపడి చానల్ వీ, ఎంటీవీలను తమ ఫిల్మ్స్‌ను ఇవ్వమని ఒప్పించగలిగారు. వారికి అవసరమైన రీతిలో మంచి కంటెంట్‌ను రూపొందించారు. ఈ రెండు చానల్స్‌కు చేసిన ప్రొగ్రామ్స్ యానిమేషన్ రంగంలోనే ఓ సంచలనం. చానల్ వీ సింపూ సిరీస్, ఎంటీవీ పోగా సిరీస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. అదే జోష్‌లో మరింత దూకుడుగా వెళ్లాలని సురేశ్ నిర్ణయించారు. అమ్రాన్ బ్యాటరీ, ఐసీఐసీఐ చింతామని క్యాంపైన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే భారత దేశ తొలి యానిమేటెడ్ వీడియో ‘బిందు’ సృష్టికర్త కూడా సురేశ్ టీమే.

ఏక్‌సౌరస్ ఏర్పాటు..

ఫేమస్ హౌజ్ ఆఫ్ యానిమేషన్ ఏర్పాటైన పదేళ్ల తర్వాత రెండో ప్రాజెక్ట్‌కు సురేశ్ అతని భార్య నీలిమా ఇరియత్ శ్రీకారం చుట్టారు. ఫేమస్ స్టూడియోస్ యజమాని అరుణ్ రుంగ్టా సహకారంతో ‘స్టూడియో ఏక్‌సౌరస్’ పేరుతో సొంత స్టూడియోను 2009లో ప్రారంభించారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన నీలిమా రామ్ మోహన్ బయోగ్రాఫిక్స్‌లో యానిమేటర్‌గా కెరీర్‌ ఆరంభించారు.

ప్రస్తుతం ఏక్‌సౌరస్‌లో 30 మంది ఉద్యోగులున్నారు. డిజిటల్, సినిమా, వెబ్, టీవీ, మొబైల్ ప్లాట్‌ఫామ్స్‌పై విభిన్నమైన మీడియా కవరేజీ ఇస్తున్నది ఈ స్టూడియో.

‘‘మా ప్రధాన బలం డిజైనింగే. సొంత పాత్రలను సృష్టించేందుకు మేం డిజైన్ ప్రాసెస్‌ను అప్లయ్ చేస్తాం. యానిమేషన్‌, ఫిల్మ్ మేకింగ్‌తోపాటు కొత్త తరహా ఆవిష్కరణలను సృష్టించేందుకే ప్రయత్నిస్తాం’’ -సురేశ్

ఏక్‌సౌరస్‌ది పూలదారేమీ కాదు. అప్పట్లో మూలధనం పదిలక్షల రూపాయలు. మౌలిక సదుపాయాలు, టీమ్ ఏర్పాటుకే బోటాబోటిగా సరిపోయాయి. మొదటి నెలలో రెంట్ కట్టడానికి కానీ, ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి కానీ డబ్బులు లేని పరిస్థితి. దీనికి తోడు మెషనరీ, సాఫ్ట్‌వేర్లకు అదనపు ఖర్చులు. కష్టాలు మరింత పెరిగిపోవడంతో ఫేమస్ స్టూడియోస్ బ్రాండ్ నుంచి ఏక్‌సౌరస్ బయటకొచ్చింది. అదే సమయంలో ఉషా జనోమ్, యెల్లో పేజెస్, గోద్రేజ్ ఏజీ, గూగుల్ తాంజూర్, ఉషా జనోమ్ పార్ట్-2 వంటి ప్రాజెక్టులు వచ్చాయి. అవన్నీ విజయవంతమయ్యాయి.

ప్రస్తుతం ఏక్‌సౌరస్‌కు 50 మంది క్లయింట్లున్నారు. హోండా, కార్టూన్ నెట్‌వర్క్, సామ్‌సంగ్, ఐసీఐసీఐ, బ్రిటానియా న్యూట్రీ చాయిస్, నెస్లే, డొమినోస్, హార్లిక్స్, సోనీ పిక్స్ ఫిల్మ్స్, గూగుల్, క్యాడబరీ జెమ్స్, లివైజ్ వంటి ప్రఖ్యాత బ్రాండ్లన్నీ ఏక్‌సౌరస్ క్లయింట్సే.

ఇప్పటివరకు 80 ప్రాజెక్టులు పూర్తి చేసినప్పటికీ -ఫిక్స్‌డ్ రెవెన్యూ మోడల్‌ను ఎక్సారుస్‌ రూపొందించుకోలేకపోయింది. ప్రతి ప్రాజెక్ట్ మీద 15 నుంచి 25 శాతం వరకు మార్జిన్ మిగులుతుందని సురేశ్ చెప్పారు.

‘‘వ్యాపారం, కొత్తదనం మధ్య ఎప్పుడూ బ్యాలెన్స్ ఉండేలా చూసుకుంటాం. సృజనాత్మకతకు చోటు లేని ప్రాజెక్ట్‌ను ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఏడాది మొత్తం మంచి బిజినెస్ ఇస్తున్న కంపెనీ ప్రాజెక్ట్ అయినా సరే’’ - సురేశ్

అంతర్జాతీయ గుర్తింపు..

350కి పైగా యాడ్ ఫిల్ములు, వందకు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు.. ఇవే సురేశ్ పనితీరుకు నిదర్శనాలు. ప్రపంచస్థాయిలో నిలబెట్టినవి కూడా అవే. అడ్వర్టయిజింగ్‌కు ఆస్కార్‌గా పిలువబడే క్లియో అవార్డ్స్‌కు సురేశ్ జ్యూరీగా కూడా వ్యవహరించారు. 2007 నుంచి ఎన్నో జాతీయ, అంతర్జాతీ జ్యూరీలలో సభ్యుడిగా వ్యవహరించారు.

అన్నేసీలో జరిగిన ఫ్రాన్స్ ప్రఖ్యాత ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు గెలుకుని భారత యానిమేషన్ రంగాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు సురేశ్. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్ట్‌ అడ్వయిజరీ ప్యానల్‌లో సురేశ్ సభ్యులు కూడా.

image


భవిష్యత్ ప్రణాళిక..

విభిన్నమైన కంటెంట్స్‌తో షార్ట్‌ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్ రూపొందించడంపై ఏక్‌సౌరస్ దృష్టిపెట్టింది. అలాగే వివిధ బ్రాండ్లకు విభిన్నమైన స్టయిల్‌తో కూడుకున్న లైవ్ యాక్షన్ యాడ్ ఫిల్మ్స్ రూపొందించాలనుకుంటున్నది. కమర్షియల్‌గా సక్సెస్ సాధించాలంటే అందరూ పయనించేదానికి భిన్నంగా చేయాలన్నదే ఈ సంస్థ కాన్సెప్ట్. ప్రస్తుతానికైతే ఉద్యోగుల సంఖ్యను మరింతగా పెంచాలన్న యోచన మాత్రం సురేశ్ చేయడంలేదు. ప్రాజెక్ట్స్‌ను మాత్రం ఇతర సంస్థలకు ఔట్‌సోర్సింగ్ ఇవ్వాలన్న యోచనలో ఉన్నారు.

సందేశం..

‘‘మీ కలలను నమ్మండి. వాటి వెంటే నడవండి. ఆ దారిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టించుకోకండి. మీరు చేసే పనిమీద మీకు నమ్మకం ఉండి, మీరు సంతోషంగా చేయగలిగినట్లైతే, బలవంతంగా ఇతర రంగంపై దృష్టిపెట్టాల్సిన అవసరమే లేదు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మీరు అనుకున్నదే చేయండి. మిగతావన్నీ సెకండరీ. ఆ సమయానికి స్థిరమైన ఆవిష్కరణలే అవసరం. తక్షణం వచ్చే లాభాల గురించి ఆలోచించొద్దు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. స్వల్పకాలిక లాభాలు చాలా నష్టాన్ని చేకూరుస్తాయి. దాని ఫలితంగా దీర్ఘ కాలంలో కష్టాల పాలు కావాల్సి ఉంటుంది’’ అని భారతీయ యువతకు సురేశ్ తన సందేశాన్ని ఇచ్చారు.

సురేశ్ విజయాలను స్ఫూర్తిగా తీసుకుని, భారతీయ యువత విజయబావుటా ఎగరవేయాలని యువర్‌ స్టోరీ కోరుకుంటోంది. సురేశ్ కూడా మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తోంది.