వెడ్డింగ్ మేడ్ఈజీ @ ఫుల్ ఆన్ షాదీ
మన దేశంలో పెళ్లిళ్ల మార్కెట్ విలువ ఎంతో తెలుసా ? 38 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో అయితే అక్షరాలా రెండున్న లక్షల కోట్ల రూపాయలు. ఇంతటి భారీ రంగంలో.. వినూత్న ఆలోచనలతో స్టార్టప్‍లు పుట్టుకొస్తున్నాయి. వేటికవే కొత్తదనాన్ని అందిస్తూ.. సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా నిర్వాహకుల అవసరం ఉన్న పెళ్లిళ్లలో వీటి హవా ఎక్కువగా ఉంటోంది. ఫుల్ ఆన్ షాదీలో ప్రస్తుతం 950మంది పెళ్లి సంబంధిత సేవలు అందించే విక్రేతలు లిస్టింగ్ అయ్యారు. మ్యారేజ్ సెటిల్ అయ్యాక.. ఒక్క మాట కూడా మాట్లాడకుండానే ఏర్పాట్ల కోసం పడే ఇష్టమైన కష్టాలను.. అధిగమించేందుకు ఏర్పాటైన ప్లాట్‌ఫాం ఇది.. ఫుల్ఆన్‌షాదీ.కాం.
మన దేశంలో ఏ మార్కెట్‌నయినా ద్రవ్యోల్బణం దెబ్బ కొట్టగలదేమో కానీ.. పెళ్లిళ్లు మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ వ్యాపారమే. దీన్ని గమనించి, ఈ మార్కెట్లోనే సత్తా చాటేందుకు ఇండోర్‌కు చెందిన ఫుల్ఆన్‌షాదీ సిద్ధమైందే.
“పెళ్లిని ఓ వ్యక్తిగత కార్యక్రమంగా మేం భావించడం లేదు. అలాగే ఆ పెళ్లి జంటకు చెందిన రెండువైపుల కుటుంబాలు, బందువులు వీలైనంతవరకూ ఆ మధుర క్షణాలను ఎంజాయ్ చేయాలి. ఏర్పాట్ల కోసం ఓ వైపు జనాలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మేం గుర్తించాం. యూజర్లు తమకు కావలసిన సర్వీసులను వెడ్డింగ్ వెండర్స్ నుంచి సులభంగా పొందేలా ఏర్పాట్లు చేశాం. వ్యక్తిగత నిర్వాహణ, ఔట్‌సోర్సింగ్‌లకు సమ ప్రాధాన్యమిచ్చేలా ఈ ప్లాట్‌ఫాం డిజైన్ చేయడం హైలైట్ ” అన్నారు ఫుల్ఆన్‌షాదీ సహ వ్యవస్థాపకురాలు ఖుష్బూూ జగ్వాని జలావద్. ఆమె తన భర్త శలభ్ జలావద్‌తో కలిసి ఓ స్నేహితుని పెళ్లికి వెళ్లినపుడు.. ఈ ఏర్పాట్లు చేస్తూ కుటుంబ సభ్యులు ఎంత ఆనందంగా ఉంటారో ప్రత్యక్షంగా చూశారు.
“ముఖ్యంగా ఓ సంఘటన నాకు నోట మాట రాకుండా చేసింది. పెళ్లి కూతురికి ఓ ప్రముఖ సెలూన్‍లో మేకప్ కోసం అపాయింట్మెంట్ తీసుకున్నారు. కానీ.. ఐదుగురు పెళ్లికుమార్తెలు అక్కడ కూర్చుని ఉన్నారు. ఒకరి తరువాత ఒకరికి మేకప్ వేసేందుకు ఒకే మేకప్ మ్యాన్ ఉన్నాడక్కడ”అంటూ తన అనుభవాన్ని వివరించారు ఖుష్‌బూ.
ఈ రంగంలో ఏదైనా చేయాలనే ఆలోచనతో ఈ జంట ఇద్దరూ ఇంటికి చేరారు. అలా ఆగస్ట్ 2015లో ఫుల్‌ఆన్‌షాదీ ప్రారంభమైంది. ఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో విద్యాభ్యాసం చేశారు ఖుష్‌బూ. ఎంబీఏ ఫైనాన్స్‌లో పట్టాకూడా పొందారు. ప్రొడక్ట్ స్ట్రాటజిక్ ప్లానింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఈమెకు ఉంది. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీఈ చేసిన శలభ్.. బిజినెస్ డెవలప్మెంట్ మరియు మార్కెటింగ్‌లో 5ఏళ్ల అనుభవం గడించారు.
ఏమిటీ ఫుల్ఆన్‌షాదీ ?
పెళ్లిళ్ల రంగంలో సర్వీసులకు సాంకేతికను జోడించి.. ఈ విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది ఫుల్ఆన్‌షాదీ. ప్రస్తుతం పలు రకాల సర్వీసులను అందించే విక్రేతలను గుర్తించి, తమ ప్లాట్‌ఫాంపై లిస్టింగ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. మ్యారేజ్ హాల్స్, పెళ్లి దుస్తులు, మేకప్ సెలూన్లు, జ్యూవెలరీ, ఫోటోగ్రాపర్లు, వెడ్డింగ్ ప్లానర్లు, ఫ్లవర్ డెకరేటర్లు, టెంట్ హౌజ్ నిర్వాహకులు, డ్రోన్ సర్వీసులు, పెళ్లి శుభలేఖలు, మెహందీ, పురోహితులు, జాతకాలు చెప్పేవారు.. ఇలా అన్ని రకాల సేవలు అందించేవారినీ తమ ప్లాట్‌ఫాంపైకి తెస్తోంది ఫుల్ఆన్‌షాదీ.
“ప్రస్తుతం అన్ని రకాల సర్వీసులను అందించేందుకు వెడ్డింగ్ ప్లానర్స్ ఉన్న మాట వాస్తవమే. అయితే.. అనేక పనులను వ్యక్తిగతంగా చేసుకునేందుకే చాలామంది ఇష్టపడుతున్నారు. ఫుల్‌ఆన్‌షాదీతో తమకు కావాలసిన సేవలను గుర్తించి ఎంపిక చేసుకునే అవకాశం యూజర్లకు లభిస్తుంది. ఏ సర్వీసులను ఔట్ సోర్సింగ్ ఇవ్వాలో, వేటిని కస్టమైజ్ చేసుకోవాలో ఇష్టానుసారం నిర్ణయించుకోవచ్చ”ని చెబ్తున్నారు శలభ్.
ప్రత్యేకమైన ఫీచర్స్ వీళ్లకే సొంతం
“మొత్తం ప్లాట్‌ఫాంలో వెండర్ల సర్వీసులకు రివ్యూలు ఇచ్చే అవకాశం ఉంది. ఒకసారి రివ్యూ ఇచ్చాక.. ఎవరూ వీటిని ఎడిట్ కానీ, డిలీట్ కానీ చేయలేరు. అందుకే తమ వ్యక్తిగతమైన నిజమైన అభిప్రాయాన్ని ఒకసారి మాత్రమే ఇవ్వగలరు” అంటున్నారు ఖుష్‌బూ. విక్రేతలను పోర్టల్‌లో లిస్ట్ చేసేందుకు ముందు.. వారిచ్చిన సమాచారాన్ని తనిఖీ చేసుకుంటుంది ఫుల్‌ఆన్‌షాదీ. “మేం ప్రధానంగా అనుసంధానకర్తలం. వీలున్నంతవరకూ కొత్త ట్యాలెంట్‌ని పరిచయం చేసే అవకాశం మాకు లభిస్తోంది. ఉదాహరణకు కొంతమంది యువ ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు.. ప్రొఫెషనల్స్ కంటే ఉన్నతమైన సేవలు అందించగలరు. వీరిని మా ప్లాట్‌ఫాం పైకి తేవడంతో.. కస్టమర్లకు కొత్తదనాన్ని పరిచయం చేసే అవకాశం లభిస్తుంది” అన్నారు శలభ్.
ఈ సంస్థకు సాంకేతికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్న వ్యక్తి, మూడో కో ఫౌండర్ హిమాన్షు జగ్వాని. ఈయన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యాభ్యాసం చేశారు. కొలంబియా యూనివర్సిటీ స్టూడెంట్ అయిన హిమాన్షు.. ఖుష్‍బూకి స్వయానా సోదరుడు.
“ఈ స్పీడ్ యుగంలో.. ప్రతీ వెండర్ దగ్గరకు వెళ్లి వారి కేటలాగ్స్ చూసి, ధరవరలు తెలుసుకునేంత టైం అందరికీ ఉండడం లేదు. ఈ సాంప్రదాయ విధానాలకు క్రమేణా డిమాండ్ తగ్గిపోతోంది. పలు రకాల అంచనాలు, గణాంకాల ద్వారా కస్టమర్లకు వారి ఇష్టానికి తగినట్లుగా సర్వీసులను అందించే విక్రేతలను ఈ ప్లాట్‌ఫాం దగ్గర చేస్తుంది ” అంటున్నారు హిమాన్షు. సాంకేతిక రంగ ఔత్సాహికుడైన ఈయన.. ఫ్లిప్‌కార్ట్ సంస్థలో ప్రాసెస్ ఆప్టిమైజేషన్ విభాగంలో ఏడాది పాటు పని చేశారు. ఫుల్‌ఆన్‌షాదీలో సాంకేతిక అభివృద్ధి విభాగాన్ని హిమాన్షు చూసుకుంటున్నారు.
ప్రత్యర్ధులు, భవిష్యత్ ప్రణాళికలు
శలభ్, ఖుష్‌బూ, హిమాన్షు.. ఈ ముగ్గురూ కలిసి ఫుల్‌ఆన్‌షాదీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నపుడే.. తమ కోసం తీవ్రమైన పోటీ ఎదురుచూస్తోందనే విషయాన్ని గుర్తించారు. పలు పెళ్లి సంబంధిత స్టార్టప్‌లతోపాటు షాదీ సాగా, 7వచన్, వెడ్‌మీగుడ్ వంటి కంపెనీలు ఈ రంగంలో ఉన్నాయనే విషయాన్ని గుర్తించారు.
“ఈ కంపెనీలేవీ కస్టమర్లను విక్రేతలతో నేరుగా కలిపే ప్రయత్నం చేయలేదు. అందుకే మేం ఈ రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టాం. అందుబాటులో ఉన్న అవకాశాలు అన్నిటి పైనా యూజర్లకు అవగాహన కలిగేందుకు సహాయం చేస్తాం. వాటిలోంచి తమకు కావలసిన, వీలైన వాటిని కస్టమర్లు ఎంపిక చేసుకుంటారు. కాంట్రాక్టులు ఇచ్చే విధానంతో పోల్చితే.. ఇది స్వయంగా నిర్వహించుకున్న అనుభూతులను మిగుల్చుతుంది. ”అన్నారు శలభ్.
మరో ఏడాది కాలంలో 15వేల మంది వెండర్స్‌ను తమ ప్లాట్‍ఫాంలో లిస్టింగ్ చేసేందుకు ఫుల్‌ఆన్‌షాదీ టీం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా మరో 8 నగరాలకు తమ సేవలను విస్తరించనున్నారు. అడ్వర్‌టైంజింగ్ ద్వారా ఆదాయం గడించాలన్నది వీరి ఆదాయ మార్గం.
“మేం ముగ్గురం మూడు విభాగాలకు చెందిన పర్ఫెక్ట్ టీం. మూడు విభిన్న రంగాలకు చెందినా.. మ అందరి లక్ష్యం, దాన్ని అందుకునేందుకు ఆలోచనా విధానం ఒకటే”అంటున్నారు హిమాన్షు.
పెళ్లిళ్ల రంగానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న పలు అంతరాలను తాము తగ్గించగలమని నమ్మకంగా చెబుతున్నారు ఫుల్‌ఆన్‌షాదీ టీం.