వీళ్లు ఇంట్లో పెట్టుకునే మినీ పవర్ ప్లాంట్ తయారు చేశారు..!!
అత్యంత తక్కువ ఖర్చుతో సోలార్ పవర్ బ్యాకప్ ఉత్పత్తి ఆవిష్కరించిన స్టార్టప్
"కరెంట్ పోయిందా..?"...
ఈ డైలాగ్ ప్రతి ఇంట్లో దాదాపు ప్రతి రోజూ వినిపించాల్సిందే. నిజానికి విద్యుత్ సంస్ధల దగ్గర కావాల్సినంత కరెంట్ ఉన్నా... సరఫరా సమస్యల వలన తరచూ కరెంట్ పోవడం అనేది తరచుగా జరుగుతుంటుంది. సీజన్ ను బట్టి అధికారిక విద్యుత్ కోతలూ పలకరిస్తూంటాయి. ఈ సమస్యల పరిష్కారానికి జనరేటర్లు, యూపీఎస్ ఇన్వర్టర్లు వచ్చాయి. కానీ వీటి నిర్వహణ ఖర్చే తడిసి మోపెడవుతుంది. జనరేటర్ అయితే డీజిల్ బిల్లు, ఇన్వర్టర్ అయితే కరెంట్ బిల్లు జేబుకు చిల్లు పెట్టేస్తాయి. ఈ సమస్యల పరిష్కారానికి అద్భుతమైన కాన్సెప్ట్ తో ముందుకు వచ్చిన స్టార్టప్ "యూసోలార్"
సిలికాన్ వ్యాలీలో పుట్టిన యూసోలార్
అమెరికాలోని కాలిఫోర్నియా బే ఏరియాలో ప్రతి ఇంట్లో ఎర్త్ క్వాక్ కిట్ తప్పనిసరిగా ఉండాలి. భూకంపాలు వచ్చిన సమయంలో శిథిలాల కింద చిక్కుకుంటే అది కొంత కాలం పాటు కుటుంబసభ్యుల ప్రాణాలు నిలిపేందుకు సాయపడుతుంది. ఈ కిట్ కోసం సోలార్ బ్యాటరీ చార్జర్, రెండు లిథియం ఆయాన్ బ్యాటరీలు కావాలి. నాలుగేళ్ల కిందట ఆర్నాల్డ్ లీట్నర్ అనే వ్యక్తి ఈ కిట్ ను కొని ఇన్ స్టాల్ చేయించుకున్నాడు. అదే రోజు అతని ఏరియాలో కరెంట్ పోయింది. విపరీతంగా వచ్చిన గాలి కారణంగా కరెంట్ సరఫరా పునరుద్ధరణకు సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఆ రోజు లీట్నర్ కుటుంబం ఇబ్బంది పడింది. కానీ ఓ కొత్త ఐడియా మాత్రం పుట్టుకొచ్చింది. భూకంప రక్షణకు వాడే కిట్ కు చార్జింగ్ కోసం ఉపయోగించే సోలార్ బ్యాటరీ చార్జర్, లిథియం ఆయాన్ బ్యాటరీలను ఇంట్లోని రిఫ్రిజిరేటర్, ఫ్యాన్లు ఇతర ఎలక్ట్రానిక్ సామాన్లకు ఎందుకు వాడకూడదనే ఆలోచన వచ్చింది. అప్పటి వరకు జనరేటర్లు, యూపీఎస్ ఇన్వర్టర్లే మార్కెట్లో ఉండటం తెలుసుకున్న లీట్నర్... అప్పటిదాకా తను చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలన్నింటినీ పక్కన పెట్టేశాడు. యూసోలార్ ను ప్రారంభించాడు. ఈ ప్రయాణంలో జిగ్ అనే స్నేహితుడ్ని భాగం చేసుకున్నాడు.
మాడ్యులర్ సోలార్ అండ్ బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ మార్కెట్లో ఇప్పుడు ఈ కంపెనీ ఉత్పత్తులు ట్రెండ్ సెట్టింగ్ గా మారాయి. భారత్ లాంటి వర్థమాన దేశాల్లో కరెంట్ సమస్యలు అధికంగా ఉంటాయి. కరెంట్ కొరత, సరఫరా సమస్యలు అధికంగా ఉండే భారత్ లో ఇలాంటి సోలార్ పవర్ బ్యాకప్ ప్రొడక్ట్స్ కు మంచి భవిష్యత్ ఉందని నమ్మారు. ఇక్కడి ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
ఆచరణ కోసం పోరాటం
గ్లోబల్ పవర్ మార్కెట్ కన్సల్టెంట్ గా పనిచేసిన ఆర్నాల్డ్ లైట్నర్ కు చాలా అవగాహన ఉంది. అయితే అదంతా మార్కెటింగ్ కు సంబంధించే. ఉత్పత్తికి సంబంధించి కనీస అవగాహన కూడా లేదు. ఫిజిక్స్ లో పీహెచ్డీ చేసిన ఆర్నాల్డ్... గూగుల్ ద్వారానే మొత్తం సమాచారాన్ని సేకరించారు. తన ఆలోచనకు కావాల్సిన ఉత్పత్తులు, వాటి ధరలు, డిజైన్లు, పనితీరు అన్నీ పై గూగుల్ సాయంతోనే అవగాహన పెంచుకున్నారు. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ సక్సెస్ కావాలంటే ... మిగతా జనరేటర్లు, యూపీఎస్ ఇన్వర్టర్ల కంటే తన సోలార్ కాన్సెప్ట్ ధర అత్యంత తక్కువగా ఉండాలి. ఆ కోణంలోనే ఎక్కువ సమాచారం సేకరించాడు. గంటలు.. గంటలు సమాచారం సేకరించి వాటిని విశ్లేషించిన తర్వాత తన ఆలోచనల్లో లోతు ఎక్కువేనని గ్రహించాడు. అత్యంత తక్కువ ధరకే సోలార్ పవర్ బ్యాకప్ అందిచవచ్చని తెలుసుకున్నాడు. ఈ ఉత్పత్తికి జనరేటర్లు, యూపీఎస్ ఇన్వర్టర్ల మార్కెట్ ను పూర్తి స్థాయిలో క్యాప్చర్ చేయగల సత్తా ఉందని నిర్ణయానికి వచ్చేశాడు.
" ప్రస్తుతం ఉన్న సోలార్ టెక్నాలజీతో ఓ పూర్తి స్థాయి ఇంటికి పవర్ బ్యాకప్ అందించడం అంత తేలికైన విషయం కాదు. అందుకే నేను నా ఆలోచనల్ని..ముందుగా పేపర్ పై పెట్టుకున్నాను. ఓ పెద్ద ఇంటికి ప్లగ్ అండ్ ప్లే తరహాలో పూర్తిస్థాయి కరెంట్ సరఫరా కోసం ఎలాంటి ఇబ్బందులు లేని.. పెద్దగా ఖర్చు కాని ఓ కొత్త ఉత్పత్తిని తేవాలని ప్లాన్ చేసుకున్నాను" ఆర్నాల్డ్
సోలార్ ప్రయాణంపై క్లారిటీ వచ్చిన తర్వాత ఆర్నాల్డ్ వెంటనే రంగంలోకి దిగలేదు. ముందుగా వ్యాపార వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలనుకున్నాడు. ఫైనాన్స్ అండ్ అంట్రప్రెన్యూర్ షిప్ కోర్స్ చేసేందుకు కొలంబియా బిజినెస్ స్కూల్ లో చేరాడు. కోర్సు పూర్తయిన తర్వాత రంగంలోకి దిగాడు. ఓ సొంత కంపెనీని ప్రారంభించాడు. ఆ కంపెనీ త్వరగానే 40 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆకర్షించింది. పరిశోధన-అభివృద్ధి రంగాల్లో పనితనం ఎక్కువ-ఖర్చు తక్కువ ఉన్న ఉత్పత్తుల్లో అవార్డులు కూడా పొందింది. కానీ కొన్ని డిజైన్, సాంకేతిక సమస్యలు రావడంతో కంపెనీ నిలబడలేదు. అందుకే వ్యూహం మార్చుకుని రెండేళ్ల తర్వాత అసలు కంపెనీ యూసోలార్ ను ప్రారంభించాడు. ఈ కంపెనీ ఉత్పత్తులు ప్రారంభించే ముందు మరింత విస్త్రతమైన పరిశోధన చేశాడు ఆర్నాల్డ్. తన పీహెచ్డీ అడ్వైజర్ జాన్ పియర్స్ తో రోజుల తరబడి చర్చించారు. జాన్ సలహాలు సూచనలతో మాడ్యూలర్, ప్లగ్ అండ్ ప్లే, ధెప్ట్ ఫ్రూఫ్, మంచి బ్యాకప్ ఉన్న పవర్ ప్యానెల్స్ , బ్యాటరీస్ తో గ్రిడ్ ను రూపొందించాడు. మొదటగా హైఎండ్ ఇళ్ల పవర్ బ్యాకప్ సమస్యలను తీర్చడంపైనే ఆర్నాల్డ్ దృష్టి పెట్టాడు. ఆ ఇళ్లలో ఉండే ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ పరికరం.. అంటే ఏసీలతో సహా పనిచేసేలా తన సోలార్ పవర్ బ్యాకప్ ఉత్పత్తిని అందించడం ప్రారంభించాడు.
ఇది ఉంటే..ఇంట్లో మినీ పవర్ ప్లాంట్ ఉన్నట్లే...
యూసోలార్ కంపెనీతో ఆర్నాల్డ్ ఓ మినీ సంచలనాన్నే సృష్టించాడు. ఇంట్లో ఎక్కడైనా అమర్చుకోలిగేలా తన ఉత్పత్తిని డిజైన్ చేశాడు. లిథియం ఆయాన్ బ్యాటరీ కోసం ఓ కేబినెట్ ను కూడా రూపొందించాడు. ఈ వ్యవస్థనంతటినీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ తో అనుసంధానించేలా ప్రోగ్రామ్ ను కూడా సిద్ధం చేశారు. ఈ ఉత్పత్తి ఇంటికి సంబంధించి ఎలాంటి కరెంట్ సమస్యనైనా తీర్చేస్తుంది. వాతావరణ పరిస్థితులను ఈ సిస్టమ్ లో ఉండే సాఫ్ట్ వేర్ అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా పవర్ యూసేజ్ ప్యాట్రన్స్ కూడా మార్చుకుంటుంది. ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ ద్వారా అలర్ట్స్ కూడా పంపిస్తుంది. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ సోలార్ పవర్ బ్యాకప్ ఉత్పత్తి ద్వారా ఇంట్లో ఉన్న చిన్న జనరేటర్ల ద్వారా బ్యాటరీలను కూడా చార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సుదీర్ఘమైన పవర్ కట్స్ ఉన్నప్పుడు కూడా అంతరాయం లేకుండా పవర్ సప్లై చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఎందుకంటే బ్యాటరీ పవర్ స్టోరేజ్ 35kwh వరకూ ఉంటుంది. అంటే ఇది ఉంటే ఇంట్లో మినీ పవర్ ప్లాంట్ ఉన్నట్లే.
ఇతర లెడ్ యాసిడ్ బేస్డ్ బ్యాటరీస్ తో పోలిస్తే ఖర్చు సగానికి సగం తగ్గిపోతుంది. ఇది పర్యావరణ హితమైన ఉత్పత్తి కూడా. సోలార్ పవర్ ను పూర్తిస్థాయిలో వినియోగించుకునే ప్రయత్నంలో ముందడుగు. యూసోలార్ ఉత్పత్తిని ఇంటికి అమర్చడంతో పాటు ఐదేళ్ల పాటు పర్మార్మెన్స్ గ్యారంటీ కూడా అందిస్తుంది. అంతే కాదు దీనిలో ఉన్న సాఫ్ట్ వేర్ ద్వారా పవర్ కట్స్ వచ్చే అవకాశాలు, వాతారవణ పరిస్థితులపై ఇంట్లోని వాళ్లను ఎప్పటికప్పడు అలర్ట్ చేయగలుగుతారు.
టీమ్ స్పిరిట్...
అయితే యూసోలార్ తన ఒక్కడితోనే అనుకున్నంత ముందుకు వెళ్లదని ఆర్నాల్డ్ కు ముందు ముందు అర్థమైంది. వెంటనే తన టీమ్ ను రూపొందించుకున్నాడు. వాస్తవానికి యూసోలార్ ఆలోచన వచ్చినప్పుడు క్లీన్ టెక్ ఇండస్ట్రీ సంక్షోభంలో ఉంది. చాలా కంపెనీలు మూతబడ్డాయి. అలాంటి కంపెనీల్లో ఒకదానికి యజమాని జెనె కిజెన్ స్కి. సోలార్ ప్యానెల్స్ తయారు చేయడానికి వాడే డీసీ ఎలక్ట్రానిక్స్ పరికరాలు చేయడంలో కంపెనీని పెట్టినా నడవడంలో సమస్యలు ఎదురు కావడంతో మూసేశాడు. జెనె అనుభవాన్ని వాడుకోవాలని ఆర్నాల్డ్ నిర్ణయించుకుని తన టీంలో మెంబల్ గా చేర్చుకున్నారు. ఆ తర్వాత తన తొలి స్టార్టప్ లో కలసి పనిచేసిన కొలేమన్ మూర్ ని కలుపుకున్నాడు. చివరిగా హార్వార్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థి జిగ్ ను చీఫ్ ఆపరేటింగ్ ఆపీసర్ గా మార్చారు. దాంతో తన బృందానికి పరిపూర్ణత వచ్చింది.
ఇండియా మార్కెట్ లోకి ప్రవేశం
భారత ప్రజలకు తమ ఉత్పత్తి విశేషంగా ఆకట్టుకుందని ఆర్నాల్డ్ గట్టిగా నమ్ముతున్నారు. ఎలాంటి స్విచ్ లు తమ ఉత్పత్తిలో ఉండవని, మొత్తం పవర్ బ్యాకప్ వ్యవస్థ అంతా ఆండ్రాయిడ్ తోనే నడుస్తుందని, ఇదే ప్లస్ పాయింటని చెబుతున్నారు. భారత ప్రజలతో సుదీర్ఘ అనుబంధం కోసం ప్రయత్నిస్తున్నామంటున్నారు.
" మా బిజినెస్ మోడల్.. సుదీర్ఘ కాలం కస్టమర్లతో అనుబంధాన్ని పెంచేలా ఉంటుంది. చాలా వరకు విడిభాగాలు ఇండియాలోనే ఉత్పత్తి చేస్తున్నాం. ఒక చోట నుంచి మరో చోటకి తీసుకెళ్లడానికి కూడా అనువుగా డిజైన్ ఉంది. ఇది నెక్ట్స్ జనరేషన్ సోలార్ ఉత్పత్తి. దీన్ని సోలార్ 2.0 గా పిలవవచ్చు" ఆర్నాల్డ్, యూ సోలార్ ఫౌండర్
భారత్ మార్కెట్ లో 2017 ప్రథమార్థం నుంచి కమర్షియల్ కార్యకలాపాలు నిర్వహించాలని ఆర్నాల్డ్ పట్టుదలగా ఉన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఇండియన్ ఎంజెల్స్, స్కాలే గ్రూప్ నుంచి పెట్టుబడులను అందించనున్నాయి. కార్యకలాపాలు పెరిగి... ఉత్పత్తుల అమ్మకాలు కూడా పెరిగితే ఖర్చు మరింత తగ్గుతుందని... మరింత చవగ్గా సోలార్ వపర్ బ్యాకప్ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని ఆర్నాల్డ్ నమ్మకంగా ఉన్నాడు. సోలార్ పవర్ అనేది ఎవరూ ఊహించనంత పెద్ద మార్కెట్ అని నిరూపించబోతున్నామనే దీమాతో ఆర్నాల్డ్ ఉన్నారు.