మీ బైక్ సర్వీసింగ్ విషయంలో మీరెప్పుడైనా ఇబ్బందులు పడ్డారా ? దగ్గరలో ఉన్న ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌ను కనిపెట్టడం మొదలు... దాని సర్వీసింగ్ పూర్తవ్వడం వరకు ఎంతో కొంత వ్యయప్రయాసలు ఎదురుకావడం సహజంగానే జరుగుతుంది.
లెట్స్సర్వీస్ నెలకొల్పాలనే ఆలోచన సచిన్ షెనాయ్ వ్యక్తిగత అనుభవం నుంచి వచ్చింది. ఓ స్టార్టప్ కంపెనీని మొదలుపెట్టే ప్రయత్నంలో తన బైక్‌ను ఎంతగానో నడిపిన సచిన్... ఓ సారి తన బైక్ సర్వీసింగ్ కోసం కాస్త ఎక్కువగా ఖర్చు చేశారు. ఓ రోజు బైక్ మళ్లీ ట్రబుల్ ఇవ్వడంతో దాని సర్వీసింగ్ కోసం ఏకంగా రూ.10,000 వెచ్చించారు. ఇది ఆయనకు జీవతకాలానికి సరిపోయే అనుభవాన్ని ఇవ్వడంతో పాటు బైక్‌ను ఎలా ట్రీట్ చేయాలనే దానిపై ఓ స్టార్టప్ ఐడియా కూడా వచ్చేలా చేసింది.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో సహ వ్యవస్థాపకులు సచిన్ శ్రీకాంత్, గిరీష్ గంగాధర్, మనోజ్ పెరకమ్ తో కలిసి సచిన్ లెట్స్సర్వీస్ అనే టూవీలర్ సర్వీస్ ప్లాట్‌ఫామ్‌ను బెంగళూరులో ప్రారంభించారు. బిజీగా ఉండే టూవీలర్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభమైన పద్ధతిలో బైక్ సర్వీసింగ్ సౌకర్యాన్ని ఈ వేదిక కల్పిస్తుంది.
ఇందులో ప్రాసెస్ చాలా సులభంగా ఉంటుంది. తమ వెబ్ సైట్లోకి లాగిన్ అయ్యి పిక్అప్ను షెడ్యూల్ చేసుకోవాలి. ఆ తరువాత ఆ బైక్ రన్నర్ మీ ఇల్లు లేదా ఆఫీసుకు వచ్చి బైక్‌ను పరిశీలిస్తారు. అనంతరం తమతో టై-అప్ అయిన ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌కు కస్టమర్ బైకును తీసుకెళ్లి... అది సర్వీసింగ్ అయిన తర్వాత తిరిగి ఓనర్లకు అప్పగిస్తారు. దీని ద్వారా బైక్ వినియోగదారులకు సమయం వృధా కాకుండా ఉంటుంది. వారి బైక్ సర్వీసింగ్ స్టేటస్ ఎలా ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్స్, నోటిఫికేషన్స్ ద్వారా వారికి తెలియజేస్తారు.
"కస్టమర్లకు కన్వీనియన్స్ అందించే విషయాన్ని లెట్స్సర్వీస్ బలంగా నమ్ముతుంది. బిజీగా ఉండే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఇంట్లో లేదా ఆఫీసులో కూర్చుని తమ బైకులు సర్వీసింగ్ చేయించుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కస్టమర్లకు తమ బైక్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయాన్ని వారికి టెక్నాలజీతో సంబంధం లేకుండా సులువుగా అర్థమయ్యేలా లెట్స్సర్వీస్ సహకరిస్తుంది. టూ వీలర్ వినియోగదారులు సులభంగా తమ బైక్ ఇన్సూరెన్స్‌ను రెన్యూవల్ చేసుకోవడం, ఎమిషన్ టెస్ట్ సర్టిఫికెట్లు పొందడానికి మేం సహాయపడతాము" అని లెట్స్సర్వీస్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు సచిన్ తెలిపారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలోని వృద్ధిని గుర్తించిన సచిన్... 40 రోజుల వ్యవధిలోనే తమ వేదిక ఎంతో వృద్ధి చెందిందని తెలిపారు. దాదాపు 60 ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లు ఈ ప్లాట్ఫామ్లో రిజిష్టర్ చేయించుకున్నారు. ప్రస్తుతం వీరు రోజుకు 20 బైకులు సర్వీసింగ్ చేయడానికి ఉపయోగపడుతుండగా... రాబోయే రెండు నెలల్లో ఈ సంఖ్య 80 దాటుతుందని అంచనా వేస్తున్నారు.
"కస్టమర్‌కు ఈ సర్వీస్ అందించినందుకు మేము ఒక్కోక్కరి నుంచి రూ.300 కన్వీనియెన్స్ ఫీజును చార్జ్ చేస్తున్నాం. ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకోవడం ఎలా అనే దానిపై రాబోయే రోజుల్లో దృష్టి సారిస్తాం" అని సచిన్ తెలిపారు.
ఈ రంగంలో పెరుగుదలకు ఎక్కువ అవకాశం ఉంది. ఇందులో మొదటగా 20 వేల డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. ఆ మొత్తాన్ని టెక్నాలజీ వృద్ధి, మంచి టీమ్‌ను ఎంపిక చేసుకోవడం, కస్టమర్లు మరియు డీలర్ల అనుసంధానికి వినియోగించారు. ప్రస్తుతం తమ పెట్టుబడిని పెంచుకునేందుకు మొదట ఇందులో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లతోనే చర్చలు జరుపుతున్నారు.
మార్కెట్, పోటీ
ఓ అంచనా ప్రకారం బెంగళూరులో ప్రతి నెల 60 వేల యూనిట్ల బైకులు అమ్ముడవుతుండగా... నెలకు లక్షా 50 వేల యూనిట్ల బైకులు నగరంలోని ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లలో సర్వీసింగ్ చేయబడుతున్నాయి.
గత ఏడాదికాలంగా మోటార్ వాహనాల సర్వీస్ రంగం గణనీయమైన ఎదుగుదలను చవిచూసింది. ఈ రంగంలో మోటార్ ఎక్స్పర్ట్, మేరీకార్, కార్టీసన్ వంటి కొత్త కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించేందుకు సైతం ఈ కంపెనీలు దృష్టి సారించాయి.
మేరీకార్.కామ్‌లో మై ఫస్ట్ చెక్ మరియు రాజన్ ఆనందన్ (పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ ) రెండు సార్లు ఇన్వెస్ట్ చేశారు. భవిష్యత్తులో మరింత ఎక్కువ మొత్తాన్ని ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి వారు ఆలోచిస్తున్నారు.
జులైలో బెంగళూరుకు చెందిన ఆటోమొబైల్ సర్వీస్ మార్కెట్ ప్లేస్ కార్టీసన్ కూడా నిధులను భారీగా సమీకరించింది. యూవి కెన్ వెంచర్స్, గ్లోబర్ ఫౌండర్స్ కేపిటల్, టాక్సీఫర్ షూర్స్ అప్రమేయా సహా మరికొందరు ఇందులో ఇన్వెస్ట్ చేశారు.
ఈ రంగంలో ఉన్న పోటీపై స్పందించిన సచిన్... ఇది పెద్ద మార్కెట్ అని తెలిపారు. కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టే వారికి ఇక్కడ ఎంతో స్కోప్ ఉందని...రాబోయే రోజుల్లో లెట్స్ సర్వీస్ మార్కెట్లో ఎక్కువ శాతం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. " ఈ రంగంలో మంచి సర్వీస్ ఇస్తామని పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. ఆ విషయంపైనే మేము దృష్టి పెట్టి మా వ్యూహాలను అమలు చేయాలని అనుకుంటున్నాం" అని వివరించారు.