డేటింగ్ లో ఉన్నారా..? అయితే మీ కోసం ప్రైవేట్ స్పేస్ అందిస్తోంది ఓయో...!
రిలేషన్ షిప్ లో ఉన్న జంటల కోసం ఓయో రూమ్స్ రిలేషన్ షిప్ మోడ్
రామ్, రమ్య ఆధునిక భావాలున్న యువతీయువకులు.
అందుకే కలసి జీవిస్తున్నారు.. కొంత కాలం అయిన తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలనుకున్నారు. వీరు తరచూ జంటగా ఔటింగ్ కు వెళ్తూంటారు. ఇష్టమైన ప్రదేశాలను చూడటానికి ఎంత దూరమైనా వెళ్తారు. కానీ ఇలా వెళ్లినప్పుడల్లా వారికి "బస" అనేది పెద్ద సమస్యగా మారిపోతోంది.
ఎంత పెద్ద హోటల్ లో అయినా మీకు పెళ్లయిందా..? అనేప్రశ్న కామన్ గా మారిపోతోంది.
కాలేదని చెబితే వెకిలిచూపులతో సిబ్బంది ఇబ్బంది పెడుతూంటారు...!
అయిందని చెప్పినా... కాళ్లకి మెట్టెలు లేవు.. మెడలో మంగళసూత్రం లేదు అని... యక్షప్రశ్నలు ... తప్పు చేస్తున్నట్లు డిసైడ్ చేసేస్తారు..!
ఈ ఇబ్బంది వల్ల రామ్, రమ్య రెండు మూడు రోజుల పాటు సరదాగా డేట్ కి వెళ్లాలన్నా ఆలోచనలో పడిపోతున్నారు...!
ఈ సమస్య వీరికే కాదు. రిలేషన్ షిప్ లో ఉన్న జంటలన్నింటికీ వర్తిస్తుంది. భారతీయ సమాజంలో రోడ్డుపై అమ్మాయి, అబ్బాయి చేతిలో చేయి వేసుకుని నడిస్తేనే అందరూ వింతగా చూసే పరిస్థితి. వారు భార్యభర్తలైనా అది తప్పేనన్నట్లు ఉంటుంది చూట్టూ ఉండే జనం వ్యవహారశైలి. ఇక పెళ్లి కాకుండానే ఒకే గదిలో కలిసి ఉంటామంటే నోళ్లు నొక్కుకోకుండా ఉంటారా..?.
కానీ ఆధునిక భావాలతో మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన యువత ఆలోచనలు మాత్రం... వేరుగా ఉంటున్నాయి. జీవితాన్ని ఆస్వాదించాలనుకున్నవారు... మనసుకు నచ్చిన వారిని భాగస్వామిగా చేసుకోవడానికి లివ్ ఇన్ రిలేషన్ షిప్ పద్దతిని పాటిస్తున్నారు. ఇలాంటి జంటలు మెట్రో నగరాల్లో అనూహ్యంగా పెరుగుతున్నాయి. కలసి ఉండటం, కలసి టూర్లకు వెళ్లడం ఇప్పుడంతా కామన్. ఇలాంటి జంటలు ఎప్పుడైనా బయటకు వెళ్లినా... ఉన్న ఊరిలోనే ఎలాంటి టెన్షన్లు లేకుండా ఓ రాత్రి ప్రశాంతమైన, ఆహ్లాదమై హోటల్లో బస చేద్దామనుకున్నా ఇక్కట్లు తప్పడం లేదు.
ఆధునిక యువత ఎదుర్కొంటున్న ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టేసింది "ఓయో రూమ్స్"
ఆన్ లైన్ హోటల్ రూం బుకింగ్ మార్కెట్ లో లీడర్ గా ఉన్న ఓయోరూమ్స్... కస్టమర్ల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ లను విశ్లేషించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చింది. రిలేషన్ షిప్ మోడ్ అనే ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా పెళ్లి కాని, రిలేషన్ షిప్ లో ఉన్న జంటలు రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఒక్క సారి రూమ్ కన్ఫర్మ్ చేసుకుంటే ఇక ఎవరూ ఎలాంటి ధృవపత్రాలు అడగరు. సహజంగా ఉండే యక్షప్రశ్నల్లో ఒక్కటి కూడా హోటల్ సిబ్బంది నుంచి రాదు.
భారత్ లో పెళ్లి కాని జంటలకు రూమ్ రెంట్ కి ఇవ్వడానికి చాలా హోటళ్లు ఇప్పటికీ తప్పుడు పనిగానే భావిస్తూంటాయి. అందుకే నో రూం ఫర్ అన్ మ్యారీడ్ కపుల్స్ అనే బోర్డులు కూడా పెట్టేస్తూంటారు. అందుకే ఓయోరూమ్స్ ఈ ఆప్షన్ పెట్టడానికి తన లిస్టెడ్ హోటల్స్ అనుమతి తీసుకుంది. అలా అంగీకరించిన హోటల్స్ ను మాత్రమే రిలేషన్ షిప్ మోడ్ ఆప్షన్ లో కనిపిస్తాయి.
" మా పార్టనర్లను మేము గౌరవిస్తాం. అయితే అదే స్థాయిలో ప్రతి గెస్ట్ ను ఓయోరూమ్స్ కు అహ్వానిస్తాం. అందుకే మా టీం ఈ సమస్యను టెక్నాలజీతో పరిష్కరించే ప్రయత్నం చేసింది. పెళ్లి చేసుకోని జంటలకు రూములు ఇవ్వకూడదని చెప్పే చట్టాలేం ఇండియాలో లేవు..." కవికృత్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్
ఓయోరూమ్స్ లో ఈ రిలేషన్ షిప్ మోడ్ లో రూమ్స్ బుక్ చేసుకోవడం చాలా సులువైన పని. ఓయో అకౌంట్ లోకి సైన్ ఇన్ అయిన తర్వాత స్టేటస్ లోకి వెళ్లి రిలేషన్ షిప్ మోడ్ సెలక్ట్ చేసుకుంటే చాలు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని ఓయో చెబుతోంది. కపుల్ ఫ్రెండ్లీ ఓయో రూమ్స్ ఇండియాలో దాదాపు వంద నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. లిస్టెడ్ హోటళ్లలో అరవై శాతం రిలేషన్ షిప్ మోడ్ కాన్సెప్ట్ కి అంగీకారం తెలిపాయి.
" స్టే ఎక్స్ పీరియన్స్ ను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఓయో అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తుంది. ప్రతి ఒక్కరికీ ఓయో ఉంటుందని మేము నమ్మకంగా చెబుతున్నాం. జంటలు ఓయోద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెక్ ఇన్ అవ్వొచ్చని చెబుతున్నాం" కవికృత్, చీఫ్ గ్రోత్ ఆఫీసర్
ఇప్పటికే ఇలా రిలేషన్ షిప్ లో ఉన్నజంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రూములు బుక్ చేసుకునే అవకాశాన్ని స్టేఅంకుల్ స్టార్టప్ కల్పిస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే స్టేఅంకుల్ ఈ కాన్సెప్ట్ నే హైలెట్ చేస్తోంది. స్టేఅంకుల్ నుంచి వస్తున్న కాంపిటీషన్ ను తట్టుకునేందుకు అలాగే... కస్టమర్ల నుంచి వస్తున్న ప్రధాన ఫిర్యాదును పరిష్కరించేందుకు ఓయోరూమ్స్ కూడా రిలేషన్ షిప్ మోడ్ లోకి వెళ్లింది. అయితే ఈ హోటల్ రూమ్ అగ్రిగ్రేటర్లకు మెట్రో నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ద్వితీయశ్రేణి నగరాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని ఓయోరూమ్స్ బృందం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తోంది.
ఆన్ లైన్ హోటల్ రూమ్ బుకింగ్ స్టార్టప్స్ లో ఓయో ఓ సంచలనం. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ మార్కెట్ షేర్ పెంచుకుంటోంది. యువతరం కోసం కొత్తగా పెట్టిన రిలేషన్ షిప్ మోడ్... కస్టమర్లతో తమ రిలేషన్ ను మరింత స్ట్రాంగ్ గా చేస్తుందని నమ్ముతున్నారు.