రండి బాబూ రండి..! సగం ధరకే బ్రాండెడ్ ప్రాడక్ట్స్..!!
మిట్ట మధ్యాహ్నం..
వీధి మొత్తం నిర్మానుష్యంగా ఉంటుంది.
హర్ ఏక్ మాల్ బండివాడు ఎప్పుడు సాయంత్రం అవుతుందా.. ఎప్పుడు లేడీ కస్టమర్లు గుమిగూడుతారా అని చెట్టుకింద బండి పెట్టుకుని గుడ్లు మిటకరిస్తూ చూస్తుంటాడు..!!
ఆల్రెడీ కచోరీలు అమ్మేవాడు రెండు మూడు రౌండ్లు కొట్టిపోయాడు..
అదిగో అప్పుడు వినిపిస్తుందొక పిలుపు..
""పాతబట్టలకు స్టీలు సామాన్లేయ్...!!""
అదో రకమైన గొంతు.. వీధిలో ఆ చివర్నుంచి ఈ చివరి వరకు వినిపిస్తుంది..!
ఆ మాటలు విన్న ఓ మధ్యతరగతి ఇల్లాలు.. వంటింట్లో తోముతున్న అట్ల పెనాన్ని సగంలోనే సింకులో వదిలేసి.. పరుగు పరుగున వచ్చి పిట్టగోడ మీద తల ఆన్చి పిలుస్తుంది..
ఏమోయ్.. స్టీలు సామన్లబ్బీ.. ఇలా రా..!!
చాలా సినిమాల్లో ఇలాంటి సీన్లు చూసే వుంటారు!
అఫ్ కోర్స్ నిజజీవితంలో కూడా ఇదే జరుగుతుందనుకోండి !!
పాతబట్టలను వదిలించుకునేందుకు మిడిల్ క్లాస్ పీపుల్ కు ఇదొక చక్కటి మార్గం. సరే వారివంటే పాతవి. చాలాకాలంపాటు తొడిగినవి. పాతబడి, రంగు వెలసిపోయి జీర్ణావస్థలో ఉంటాయి కాబట్టి, స్టీలు సామాన్ల వాడిని సాధికారికంగా పిలిచి మరీ, బట్టలేసి గిన్నెలు తీసుకుంటారు.
మరి రిచ్ పీపుల్ ఏం చేస్తారు..? లక్షలు పోసి బట్టలు కొంటారు. వేలు పెట్టి షూ తీసుకుంటారు. ఖరీదైన హాండ్ బ్యాగులు, వాచెస్.. బ్రేస్ లెట్స్.. ఇలాంటి లగ్జరీ వస్తువులన్నిటిపైనా వారికి ఒకసారే మోజు. రెండోసారి అంతగా ఇష్టం కగలదు. అతికష్టమ్మీద వాడుతారు. మూడోసారి వాటివంక కూడా చూడరు. అవి ఏదో మూలన అనాథల్లా పడివుంటాయి. చూస్తూ చూస్తూ పడేయలేరు. దానమూ చేయలేరు. ఒకవేళ ఎవరికైనా ఇచ్చేసినా తీసుకున్న వారికి అంతగా నప్పకపోవచ్చు. మొత్తమ్మీద లగ్జరీ వస్తువుల్ని వదిలించుకోవడం అనుకున్నంత ఈజీ కాదు. అయితే, అలాంటి వాటిని అమ్మిపెడతామంటూ ఓ యువతి స్టార్టప్ తో పరిష్కారం చూపించింది.. అదేంటో చదవండి...
డింపుల్ మీర్ చందని. బిజినెస్ ఫ్యామిలీలో. అయినప్పటికీ అందరిలా కుటుంబం పేరు చెప్పుకొని ఎదగడం ఆమెకు ఇష్టం లేదు. సొంతంగా తన కాళ్ళ పై నిలబడి ఒక పర్ఫెక్ట్ ఆంట్రప్రెన్యూర్‌గా నిరూపించాలనుకుంది. స్టార్టప్ మంత్రాతో పరుగులు పెడుతున్న యువతను ఆదర్శంగా తీసుకుంది. ఒక వినూత్న మైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. ఆ ఐడియా పేరు సీక్రెట్ డ్రెస్సర్ డాట్ కామ్. వినడానికి కొత్తగానూ, వింతగానూ ఉండవచ్చు. కానీ ప్రతీ ఒక్కరినీ ఆలోచింపచేసే స్టార్టప్ ఇది. చెప్పాలంటే ఇదో వినూత్న బిజినెస్.
సాధారణంగా పార్టీలకు, పెళ్లిల్లకు నియో రిచ్ పీపుల్ ఒక రేంజిలో తయారైపోతారు. వాళ్లు వాడే బాడీ స్ప్రే దగ్గర్నుంచి హెయిర్ బ్యాండ్ దాకా లగ్జరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చమ్కాయించే డ్రెస్సు.. వావ్ అనిపించే సూటు.. అదిరిపోయే హాండ్ బ్యాగు.. సూపర్ అనిపించే షూ.. ఇలా దేనికదే లగ్జరియస్ గా కనిపిస్తుంది. వాటిని చూడగానే రేటుకూడా అటుఇటుగా తెలిసిపోతుంది. అవన్నీ ఆ ఒక్క పార్టీకో పెళ్లివేడుకకో పరిమితం. మళ్లీ అలాంటిదే ఇంకో సందర్భం వచ్చినా వేరే కలెక్షన్స్... వేరే లుక్స్ కోసం ట్రై చేస్తారే తప్ప.. వేసిన డ్రెస్సులే వేయరు. ఆ స్థాయి మనుషులకు అది పరువు తక్కువ వ్యవహారం కూడా.
వేలు లక్షలు ఖర్చు పెట్టి కొనే సూట్లు, డిజైనర్ వేర్స్ ఒక్క పార్టీతో పాతబడిపోతాయి. పోనీ పనివాళ్లకో.. తోటమాలికో ఇవ్వాలన్నా వాళ్లు తీసుకోరు. అంతంత ఖరీదైన బ్రాండెడ్, డిజైనర్ వేర్స్.. వాళ్లకు నప్పవు. అడుక్కుని తొడుక్కున్నారని ఈజీగా తెలిసిపోతుంది. ఇలాంటి సమస్యకు సీక్రెట్ డ్రెస్సర్స్ పేరుతో డింపుల్ వెరైటీ పరిష్కారం వెతికింది. వేలు లక్షలు తగలేసి ఒకటీ, రెండుసార్లు మాత్రమే వేసుకునే బ్రాండెడ్, డిజైనర్ వేర్లను సీక్రెట్ డ్రెస్సర్ లో రహస్యంగా అమ్మేయవచ్చు. వాటి క్వాలిటీని బట్టి రేటు నిర్ణయిస్తారు. అమ్ముడు పోతే డబ్బులు చెల్లిస్తారు.
ఎవరిదాకో ఎందుకు.. ఈ సమస్య డింపుల్ కే వచ్చింది. ఎంతో నచ్చిన డిజైనర్ వేర్లను వార్డ్ రోబ్ లో ఏళ్లకు ఏళ్లు పెట్టి చివరికి విసుగు పుట్టింది. వాటిని ఏం చేయాలా అనే ఆలోచననే స్టార్టప్ కు దారితీసింది. నిజంగానే ఇది అద్భుతమైన ఆలోచన. రోహిత్ బాల్, సబ్యసాచి లాంటి డిజైనర్లు డిజైన్ చేసిన బట్టలు కొనాలంటే సామాన్యులకు సాధ్యం కాని పని. అదే ఈ సీక్రెట్ డ్రెస్సర్లో అమ్మకానికి పెడితే మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారు తక్కువ మొత్తానికి అదిరిపోయే అర్మనీ సూట్ సొంతం చేసుకోవచ్చు..
డింపుల్ ఆలోచన సక్సెస్ అయ్యింది. ఆమె స్టార్టప్ ఎందరో రిచ్ పీపుల్ కి పరిష్కారం చూపింది. మొహమాట పడకుండా అమ్మేయవచ్చు. ఖరీదైన బ్రాండెడ్, డిజైనర్ వేర్ ను తక్కువ ధరకే కొనేవాళ్లు కొనవచ్చు. డింపుల్ ఆలోచన ఎందరినో ఆకర్షించింది. ఇంటర్నేషనల్ బ్రాండెడ్ దుస్తులు కూడా తక్కువ ధరకే ఇచ్చే ఈ వెబ్ సైట్ అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయింది. కేవలం బట్టలు మాత్రమే కాదు బ్రాండెడ్ యూస్డ్ యాక్సెసరీస్ అన్నీ ఇందులో దొరుకుతాయి.
సైట్లోకి ఎంటర్ కాగానే వన్ స్టాప్ షాపింగ్ అనుభూతి వస్తుంది. ఇండియన్ డిజైనర్ వేర్ దగ్గర్నుంచి ఇంటర్నేషనల్ వరకు అన్ని రకాల బ్రాండ్స్ అందుబాటులో ఉంటాయి. లెదర్ జాకెట్స్.. వాచీల దగ్గర్నుంచి అన్నీ మంచి కండిషన్లోనే ఉంటాయి. చిరుగులు, డామేజీ ఏదీ ఉండదు. అంతా బావుంది అనుకుని వెరిఫై చేసిన సైట్లో ఉంచుతారు.
అమ్మాలనుకున్న వారు కూడా ఐటెం డిటెయిల్స్ ఆన్ లైన్లోనే ఫిలప్ చేయాలి. ఏది అమ్మాలనుకుంటున్నారో దాని ఫోటోస్, అడిగిన వివరాలన్నీ చెప్తే వచ్చి వెరిఫై చేసుకుని, రేటు మాట్లాడుకుని, ఐటెం పోర్టల్ లో పెడతారు.
డింపుల్ కేవలం యంగ్ ఆంట్రప్రెన్యూర్ మాత్రమే కాదు. ఒక ప్రొఫెషనల్ యోగా ట్రెయినర్. కథక్ డాన్సర్. ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేటర్. జీవితంలోని ఎన్నో ఒడిదిడుకులను యోగాతో దూరం చేసుకోవచ్చని డింపుల్ సలహా ఇస్తుంటారు. అంతేకాదు తన హెల్దీ లైఫ్ స్టయిల్ ను మెయిన్ టెయిన్ చేసేందుకు వెజిటేరియన్ గా ఉండటమే కారణమని అంటారామె.
డింపుల్ తన హెల్దీ సీక్రెట్స్‌ను నలుగురితో పంచుకునేందుకు ఒక హోలిస్టిక్ న్యూట్రిషన్ కన్సల్టెన్సీని కూడా స్థాపించారు. ఇందులో ప్రధానంగా హెల్దీ లైఫ్ స్టయిల్ ను ఎలా అలవర్చుకోవాలో సలహాలు, సూచనలు ఇస్తుంటారు.
నిత్యం ఆనందంగా ఉండటం..
తీసుకున్న నిర్ణయాల పట్ల క్లారిటీ ఉండటం..
రోజంతా ఎనర్జీతో ఉండటం..
జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందించడం..
మనస్సు, శరీరం, ఆత్మలను సమన్వయం పరుచుకోవడం..
ఇలాంటి లక్షణాలు ఉంటే చాలు.. జీవితం సాఫీగా సాగిపోతుందని డింపుల్ సజెస్ట్ చేస్తున్నారు. కనీసం ఒక క్రోసిన్ టాబ్లెట్ కూడా వేసుకోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటోంది అంటే అర్థం చేసుకోవచ్చు ఆమెంత పర్ ఫెక్టో..
యువర్ స్టోరీ పాఠకుల కోసం డింపుల్ కొన్ని ఆరోగ్య సూత్రాలను చెప్తున్నారు.. అవేంటంటే..
1. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి
2. తెల్లవారుజామునే పది నిమిషాలు యోగా చేయాలి.. లేదంటే ఒక పుస్తకం చదవాలి.. లేకుంటే మంచి సంగీతం వినాలి..
3. బ్రేక్ ఫాస్ట్ వీలైనంత ఎక్కువగా తిని, ఆ తర్వాత స్మాల్ మీల్స్ తీసుకోవాలి
4. టీ కాఫీలు మానేసి నిమ్మకాయ రసం తాగాలి
5. ఏడు గంటల పాటు హాయిగా నిద్రపోవాలి