డంబెల్స్ లేవు! ట్రెడ్ మిల్ లేదు! అసలు మిషనే కనిపించదు! భలేవుంది వీళ్ల ఫిట్ నెస్ సెంటర్ !!
సరికొత్త థీమ్ తో జనాన్ని ఆకర్షిస్తూ కల్ట్
ఇది ఫిట్ నెస్ యుగం .. ఈ జనరేషన్ అంతా సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ అంటూ జిమ్ లచుట్టూ తిరుగుతున్నారు. కిందామీదా పడుతూ గంటల తరబడి ఎక్సర్ సైజులు చేస్తూ కండలు తిరిగిన దేహం కోసం నానా కష్టాలు పడుతున్నారు. అయితే కండల గండరుల కోసం ట్రెడ్ మిల్ మీద ఆయాసపడే పనిలేకుండా.. ఆరు పలకల దేహం కోసం కిలోమీటర్ల కొద్దీ పరుగెత్తాల్సిన అవసరంలేకుండా.. ఫిట్ నెస్ ట్రైనింగ్ కి సరికొత్త అర్థాన్ని చెబుతూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది కల్ట్..
స్టార్టప్ ఆలోచన
జనాల్లో హెల్త్ కాన్షియస్ పెరిగింది. ప్రతీ ఒక్కరు బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. అందుకోసం గంటలు గంటలు జిమ్ లలో మెషిన్లపైన వర్కౌట్స్ చేస్తూ చెమటోడుస్తున్నారు.ఈ విధానం దీపక్, రిషబ్ కు బొత్తిగా నచ్చేదికాదు. అసలు మెషిన్ లేని , యంత్రాలతో పనేలేకుండా ఫిట్ నెస్ ట్రైనింగ్ ఉండాలన్న వారి ఆలోచనల్లోంచి పుట్టిందే కల్ట్
దీపక్ కర్ణాటకలోని వీటీయూ నుంచి కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ పట్టా, పుణె సింబయాసిస్ నుంచి ఎంబిఎ పట్టా అందుకున్నాడు. ఎంట్రప్రెన్యూర్ గా ప్రస్థానాన్ని మొదలు పెట్టకముందు కూడా విప్రోలో రిటైల్ అండ్ కన్స్యూమర్ గూడ్స్ విభాగానికి గ్లోబల్ మార్కెటింగ్ హెడ్ గా పనిచేశాడు. అలాగే దీపక్ బావ రిషబ్ కూడా పుణె నుంచి ఎంబీయే పూర్తి చేశాడు. దీపక్ లాగే రిషబ్ కూడా విప్రో , రెకిట్ బెన్ స్కిసర్ వంటి సంస్థలలో పనిచేశాడు. ఆ సంస్థలలో పనిచేసేటప్పుడే ఇంటర్నేషనల్ అథ్లెట్స్ లో ట్రైనింగ్ తీసుకుని తను కూడా ఎల్ 1 ట్రైనర్ గా మారాడు.
దీపక్ విప్రో లో వర్క్ చేస్తున్నప్పుడే వీకెండ్స్ లో ఎంట్రప్రెన్యూర్స్ ని కలుస్తూ ఉండేవాడు. వారితో ఇంటరాక్షన్ లో స్టార్టప్స్ లో ఉండే కష్టనష్టాలు తెలుసుకున్నాడు. అలా 2010 మెషిన్ లెస్ వర్కౌట్స్ అనే యునిక్ కాన్సెప్ట్ తో రిషబ్ తో కలిసి ఈ స్టార్టప్ ని మొదలుపెట్టారు.
“కామన్ వర్కౌట్ ఇంజురీస్ తగ్గించడానికి పోస్చర్స్, ఫామ్ మీద దృష్టి పెడతాం..కస్టమర్స్ ని కూడా ఎలాంటి పౌడర్స్, పిల్స్, సప్లిమెంట్స్ వాడమని ప్రోత్సహించం. అలాగే వర్కౌట్స్ పేరుతో కొత్తకొత్త కఠిన ఆహార నియమాలు పాటించమని కూడా చెప్పం. ఫిట్ నెస్ కోసం కొన్నిసార్లు సైక్లింగ్, స్విమ్మింగ్ తో పాటు వారితో ఆటలు కూడా ఆడిస్తాం”..రిషబ్
అవరోధాలు
మెషిన్ లెస్ వర్కౌట్స్ పై జనాల్లో అవగాహన కల్పించడానికి మొదట్లో వీరిద్దరూ చాలా కష్టపడ్డారు. దీంతో పాటు రోటీన్ జిమ్ సెటప్ కి కల్ట్ పూర్తి ఢిఫరెంట్ కావడంతో చాలా స్థలం అవసరమయ్యేది. అలా బెంగళూర్ సర్జాపూర్ రోడ్డులో ప్రస్తుతం కల్ట్ సెంటర్ ఉన్న స్థలాన్ని దొరకబుచ్చుకోవడం కూడా కష్టమైంది.
ఆరంభం అదిరింది
ఏ సంస్థకైనా మొదటి కస్టమర్ ని సంపాదించడం చాలా కష్టం. 75 లక్షల ప్రారంభ పెట్టుబడితో మొదలైన కల్ట్ కూడా దగ్గర్లోని లేక్ వద్ద అవుట్ డోర్ ట్రైనింగ్ యాక్టివిటీస్ తో మొదటి కస్టమర్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత కేవలం మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో చాలా మంది కస్టమర్లు వచ్చి చేరారు. అందుకే వీరికి పబ్లిసిటీపై ఒక్క పైసా కూడా ఖర్చుచేయాల్సిన అవసరం రాలేదు.
కల్ట్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ బేసిస్ లో మాత్రమే మెంబర్ షిప్ లను ఆఫర్ చేస్తోంది. తొమ్మిది మంది ట్రైనర్లున్న కల్ట్ - కేవలం ఆర్నెల్ల కాలంలో 200 పైగా మెంబర్స్ ని సంపాదించుకోగలిగింది. ఫేస్ బుక్ లో కల్ట్ పేజ్ కి 20,000 పైగా లైక్ లు సంపాదించుకుంది. కొంత మంది తమ ఫిట్ నెస్ గోల్స్ అచీవ్ చేసుకోవడానికి జాయిన్ అయితే మరికొంత మంది స్పోర్ట్స్ ని కెరీర్ గా ఎంచుకుని అథ్లెట్ ఫిజిక్ కోసం కల్ట్ ని ఆశ్రయిస్తున్నారు.
కల్ట్ సంవత్సరానికి 48, 000, అర్థ సంవత్సరానికి 30, 000 చార్జ్ చేస్తూ మెంబర్ షిప్ ఇస్తోంది. ఈ మెంబర్ షిప్ తీసుకున్న కస్టమర్స్.. స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్, ముతాయ్, బాక్సింగ్, బ్రెజియిలన్ జ్యూ-జిత్సు, యోగా, పవర్ స్ట్రెచ్, ఓపెన్ వర్కౌట్స్ తో పాటు షెడ్యూల్ లో ఉన్న అన్ని క్లాసులకు అంటెడవ్వచ్చు. ఛాంపియన్ షిప్ బౌట్స్ లో పాల్గొనే వారికోసం కల్ట్ బీట్ డౌన్ పేరుతో ప్రత్యేక సెషన్ ని కూడా ప్రారంభించింది.
“మార్కెటింగ్ కోసం పైసా ఖర్చు లేకపోవడంతో మాకు ఆదాయం బాగానే వస్తోంది. సాధారణ జిమ్ మాదిరిగా హై మిషన్ మెయింటెనెన్స్, పవర్ బిల్స్ లేకపోవడం మాకు కలిసోస్తోంది. ఆదాయం బాగానే వస్తున్నప్పటికీ వచ్చిన దాంట్లో ఎక్కువబాగం ట్రైనర్స్ కి జీతాలు చెల్లించడానికే కేటాయిస్తున్నాం”.-రిషబ్
కార్పొరేట్ వర్క్ షాప్స్
సెల్ప్ డిఫెన్స్, ఫంక్షనల్ ఫిట్ నెస్ తో పాటు బాడీ కండిషనింగ్ కంబాట్ స్పోర్ట్స్ లాంటి అంశాలపై కార్పొరేట్స్ కి ప్రత్యేక వర్క్ షాప్స్ నిర్వహిస్తోంది కల్ట్. వీటితో పాటు క్లయింట్స్ అవసరాలు అభిరుచులకు అనుగుణంగా బూట్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తోంది. డెక్లథాన్ తో కలిసి ప్రి అండ్ పోస్ట్ మరాథాన్ వర్కౌట్స్ పై కూడా శిక్షణ ఇస్తోంది. ఈ వర్క్ షాప్స్ అన్నీ ప్రత్యేకంగా కార్పొరేట్స్ అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేశాం. అందుకే వీటికోసం ప్రత్యేకమైన ఫీజు కూడా వసూలు చేస్తున్నాం. వ్యాయామాలు ఎలా చేయాలనే దానిపై అవగాహన కల్పించడమే కాకుండా .. వాటి నుంచి పూర్తి లభ్థి పొందేలా చేయడానికి అవసరమౌతాయని అంటున్నాడు నిర్వాహకుడు శరత్. వీటితో పాటు అరవై ఏళ్లు పైబడిన వృద్దులకు, సీనియర్ డాక్టర్స్, ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్స్ గైడెన్స్ తో ఓ ప్రత్యేక ప్రోగ్రామ్ ప్రారంభించేందుకు రెడీ అవుతోంది కల్ట్.
ప్రాంచైజ్ మోడల్ ద్వారా విస్తరణ
ప్రాంచైజ్ మోడల్ ద్వారా 2016 ఫిబ్రవరికల్లా బెంగళూరులో మరో రెండు సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రణాలికలు చేస్తోంది కల్ట్.. అయితే రెగ్యులర్ డిస్ కనెక్టెడ్ ప్రాంచైజ్ లాగా కాకుండా ప్రాంచైజ్ ఓనర్స్ కి తామే ట్రైనింగ్ ఇచ్చి ఈ సెంటర్ ని నడిపేలా తీర్చిదిద్దిన తర్వాతే అనుమతిస్తున్నామంటున్నారు నిర్వాహకులు.
ఈ ఏడాది నవంబర్ లోనే కల్ట్ ఫిట్ నెస్ ప్ర్రైవేట్ లిమిటెడ్ అనే పూర్తి స్థాయి సంస్థగా మారిన కల్ట్ బెంగళూరు తర్వాత ఇండియాలోని అన్ని టైర్ టూ సిటీస్ లో సంస్థను విస్తరించాలనే ప్రణాలికలు రచిస్తోంది. 2016 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రెండున్నర కోట్ల ఆదాయాన్ని అందుకునే టార్గెట్ తో పనిచేస్తోంది.
యువర్ స్టోరీ.కామ్ టేక్
ఈ ఆధునిక కాలంలో ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పులు.. ఆదాయ పెరగుదల వెల్ నెస్ సెక్టార్ కి వరంగా మారాయి. ప్రతీ సంవత్సరం ఈ సెక్టార్ లో 20 నుంచి 30 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ మార్కెట్ విలువ 490 బలియన్ డాలర్లు. దీంట్లో వెయిట్ లాస్,బ్యూటీ ట్రీట్ మెంట్స్ వంటి వాటికి ఎక్కువ వాటా ఉన్నప్పటికీ డెలాయిట్-ఐహెచ్ఆర్ఎస్ ఎ రిపోర్ట్ ప్రకారం కేవలం ముంబై, డిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లోనే 4.8 మిలియన్ ఫిట్ నెస్ ఫ్రీక్స్ ఉన్నారని తెలియజేస్తోంది. దీన్నిబట్టే ఈ సెక్టార్ గ్రోత్ ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు . బెంగళూర్ బేస్డ్ ట్రూ వెయిట్ వెయిట్ లాస్ కి ఖచ్చితమైన పద్దతులు తెలియజేయడంతో పాటు సూపర్ ఫుడ్ కిట్ పేరుతో న్యూట్రీషియన్ కౌన్సిలింగ్ అందిస్తూ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. అలాగే మరో బెంగళూర్ బేస్డ్ సంస్థ జిమ్ పిక్ కూడా ఫిట్ నెస్ ,వెల్ నెస్ సర్వీసులు అందిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరం కల్లా కోటి రూపాయల ఆదాయాన్నిసంపాదించాలనే టార్గెట్ గా పనిచేస్తోంది. అలాగే ముంబై బేస్డ్ ఫిటిస్కెట్ కూడా 450 జిమ్స్, ఫిట్ నెస్ స్టూడియోలతో ఒప్పందం కుదుర్చుకుని బీటా వెర్షన్ తో నెలకి 500 బుకింగ్స్ సాధిస్తూ దూసుకుపోతోంది.ఈ స్టార్టప్స్ తో కల్ట్ పోటీపడలేకపోయినా.. మెషిన్ లెస్ ఫిట్ నెస్ అనే యునిక్ ఫీచర్ తో ఇంటర్నేషనల్ ఎక్స్ పీరియన్స్‌డ్ ట్రైనర్స్ తో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకుంటూ సాగిపోతుంది. సరికొత్త థీమ్ తో జనాన్ని ఆకర్షిస్తూ కల్ట్ సక్సెస్ కావాలని కోరుకుందాం.