సంగీతంతో హోరెత్తిస్తున్న వైల్డ్ సిటీ
మ్యూజిక్ పరిశ్రమలో విజయవంత మైన సరా, మున్‌బిర్‌ల జంట లండన్ వదిలి భారత్‌లో కార్యకలాపాలు
సరా ఫతేమి, మున్‌బిర్ చావ్లా మధ్య యూకేలో పరిచయం ఏర్పడింది. మున్‌బిర్ ఆ సమయంలో మ్యూజిక్ ప్రొడక్షన్‌లో విద్యనభ్యనిస్తున్నారు. సౌండ్ ఇంజనీరింగ్ మొదలు స్టేజ్ నిర్వహణ వరకు మ్యూజిక్ ఇండస్ట్రీలో అన్ని విభాగాల్లో ఆయనకు ఎంతో అనుభవం ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివల్స్, ప్రొడక్షన్ కార్యక్రమాలను సరా నిర్వహిస్తున్నారు. లండన్‌లో ఎలక్ట్రానిక్ విభాగం కళాకారులతో మున్‌బిర్‌కు పనిచేసిన అనుభవం ఉంది. ఈ విభాగంలో అవకాశాలను అందుకోవాలన్నది ఈ జంట ఆశయం. ఇద్దరూ కలిసి ఆన్‌లైన్ మ్యూజిక్ మ్యాగజైన్ ‘వైల్డ్ సిటీ’ ప్రారంభించారు. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
యూకే నుంచి భారత్‌కు..
మాంద్యం కారణంగా యూకేలో కార్యకలాపాలు సంతృప్తిగా సాగలేదు. అయితే భారత్‌కు ఏదైనా వినూత్న సేవలను తీసుకెళ్లాలన్నది వీరి కల. ‘ఎలక్ట్రానిక్ మ్యూజిక్ రంగం లండన్‌లో బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. అంతేకాదు అన్ని దేశాలకూ వేగంగా విస్తరిస్తోంది కూడా. ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాలకూ తీసుకెళ్లాలన్న ఆలోచన ఈ జంట మెదిలో వచ్చింది. ‘ప్రధానంగా భారత్‌లో మ్యూజిక్, ఈవెంట్స్ పరిశ్రమవైపు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విభాగంలో అవకాశాలు బోలెడున్నాయి’ అని అంటారు సరా. ఆలోచన వచ్చిందే తడవుగా భారత్‌కు వచ్చి తమ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఈ జంటకు యూకేలో మంచి నెట్‌వర్క్ ఉంది. భారత్‌లో అంతా కొత్తే. కొన్ని నెలలపాటు ఇక్కడి మార్కెట్‌ను పరిశీలించాకే కార్యకలాపాలను ప్రారంభించారు. అది కూడా విభిన్న విభాగాల్లో ప్రవేశించాలన్నది వీరి ఆలోచన. ఎన్నో కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించుకున్నాం. వీటిలో ఆన్‌లైన్ మ్యూజిక్ మ్యాగజైన్ ఒకటి అని అంటారు సరా. సంగీత కార్యక్రమాల ద్వారా యువతకు దగ్గరయ్యారు. మొత్తానికి ప్యూమా, బిస్లెరి, అబ్సోలుట్, ఆస్ట్రియన్ కల్చరల్ ఫోరమ్, బుడ్వైజర్, ద లలిత్ వంటి ప్రముఖ కంపెనీలు వీరి క్లయింట్ల జాబితాలో చేరాయి.
సంగీతంతోపాటే ఇతర వ్యాపారాలు
న్యూఢిల్లీ కేంద్రంగా ఈ జంట తమ కార్యకలాపాలను కొన్నేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తోంది. పలు కార్యక్రమాలను సక్సెస్‌ఫుల్‌గా చేపట్టిన తర్వాత 2013లో సొంతంగా మాగ్నెటిక్ ఫీల్డ్స్ ఫెస్టివల్‌ను ఆవిష్కరించారు. మ్యూజిక్ ప్లేయర్, ఈవెంట్స్ గైడ్, న్యూస్ ఫీడ్‌తో కూడిన యాప్‌ను సైతం కంపెనీ అభివృద్ధి చేసింది. ఆపిల్ యాప్ స్టోర్‌లో దీనిని నిక్షిప్తం చేసింది. మ్యూజిక్, ఈవెంట్స్ కంపెనీగా వైల్డ్ సిటీ ఇతర ఆదాయ మార్గాల్లోకి సైతం ప్రవేశించింది. అవి ఏమంటే..
- ఆన్‌లైన్ ప్రకటనలు.
- నగర స్థాయితోపాటు అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు. డిస్కో, డైక్విరిస్, సదస్సుల నిర్వహణ. మాగ్నెటిక్ ఫీల్డ్స్ ఫెస్టివల్‌లో మూడు రోజులపాటు సంగీత కార్యక్రమాలు.
- ఎలక్ట్రానికా కళాకారులను కస్టమర్లతో కలిపేందుకు విటాల్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది.
- మ్యూజిక్ బ్రాండ్స్‌కు కన్సల్టెన్సీగా వ్యవహరిస్తోంది.
- సిటీ ప్రెస్ పేరుతో మ్యూజిక్ పరిశ్రమకు పబ్లిక్ రిలేషన్ సేవలందిస్తోంది.
- బోర్డర్ మూవ్‌మెంట్ ప్రాజెక్టు చేపట్టింది. దీని ద్వారా దక్షిణాసియా, జర్మనీ కళాకారులను ఒక వేదికపైకి తీసుకొస్తోంది. ఔత్సాహిక కళాకారులకు కొత్త వేదికను పరిచయం చేస్తోంది. పలు సంగీత కార్యక్రమాలను వినూత్న రీతిన నిర్వహిస్తోంది.
పౌరసత్వాన్ని బదిలీ చేసుకోవడం, వ్యాపారాన్ని ప్రారంభించడం భారత్‌లో క్లిష్టమే. సంగీత కార్యక్రమాల ద్వారానైనా పరిస్థితుల్లో వేగంగా మార్పు వస్తోందని అంటారు సరా. ఈవెంట్ ప్రణాళిక, నిర్వహణ అంతా వారం రోజుల్లో విజయవంతంగా పూర్తి చేయొచ్చని చెబుతున్నారు. అదే యూకేలో ఇందుకు భిన్నంగా ఉంటుందని, కార్యక్రమాలను మరింత ముందస్తుగా ప్రణాళికగా చేపట్టేందుకు అనుకూలమని అన్నారు.
వైల్డ్ సిటీ బాధ్యతను సరా, మున్‌బిర్‌లు పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. బలమైన నెట్‌వర్క్ కూడా వీరికి ఉంది. ‘ఇతరుల కోసం నా శ్రమను ఎన్నో ఏళ్లు ధారపోశాను. ఎంతో చేశాను. ఎంతో సాధించాను. అయితే తక్కువ మెచ్చుకోలు లభించింది. ఎంతో ఆశించాను. అయితే శ్రమను మించినది ఏదీ లేదు. కృతజ్ఞత లేని వ్యక్తుల కోసం శ్రమించే బదులు తన కోసమే కష్టపడితేనే ఫలితమని తెలిసిందని అంటారు సరా. భారత్‌లో పనిచేయడం, ముఖ్యంగా నూతన రంగంలో సేవలందించడం ఎంతో ప్రయోజనాన్ని ఇస్తోందని చెప్పారు. మేం ఇతరుల కంటే భిన్నంగా చేస్తున్నామని అనుకోవడం లేదు. ఎంతో మందిలో మేము కూడా ఉన్నాం. అవకాశాలు మాత్రం ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. భాగస్వామ్యాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి’ అని అన్నారు.