ఒక తమాషా సంఘటన ఆంత్రప్రెన్యూర్ గా మార్చింది!!
భవిష్యత్తు అంతా 3డి ప్రింటింగ్ దే అంటున్న మేఘా-
ఒక్క దారి తప్పితే వంద దారులుంటాయి.. ప్రయాణించే ధైర్యం వుండాలి. ముళ్ళకీ రాళ్ళకీ బెదిరిపోని ఆత్మస్థయిర్యం వుండాలి. గమ్యం చేరాలనే పట్టుదల వుండాలి. ఈ ధైర్యం, స్థయిర్యం .. మేఘాకు చాలానే వున్నాయి. అందుకే పాతికేళ్ళ వయసులో ఆమె పెళ్ళి చేసుకుని సెటిల్ అయిపోవాలనుకోలేదు. పారిశ్రామిక వేత్తగా సత్తా నిరూపించుకోవాలనుకుంది. అదికూడా దేశంలోనే ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న 3డి ప్రింటింగ్ లాంటి చాలెంజింగ్ రంగంలో..
మేఘాభాయా. 3డి ప్రింటింగ్ కంపెనీ ఇన్ స్టా ప్రో3డి ఫౌండర్ . చిన్నప్పటి నుంచే చాలా తెలివైన అమ్మాయి. ఆమె బాల్యమంతా నుంచి డిస్కవరీ ఛానెల్, ఎన్ సైక్లోపీడియాల మధ్యే గడిచింది. సైన్స్ అంటే మక్కువ పెరగడానికి తండ్రి కారణం. చిన్నప్పడు ఆయన ఎలక్ట్రానిక్ వస్తువలను రిపేర్ చేస్తుంటే గమనించేది. తండ్రితో పాటు ఫ్యాక్టరీకి వెళ్ళి మిషన్స్ ఎలా పనిచేస్తాయి.. వాటిని ఎలా రిపేర్ చేస్తారో గమనించేది. అలా ఆమెకి టెక్నాలజీ మీద ఇంట్రస్ట్ చిన్నప్పటి నుంచే పెరిగింది.
అయితే, ఆమె 3డి ప్రింటింగ్ అంత్రప్రెన్యూర్ గా మారడం వెనుక తమాషా కారణమే వుంది. ఓసారి సమ్మర్లో ఆమెకి ఒక చిన్న సమస్య ఎదురైంది. హైహీల్స్ వేసుకునే అమ్మాయిలకు హీల్స్ గడ్డిలో కూరుకుపోయేవి. నడవడం కష్టమయ్యేది. దీనికి ఆమె ఒక పరిష్కారం కనుక్కుంది. దానిపేరే హీల్ క్యాప్స్ . కానీ వీటిని తయారు చేయాలంటే పెట్టుబడి బాగా కావాలి. సంప్రదాయ తయారీ విధానం చాలా ఖరీదైన వ్యవహారం. అప్పుడే ఆమెకి 3డి ప్రింటింగ్ గురించి తెలిసింది. దాని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఆ పరిశోధన నుంచే ఇన్ స్టా ప్రో 3డి పుట్టింది.
3డి ప్రింటింగ్
ఇండియా లో ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్న టెక్నాలజీ 3డి ప్రింటింగ్. మనకి ఈ కాన్సెప్టే కొత్త. అందుకే ఆ టెక్నాలజీ ఆమెకి చాలా ఎగ్జయిటింగ్ గా అనిపించింది. అలీబాబా అద్భుత దీపాల్లాగా ఈ టెక్నాలజీతో ఏదైనా సాధ్యమే అనిపించింది. దేన్నైనా తయారు చేయొచ్చు. ఇదే ఎగ్జయిట్ మెంట్ తో 2015 మొదట్లో ఇన్స్ టా ప్రో ను మొదలుపెట్టారు. ఇప్పుడు ఆమె టీమ్ లో నలుగురు టెకీలు వున్నారు.
ఇన్ స్టా ప్రో అనేది ఒక సర్వీస్ బ్యూరో లాగా పనిచేస్తుందని మేఘా చెప్పారు. ప్రోడక్ట్ డిజైనర్లు, డెవలపర్లు, స్టూడెంట్స్,ఇంజనీర్స్ ఆర్కిటెక్ట్స్ బేకర్స్ , జువలర్స్ తో కలిసి పనిచేసే ఇన్ స్టా ప్రో .. కొత్త ప్రోటో టైప్స్ క్రియేట్ చేయడమే కాకుండా, నేరుగా డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ కూడా చేస్తుంది.
బిజినెస్ నుంచి టెక్ బిజినెస్ వరకు..
మేఘాకి సైన్స్ అంటేప్రాణం. గ్రాడ్యుయేషన్ లో ఆమె సబ్జెక్టు మారినా.. సైన్స్ మీద ఆసక్తి మాత్రం మారలేదు. 2012 లో లాన్సెస్టర్ యూనివర్శిటీ నుంచి బిజినెస్ స్టడీస్ లో డిగ్రీ తీసుకున్నాక కొన్నాళ్ళు కుటుంబ వ్యాపారంపై దృష్టి పెట్టారు. ఎల్ఇడి లైటింగ్, సైనేజ్ ల వ్యాపారంలో మూడేళ్ళ అనుభవం తర్వాత సొంతంగా వ్యాపారం లోకి దిగారు. తండ్రితీర్చి దిద్దిన వ్యాపారంలో ఆయన కూతురుగా తాను పెద్దగా చేయగలిగిందేమీ లేదని భావించింది. అందుకే తన శక్తి సామర్థ్యాలు తెలియాలంటే, స్వయంగా అంత్రప్రెన్యూర్ గా మారాలనుకుంది.
అయితే, 24 ఏళ్ళ వయసులో పెళ్ళి కి బదులు వ్యాపారం చేస్తానని చెప్పి తల్లిదండ్రులను ఒప్పించడం చాలా కష్టం . అందుకే వారికిఅర్థమయ్యేలా చెప్పింది. దాంతో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు వాళ్ల సపోర్టుతోనే కెరీర్ నడుస్తోంది.
ఇన్ స్టా ప్రో 3డి
3డి ప్రింటంగ్ కి సంబంధించి కనీస వనరులు కల్పించాలి. శక్తివంతమైన ఈ టెక్నాలజీ ద్వారా కొత్త వస్తువుల ఆవిష్కరణకి, డిజైన్ కి, తయారీ కి ఉపయోగపడే ఈ శక్తి వంతమైన టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తేవాలి.. ఇదే తన ఆశయమని మేఘా చెప్తారు. ఇప్పటికీ కూలర్ మాస్టర్, ఎబిబి సోలార్, మెక్ కేన్ హెల్త్, సిఐబిఎఆర్ టి లాంటి మల్టీ నేషనల్ కార్పొరేషన్లతో, ప్రభుత్వ సంస్థలతోకలిసి ఇన్ స్టా ప్రో పనిచేసింది. కేవలం ఈ సంస్థలతో కలిసి పనిచేయడమే కాకుండా స్వయంగా కూడా ఇన్ స్టా అనేక ప్రయోగాలు చేసింది.
అప్పుడే పుట్టిన పిల్లల చేతి ముద్రలని, పాద ముద్రలని పేపర్ పై ప్రింట్ అవుట్లు తీసి వాటిని భద్రపరుచుకునేందుకు వీలుగా 3డి ప్రింట్ చేసి ఇస్తారు. ఇండియాలో ఇదే మొదటిది. నిజానికి ఇలాంటివే చాలా చెయ్యచ్చు. కానీ 3 డి ప్రింటింగ్ ఇండియాలో ఇంకా ఆ దశకి చేరుకోలేదు. డిఫెన్స్, ఏరో స్పేస్, ఆటోమొబైల్, జెవలరీ రంగాల్లో ఈ 3డి ప్రింటింగ్ ను బాగానే ఉపయోగిస్తున్నప్పటికీ, వ్యక్తిగత అవసరాలకోసం వాడుకోవడం ఇంకా మొదలవలేదు.
సవాళ్ళు
అంత్రప్రెన్యూర్ షిప్ అంటేనే సవాళ్ల మయం. అనేక సమస్యలుంటాయి.. వాటిని ఎదుర్కోవాలి.. పరిష్కరించాలి. అధిగమించాలి. చేస్తున్న పనిలో ముందుకు ఎలా ఎదగాలి.. ఇప్పుడు చేస్తున్న పనిని ఎలా సమర్ధంగా చేయాలి.. మంచి టీమ్ ను ఎలా నిర్మించుకోవాలి.. ఇవన్నీ సవాళ్ళే. ఇక మహిళా అంత్రప్రెన్యూర్ అంటే ఇంకా ఎక్కువే వుంటాయి. అక్కడక్కడా కొందరు డిస్కరేజ్ చేసినప్పటికీ ప్రతిభను గుర్తించిన వారే ఎక్కువని గర్వంగా చెప్తారు మేఘా.
ఈ సవాళ్ళ నుంచీ, సమస్య ల నుంచి ఆమె నేర్చుకున్న పాఠం ఒక్కటే. ఏదో తప్పు జరిగిపోతోందని కంగారు పడడం కంటే, సవ్యంగా జరుగుతున్న వాటిని చూసి సంతోష పడటమే మంచిది. ఆమెకు అనుభవం నేర్పినపాఠం ఇదే.
టెక్నాలజీ లో మహిళలు
ఒక్క టెక్నాలజీలోనే కాదు.. మొత్తంగా ఏ రంగం తీసుకున్నా.. మహిళలకు సరైన అవకాశాలు రావట్లేదనేది మేఘా అభిప్రాయం. అనేక సామాజిక కారణాల వల్ల మహిళల్లో వున్న శక్తిని గుర్తించడానికి సమాజం సిద్ధంగా లేదని ఆమె అంటారు.
మొత్తం మీద మహిళా అంత్రప్రెన్యూర్ గా నిలదొక్కుకోవడం అంత తేలిక కాదని ఆమెకి కూడా తెలుసు. ప్రతి సందర్భంలోనూ తెలివితేటల్ని, సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ వుండాలి. అయితే, ఈ సవాళ్ళన్నీ తన మంచికే అనుకుంటుంది మేఘా. ప్రతి సమస్య కొత్త పరిష్కారాన్ని చూపిస్తుంది. మరింత సమర్థంగా పరిష్కరించుకునే మార్గాన్ని చూపిస్తుందని ఆమె విశ్వాసం.
అయిదేళ్ళ అనుభవం
మొత్తమ్మీద ఈ టెక్నాలజీలో భవిష్యత్ ఆమెకి ఆశాజనకంగా వుంది. ఇదేదో ఇవాళొచ్చి రేపు వెళ్ళిపోయే ఫ్యాషన్ కాదని తనకి అర్థమైంది.
ఇప్పటికీ ఇంకా పైపైనే చూశాం. ఈ టెక్నాలజీ చేయగలిగే అద్భుతాల గురించి తెలుసుకోవాలని ఆమె అంటారు. కొద్ది రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక పీసీ వున్నట్టే, ఒక 3డి ప్రింటర్ కూడా వుంటుందని ఆమె అంచనా. భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇన్ స్టాప్రో ను ఒక మంచి సర్వీస్ బ్యూరోగా తీర్చి దిద్దుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నూతన ఆవిష్కరణల దిశగా డిజైనర్లు, ఇన్నొవేటర్లను ప్రోత్సహించే సంస్థగా తీర్చిదిద్దుతామని మేఘా దీమా వ్యక్తం చేస్తున్నారు.