అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించే హెడ్ ఫోన్లను రూపొందించింది ఓ ఆంధ్రుడే !
అమెరికన్ ఆర్మీ ఉపయోగించే బ్లాక్ హాక్ హెలికాఫ్టర్లు, న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడర్లు, ఎన్నో కాల్ సెంటర్లు, వేలాది మంది ఎగ్జిక్యూటివ్‌లు, టాప్ మోస్ట్ బ్యాంకులు.. అన్నీ ఆయన కంపెనీ ప్రోడక్టులు ఉపయోగిస్తాయి. అవిలేకపోతే వాళ్లకు పొద్దు గడవదు. వ్యాపారాలు సాగవు. ఇంతవరకూ ప్రపంచంలో అంతటి టెక్నాలజీని ఉపయోగించి రూపొందిన ప్రోడక్టే లేదంటే అతిశయోక్తికాదు. అదే 'ది బూమ్'. వాయిస్ రికగ్నిషన్, నాయిస్ క్యాన్సిలేషన్‌లో ప్రపంచంలోనే అతిగొప్ప టెక్నాలజీ. దాని వెనుకుంది వ్యక్తి ఓ తెలుగువ్యక్తి, అందునా హైదరాబాదీయే అంటే మనకు నిజంగా గర్వకారణమే.
30 ఏళ్ల క్రితమే హైదరాబాద్ నుంచి సిలికాన్ వ్యాలీ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు ది బూమ్ వ్యవస్థపాపకులు ఆదిత్య పడాల. ఈయన స్థాపించిన కంపెనీ నాయిస్ కాన్సిలేషన్‌తో ఓ చరిత్రనే సృష్టించింది. బయట ఎన్ని రణగొణధ్వనులు ఉన్నా.. అవి అవతలి వాళ్లకు వినిపించకుండా కేవలం మాటలు మాత్రమే వినిపించేలా రూపొందిన వ్యవస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. వివిధ దేశాలు ది బూమ్ ప్రోడక్టులు కొనుగోలు చేస్తున్నాయి. చాలా విభిన్నమైన రంగంలో ఉన్న ఆదిత్యను ఈ మధ్యే కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియా ప్రోగ్రాంకు ఆహ్వానించింది. ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అయిన సిలికాన్ వ్యాలీ నిపుణుల్లో ఆదిత్య కూడా ఒకరు. ఓ కార్యక్రమం కోసం హైదరాబాద్ వచ్చిన ఆయనను యువర్ స్టోరీ పలుకరించింది. ఎన్నో ఆసక్తికర విషయాలతో నిండిన ఆ స్టోరీని చదివి మీరూ స్ఫూర్తి పొందండి.
ఆదిత్య పడాల(కోటు వేసుకున్న వ్యక్తి)
ఆదిత్య పడాల.. రామాంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించి ఉస్మానియాలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఆయనకు సెయిలింగ్‌లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. రెగెట్టాలో భారతదేశం తరపున జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో కూడా ప్రాతినిధ్యం వహించారు. ఆదిత్య తండ్రి వింగ్ కమాండర్ పిఎం మోహన్ రావు. ఆయన ఫ్లైట్ ఇంజనీర్. కమ్యూనికేషన్స్ స్క్వాడ్రన్‌లో ఉన్న ఆయన 1960ల్లో అప్పటి ప్రధాన మంత్రులు లాల్ బహదూర్ శాస్త్రి, జాకీర్ హుస్సేన్, నెహ్రూ లాంటి వాళ్లను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన విశిష్ట వ్యక్తి. తల్లి డాక్టర్. తాత, ముత్తాల నుంచి కుటుంబ సభ్యుల్లో అందరూ ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లే.
యూఎస్‌లో మాస్టర్స్
1983ల్లోనే ఆయన ఎంఎస్ చేసేందుకు యూఎస్ వెళ్లారు. అది పూర్తయ్యాక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌కు చెందిన టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్లో మొదటి ఉద్యోగం చేశారు. ఆ తర్వాత బోస్టన్‌లో ఓ స్టార్టప్‌లో కొద్దికాలం పనిచేశారు. సాయంత్రం పూట బిజినెస్ స్కూల్‌కు వెళ్లి మేనేజ్మెంట్ పాఠాలు కూడా నేర్చుకున్నారు. అటు ఇంజనీరింగ్‌పై పట్టు, ఇటు నిర్వాహణపై అవగాహన సంపాదించడంతో ఓ రీసెర్చ్ కంపెనీలో మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఈ క్రమంలోనే ఓ ఇన్వెస్టర్‌తో పరిచయం ఏర్పడింది. అదే 1995లో 'ఊమ్ వాయిస్' కంపెనీ ఏర్పాటుకు దారితీసింది.
నాయిస్ కాన్సిలేషన్ అనేది ఓ విభిన్నమైన రంగం. అప్పటి వరకూ కొన్ని కంపెనీలు దీనిపై పనిచేస్తున్నా పెద్దగా విజయం సాధించిన దాఖలాలు లేవు. అందుకే స్పీచ్ రికగ్నిషన్, నాయిస్ కాన్సిలేషన్లో ఊహించనంత మార్కెట్ ఉందని ఆదిత్యకు అర్థమైంది. ఆ దిశగా అడుగులు వేసి కొంత మంది నిపుణులతో కలిసి టెక్నాలజీ సహా కొన్ని పరికరాల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ సమ్మిళితమైన ఉత్పత్తులు సిద్ధం చేశారు.
స్పష్టతతో వాయిస్ ఎలా సాధ్యం ?
కంపెనీ ఏర్పాటయ్యాక వీళ్ల దృష్టి వాల్ స్ట్రీట్‌పై మళ్లింది. వందలాది మంది ట్రేడర్లు, ఫోన్ కాల్స్, షేర్ల అమ్మకాలు - కొనుగోళ్లు, గందరగోళం, అరుపులు - కేకలు.. అదీ అక్కడి సాధారణ వాతావరణం. ట్రేడర్లు ఫోన్లలో కస్టమర్లతో మాట్లాడుతుంటారే కానీ.. ఎవరికీ ఏదీ అర్థం కాని పరిస్థితి. అందుకే తమ ప్రోడక్ట్ ఇక్కడ క్లిక్ అయితే ఇక తిరుగు ఉండదని ఊమ్ వాయిస్ టీం ఓ నిర్ధారణకు వచ్చింది. అంతే తమ టెక్నాలజీని కొంత మంది ట్రేడర్లు, స్టాక్ బ్రోకర్లపై పరీక్షించారు. అద్భుతం.. !
అవతలి వాళ్లు మాట్లాడేది వీళ్లకు... వీళ్లు మాట్లాడేది అవతలి వాళ్లకు చాలా స్పష్టంగా వినిపించేది. దీంతో అందరిలోనూ ఆశ్చర్యం. ఎలా ఇది సాధ్యమైందీ అని. అంతే ఒక్కసారిగా ఇదో విప్లవంలా మారింది. ప్రతీ ఒక్కరూ ఈ పేటెంటెడ్ టెక్నాలజీ కోసం క్యూ కట్టారు. మొట్టమొదట గోల్డ్మ్యాన్శాక్స్ పెద్ద క్లైంట్. వస్తూ వస్తూనే.. మేజర్ డీల్ రావడంతో.. మెరిల్లించ్, క్రెడిట్ సూయిస్, యూబిఎస్ సహా పెద్ద పెద్ద బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థలన్నీ ఊమ్ వాయిస్‌కు బ్రహ్మరథం పట్టాయి.
''మొదట్లో ఫోన్ రిసీవర్కే ఓ పెద్ద రూపాయి బిళ్లంత సైజు ఉండే ఓ పరికరాన్ని అమర్చాం. మేం అనుకున్న దానికంటే ఆ పరికరం చుట్టుపక్కల ఉండే శబ్దాన్నంతటినీ తగ్గించేసింది. మన మాట అవతలి వాళ్లకు స్పష్టంగా వినిపించేది. మొదట్లో వాయిస్ ఫిల్టర్లు వాడాం. ఇతర కంపెనీలకు చెందిన, అప్పటికే మార్కెట్లో ఉన్న వాటిని కూడా పరీక్షించి చూశాం. చివరకు హార్డ్ వేర్, సాఫ్ట్వేర్ కలయికతో బూమ్ హెడ్ ఫోన్స్ సిద్ధమయ్యాయి '' అంటారు ఆదిత్య.
అయితే ఇదేదో టెలిఫోన్లు అమ్మినట్టో.. లేకపోతే.. ఏదో ఒక ప్రోడక్ట్ అమ్మినట్టో జరిగిన వ్యవహారం కాదు. అప్పట్లోనే ఒక్కో కంపెనీ ఈ టెక్నాలజీ కోసం 1 మిలియన్ డాలర్ల వరకూ ఖర్చు చేశాయి. పట్టుమని పది మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు కూడా ఈ స్థాయిలో భారీ మొత్తం చెల్లించి ఊమ్ వాయిస్ కస్టమర్లు అయిపోయారు. ఒక్కసారిగా కంపెనీ పేరు మారుమోగిపోయింది.
వివిధ కంపెనీలకు లైసెన్సింగ్ పద్ధతిని టెక్నాలజీని అమ్మేద్దామని మొదట్లో అనుకున్నా.. దాని వల్ల దీర్ఘకాలంలో ఫలితం ఉండబోదని ఆదిత్య అర్థం చేసుకున్నారు. అందుకే ప్రోడక్ట్స్ తయారు చేసి కస్టమర్లకు అమ్మాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో యాపిల్ కోసం స్టీవ్ జాబ్స్ ఎంచుకున్న ఇండస్ట్రియల్ డిజైనింగ్ కంపెనీనే వీళ్లూ ఎంచుకున్నారు. కొద్దికాలానికి బూమ్ పేరుతో హెడ్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఇన్వెస్ట్మెంట్ సంబంధ కంపెనీలకే కాకుండా కాల్ సెంటర్లు కూడా ఈ టెక్నాలజీపై అమితాసక్తిని కనబర్చాయి. ఇంటెల్ సంస్థ తమ హై ఎండ్ సేల్స్ గ్రూప్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ లొకేషన్లలో బూమ్ క్వైట్ను ఉపయోగిస్తోంది. సాధారణ కస్టమర్లకు కూడా ఈ పరికరంపై ఆసక్తి పెరగడంతో 2003 ప్రాంతంలోనే ఈ కామర్స్‌కు తెరతీశారు. రిటైల్ కస్టమర్ల నుంచి అనూహ్య మద్దతు రావడంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.
బతికిపోయారు !
ఏ స్టార్టప్‌కు అయినా ఎదురుదెబ్బలు లేనిదే వృద్ధి ఉండదు. అలాంటి ఊహించని ఓ మలుపే ఊమ్ వాయిస్‌కు జరిగింది. సెప్టెంబర్ 11,2001లో న్యూయార్క్ ట్విన్ టవర్స్ పేల్చివేత అటు కంపెనీకి ఇటు వ్యక్తిగతంగా కూడా ఆదిత్యకు పెద్ద షాక్ ఇచ్చాయి. ఆయన కూడా తృటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. క్లైంట్లకు ప్రజెంటేషన్ ఇచ్చేందుకు వెళ్లిన ఇద్దరు ఉద్యోగులు ఆ ప్రమాదంలో చనిపోయారు. ఓ ఉద్యోగి రావడం కొద్దిగా ఆలస్యం కావడం వల్ల లోపలికి వెళ్లడం ఆలస్యమైంది కానీ.. లేకపోతే.. ఆయన కూడా ఈ మీటింగ్‌కు వెళ్లాల్సి ఉంది. వాళ్లు ఎంట్రన్స్ దగ్గర్లో ఉన్నప్పుడే ప్రమాదం జరగడంతో బతికిపోయారు.
ఉద్యోగులను కోల్పోయి కుంగిపోతున్నప్పుడే వ్యాపారం కూడా మెల్లిగా తగ్గడం మొదలైంది. స్టాక్ మార్కెట్లు కుదేలైపోవడంతో వాల్ స్ట్రీట్ జోరు తగ్గి, వ్యాపారం మూతబడే స్థాయికి వచ్చింది.
''నాతో ఎంతోకాలం కలసి పనిచేసిన ఉద్యోగులను కోల్పోవడంతో చాలా రోజులు కుంగిపోయాను. మృత్యువును అంత దగ్గరి నుంచి చూడడంతో వణికిపోయిన పరిస్థితి. తేరుకునేందుకు నాకు చాలా కాలమే పట్టింది. ఈ లోపే అమెరికాలో పరిస్థితులు కూడా మెల్లిగా క్షీణిస్తూ వచ్చాయి. వ్యాపారం కూడా బాగా తగ్గుతూ వచ్చింది. నా జీవితంలో అదే చాలా కఠినమైన సమయం''
అప్పుడు పుట్టిన ఆలోచనే ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు పనికొచ్చింది
ఒకే రంగానికి పరిమితం కావడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే.. నిలబడడం కష్టమని తెలిసొచ్చింది. ఇదే టెక్నాలజీని ఆర్మీకి ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మొదలైంది. అనుమతులు పొందిన తర్వాత ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానాలైన బ్లాక్ హాక్‌పై ప్రయోగాలు చేశారు. ఊమ్ కోబ్రా మైక్‌ను ఉపయోగించేలా చేశారు. అంతటి రెక్కల హోరులో కూడా వాయిస్ క్లారిటీ చాలా మెరుగ్గా ఉంది. వీళ్లు ఏం చెబ్తున్నారో.. అక్కడి కంట్రోల్ రూమ్‌కు అర్థమయ్యేది.
హెలికాఫ్టర్ అంబులెన్స్‌లో కొన్ని సార్లు డాక్టర్లతో సంభాషించాల్సి వచ్చినప్పుడు.. వాళ్లు ఏం చెబ్తున్నారో అర్థం కాక హెలికాఫ్టర్ ఆపేసిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు బూమ్ హెడ్ ఫోన్స్ వాడకం మొదలుపెట్టాక ఆర్మీకి ఆ అవసరం రాలేదంటారు ఆదిత్య.
అలా ఒక్కో రంగానికీ విస్తరిస్తూ.. ఏవియేషన్, కాల్ సెంటర్, ట్రేడింగ్, ఇండస్ట్రీస్, ఇండివిడ్యుయల్స్‌కు ఈ ప్రోడక్ట్‌ను ఎంతో చేరువ చేశారు. ప్రస్తుతం ఊమ్ వాయిస్‌లో 100 కంటే తక్కువ మంది ఉద్యోగులే పనిచేస్తున్నారు. కోర్ టీమ్ మాత్రమే హెడ్ క్వార్టర్స్‌లో ఉంటారు. కొన్ని కీలక భాగాల ఉత్పత్తి మినహా.. మిగిలిన విడిభాగాల తయారీ అంతా పెద్ద కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలతో ఔట్సోర్సింగ్ చేస్తున్నారు. స్టార్టప్ ఇండియాలో భాగంగా కేంద్రానికి సలహాలు ఇచ్చేందుకు వచ్చిన బృందంలో ఉన్న ఆయన.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విడిభాగాల ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చూస్తున్నారు. 33 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం విడిచి వెళ్లినా.. ఇక్కడి మట్టిపై అభిమానం మాత్రం అలానే ఉందంటూ ఉద్వేగానికి లోనవుతారు ఆదిత్య.
ప్రైవేట్ సంస్థ కావడంతో ఫైనాన్షియల్స్ వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడని ఆదిత్య.. తమ కంపెనీ లాభాల్లోనే ఉందని వివరించారు. సాధారణ కార్పొరేట్ ఆఫీసుల్లా కాకుండా 10 ఎకరాల సువిశాల వైన్ యార్డ్‌లో ఆఫీసును నిర్మించారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఎలక్ట్రిక్ కార్లు కొనేలా చేస్తున్నారు. తాము ఉపయోగించే విద్యుత్ అంతటినీ తామే సోలార్ ద్వారా తయారు చేసుకునేందుకు ఐదేళ్ల కాలపరిమితిని విధించుకున్నారు.
స్టార్టప్స్‌కు నేను చెప్పేది ఏంటంటే ..
ఏదైనా ఓ స్టార్టప్ మొదలుపెట్టాలని అనుకున్నప్పుడు దృష్టంతా దానిపైనే నిలపండి.
మనకు, మన ఆలోచనకు, మన కంపెనీకి ఇన్వెస్టర్ విలువ కట్టకూడదు, కస్టమర్ మనకు ముఖ్యం.
మీ ప్రోడక్ట్‌లో అంత దమ్ముంటే కస్టమర్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు
నిష్ సెగ్మెంట్ (విభిన్నమైన, చాలా తక్కువ మంది ఉన్న రంగం)లో మీ ప్రయోగాలు చేసి కస్టమర్లను మెప్పించండి.
కస్టమర్ల సంఖ్య తక్కువే ఉండొచ్చు, కానీ వాళ్లకు మీ ప్రోడక్ట్‌లో అసాధారణమైన విలువ ఉందని గుర్తించేలా చేయండి.
ఒక వేళ మీరు చేసిన విజయవంతమైతే.. అదే ఫార్ములాతో విస్తరించండి.
ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీబడీ అనే కాన్సెప్ట్ వద్దు, మీ ప్రత్యేకత ఏంటో చూపించండి.
మీకు ఇన్వెస్ట్మెంట్ అవసరం లేకపోతే, నిధుల సమీకరణ అవసరంలేదు.
ఫండింగ్ వస్తేనే స్టార్టప్ విజయవంతమైందని అనుకోవడం పొరపాటు.