ఇంటర్‌కే వెబ్ డిజైనింగ్, డిగ్రీకి యాప్స్..డిజిటల్ రంగంలో 22 ఏళ్ళకే సూపర్ సక్సెస్
అతని వయసు కుర్రాళ్లు సినిమాలు, షికార్లతో గడుపుతూ ఉంటారు. వీడియో గేమ్స్‌లో బిజీగా ఉంటారు. కానీ పద్నాలుగేళ్ళ ఇషాన్ అప్పట్లో వర్డ్ ప్రెస్‌తో ఆడుకున్నాడు. అందులో వెబ్ డిజైన్స్‌తో ఆడుకున్నాడు. ఈ ఆటే అతనికి కెరీర్‌గా మలుపు తిరిగింది. 2008లో మొదటి వెబ్సైట్ డిజైన్ 3,500 రూపాయలకు చేసి పెట్టాడు. అప్పటికి చాలా కంపెనీలకు సొంత వెబ్ సైట్లు ఉండేవి కావు. వారి బిజినెస్ కార్డ్ మీద వెబ్ అడ్రస్ చూసుకోవాలనే కోరిక మాత్రం వుండేది. ఇషాన్‌కు 21 ఏళ్ళు వచ్చే సరికి ఆయన తన సొంత కంపెనీ యాస్ప్రికాట్ (ASPRICOT) మొదలు పెట్టాడు. ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఇండోర్‌లో మొదలైన ఈ సంస్థకు ఈ రోజు 36 దేశాల్లో బిజినెస్‌లు వున్నాయి. హాలీవుడ్లో ఆఫీస్ వుంది. 20లక్షల డాలర్ల వాల్యుయేషన్ వుంది. రాజీలేని నాణ్యతా ప్రమాణాలతో వెబ్ సైట్ డెవలపింగ్, డిజైనింగ్ ఇండస్ట్రీ రూపు రేఖల్నే మార్చేస్తోంది.. యాస్ప్రికాట్.
డిజిటల్ బిజినెస్‌లో యాస్ప్రికాట్ది ఒక విభిన్న శైలి. ముఖ్యంగా వెబ్ డిజైనింగ్‌లో కాపీ, పేస్ట్ ధోరణికి ఈ సంస్థ పూర్తిగా వ్యతిరేకం. అసలు చాలా మంది క్లయింట్లకు ఊహలో కూడా లేని ఫీచర్స్‌ను ఇంటిగ్రేట్ చేస్తూ, పూర్తి స్థాయిలో ఓ కొత్త వెబ్‌సైట్‌ను డిజైన్ చేసి, ఆరు రోజుల్లో డెలివర్ చేయడం వీళ్ల ప్రత్యేకత. అవి కూడా రెస్పాన్సివ్ వెబ్ సైట్స్‌ను మాత్రమే ఇప్పటి వరకు డిజైన్ చేసారు. “ ఉదాహరణకు మేం తయారు చేసిన వెబ్‌సైట్‌ను అనేక డివైసెస్‌లో పరీక్షిస్తాం. W3C ప్రకారం ఎలాంటి ఎర్రర్స్ లేకుండా చూసుకుంటాం. డిజైన్ చేసిన ప్రతి వెబ్‌సైట్‌కూ గూగుల్ పేజీ స్పీడ్ టెస్ట్ స్కోర్ 80కి పైనే వుండాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఒకసారి చేసిన డిజైన్‌ను మరో క్లయింట్‌కి ఎట్టి పరిస్థితుల్లో డూప్లికేట్ చేయం” అని చెప్పారు ఇషాన్.
ఇక రెండో విషయం.. యాస్ప్రికాట్కి వున్న అద్భుతమైన సిస్టమ్స్. “ చాలా వరకు స్టార్టప్స్ ప్రాసెస్, సిస్టమ్ బిల్డ్ చేసుకోవడం మీద ఎక్కువగా దృష్టి పెట్టవు. మొదట్లో నేను కూడా ఇలాంటి పొరపాటే చేసాను. అయితే, ఈ పొరపాటును వెంటనే గ్రహించి.. అద్భుతమైన ప్రాసెసస్, ఆటోమేషన్ టెక్నిక్స్‌ను బిల్డ్ చేసాను. ఫలితంగా ఇప్పుడు పనిలో ఒక స్టాండర్డైజేషన్ వచ్చింది. ” అంటారు ఇషాన్.
సేల్స్, సపోర్ట్ ప్రాసెస్‌లో కూడా ఎక్కడా లోపాలకు అవకాశం లేకుండా తీర్చి దిద్దారు. ఒక మెయిల్‌కి 15 నిముషాల్లోగా సేల్స్ మెన్ ప్రతిస్పందించకపోతే, అతనికి పెనాల్టీ వుంటుంది.
ఇక యాస్ప్రికాట్ మూడో ప్రత్యేకత.. ఈ కంపెనీలో 60 శాతం సిబ్బంది మహిళలే. మహిళలే కీలకమైన పొజిషన్స్‌లో కూడా వున్నారు. ఈ నిష్పత్తిని మార్చాలని కూడా యాజమాన్యం అనుకోవడం లేదు.
ఇషాన్ వ్యాస్ తండ్రికి కొంచెం ఆలస్యంగా వివాహమైంది. దాని వల్ల ఇషాన్ టీనేజ్‌కి వచ్చేసరికే ఆయన తండ్రి రిటైర్ అయిపోయారు. అయితే, చిన్నప్పటి నుంచి ఇషాన్‌ను స్వతంత్రంగా బాధ్యతాయుతంగానే పెంచారు.
“ అలాగని నేను క్లాస్ రూమ్‌లో బుద్ధిగా కూర్చుని చదువుకునే రకం కాదు. వ్యాపారం ధ్యాసలో పడి టెన్త్‌లో లెక్కల పరీక్షలో తప్పాను. ఇంటర్మీడియట్లో కూడా ఓ కంపెనీలో పదకొండు నెలలు పనిచేసాను. ఆ తర్వాత బెంగళూరు వెళ్ళి బిబిఎమ్ పూర్తి చేసాను ” అని తన కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తారు ఇషాన్.
బెంగళూరులో వుండగానే, ఒక ప్రముఖ న్యూస్ పోర్టల్‌లో పని చేసాడు ఇషాన్. ఈ అనుభవమే అతనిని తన సొంత స్టార్టప్ నెలకొల్పేలా ప్రోత్సహించింది. ఒక లాప్ టాప్, ఒక డెస్క్ టాప్ ఇద్దరు మిత్రులను వెంటేసుకుని, జేబులో రూపాయి లేకుండా, 2013 జులైలో యాస్ప్రికాట్ను నెలకొల్పారు. 20 రోజులు గడిచేసరికి అతని చేతిలో లక్ష రూపాయల ఆర్డర్లు వున్నాయి.
“ మా కుటుంబాల్లో వ్యాపారమంటేనే వద్దంటారు. అలాంటిది నా మీద నమ్మకం వుంచిన మా తల్లిదండ్రులకు నేను ఎంతో రుణపడి వుండాలి ”అంటారు ఇషాన్.
ఇంట్లో ఒప్పించినా బయట ఒప్పించడం కష్టమే అయింది. అందరూ అతని వయసు చూసి ఇంత చిన్న కుర్రాడి దగ్గర మనం ఉద్యోగం చేరడమేంటనుకునే వారు. తన బిజినెస్ మీద తనకు నమ్మకం వుందనీ, వారందరికీ క్రమం తప్పకుండా జీతాలు చెల్లించగలనని ఒప్పించడం చాలా కష్టమయ్యేది.
చివరికి ఈ 22 ఏళ్ళ కుర్రాడు పెట్టిన కంపనీ ఇప్పుడు, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్, అపెరల్స్, మొబైల్ యాప్స్ ఫర్ స్టార్టప్స్ లాంటి రంగాల్లో డిజిటల్ బిజినెస్‌కు కేరాఫ్ అడ్రస్. సిస్కో, ఐబిఎం, దుబాయ్ ఏర్ షో లాంటి ప్రతిష్టాత్మక వెబ్ సైట్లు ఇప్పుడు ఇషాన్ కంపెనీ క్లయింట్లు. ఇండోర్‌లో ప్రధాన కార్యాలయం వున్న ఈ కంపెనీకి విదేశీ క్లయింట్లకు సేవలందించేందుకు హాలీవుడ్లో కూడా ఒక ఆఫీస్ వుంది. ప్రస్తుతం ఈ స్టార్టప్ పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్లతో జరిపిన చర్చల్లో సంస్థ విలువ 20లక్షల డాలర్లని తేలింది.
రేపటి ఆశలు
ఇన్నోవేషన్ విషయానికొస్తే, యాస్ప్రికాట్ మొదటి నుంచి కన్వర్జన్స్ దారిలోనే నడుస్తోంది. కొత్త ప్లాట్‌ఫామ్స్‌ను అందరికంటే ముందే అడాప్ట్ చేసుకోవడం కంపెనీ ఫిలాసఫీ. “ ఇప్పడిప్పుడే వేరబుల్స్‌లోకి ప్రవేశిస్తున్నాం. యాపిల్ వాచ్ యాప్స్‌తో పని మొదలు పెట్టాం ” అని భవిష్యత్ లక్ష్యాలను వివరించారు ఇషాన్.
ప్రస్తుతం ఈ కంపెనీలో 22మంది పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా వంద మందికి పెంచాలనుకుంటున్నారు. వచ్చే సంవత్సరానికి వెయ్యి మందికి చేరుకుంటామని ఇషాన్ ధీమాగా ఉన్నారు. ఇండియాలోనే అతి పెద్ద డిజటల్ బిజినెస్ సర్వీస్ కంపెనీగా యాస్ప్రికాట్ను తీర్చిదిద్దాలని ఇషాన్ ప్రయత్నం.