చదివింది పదో తరగతి.. రాసేవి ఇంగ్లీష్ నవలలు..ఓ సాధారణ గృహిణి విజయగాథ
Wednesday November 18, 2015 , 4 min Read
ఎవరన్నారు ? ఆంగ్లంలో మాట్లాడాలంటే అవధానం చేసినంత కష్టమని! హేమ మాచెర్లను చూస్తే ఆ అభిప్రాయాన్ని అర్జెంటుగా మార్చుకుంటారు! పదో తరగతి! అది కూడా తెలుగు మీడియం! అలాంటి స్టేజీ నుంచి ఏకంగా ఇంగ్లీష్‌లో నవలలు రాసి బ్రిటిషర్ల మనసులు గెలుచుకునే స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదు! అంతర్జాతీయ అవార్డులు సొంతం అంతకంటే గొప్పదనం మరొకటి లేదు. వరంగల్ నుంచి లండన్ వరకు సాగిన ఓ సాధారణ మధ్యతరగతి గృహిణి ఇన్సిపిరేషన్ స్టోరీ ఇది!
ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా తెలుసుగా! అందులో శ్రీదేవి ఒక మిడిల్ క్లాస్ హౌజ్ వైఫ్. ఫ్యామిలీతో కలిసి ముంబైలో ఉంటుంది. వంటలు వండటంలో ఆమె ఎక్స్పర్ట్. స్మాల్ హోం ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమెకి సరిగా ఇంగ్లీష్ రాదు. పిల్లలు, భర్త ఆమెను ఆటపట్టిస్తుంటారు. అనుకోకుండా శ్రీదేవి ఒకసారి న్యూయార్క్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఇంగ్లీష్ రాక చాలా ఇబ్బంది పడుతుంది. చుట్టూ ఉన్నవాళ్లంతా అవమానిస్తారు. అవహేళన చేస్తారు. అప్పుడు శ్రీదేవి కసితో ఇంగ్లీష్ ఎలాగైనా నేర్చుకోవాలనుకుంటుంది. ఛాలెంజ్ గా తీసుకుని స్పీకింగ్ కోర్సులో జాయిన్ అవుతుంది. కట్ చస్తే.. జస్ట్ నెల రోజుల్లోనే ఇంగ్లీష్ భాష అంతు చూస్తుంది.
సరిగ్గా ఇలాంటి కథే- హేమ నిజజీవితంలోనూ జరిగింది! పూర్తిపేరు హేమ మాచెర్ల. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలో చిన్న పల్లెటూరు. పెద్దగా చదువుకోలేదు. గ్రామీణ ప్రాంతం. పైగా తెలుగు మీడియం చదువులు. ఆ రోజుల్లో ఇంగ్లీష్అంటే అదేదో పెద్ద బ్రహ్మపదార్ధం. చెప్పేవాళ్లు లేక, నేర్చుకోవాల్సిన అవసరం రాక, ఆంగ్రేజీని అటకమీదికి ఎక్కించేసింది! కానీ ఊహించలేకపోయింది. లండన్‌లో పనిచేసే భర్త దొరుకుతాడని! ఆయనతోపాటు అక్కడికి వెళ్లాల్సి వుంటుందని! ఆ రోజు రానే వచ్చింది! భయంభయంగానే ఫ్లైట్ ఎక్కింది! ఇంగ్లీష్ ముక్క రాదు. కనీసం ఎయిర్ హోస్టెస్‌ని ఏమైనా అడగాలన్నా ఇబ్బందే! పెద్దబావ కాయితం మీద కొన్ని పదాలు రాసిచ్చారు. చిన్నపిల్లాడికి పాలు కావాలంటే ఏమనాలి? మంచినీళ్లు ఇవ్వమని ఎలా అడగాలి. ఆ తర్వాత ఫైన్, థాంక్యూ, ఎస్, నో లాంటి కొన్ని పదాలు నేర్పించారు.
లండన్‌లో అడుగు పెట్టిన మూడో రోజు ఒక ఫోన్ వచ్చింది. భర్త బాత్రూంలో ఉన్నారు. హేమ ఫోన్ ఎత్తారు. అవతలి వ్యక్తి బ్రిటిష్ యాక్సెంట్లో డాక్టర్ గారు ఉన్నారా అని అడిగారు. ఈమె ఎస్ అన్నారు. మళ్లీ ఆమె నేను మాట్లాడొచ్చా అని అడిగారు. హేమ నో అన్నారు. అందుకు ఆమె -పేషెంట్‌కి సీరియస్‌గా ఉంది దయచేసి డాక్టర్ గారికి ఫోనివ్వండి అంది. అందుకు ఈమె ఫైన్ అన్నారు. ప్లీజ్ అర్జెంటండీ అని అవతలి నర్సు ప్రాధేయ పడింది. దానికి హేమ థాంక్యూ అని ఫోన్ పెట్టేసింది. బాత్రూమ్ నుంచి వచ్చిన తర్వాత జరిగింది చెప్పారు. భర్త ఏమీ మాట్లాడలేదు. నవ్వుతూ హాస్పిటల్‌కి వెళ్లిపోయారు. సాయంత్రం వచ్చేటప్పుడు ఒక విమెన్స్ మేగజైన్, ఒక డిక్షనరీ తీసుకొచ్చారు. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావ్ అంతే అన్నారు. కాసేపు హేమ కంగారు పడ్డారు. మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా చదివారు. ఒక్క సెంటెన్స్ కూడా అర్ధం కాలేదు. ఇలా అయితే లాభం లేదనుకుని, దగ్గరల్లో ఉన్న ఒక లైబ్రరీకి వెళ్లారు. అది చిన్న పిల్లలది. అక్కడ స్టోరీ టెల్లింగ్ నేర్పిస్తారు. అప్పుడే అనిపించింది హేమకు. తాను కూడా ఇంగ్లీష్‌లో చిన్న పిల్లనే కదా అని! వాళ్లలా ఎందుకు నేర్చుకోవద్దు అనుకున్నారు. కిడ్స్ బుక్స్ తెచ్చుకున్నారు. అవన్నీ అర్ధమయ్యాక టీనేజ్ బుక్స్ తెచ్చుకున్నారు. ఒక డిక్షనరీ ముందేసుకుని వాటి అర్ధాలు వెతికి పట్టి సెంటెన్సులు రాసుకున్నారు. ఆ తర్వాత నావెల్స్ చదవడం మొదలుపెట్టారు. అలా అలా బయోగ్రఫీల దాకా వెళ్లారు.
చూస్తుండగానే కాలం గిర్రున తిరిగింది. రాయడం చదవడం థరోగా వచ్చింది. హేమకు కథలు రాయడం చిన్నప్పటి నుంచి అలవాటు. యూకేలో జరిగిన సంఘటనలు, అక్కడి జీవిన శైలిపై తెలుగులో చిన్న చిన్న కథలు ఒక 25 వరకు రాశారు. ఆ తర్వాత పిల్లలు, వాళ్ల ఆలనా పాలనాకే సరిపోయింది. పదేళ్ల తర్వాత ఒక రోజు భర్త అన్నారు. ఈ కథలేవో ఇంగ్లీష్‌లో ఎందుకు రాయకూడదు అని! ఇక్కడ తెలుగులో రాస్తే ఎవరికీ కనెక్ట్ అవదు. ఇంగ్లీష్‌లో రాస్తేనే కదా.. నలుగురు చదివేది అన్నారు. అలా భర్త ప్రోత్సాహంతో ఒక కథ మొదలుపెట్టారు. అయినప్పటికీ రాస్తానని హేమకు నమ్మకం లేదు. కొన్ని పేజీలు రాసిన తర్వాత గ్రామర్ మీద డౌటొచ్చింది. లోకల్ రైటర్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు. గ్రామర్ గురించి వర్రీ వద్దు ముందు కథ రాయండి అన్నారు వాళ్లు. ఫోర్ అనే లోకల్ చానల్ ఒక నావెల్ కాంపిటీషన్ పెట్టారు. దానికి హేమ కథ పంపించారు. ఆ తర్వాత దాని గురించే మరిచిపోయారు. ఎందుకంటే ఆమెకు నమ్మకం లేదు. వన్ ఇయర్ తర్వాత ఇంటికి లెటర్ వచ్చింది. 44 వేల ఎంట్రీల తర్వాత 24 బుక్స్ సెలెక్ట్ చేస్తే, అందులో ఒకటి హేమ పుస్తకం. ఆనందానికి హద్దుల్లేవు. ఆ పుస్తకం పేరు బ్రీజ్ ఫ్రం ద రివర్ మంజీరా. ఒక ఇన్నోసెంట్ ఇండియన్ అమ్మాయి నిజ జీవితం! ఆ పిల్ల ఒక బ్రిటిషర్ని పెళ్లాడి యూకే వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత భర్త నిజస్వరూపం బయటపడుతుంది. చిత్రహింసల పాలవుతుంది. మూసిన తలుపుల వెనుక బయట ప్రపంచానికి తెలియని ఒక అమ్మాయి చీకటి కోణాలు బయటికి తెలియాలనే ఉద్దేశంతో పుస్తకం రాశానంటారు హేమ. సమాజం కోసం ఏదైనా చేయాలనే తపనతో బుక్ రాశారు. పుస్తకాన్ని కొద్దిమంది విమర్శించినా, చాలామందికి నచ్చింది. అమెరికాలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా అవార్డులు వచ్చాయి. నేషనల్ రీడింగ్ హీరో అవార్డు అంటే అదొక అచీవ్మెంట్. అప్పటి బ్రిటన్ ప్రధాని గార్డియన్ బ్రౌన్ సతీమణి చేతుల మీదుగా ఆ అవార్డు తీసుకున్నారు. ప్యారిస్ పబ్లిషర్స్ ఆ పుస్తకాన్ని ట్రాన్స్ లేట్ చేసి పుస్తకం వేశారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
"అప్పడు అమ్మ ప్రోత్సాహమిస్తే ఇప్పుడు నా భర్త ఎంకరేజ్ చేశారు. ఇంగ్లీష్‌లో కథలు రాయడానికి రాధామనోహర్ ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ఉంది" అంటారు హేమ మాచెర్ల.
సెకండ్ బుక్- బ్లూ ఐస్. మొదటి బుక్ ప్రింట్ అచ్చవుతున్నప్పుడే రెండో బుక్ కూడా సేమ్ పబ్లిషర్సే డీల్ కుదుర్చుకున్నారు. గాంధీయిజం -బ్రిటిష్ వలసవాదం. ఈ రెండిండి మధ్య జరిగిన సంఘర్షణలో ఒక అమ్మాయి జీవితం ఎలా మలుపు తిరిగిందనేది కథ. ఇక్కడా అమ్మాయే మెయిన్ రోల్. ప్రస్తుతం మూడో నవల ఏ టేల్ ఆఫ్ టు సిస్టర్స్ రాస్తున్నారు. తాల్- తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వాళ్ల సావనీర్‌కి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. యూకేలో లోకల్ లైబ్రరీ వాళ్లు బుక్ టాక్స్, వర్క్ షాప్ కోసం హేమను పిలుస్తుంటారు. అప్పుడు అమ్మ తెలుగులో కథలు రాయడానికి ప్రోత్సాహమిస్తే.. ఇప్పుడు భర్త రాధామనోహర్ వెన్నంటే ఉండి ఇంగ్లీష్ నేర్పించి మరీ రచయిత్రిగా మలిచారు." దేశం కాని దేశంలో, ఎవరూ తెలియని ప్రపంచంలో, సర్వైవ్ కావాలంటే ముందు భాష కమ్యూనికేట్ కావాలి. అది తనంత తానకు రావాలి! అందుకే ఎంకరేజ్ చేశాను"అంటున్నారు భర్త రాధా మనోహర్.
కృషి వుంటే మనుషులు రుషులవుతారు అనే మాటను వందకు వంద శాతం నిజం చేశారు హేమ మాచెర్ల. దేశం కాని దేశంలో, తెలుగు తప్ప.. ఇంగ్లీష్ ముక్క కూడా రాని హేమ- పట్టుదలతో చదివి ఇప్పుడొక గొప్ప రచయిత్రిగా పేరు తెచ్చుకున్నారు. బ్రిటిషర్ల అభిమాన రచయితగా మారిన తెలుగు ఆడపడచు హేమ మాచెర్లను చూసి మనమూ గర్వపడదాం.