సోదరుడి ఆటిజం సమస్య నుంచి పుట్టిన 'ఐ -సపోర్ట్ ఫౌండేషన్'

కుటుంబం ఎదుర్కున్న కష్టమే సాయం చేసే సంస్థకు నాందిఆటిజం బాధితులకు సహాయం చేస్తున్న అక్కాచెల్లెళ్లుతల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చే ఏర్పాట్లు

సోదరుడి ఆటిజం సమస్య నుంచి పుట్టిన 'ఐ -సపోర్ట్ ఫౌండేషన్'

Tuesday September 01, 2015,

4 min Read

“అమ్మా.. ఆ పిల్లాడిని చూడు. బాతులాగా ఎగురుతున్నాడో !” అంటూ ఆశ్చర్యంగా తల్లికి చెప్పింది ఓ చిన్నారి. “ అతనివైపు చూడకు. దేవుడు అలాంటి పిల్లలను పుట్టించడం చాలా దురదృష్టకరం ” అంటూ.. శివం దగ్గర నుంచి దూరంగా తన కూతురుని తీసుకెళ్లిపోయింది ఆ తల్లి. శివం రమణి పుట్టినపుడు సాధారణంగానే ఉన్నా... 3 ఏళ్ల వయసులో.. టైఫాయిడ్ వచ్చింది. అప్పటి పరిణమాలు అతని జీవితాన్ని మార్చేశాయి. అప్పుడు సోకిన ఇన్ఫెక్షన్ కారణంగా.. శివంకు మాటలు రాకపోగా ఎదుగుదల నిలిచిపోయి ఆటిజంకు దారి తీసింది.

ఉత్తర్ ప్రదేశ్‌లోని చిన్న పట్టణమైన రాయ్‌బరేలీలో పుట్టి పెరిగిన బాబీ, జూహి రహాని, శివం రమణిలు సహోదరులు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో... ఇద్దరు కూతుళ్లు, కొడుకుని.. తల్లి ఒంటరిగానే కష్టపడి పెంచి పెద్ద చేసింది.

“మేం పెద్ద కుటుంబంలో నివశించాం. అయితే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడం, గెంతడం లాంటి శివం వింత ప్రవర్తన కారణంగా.. అందరూ మమ్మల్ని కోపంగా చూసేవారు. మాపై చెడు ఉద్దేశ్యాలతోపాటు.. శివంను అసలు మనిషిగా కూడా చూసేవారు కాదు. అనేక కుటుంబ ఫంక్షన్లకు మేం హాజరయ్యేవారం కాదు... కొంతమంది మమ్మల్ని పిలిచేందుకు కూడా ఇష్టపడలేదు. వాడి వింత ప్రవర్తనతో ఆ ఫంక్షన్లలో న్యూసెన్స్ సృష్టిస్తాడని భావించేవారు” అని చెబ్తోంది జూహీ.
బాబీ(పైవరుసలో ఎడమవైపు), జూహీ, తల్లి, శివం

బాబీ(పైవరుసలో ఎడమవైపు), జూహీ, తల్లి, శివం


ఐ సపోర్ట్ ఫౌండేషన్ పుట్టుక

“ఆటిజం గురించి కానీ, శివం అలా ప్రవర్తించడానికి గల కారణాలపై గానీ.. ఏమాత్రం అవగాహన కూడా లేని రాయ్‌బరేలీ లాంటి చిన్నపట్టణంలో కొన్నేళ్లపాటు ఎన్నో కఠినమైన పరిస్థితులు ఎదుర్కున్నామ”ని చెప్తారు జూహి.

తల్లితోపాటు, బాబీ, జూహీలు ఆటిజంతో బాధపడే చిన్నారులకు తగిన శిక్షణనిచ్చే స్కూల్స్ కోసం విపరీతంగా అన్వేషించారు. అయితే.. ఎటువంటి ఉపయోగం లేకపోయింది. ఒకటంటే ఒక్క స్కూల్‌ కూడా కనిపించలేదు. కుటుంబం నుంచి మద్దతు ఇస్తామన్నా... రాయ్‌బరేలీలోని పాఠశాలల్లో ఎవరూ శివంకు సపోర్ట్ చేసేందుకు అంగీకరించలేదు. దీంతో లక్నోకు నివాసం మార్చుకుని.. శివంను అక్కడ ప్రత్యేకమైన స్కూల్‌లో చేర్పించింది ఆ కుటుంబం.

2014లో ఆటిస్టిక్ చిల్డ్రన్ కోసం ఓ చిన్న స్కూల్‌ని ప్రారంభించింది బాబీ. ఇలాంటి పిల్లల మానసిక అభివృద్ధికి అవసరమైన వాతావరణాన్ని కూడా కల్పించడం దీని ప్రత్యేకత. కొన్నాళ్ల తర్వాత ఈ స్కూల్‌లో సహ వ్యవస్థాపకురాలిగా మారింది జూహీ కూడా. ఆ తర్వాత 'ఐ సపోర్ట్ ఫౌండేషన్' పేరుతో లాభాపేక్ష లేని ఎన్‌జీఓగా రిజిస్టర్ చేశారు దీన్నే. పేదరికంతో బాధపడుతున్న, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పిల్లలకు విద్య నేర్పించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. సాధారణంగా ఇలాంటి పిల్లలు ఏదో ఒక విషయంలో ఎక్కువగా నైపుణ్యం చూపుతుంటారు. వారిలోని ఆ ప్రతిభను గుర్తించి వారికి మద్దతునిచ్చి, శక్తి సామర్ధ్యాలను బయటపెట్టేందుకు ఈ ఫౌండేషన్ ప్రయత్నిస్తుంది.

ప్రభావం చూపిన అంశాలు

సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అందించిన గణాంకాల ప్రకారం ప్రతీ 88మంది పిల్లలలో ఒకరు ఆటిజంతో జన్మిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఈ సంఖ్య ప్రతీ 110మందికి ఒకరుగా ఉండేది.

“శివం లాంటి పరిస్థితి కానీ, అంత కంటే ఎక్కువగా బాధపడుతున్న పిల్లలు కానీ చాలామందే ఉంటున్నారు. ఈ సమస్యను విడిచిపెట్టేయడం కంటే... సమాజానికి దీన్ని గురించి తెలియచెప్పి, వారికి మద్దతునివ్వాలని సూచించేందుకే ఐ-సపోర్ట్ ఫౌండేషన్ ప్రారంభమైంది. మెరుగైన భవిష్యత్తును నిర్మించేందుకు సమాజంలో మార్పు తెచ్చేందుకు నేటి యువతరం కష్టపడాల్సి ఉంది.”

లక్నోలో నెలకొల్పిన ఈ ఫౌండేషన్ ద్వారా.. ప్రస్తుతం 45మందికి విద్యాబుద్ధులు నేర్పే ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరులోని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాల్లో వర్క్ షాప్స్ నిర్వహిస్తూ ఉంటారు. లక్నో సెంటర్‌ని అక్క బాబీ చూసుకుంటుండగా... విప్రో సంస్థలో ఫుల్ టైం జాబ్ చేస్తున్న జూహీ... బెంగళూరులోని కార్యకలాపాలు ప్రారంభించడం విశేషం. ప్రస్తుతం బెంగళూరులో వీరికి 100మందికిపైగా వాలంటీర్లు ఉన్నారు. “ ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన అవసరమున్న, పేదరికంలో మగ్గుతున్న 8వేల మందికి పైగా పిల్లలను సహాయం చేస్తున్నాం”అని చెప్పింది జూహీ.

కార్యకలాపాలు, కార్యక్రమాలు

ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన పిల్లల వికాసానికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉంటుంది. వారి సమగ్ర అభివృద్ధి కోసం చిన్నారు అవసరాలు, వారి సామర్ధ్యాలను సమతుల్యం పాటించాల్సి ఉంటుంది. “సాధారణ విద్యా శిక్షణతోపాటు.. సమాంతరంగా మరిన్ని శిక్షణలు ఇవ్వాల్సి ఉంటుంది. వారి స్థాయికి అనుగుణంగా పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షకుడు, సైకాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్‌లను అందుబాటులో ఉంచుతాం. ట్రైనింగ్‌లో లక్ష్యాలను నిర్ణయించేటపుడు... కుటుంబ అవసరాలకు తగిన ప్రాధాన్యతనిస్తాం. ప్రతీ 3 నెలలకు ఓసారి వారి అభివృద్ధిపై రివ్యూలు నిర్వహిస్తాం. ముందు నిర్ణయించిన టార్గెట్స్‌ని ఏ మేరకు అందుకోగలిగారు, మరుసటి త్రైమాసికానికి సంబంధించిన లక్ష్యాలను ఈ రివ్యూల ద్వారా నిర్ణయించుకుంటాం ”అని చెప్పారు జూహీ.

పిల్లల మానసిక వికాసం పెంపొందించడంలో.. తల్లిదండ్రులు, టీచర్లు సమాన పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇంట్లో, స్కూల్‌లో పిల్లల ప్రవర్తన ఎలా ఉంటోందో ఉమ్మడిగా కూర్చుని నిర్ణయించుకుంటారు. క్లాస్‌రూమ్‌లో చిన్నారుల ప్రవర్తననూ చూసేందుకు.. పేరెంట్స్‌ను తరచుగా పాఠశాలకు పిలుస్తుంటారు టీచర్స్.

పేదరికంలో మగ్గుతున్న చిన్నారులకు చేయూత - మురికివాడల్లో ఉంటున్న పిల్లల వివరాలను కూడా సేకరిస్తుంది ఐ సపోర్ట్ ఫౌండేషన్. డేటా సేకరించి, నిర్లక్ష్యానికి గురైన పిల్లలను, పాఠశాలల్లో చేరనివారిని గుర్తించి.. చదువుకునే అవకాశం కల్పిస్తారు. లింగ, కుల-మత బేధాలకు ఈ ఫౌండేషన్ వ్యతిరేకం. బాలకార్మికులు, స్కూల్ డ్రాప్ అవుట్స్‌ను గుర్తించి, వారి తల్లిదండ్రులను కలిసి, విద్య అవసరాన్ని తెలిపే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు దేశంలో అమలవుతున్న చట్టాలు, వారికి ఉన్న అవకాశాలను తెలియచేస్తారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలు, వర్క్‌షాప్స్‌ను కూడ ఇప్పటికే నిర్వహించింది ఐ సపోర్ట్ ఫౌండేషన్.

హిఫాజత్ పేరుతో నిర్వహించే వర్క్‌షాప్‌లలో .. అమూల్యమైన వాటిని కాపాడుకుందామని ప్రచారం చేస్తారు. వీటిలో అవగాహన, చిన్నారులపై దాడులు, ఆటిజంపై కేంపెయిన్స్, అభివృద్ధి ప్రణాళికల వంటివి ఈ వర్క్‌షాప్‌లలో ఉంటాయి.

image


లక్నోలో ఆటిజంపై అవగాహన వర్క్‌షాప్- ఆటిజం బాధితులను ముందుగానే గుర్తించడం, పేరెంట్స్‌కు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వడం, లెర్నింగ్ ఛార్ట్, డెవలప్మెంట్ ప్లాన్ రూపకల్పన చేశారు ఈ వర్క్‌షాప్‌లో.

  • పలు రకాల శారీరక లోపాలపై... డిజేబిలిటీ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
  • విభిన్నమైన శక్తి సామర్ధ్యాలున్న పిల్లలను గుర్తించి, వారిలో సానుకూల దృక్పథాన్ని పెంచాలని సూచించారు.
image


రోబోటిక్స్ లెగో సెషన్స్.. ప్రత్యేక శిక్షణతోపాటు పేద విద్యార్ధుల్లో లాజికల్ రీజనింగ్ పెంపొందించి.. సామాజిక అభివృద్ధి నైపుణ్యం పెంపొందించేందుకు ఈ తరగతులు నిర్వహించారు.

రోబోటిక్స్ లెగో సెషన్స్

రోబోటిక్స్ లెగో సెషన్స్


ఉచిత వైద్య పరీక్షలు- రక్త దాన కార్యక్రమాలు

ఈ విద్యార్ధుల్లో ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారం పెంపొందించేందుకు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి కాగా... విక్టోరియా హాస్పిటల్, బెంగళూరు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు.

టీకప్పుతో ఆలోచనలు - కుల్హద్ అనే మట్టితో తయారుచేసిన కప్పులో టీ అమ్ముతూ.. వారాంతంలో స్టాల్స్ నిర్విస్తున్నారు. బెంగళూరులోని బీటీఎం లేఅవుట్ ప్రాంతంలో నిర్వహిస్తూ నిధులు సేకరిస్తున్నారు.

కుల్హద్ కప్పులో టీ విక్రయంతో నిధుల సేకరణ క్యాంప్

కుల్హద్ కప్పులో టీ విక్రయంతో నిధుల సేకరణ క్యాంప్


క్లిక్-ఓ-క్లిక్

బాలకార్మిక వ్యవస్థపై చేసే పోరాటం ఇంది. కొంతమంది వాలంటీర్లు బాలకార్మికుల నిషేధం కాన్సెప్ట్‌పై ఫోటోలు తీసి.. ఇందుకోసం పాటుపడతారు.


చెయ్యి పట్టి అక్షరాలు దిద్దిస్తున్న వాలంటీర్

చెయ్యి పట్టి అక్షరాలు దిద్దిస్తున్న వాలంటీర్


ఐ ఫండ్ ఫౌండేషన్‌కు ఇప్పటి వరకూ ప్రభుత్వం కానీ, ఎన్‌జీవో సంస్థ కానీ నిధులు సమకూర్చలేదు. అయినా సరే నిర్వహణలో ఎటువంటి లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వ్యవస్థాపకులు. ఈ ఫౌండేషన్‌లో తన కుటుంబం ఎదుర్కున్న కష్టం నుంచి స్ఫూర్తిని పొంది... మరో విభాగాన్ని జత చేయబోతోంది జూహి. ఆటిజం చిన్నారుల తల్లిదండ్రలకు మరింత సమాచారం అందించి, సహాయపడేలా ప్లాట్‌ఫాంని డిజైన్ చేస్తున్నారు.

“ఇది మా ప్రయాణంలో ప్రారంభం మాత్రమే. పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని సాధించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. సంక్షేమం, పునరావాసం కోసం మరెంతో చేయాల్సి ఉంద'న్న జూహీ.. గాంధీజీ కొటేషన్‌ని గుర్తు చేసుకున్నారు.

“శక్తి శారరీక ధారుడ్యంతో వచ్చేది. దేనికీ లొంగని మనస్తత్వం నుంచి పుట్టేదే అసలైన శక్తి”-గాంధీ

ట్విట్టర్

ఫేస్‌బుక్