40 ఏళ్ల వయస్సులో ప్రాపర్టీ మార్కెట్లో అడుగు పెట్టి విజయం సాధించిన మోనిక

40 ఏళ్ల వయస్సులో ప్రాపర్టీ మార్కెట్లో అడుగు పెట్టి విజయం సాధించిన మోనిక

Friday October 23, 2015,

3 min Read

మోనికా కన్వర్.. తన భర్త సైన్యంలో పనిచేస్తున్నారు. ఆయన ఉద్యోగ రీత్యా దేశం మొత్తం తిరగాల్సి వచ్చింది. ఒక దశలో రియల్ ఎస్టేట్ రంగం వాళ్లకో భయంకర అనుభవం కలిగించి.. వాస్తవ ప్రపంచంలోకి తెచ్చింది.

ఢిల్లీలో ఉన్న పూర్వీకుల ఆస్తిని విక్రయించడానికి ప్రయత్నించారు మోనికా, ఆమె భర్త. ఆ సమయంలో రేటు తగ్గించుకోవాలంటూ రియాల్టీ బ్రోకర్లను వాళ్లను వెంటాడి వేధించారని చెబ్తారామె. ఎంత మంది బ్రోకర్ల చుట్టూ తిరిగినా నిజమైన ధర లభించే పరిస్థితి వాళ్లకు కనిపించలేదు. చివరకు అతి కష్టంమీద ఎలాగోలా ఆ ఆస్తిని అమ్మగలిగారు. ఆ తర్వాత పెట్టుబడిగా గుర్‌గావ్‌లో ఓ ప్రాపర్టీ కొనుగోలు చేద్దామని అనుకున్నపుడు ఇంతకు మించిన అనుభవమే ఎదురైంది. “గత అనుభవం కంటే ఈ సారి మరింత ఆందోళన కలిగింది'' అంటారు మోనికా. రియాల్టీ రంగంపై ఎలాంటి పరిజ్ఞానం లేకపోవడంతో.. ఏం చేయాలో పాలుకోని స్థితి ఎదురైంది వాళ్లకు.

మోనికా కన్వర్

మోనికా కన్వర్


చివరకు కొందరి సహాయంతో ఆస్తి వివరాలను సరిచూసుకుని, గుర్‌గావ్‌లో ప్రాపర్టీ కొనుగోలు చేశారు.

"ఇంటర్నెట్ ఇంతగా అందుబాటులో ఉంది. ఈ రంగంలో అనేక బ్రహ్మాండమైన వెబ్‌సైట్స్ ఉన్నాయి. సమాచారం కుప్పలు తెప్పలుగా ఉంది. అయితే.. వాటిని విశ్లేషించడానికి, పోల్చుకోవడానికి, ఓ నిర్ణయానికి రావడానికి తగిన ప్లాట్‌ఫాం ఒక్కటి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ ఆలోచన నుంచి పుట్టినదే ప్రాప్‌చిల్.కాం. ఆస్తులు కొనుగోలు చేసేటపుడు వారికి తగిన ఛాయిస్ అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం" అన్నారు మోనిక.

ఈ ఆలోచనతో అమ్మకాలకు, కొనుగోళ్లకు వారధి లాంటి వెంచర్‌ని ప్రారంభించారామె. 2013 అక్టోబర్‌లో ఒకే ఒక ప్రాజెక్ట్‌తో తమ కార్యకలాపాలు ప్రారంభించగా.. 2014 ఫిబ్రవరిలో సొంత ఆఫీస్‌ని ప్రారంభించారు.

రియాల్టీ రంగంలో లేడీస్‌కు ఎదురయ్యే సమస్యలు

నిర్మాణ రంగంపై ఎలాంటి అనుభవం లేకపోవడం మోనికకు ఎదురైన ప్రధాన సమస్య కాగా.. 40 ఏళ్ల వయసులో వెంచర్‌ని ప్రారంభించడం ఆమెకు ఎదురైన మరో సవాల్.

“రియల్ ఎస్టేట్ రంగంలో మహిళలను అంతగా పట్టించుకోరు. నేను వ్యక్తిగతంగానే ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నాను. స్త్రీలు సరైన నిర్ణయాలు తీసుకోలేరని, అందుకే రియాల్టీ రంగంలో సలహాదారుల బాధ్యతలు వారు నిర్వహించలేరని చాలామంది భావిస్తారు” అని తన అనుభవాన్ని పంచుకుంటారు మోనిక.

ఐటీ సెక్టార్‌లో నిపుణులు స్టార్టప్‌ కంపెనీల్లో చేరేందుకు అంతగా ఇష్టం చూపబోరని, బడా కంపెనీలపైనే వారి దృష్టి ఉంటుందనే విషయం ఆమెకు త్వరగానే తెలిసొచ్చింది. అంటే తమ దగ్గర జాయిన్ అయేందుకు ఉత్సాహం చూపిన వారినే నిపుణులుగా మార్చుకోవాల్సిన అవసరాన్ని ఆమె గుర్తించారు.

image


మహిళలు ఓ వెంచర్‌ని దిగ్విజయంగా నిర్వహించగలరనే విషయాన్ని.. వారి కష్టం, కాలమే నిరూపిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఇది అక్షరాలా నిజం. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ధరలను పోల్చి, వాటిని డిస్‌ప్లే చేయడానికి ప్రాప్‌చిల్‌లో నిరంతరం శ్రమిస్తున్నారు ఈ భార్యాభర్తలు. ఆయా ఆస్తుల కొనుగోళ్లు చేయాలని అనుకునేవారికి నైపుణ్యంతో కూడిన సలహాలు అందిస్తున్నారు. బిల్టప్‌ ఏరియా, ధర, ఆస్తి ఉన్న ప్రాంతంతో సహా.. అన్ని అంశాలను పరిగణించి కంపేర్ చేయడం ప్రాప్‌చిల్ ప్రత్యేకత.

ఏమిటీ ప్రాప్‌చిల్ ? ఎందుకు ?

మొదట ఒక ఏడాదిపాటు రియాల్టీ రంగానికి చెందిన పలు అంశాలపై పరిశోధన చేశారు మోనిక. ఈ సెగ్మెంట్‌కు చెందిన విభాగాలను షార్ట్‌లిస్ట్ చేసి.. వాటిని పోల్చి చూసుకుని రేటింగ్స్ ఇవ్వడం, అల్గారిథమ్స్ అభివృద్ధి చేయడం, వరుస క్రమంలో అమర్చడంలోనే ఏడాది గడిచిపోయింది. ఆ తర్వాత మరో ఏడాదిపాటు ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయడం పోర్టల్ నిర్మాణానికి కేటాయించి.. అవి పూర్తి చేశాక ఫిబ్రవరి 2015లో తొలిదశ పోర్టల్‌ను లాంఛ్ చేశారు. 2015 జూలైలో వెబ్‌సైట్ రెండో దశ కూడా పూర్తయింది.

గుర్‌గావ్, నోయిడా, బెంగళూరు, చెన్నై, భోపాల్, ఇండోర్, భివాడి, నీమ్‌రానాలలో ఇలాంటి కంపేరిజన్స్ పూర్తి చేయగా.. త్వరలో మరిన్ని పట్టణాలకూ ఈ సర్వీసులు విస్తరించబోతున్నారు.

టీచర్ నుంచి ఆంట్రప్రెన్యూర్‍‌ వరకు

మోనిక ఒక సైన్స్ పట్టభద్రురాలు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి సంబంధించిన కొన్ని కంప్యూటర్ కోర్సులు కూడా పూర్తి చేశారు. అయితే పూర్తి స్థాయిలో కెరీర్ గాడిలో పడేందుకు, మోనికకు అవకాశం లభించలేదు. కారణం సైన్యంలో తరచుగా బదిలీలు జరగడమే. దీంతో పలు ఆర్మీ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్‌లో దాదాపు 15 ఏళ్ల పాటు టీచర్‌గా విధులు నిర్వహించారామె.

" ఆంట్రప్రెన్యూర్‌షిప్‌కి వయసుతో సంబంధం లేదని, అది మానసిక ధృడత్వంపై ఆధారపడ్డ అంశమని.. మా ప్రయాణంలో తెలుసుకున్నాను. అయితే.. ప్రొఫెషనల్ అనుభవం, మానసిక పరిపక్వత, భావోద్వేగ నియంత్రణలు.. స్టార్టప్ ప్రారంభకులకు ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణాలు. ఇవి వయసు, కాలంతో పాటు సహజంగా అలవడే లక్షణాలే" అని చెప్పారు మోనికా.

ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ప్రాంతం నుంచి వచ్చిన మహిళ మోనిక. ఇప్పటికీ ఆమె కుటుంబం అక్కడే ఉంది. మోనిక తండ్రి ఫార్మాస్యూటికల్ సంబంధిత వ్యాపారం నిర్వహిస్తారు. వ్యాపార నిర్వహణలో తండ్రి నిబద్ధతను వయసు పెరిగే సమయంలో మోనిక గమనించినా.. తాను కూడా ఓ ఆంట్రప్రెన్యూర్‌ అవుతానని ఎప్పుడూ అనుకోలేదంటారామె.

ప్రాప్‌చిల్ డైరెక్టర్‌గా.. భర్తతో కలిసి ఆయా నగరాల్లో విస్తృతంగా పర్యటిస్తుంటారు మోనిక. అక్కడ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని చెక్ చేసుకుంటారు. ఆ ప్రాంతంలో కనీసం ఓ వారం పాటు ఉండేలా ప్లాన్ చేసుకుని, గ్రౌండ్ వర్క్ చేస్తారు. దీని కంటే ముందే.. వీలైనంతగా పరిశోధన చేసి, ఆ ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ప్రస్తుతానికి అపార్ట్‌మెంట్స్‌కి మాత్రమే రివ్యూలు ఇస్తున్నా.. రియాల్టీ రంగానికి చెందిన అన్ని విభాగాలకు సేవలను విస్తరించనున్నారు.

వెబ్‌సైట్