Brands
Discover
Events
Newsletter
More

Follow Us

twitterfacebookinstagramyoutube
Youtstory

Brands

Resources

Stories

General

In-Depth

Announcement

Reports

News

Funding

Startup Sectors

Women in tech

Sportstech

Agritech

E-Commerce

Education

Lifestyle

Entertainment

Art & Culture

Travel & Leisure

Curtain Raiser

Wine and Food

YSTV

ADVERTISEMENT
Advertise with us

ఒకప్పుడు పశువులు కాసిన వ్యక్తి.. నేడు కాలేజీకి ప్రిన్సిపల్

మహాత్ముడే స్ఫూర్తిగా హిందీ భాష హమారీ జాన్ హై అంటున్న రామకోటి

ఒకప్పుడు పశువులు కాసిన వ్యక్తి.. నేడు కాలేజీకి ప్రిన్సిపల్

Friday August 25, 2017 , 4 min Read

అపజయాలు కలిగినచోట గెలుపు పిలుపు వినిపిస్తుందని ఓ సినీ కవి అంటాడు. నిజమే పరాజయాల పరంపరలో ఎప్పుడో ఒకసారి గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆ పిలుపు విని విజయతీరానికి చేరుకున్నవాడే నిజమైన విజేత. అలాంటి ప్రయాణమే రామకోటిది. ఎక్కడ జోగ్యానాయక్ తండా.. ఎక్కడ జియాగూడ అభ్యుదయ ఓరియెంటల్ కాలేజీ. పేరు రాయడం వస్తే చాలనుకున్న చదువు.. పీహెచ్డీ చేసి, ఓ కాలేజీ ప్రిన్సిపల్ అయ్యేదా వెళ్లింది. ఈ ప్రయాణంలో లైఫ్ లాంగ్ స్ట్రగుల్. ఒక్కో అవాంతరాన్ని దాటుకుంటూ వెళ్లిన రామకోటి జర్నీ అతని మాటల్లోనే..

image


వరంగల్ జిల్లా చైతన్యానికి మారు పేరు అంటారు. ఆ గడ్డమీద పుట్టిన నాకు చైతన్యం జన్మత: అబ్బింది. అన్ని తండాల్లాగే మా తండా కూడా ఊరికి దూరంగా విసిరేసినట్టుగా వుంటుంది. ప్రస్తుత జనగామ జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి దగ్గర జోగ్యానాయక్ తండాలో పుట్టి పెరిగాను. వ్యవసాయ నేపథ్యమున్న కుటుంబం. తరతరాలుగా ఎద్దు, వ్యవసాయమేనా? గిరిజన కుటుంబంలో పుట్టినంత మాత్రాన చదువుకు దూరంగా బతకాల్సిందేనా? ఈ ప్రశ్న నన్ను వెంటాడింది. లంబాడా కుటుంబంలో పుట్టి గొప్ప వ్యక్తులుగా పేరు తెచ్చుకున్న వాళ్ల గురించి విన్నప్పుడల్లా నాలో ఏదో తెలియని కసి రగిలేది. వాళ్లాలా కాకున్నా.. నాకంటూ సమాజంలో మంచి గుర్తింపు, పేరు రావాలని తపన పడ్డాను. 

ఆ పట్టుదలతోనే ఇంట్లో పరిస్థితులు సహకరించకున్నా హై స్కూల్ దాకా చేరుకున్నా. జడ్పీఎస్ఎస్ చెన్నూరు. మా తండానుంచి 8 కిలోమీటర్లు. అప్పట్లో సైకిల్ కూడా వుండేది కాదు. కాలినడకనే ప్రయాణం. రోజూ పదహారు కిలోమీటర్లు నడిచేవాణ్ని. 1978లో పదో క్లాస్ ఎగ్జామ్స్ రాశాను. తానొకటి తలిస్తే దైవం మరోటి తలచినట్టు.. టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను. ఎంత దీక్షతో బడికి వెళ్లానో అంత నీరుగారిపోయాను. ఒకరకమైన నిరుత్సాహం కమ్మేసింది. చూస్తుండగానే నాలుగేళ్లు గడిచిపోయాయి. ఆ టైంలో నేను చేయని పనంటూ లేదు. చివరికి పశువులు కూడా మేపాను. 

రెండేళ్ల తర్వాత హైదరాబాద్ బస్సెక్కాను. పాతబస్తీ దారుస్సలాంలో ఓ ఆయిల్ మిల్లులో పనికి కుదిరాను. పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8వరకు డ్యూటీ. అక్కడ కొంతకాలం చేసిన తర్వాత, బాలానగర్ లోని ఓ స్క్రాప్ కంపెనీలో ఇంకో ఉద్యోగం. నెలకు జీతం రూ.150. కాలం గిర్రున తిరిగింది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ధ్యాస చదువు మీదకి మళ్లింది. 1982లో టెన్త్ పాసయ్యాను. రిజల్ట్ చూసుకున్న తర్వాత ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. పెట్టేబేడా సర్దుకుని జనగాం బస్సెక్కాను. 

image


అంతలోనే మళ్లీ నిరాశ. ఇంటర్లో సీటు దొరకలేదు. స్టేషన్ ఘన్ పూర్ లో ట్రై చేశాను. అప్పుడే అక్కడ కొత్తగా గవర్నమెంటు కాలేజీ స్థాపించారు. అదృష్టం కొద్దీ సీట్ కన్ఫమ్ అయింది. ఆ కాలేజీలో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను. అంతా బానేవుంది కానీ, ఇంటికి కాలేజీకి దూరం కావడంతో చదువు కష్టంగా మారింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. చేసేదేంలేక సెకండ్ ఇయర్ నెల్లికుదురు గవర్నమెంటు జూనియర్ కాలేజీలో చేశాను. ఎందుకంటే అక్కడికి ఐదారు కిలోమీటర్ల దూరంలో అక్క ఉంటుంది. ఆమె సలహాతోనే సెకండ్ ఇయర్ కాలేజీ మారాను. ఎగ్జామ్స్ రాసి ఫలితాలు వచ్చేలోపు ఖాళీగా వుండలేక, కొడకండ్లలో వయోజన విద్యాకేంద్రంలో సూపర్ వైజర్ గా చేరాను. నెలకు రూ. 550 ఇచ్చేవారు.

ఈలోపు ఇంటర్ రిజల్ట్ వచ్చాయి. పాసయ్యాను. 1985లో డిగ్రీ కోసం మళ్లీ పట్నం బస్సెక్కాను. ఏవీ కాలేజీలో జాయిన్ అయ్యాను ఈవెనింగ్ క్లాసులు. పొద్దంతా ఉద్యోగం.. సాయంత్రం క్లాసులు. నారాయణగూడ విఠల్ వాడీలోని ఓ ప్రైవేటు కంపెనీలో డెలివరీ బోయ్ గా పనిచేశాను. ఆ సమయంలోనే పెళ్లి జరిగింది. భార్యాభర్తలం ఇద్దరం పనిచేస్తేగానీ బతుకు బండి నడిచేది కాదు.

రెండేళ్ల తర్వాత 1987లో దక్షిణమధ్య రైల్వేలో జాబ్ వచ్చింది. లాలాగూడ లోకో షెడ్ లో హెల్పర్ జాబ్. ఉద్యోగమైతే వచ్చింది కానీ.. జీవితం ఇది కాదేమో అనిపించింది. ఇంకా చదువుకోవాలన్న తపన చల్లారలేదు. పైగా నేను వెళ్తున్న రూట్ ఇది కాదని గట్టిగా నమ్మాను. డిగ్రీ తర్వాత 1990-92లో ఎమ్ఏ హిందీ చేశాను. 1992 దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడెమీలో స్టోర్ కీపర్ గా ఇంకో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఆ నౌకరీ చేస్తూనే 1995లో పీహెచ్డీ చేశాను. బంజారా జానపద గీతాలపై పరిశోధన. 1999లో జియాగూడ అభ్యుదయ ఓరియెంటల్ ఈవెనింగ్ కాలేజీలో హిందీ టీచర్ గా అవకాశం వచ్చింది. అనుకున్న లక్ష్యం వైపే ప్రయాణిస్తున్నానని అప్పుడనిపించింది. ఆ ఊపులోనే ఓయూ నుంచి ఎల్ఎల్ఎం, ఎల్ఎల్బీ కంప్లీట్ చేశాను.

2015లో కాలేజీ ఇంచార్జ్ ప్రిన్సిపల్ గా అవకాశం ఇచ్చారు. అదొక కత్తిమీద సాములాంటి ఉద్యోగం. ఎందుకంటే ఆ కాలేజీలో కనీస మౌలిక సదుపాయాలు లేవు. కూచోడానికి బెంచీలు లేని దుస్థితి. వాస్తవానికి ప్రిన్సిపల్ పోస్టుకి ఎవరూ ముందుకు రాకుంటే, నేనే సవాల్ గా తీసుకుని బాధ్యతలు మీదేసుకున్నాను. పేరులో ఉన్న అభ్యుదయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపించాలని కంకణం కట్టుకున్నాను. ముందుగా మౌలిక వసతుల మీద దృష్టి పెట్టాను. టాయిలెట్స్ నిర్మాణం దగ్గర్నుంచి నాన్ టీచింగ్ స్టాఫ్ దాకా అన్నింటా ముందు నడిచి, కాలేజీకి ఓ రూపు తెచ్చాను. యూజీసీ ఇచ్చిన కొన్ని నిధులతో కళాశాల రూపురేఖల్నే మార్చేశాను. 

image


పాడుబడ్డ బంగళాలా ఉన్న భవంతిని అధునాతన ఇంజినీరింగ్ కాలేజీలా తీర్చిదిద్దాను. లైబ్రరీని ఆధునీకరించాను. పై అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగి, బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయించాను. పదిహేను కంప్యూటర్లు తెప్పించి లాబ్ ను మెరుగుపరిచాను. కలలో కూడా ఊహించని విధంగా కాలేజీని తీర్చిదిద్దినందుకు మంచి గౌరవమే దక్కింది. జియాగూడలో ఇంత అద్భుతమైన కాలేజీ వుందా అని అందరూ అబ్బురపడ్డారు. గట్టిగ అనుకుంటే అయతది అంటారుగా.. సేమ్ అలాగే జరిగింది. కళాశాలను మార్చాలని గట్టిగా అనుకున్నా.. సాధించా. రెండేళ్లలోనే కాలేజీ ముఖచిత్రాన్నే మార్చేశాను. భవిష్యత్ లో జియాగూడ అభ్యుదయ కాలేజీ అంటే- అద్భుతమైన సాహిత్య కేంద్రం అని ప్రతీ ఒక్కరూ కొనియాడాలనేది నా స్వప్నం.

ఇప్పుడనిపిస్తుంది.. చదువు అనేది మనిషికి ఎంత అవసరమో. అందుకే రామకోటి చెప్పేది ఒక్కటే.. కూలి పనిచేసైనా, పస్తులుండైనా సరే చదువుకోవాలి అని. చదువే అన్నిటికి మూలం. బడి అంటే నా దృష్టిలో దేవాలయం అంటారు రామకోటి. చదువే మనిషి ఉన్నతికి మార్గం. చదువుకున్నవాడే నాకు ఆరాధ్యుడు.. ఆత్మీయుడు.. మహాత్ముడి స్ఫూర్తిగా హిందీభాష ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అని చెప్పి ముగించారు రామకోటి.