ఫండ్స్ కోసం పంచసూత్రాలు..! మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకం !!
మీరు మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలనుకుంటున్నారా? అయితే ఇక ఏమాత్రం నిధుల గురించి బాధ పడాల్సిన అవసరం లేదు. గత రెండేళ్లలో నమోదైన గణాంకాలు మీకు అనుకూలంగానే ఉన్నాయి. 2014తో పోలిస్తే దేశంలో మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య 50 శాతం పెరిగింది. మహిళలు ప్రారంభించిన స్టార్టప్‌లు మనుగడ సాధించడానికి మెరుగైన అవకాశాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఫండ్స్ సేకరించడానికి ఈ పంచ సూత్రాలు మీకు అద్భుతంగా తోడవుతాయి.
పారిశ్రామికవేత్త అనగానే- సూటూ,బూటూ, టక్కు, టై వేసుకుని అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడే ఒక మగ పర్సనాలిటీయే కళ్లముందు స్ఫురిస్తుంది. అది మన తప్పు కాదు. వ్యవస్థీకృతమైన ఒక చిన్నచూపు. ప్రత్యేకంగా మెన్షన్ చేస్తే తప్ప- మహిళా పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడం. వాళ్లలో ఎన్నో గొప్పగొప్ప ఆలోచనలుంటాయి. దేశ గతిని మార్చగల్గిన శక్తిసామర్థ్యాలు, తెలివితేటలు ఉంటాయి. అయినా వారి గురించి చర్చించం. నిధుల గురించి పట్టించుకోం. ఫలితంగా చాలామంది భారతీయ మహిళలు చిన్న,మధ్య తరహా- కుటీర పరిశ్రమలకే పరిమితమైపోయారు. ప్రభుత్వ పథకాలు కూడా వారిని అంతవరకే పరిమితం చేశాయి. అయితే ఇదంతా మనదేశంలో స్టార్టప్ విప్లవం రాకముందు మాట!
స్టార్టప్ విప్లవం
గడిచిన రెండేళ్లలో ఎంతో మార్పు వచ్చింది. విద్యావంతులు, టెకీ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఇప్పుడు చరిత్ర సృష్టిస్తున్నారు. గత రెండేళ్లలో మహిళల ఆధ్వర్యంలో ఎన్నో స్టార్టప్‌లు వచ్చాయి. వారి నేతృత్వంలో లైమ్‌రోడ్, కార్య, జివామె, క్యాష్‌కరో వంటి సంస్థలు వినూత్న ఆలోచనలతో అద్భుతాలు సృష్టించాయి.
మహిళలకు ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంగా నిలిచిన లైమ్‌రోడ్ సంస్థ.. సుచీ ముఖర్జీ నాయకత్వంలో 30 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. రిచాకర్ సీఈవోగా ఉన్న జివామె సంస్థ.. 300శాతం వృద్ధిరేటుతో.. ఆన్లైన్ లింగరీ సిగ్మంట్లో లీడర్‌గా నిలిచింది. క్యాష్‌బ్యాక్ ఐడియాతో స్టార్టప్ మొదలుపెట్టిన స్వాతి భార్గవ.. మూడేళ్లలో రతన్ టాటాను ఇన్వెస్టర్‌గా పొంది అబ్బురపరిచింది. మహిళల కోసం ఆఫీస్, పార్టీ, ట్రెండీ దుస్తుల్ని రూపొందిస్తూ.. కార్య లైఫ్‌స్టైల్ సొల్యూషన్స్ దూసుకుపోతోంది. ఇక మీడియా టెక్ కంపెనీలైన యువర్‌స్టోరీ, పాప్ క్సో.. వంటి ఎన్నోకంపెనీలు మహిళల ఆధ్వర్యంలో స్ఫూర్తిదాయకమైన విజయాలను సాధించాయి.
ఊహించని విజయాలతో అసాధ్యాలను సుసాధ్యం చేయడమేకాదు., విమెన్ స్టార్టప్‌లపై సర్వత్రా ఆసక్తిని, క్రేజ్‌ని తీసుకువచ్చారు కొంతమంది మహిళా పారిశ్రామికవేత్తలు. ప్రభుత్వంతోబాటు అనేకమంది వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, ఏంజెల్ ఇన్వెస్టర్లు రకరకాల వ్యూహాలతో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నారు. టెక్నాలజీ సహాయం కూడా అందిస్తున్నారు. దేశంలో పెరుగుతున్నఈ ప్రో-స్టార్టప్ కల్చర్ మహిళలను ఉత్సాహపరుస్తోంది. వారు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి తగిన ప్రోత్సాహాన్నిఅందిస్తోంది.
ఇవే పంచసూత్రాలు
1.నెట్వర్క్ ఉంటే నెట్ క్యాపిటల్ రెడీ
ఓ పారిశ్రామికవేత్తగా సరైన వనరులను, నైపుణ్యాన్ని పొందడం మీకు చాలా అవసరం. ఇందుకు నెట్వర్కింగ్ దోహదం చేస్తుంది. మీ నెట్వర్క్ ఎంత విస్తృతంగా ఉంటే..అంత ఎక్కువగా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు పరిచయమవుతారు. మీ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు నిధులను అందిస్తారు. మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలవడానికి చాలా సంస్థలు ఉన్నాయి. ఆర్థికపరమైన సలహాలతోబాటు ఓ గురువులా మార్గనిర్ధేశం చేస్తాయి. వ్యాపార రంగంలో మహిళలకు అండగా నిలిచే శక్తివంతమైన వ్యక్తులను సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. అవకాశాలను అందిపుచ్చుకోండి. భారతదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునందించేందుకు ఇప్పుడు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి.
2.ప్రభుత్వ, కార్పొరేట్ సాయం
ముందుగా చెప్పినట్టు మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనివ్వడంలోభారత ప్రభుత్వం ముందుంది. ఇందుకోసం నిధులను కూడా కేటాయించింది.మైనారిటీలు, మహిళా యాజమాన్య వ్యాపారాలను ప్రోత్సహిస్తూ విధానాలను కూడా రూపొందించింది. అలాగే పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా ముందుకువస్తున్నాయి. విమెన్ స్టార్టప్‌లకు ఫండింగ్ చేస్తున్నాయి. వ్యాపార రంగంలో మహిళలు నిలదొక్కుకునేందుకు సహకరిస్తున్నాయి.
3. ఫండ్‌రైజింగ్ ఆప్షన్స్
నిధులను సమకూర్చుకోవడానికి ఇప్పుడు ఎన్నో అవకాశాలున్నాయని గుర్తించండి. మనం పరిగణలోకి తీసుకోని ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయని మరచిపోవద్దు. సంప్రదాయ వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, ఈక్విటీ ఫండింగ్ కంపెనీలు ఉండనే ఉన్నాయి. అయితే మన ఆలోచనలు ఇక్కడతో ఆగిపోకూడదు. ఇతర ఆప్షన్స్‌ని కూడా పరిశీలించాలి. ఇప్పుడు ఎన్నో జాతీయ, ప్రైవేటు బ్యాంకులు మహిళా పారిశ్రామికవేత్తలకు అతితక్కువ వడ్డీలకు రుణాలు అందిస్తున్నాయి. వీటితోబాటు ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కూడా ఎంచుకోవచ్చు.
4.క్రౌడ్ ఫండింగ్
ఎక్కువగా వాడుకలో లేనప్పటికీ, పెట్టుబడి మొత్తాన్ని సమీకరించడానికి క్రౌడ్ ఫండింగ్ గొప్ప మార్గం. ఇందుకు రెండు దారులున్నాయి. ఒకటి, రివార్డు బేస్డ్.. రెండోది ఈక్విటీ పద్ధతి. రివార్డ్ బేస్డ్ విధానంలోఅవతలి కంపెనీ పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలంగా మీ కంపెనీ ఉత్పత్తి లేదా సేవలను అందించవచ్చు. ఇక ఈక్విటీ విషయానికి వస్తే, పెట్టుబడి పెట్టిన కంపెనీ మీ స్టాక్స్‌ని కొంటుందన్నమాట! ఇటీవలి కాలంలో సినిమాలను కూడా క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల కన్నడలో విజయవంతమైన లూసియా సినిమా అలా రూపొందినదే!
5.ఏంజిల్ ఇన్వెస్టర్స్
మీ స్టార్టప్ కోసం ఏంజిల్ ఇన్వెస్టర్స్ కోసం ఎందుకు ప్రయత్నించకూడదు?మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఇండస్ట్రీలో ఇప్పుడలాంటి ఇన్వెస్టర్లు ఎంతోమంది ఉన్నారు. మహిళల వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడు రెండింతల మంది ఇన్వెస్టర్లు రెడీగా ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళా యాజమాన్యంలో నడిచే వ్యాపారాల్లో పెట్టబడులు పెట్టడానికి ఇటీవల సాహా ఫండ్ పేరుతో వెంచర్ క్యాపిటల్ సంస్థను ప్రారంభించారు . రూ.100 కోట్ల విలువజేసే ఈ కంపెనీ.. మహిళలు నిర్వహించే సంస్థల్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. అలాగే 60 శాతంమందికిపైగా మహిళా ఉద్యోగులున్నకంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. ఒకవేళ పురుషులు నిర్వహిస్తున్నప్పటకీ, ఆ కంపెనీ వస్తు సేవలు మహిళల కోసమే అయితే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది సాహా ఫండ్.
చదివారుగా, మహిళా పారిశ్రామికవేత్త కావాలన్న ధృఢ సంకల్పం మీకుంటే మిమ్మల్నిఎవ్వరూ ఆపలేరు. మీ కోసం ఎన్నోఅవకాశాలు ఎదురుచూస్తున్నాయి. సో, ఇంకెందుకు ఆలస్యం? మీ విజయగాథను మీరే రాసుకోండి!
గెస్ట్ ఆథర్ డా. సోమ్ సింగ్
దశాబ్ద కాలంపాటు కార్పొరేట్ వరల్డ్‌లో పనిచేశారు. అనేక మల్టీ నేషనల్ కంపెనీల్లో మార్కెటింగ్ హెడ్‌గా పనిచేశారు. ఇప్పడు స్టార్టప్ అడ్వయిజర్‌గా, ఏంజిల్ ఇన్వెస్టర్‌గా మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనందిస్తున్నారు. ట్యాక్సీ ఫర్ షూర్, చార్జ్ బీ, మాబ్ స్టాక్, హోటెలాజిక్స్, టూకీటాకీ, ఎక్స్ప్లరా, ఇండియన్ స్టేజ్, అన్‌బాక్స్‌డ్, ఇండిక్స్..ఇలా అనేక స్టార్టప్‌లకు మెంటర్‌గా వ్యవహరించారు. విధాన రూపకర్తలకు, పారిశ్రామికవేత్తలకు మధ్య దూరంతగ్గిస్తూ సెంటర్ ఫర్ ఆంట్రప్రెన్యూర్ ఎక్స్‌లెన్స్(సిఈఈ) ఐడియాను ప్రతిపాదించారు. బి హియర్డ్- అంటూ పారిశ్రామికవేత్తల వాణి వినిపించే లక్ష్యంతో సిఈఈకి రూపకల్పన చేశారు.
(గమనికః ఈ ఆర్టికల్‌లో వ్యక్తంచేసిన అభిప్రాయాలు, ఆలోచనలు రచయితవి మాత్రమే. అవన్నీ యువర్‌స్టోరీ అభిప్రాయాలుగా భావించాల్సిన అవసరం లేదు.)