విజయవంతమైన వ్యాపారవేత్త... నదీర్ గోద్రెజ్
ఆ ఫ్యామిలీకి బిజినెస్... ఓ రిలే రేస్తరతరాల వ్యాపారాలను కొనసాగిస్తున్న వారసులువ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడమే లక్ష్యం
వెయ్యి మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతో మొదలవుతుంది అంటారు. ఆ అడుగు ఎప్పుడైనా పడొచ్చు. ఎక్కడైనా పడొచ్చు. కానీ నదీర్ గోద్రెజ్ జీవితంలో ఆ అడుగు పుట్టుకతోనే పడింది. ధనవంతులైన పార్శీ కుటుంబంలో పుట్టిన నదీర్ గోద్రెజ్ ఇప్పుడు నలుమూలలా విస్తరిస్తున్న వ్యాపార సామ్రాజ్యానికి అధినేత. ఒకదాంతో మొదలుపెట్టి... ఇంకో దాంట్లో అడుగుపెట్టి... తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇప్పటికీ కొత్త పుంతలు తొక్కిస్తూనే ఉన్నాడు. ఇంతకీ ఎవరా నదీర్ గోద్రెజ్. తెలుసుకోవాలనుందా? అయితే చదవండి.
నదీర్ అండ్ ఫ్యామిలీ
గోద్రెజ్ అన్న పేరు వింటే అందరికీ గుర్తొచ్చేవి ముందుగా తాళాలు, బీరువాలు. భారతదేశంలో నాణ్యత, నైపుణ్యాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాయి గోద్రెజ్ ఉత్పత్తులు. గోద్రెజ్ వంశంలో పుట్టిన వ్యక్తే నదీర్ గోద్రెజ్. గోద్రెజ్ వంశానిది మొదట్నుంచీ వ్యాపారమే. బుర్జోర్ గోద్రెజ్ ఇద్దరు తనయుల్లో నదీర్ చిన్నవాడు. 19వ శతాబ్దంలో తాతలు అర్దేషిర్, ఫిరోజ్ షా గోద్రెజ్ లు ప్రారంభించిన వ్యాపారాన్ని నదీర్ తండ్రి బుర్జోర్ గోద్రెజ్ కొనసాగించారు. వినూత్న ఆలోచనలతో వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో గోద్రెజ్ వంశస్తులది పేటెంట్ అనే చెప్పాలి. ఇప్పటికీ లాక్ అండ్ సేఫ్ ఇండస్ట్రీలో గోద్రెజ్ బ్రాండ్‌ది తిరుగులేని ముద్ర. నదీర్ తండ్రి ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. 1897లో ఆయన మొదలు పెట్టిన తాళాలు, బీరువాల ఉత్పత్తులే సగటు భారతీయుడి కుటుంబంలో భాగమయ్యాయి. ఈ వ్యాపారాన్ని తర్వాత నదీర్ గోద్రెజ్ చేపట్టారు.
బాల్యంలోనే అద్భుతాలు
1959లో అంటే నదీర్ వయస్సు అప్పుడు ఎనిమిదేళ్లు. తన సోదరుడు ఆది గోద్రెజ్‌కు నదీర్ కు మధ్య తొమ్మిదేళ్ల గ్యాప్ ఉంది. పై చదువుల కోసం ఆది గోద్రెజ్ అమెరికాకు వెళ్లాడు. 1963 వరకు తిరిగి రాలేదు. అప్పుడు నదీర్ వయస్సు 12 ఏళ్లు.
"అన్నతో నేను ఎక్కువ సమయాన్ని గడపలేకపోయా. కానీ అమెరికా వెళ్లకముందు, తిరిగొచ్చిన తర్వాత నా జీవితంపై అన్న ప్రభావం ఎక్కువ" అంటారు నదీర్.
1963లో ఆది వయస్సు 21 ఏళ్లు. అప్పటికే మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు. వస్తూవస్తూనే ఫ్యామిలీ బిజినెస్‌లో అడుగు పెట్టేశాడు. "అప్పట్నుంచీ ఇప్పటి వరకు యాభై రెండేళ్లుగా ఈ బిజినెస్ లో పనిచేస్తున్నాడు" అని అన్న ఆది గురించి నదీర్ గర్వంగా చెబుతాడు. నదీర్ కూడా అన్నలాగే పైచదువులు చదివాడు. 26 ఏళ్ల వయస్సప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోని ఎంఐటీలో, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో రెండు మాస్టర్ డిగ్రీస్ సంపాదించాడు.
"మా అన్న నాకన్నా మేధావి. కానీ విద్యావంతుడు కాదు. నేను మాత్రం అంత మేధావి కాదు... కానీ విద్యావంతుడిని" అని ఇద్దరి మధ్య తేడాను వివరిస్తున్నాడు నదీర్.
నదీర్ కు భాషలపై ఆసక్తి ఎక్కువ. ఆరు భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. చరిత్ర, భౌగోళిక శాస్త్రాలపై పట్టుంది. ఒక్కమాటలో చెప్పాలంటే గోద్రెజ్ కుటుంబంలో చాలావరకు విద్యావంతులే.
అమ్మా... నాన్న... నదీర్...
నదీర్ పై తండ్రి ప్రభావం ఎక్కువ. చిన్న వయస్సులోనే నదీర్ కు కెమిస్ట్రీ గురించి చెప్పాడు తండ్రి బుర్జోర్. ఎంఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి అదే కారణమంటాడు నదీర్. "1973లో ఓ ప్రాజెక్ట్ కోసం మా హెచ్ఓడీతో కలిసి పనిచేశాను. అప్పుడే నాకు చాలా విషయాలపై అవగాహన వచ్చింది. హర్ గోబింద్ ఖురానా ల్యాబ్ లో బయాలజీ గురించీ కొంత తెలుసుకున్నాను. అప్పుడు ఎంఐటీలో రీసెర్చ్ చేయకుండా ఉండి ఉంటే ఇప్పుడు చాలా బాధపడేవాణ్ణి. ఎందుకంటే... ఇంటెల్, ఐడీజీ, హెచ్ పీ, పోలరాయిడ్ లాంటి కంపెనీలన్నీ ఎంఐటీ నుంచే పుట్టుకొచ్చాయి" విద్యాభ్యాసం గురించి నదీర్ చెప్పే మాటలివి.
ఆ అవగాహనతోనే తన వ్యాపారాలు సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయంటాడు నదీర్. నదీర్పై తల్లి జై గోద్రెజ్ ప్రభావం కూడా ఉంది. 1960వ దశకం మధ్యలో చైల్డ్ సైకాలజీ నేర్చుకోవడానికి ఒరీగన్ యూనివర్సిటీలో చేరారామె. నదీర్ అన్నలాగే చాలా మేధావి. ఇంగ్లీష్ టీచర్ కూడా. సర్కస్‌లో రింగ్ మాస్టర్లా క్లాస్‌ని స్వేచ్ఛగా నడిపేవారన్న పేరుంది. నదీర్ అమ్మమ్మ స్ఫూర్తితో కవితలు కూడా రాశాడు. స్వాతంత్ర ఉద్యమం సమయంలో నదీర్ అమ్మమ్మ రాసిన కవితలు వారపత్రికల్లో ప్రచురితమయ్యాయి.
వ్యాపారం వైపు అడుగులు
ఎమర్జెన్సీ సమయంలో అంటే 1976లో నదీర్ ఇండియాకు తిరిగొచ్చాడు. "నీ అవసరం చాలా ఉంది. వెంటనే రా" అన్న సోదరుడు ఆది పిలుపు మేరకు వ్యాపారంలో అడుగుపెట్టాడు నదీర్. నదీర్ రాకతో గోద్రెజ్ వ్యాపారం విస్తరించింది. కానీ 2000వ సంవత్సరంలో బిజినెస్ కు బూమ్ వచ్చింది. కొన్ని సంవత్సరాల ఆటుపోట్ల ప్రయాణంలో అనేక ప్రయోగాలు, విస్తరణలు జరిగాయి. గోద్రెజ్ ఇండస్ట్రీస్, ప్రాపర్టీస్, కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఆగ్రోవెట్, నేచర్స్ బాస్కెట్, ఇన్ఫోటెక్, ఇఫాసెక్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, గోద్రెజ్ అండ్ బోయ్స్, గోద్రెజ్ టైసన్, గోద్రెజ్ ఇంటీరియో లాంటి వ్యాపారాలతో గోద్రెజ్ విస్తరించింది. విస్తరిస్తూనే ఉంది. ప్రస్తుతం భారతదేశంలో కార్పోరేట్ సామ్రాజ్యాల్లో గోద్రెజ్ కూడా ఒకటి. వ్యవసాయాధార వ్యాపార సంస్థలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు గుడ్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. డిజిటల్ మార్కెట్లో అడుగు పెట్టారు. నలభై కోట్లతో నేచర్ బాస్కెట్ లో పెట్టుబడులు పెట్టారు. అన్ని వ్యాపారాల్లో అడుగుపెట్టాలన్నది నదీర్ ఆశ. వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని నిలబెట్టాలంటే మార్పులను స్వీకరించక తప్పదు. అందుకే కొత్తకొత్త వ్యాపారాల్లో అడుగుపెడుతోంది గోద్రెజ్.
"వారసత్వంగా వచ్చిన వ్యాపారం, వంశపారపర్యంగా వచ్చిన అవకాశాలు, పెద్దపెద్ద బిజినెస్ లు ఉండటం మాకు అనుకూలం కాదు. మేం చేసిన గ్రౌండ్ వర్క్, మా నిర్వహణా వ్యవస్థే మాకు బలం. బయటి సంస్థలతో మేం భాగస్వాములమవుతాం. ఎందుకంటే... అన్నీ మేమే చేయాలి. అన్నీ మేమే చేయగలం అని మాత్రం అనుకోం. అందుకే బయటి సంస్థలపై ఆధారపడుతుంటాం. ఎక్కడైతే మిగతా సంస్థలు మాకంటే నైపుణ్యంగా ఉంటాయో అలాంటి సంస్థలపై ఆధారపడుతుంటాం" ఇదీ నదీర్ సక్సెస్ సీక్రెట్.
గోద్రెజ్ ల వ్యాపార సామ్రాజ్యం నదీర్ తో ముగిసిపోలేదు. ఆయన తర్వాతి తరాలు కూడా గోద్రెజ్ ల వ్యాపార విస్తరణలో తమ ముద్ర వేస్తున్నారు. నదీర్ మేనకోడలు నీసా గోద్రెజ్... గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్. జీసీపీఎల్, గోద్రెజ్ ఆగ్రోవెట్, టీచ్ ఫర్ ఇండియా లో బోర్డ్ మెంబర్.
"పర్యావరణపరంగా మేలు, సమాజానికి మంచి చెయ్యడమే మా లక్ష్యం. అంటే మాది సోషల్ ఎంటర్ ప్రైజ్ లాంటిది. వాతావరణ మార్పు సమస్యను పరిష్కరించేందుకు వీలైనంతగా మేలు చెయ్యడమే నా లక్ష్యం. ఎవరూ చేయి అందించలేకపోతే మేం అందిస్తాం. ఇన్నోవేషన్ కోసం కావాల్సిన పెట్టుబడులను సమకూర్చేందుకు గోద్రెజ్ గ్రూప్ నిబద్ధతతో పనిచేస్తోంది. గోద్రెజ్ గ్రూప్ వేగంగా విస్తరించేందుకు ఇలాంటి ఇన్నోవేషన్ ప్రోగ్రామ్సే కారణం"
యువతకు ప్రోత్సాహం
ఇన్నోవేషన్ ను వేగవంతం చేసే యువ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు గోద్రెజ్ గ్రూప్ లో ఉన్నారు. బెస్ట్ మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్స్ కి లౌడ్ పేరుతో ప్రైజులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. కలలను నిజం చేసుకోవాలనుకునే యువతీయువకులకు గోద్రెజ్ గ్రూప్ అందిస్తున్న ప్రోత్సాహం గొప్పది. మరోవైపు గోద్రెజ్ కల్చరల్ ల్యాబ్... ఉద్యోగుల వ్యక్తిగత, ఉద్యోగ జీవితాల్లో చేయూతనందిస్తోంది.
వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేస్తున్న గోద్రెజ్ ల వారసుడు నదీర్ గోద్రెజ్ ... ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారమైన 'ఓర్డ్ర్ నేషనల్ డి లా లిజీయన్ డిహన్యూర్' అవార్డు దక్కించుకున్నారు. "గత తొమ్మిది పదేళ్లుగా అసలైన విజయాన్ని చూస్తున్నారు. ప్రస్తుతం నా వయస్సు 63. మా టీమ్ ను పరిగెత్తించడమే నా లక్ష్యం" అంటాడు నదీర్. నిజమే... నదీర్ గోద్రెజ్ స్ఫూర్తినిచ్చే మంచి లీడర్. నవ్వుతూ, తుళ్లుతూ కనిపించే ఓ విజయసారథి. ఇంత సాధించినా... "చూడాల్సింది ఇంకా మిగిలే ఉంది" అంటాడు.