చిన్న కిరాణా దుకాణాలనూ ఆన్లైన్ బాట పట్టిస్తున్న 'జిఫ్ స్టోర్స్'
భారత్‌లో మొబైల్ విప్లవం ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. వ్యాపార అవకాశాలను మోసుకొచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని గతేడాది మొబైల్ స్పార్క్స్ (MobileSparks)ను ప్రారంభించాం. మొబైల్ స్టార్టప్స్‌కు ఊతమివ్వాలనేది దీని లక్ష్యం. ప్రజల అరచేతుల్లోకి టెక్నాలజీని మోసుకొచ్చింది మొబైల్. 2011లో ప్రారంభమైన ఈ-కామర్స్ రంగంలో ఎంతోమంది తమ ప్రతిభ చాటుకుంటున్నారు. అమ్మకందార్లకు ఆన్లైన్ చాలా సులువైన మార్గంగా మారింది. అంతేకాక పెట్టిన పెట్టుబడులకు తగిన ఆదాయాన్ని ఇవ్వడంలో కూడా ఇది ఎంతో ముందుంది. చిన్న స్టోర్లకు, సూపర్ మార్కెట్లకు ఆన్ లైన్ మార్కెట్ ఎన్నో అవకాశాలు కల్పిస్తోంది. అలాంటిదే జిఫ్ స్టోర్ (Jiffstore).
చిన్న దుకాణాలు, సూపర్ మార్కెట్లను వినియోగదారుల చెంతకు చేరేందుకు జిఫ్ స్టోర్ మంచి వేదిక. దీని ద్వారా అమ్మకందార్లు కస్టమర్స్‌ను చేరుకోవడం చాలా సులభం. వినియోగదారులు 3 చిన్న స్టెప్స్ ద్వారా ఆర్డర్ చేస్తే చాలు.. వాళ్ల దగ్గరికే నేరుగా డెలివరీ చేస్తారు. ఆన్ లైన్ మార్కెట్‌కు సంబంధించి జిఫ్ స్టోర్ దుకాణదారుకు అన్ని అంశాలూ వివరిస్తుంది. మార్కెటింగ్ టెక్నిక్స్, గ్లోబలైజేషన్లో వ్యాపార పద్ధతులు, కస్టమర్‌ను ఆకట్టుకునే మార్గాలు, మొబైల్ ద్వారా అందుబాటులో ఉన్న పద్ధతులు.. ఇలా అన్నింటిపైనా అవగాహన కల్పిస్తుంది. నెలకోసారి పేమెంట్ చేయడం ద్వారా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.
సతీశ్ బసవరాజ్, అశ్విన్ రామ్, షమీల్ అబ్దుల్లా, సందీప్ అనే నలుగురు వ్యక్తులు జిఫ్ స్టోర్‌ను ప్రారంభించారు. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ అయిన వీరందరికీ మొబైల్, ఇంటర్నెట్లపై 20 ఏళ్లకు పైగా అనుభవముంది. Tlabsలో జిఫ్ స్టోర్ తర్ఫీదు పొందింది. ప్రస్తుతం ఇది బెంగళూరులో 25కు పైగా దుకాణాలను నడిపిస్తోంది.
ఈ వ్యాపారంలో ప్రధాన ఆటంకం దుకాణదారులను ఒప్పించడమే. ఎందుకంటే చాలా మందికి మొబైల్ ద్వారా వ్యాపారం చేయొచ్చు అని తెలియదు. టెక్నాలజీపైన అవగాహన లేనివాళ్లు ఇలాంటి బిజినెస్‌కు ఒప్పుకోరు. “ మెట్రో నగరాలు, టైర్ వన్ సిటీలలోని సూపర్ మార్కెట్లు, రిటైల్ స్టోర్లను సాధించడమే ఇప్పుడు మా టార్గెట్ ” అన్నారు సతీష్. ఆ తర్వాత మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలనేది వారి ప్రణాళిక. రిటైల్ స్టోర్‌నే ఒక డిస్ట్రిబ్యూటర్‌గా పరిగణిస్తారు. అలా చేయడం వల్ల స్టోర్ యజమాని సంతృప్తి చెందుతాడు. నేరుగా దుకాణానికే మొబైల్ ద్వారా ఆర్డర్ అందుతుంది. మధ్యలో ఒకరు ఆర్డరు తీసుకోవడం.. వాళ్లు దుకాణదారుకు ఆర్డరివ్వడం.. లాంటి ఆటంకాలు ఇందులో ఉండవు. కస్టమర్ నేరుగా దుకాణదారుకే ఆర్డర్ చేసి వస్తువులు పొందుతారు.
“ ఇప్పుడైతే మంచి స్పందన లభిస్తోంది. వినియోగదారులతో పోల్చితే ముఖ్యంగా దుకాణదారుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడిప్పుడే దీనికి ప్రచారం లభిస్తోంది. దీంతో ఆర్డర్స్ కూడా లభిస్తున్నాయి” అని చెప్పారు సతీశ్. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్, ఐవోఎస్ సాఫ్ట్వేర్లలో అప్లికేషన్ లభిస్తోంది. ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న దుకాణదారులు రోజుకు కనీసం రెండు ఆర్డర్లయినా దక్కించుకుంటున్నారు.
మీరు స్టోర్ ఓనర్ అయితే జిఫ్ స్టోర్ లో సైన్ అప్ అయి భాగస్వామిగా మారవచ్చు. మొబైల్ ద్వారా స్టార్టప్ రంగంలోకి ప్రవేశించాలనుకుంటే మొబైల్ స్పార్క్స్ ను సంప్రదించవచ్చు.