ఒకప్పుడు సాధారణ గుమస్తా.. నేడు రూ.10 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి అధిపతి
గుమస్తాకు పెద్దగా కలలేం ఉంటాయి చెప్పండి? మహా అయితే ఏడాదికోసారి ఇంక్రిమెంట్. కంపెనీ దయతలిస్తే పండగకోసారి బోనస్. ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగం. గొర్రెతోక బెత్తెడు అన్నట్టు జీతం. దానికి మించి ఊహించడం కూడా అత్యాశే. అలా ఆలోచించాలంటే గట్స్ ఉండాలి. ఖలేజా ఉండాలి. కోటీశ్వరుడు కావాలని కలలు కనడంలో తప్పులేదు. కానీ వాటిని సాకారం చేసుకోడానికి గుండె ధైర్యం కావాలి. అవన్నీ పుష్కలంగా ఉన్న వ్యక్తి ఛోటూ శర్మ. ఒకప్పడు గుమస్తాగా ఉన్న అతను.. ఇవాళ పది కోట్ల టర్నోవర్ చేసే సాఫ్ట్ వేర్ కంపెనీకి అధిపతి అంటే నమ్మలేం.
ఏ ఛోటూ టీ పట్రా.. ఏ ఛోటూ ఆ ఫైల్ తీసుకురా.. ఇలాంటి ఆర్డర్లను శిరసావహించిన వ్యక్తి ఒక సంస్థకు సీఈవో అయ్యాడూ అంటే.. ఇదంతా రాత్రికి రాత్రి జరిగింది కాదు. హిమాచల్ ప్రదేశ్ లోని మారుమూల గ్రామానికి చెందిన ఛోటూ శర్మ సాదాసీదా గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. కానీ మనసులో ఎక్కడో చదువుకోవాలన్న తపన అలాగే వుండిపోయింది. అందుకే పగలు డ్యూటీ.. రాత్రి చదువు.
1998లో ధలియారా కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. కంప్యూటర్ కోర్స్ చేయాలని వుంది. కానీ చేతిలో డబ్బు లేదు. ఫీజు కట్టడానికి కనీసం ఐదు వేలు కూడా లేని నిస్సహాయత. అయినా సరే రాజీపడలేదు. కంప్యూటర్ తెలిసుంటే భవిష్యత్ ఉంటుందని భావించాడు. ఆ సంకల్పంతోనే చండీగఢ్ వచ్చాడు.
రానైతే వచ్చాడు కానీ ముందు ఎంతోకొంత సంపాదించాలి. కనీసం రోజు ఖర్చులైనా గడవాలి. అందుకే ఒక కంప్యూటర్ సెంటర్లో గుమస్తాగా చేరాడు. అందులో డ్యూటీ చేస్తూనే రాత్రిళ్లు కంప్యూటర్ కోర్స్ చేశాడు. మొత్తానికి మైక్రోసాఫ్ట్ డెవలపర్ గా సర్టిఫికెట్ సంపాదించాడు.
డబ్బులు సరిపోక రాత్రిళ్లు పస్తులు పడుకున్న సందర్భాలు లెక్కలేవు. ఈలోగా ఒకచోట చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పే అవకాశం వచ్చింది. ఎక్కడికి వెళ్లినా కాలినడకే. సైకిల్ కూడా లేదు. ఒక్కో పైసా కూడబెట్టి ముందుగా ఒక బైక్ కొన్నాడు. రెండేళ్ల తర్వాత కంప్యూటర్ తీసుకున్నాడు.
చేతిలో సర్టిఫికెట్.. ఇంట్లో కంప్యూటర్. సాఫ్ట్ వేర్ డెవలపర్ గా మరింత రాటుదేలాడు. ఆప్టెక్ కంప్యూటర్ సెంటర్లో ఫ్యాకల్టీగా చేరాడు. ఆ ఉద్యోగం చేస్తూనే టైం దొరికినప్పుడల్లా మధ్యాహ్నం, సాయంత్రం కొంతమందికి క్లాసులు కూడా చెప్పేవాడు. అలా చేతిలో కొంత డబ్బు కనిపించింది. అయితే ఛోటూ శర్మ లక్ష్యం ఇది కాదు. ఒక కంప్యూటర్ సెంటర్ పెట్టాలనేది అతడి ప్లాన్.
డబుల్ బెడ్రూం ఫ్లాట్ ఒకటి అద్దెకు తీసుకున్నాడు. అందులో కంప్యూటర్ సెంటర్ స్టార్ట్ చేశాడు. 6 నెలలు తిరిగేసరికి 80 స్టూడెంట్స్ అయ్యారు. అందులో ట్రైన్ అయిన విద్యార్ధులకు పెద్ద పెద్ద కంపెనీల్లో ప్లేస్ మెంట్స్ దొరికాయి.
రోజులు గడుస్తున్నా కొద్దీ ఛోటూ శర్మ ఇన్ స్టిట్యూట్ పై జనాల్లో నమ్మకం పెరిగింది. పరపతీ పెరిగింది. అలా 2007లో సీఎస్ ఇన్ఫోటెక్ అనే సంస్థను వేర్వేరు చోట్ల స్థాపించాడు. ప్రస్తుతం అతని కోచింగ్ సెంటర్లో వెయ్యిమందికి పైగా విద్యార్దులన్నారు. 150 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఏడాది తిరక్కముందే కంపెనీ టర్నోవర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఎంత లేదన్నా ఛోటూ శర్మ వార్షిక ఆదాయం పదికోట్లకు పైమాటే.
సంపాదన ఒక్కటే కాదు.. సామాజిక సేవ చేయడంలోనూ ఛోటూ శర్మ ముందుంటాడు. పేద పిల్లల చదువు కోసం తనవంతు సాయం చేస్తుంటాడు.