పెళ్లి ఫోటోలంటే గుర్తొచ్చే పేరు ది ఫోటో డైరీ
ఆర్ట్ కి సైన్స్ కి సరిపడదు.. అందుకే మనసంతా కళల్ని నింపుకున్న మోనీషా సైకాలజీ చదువులో ఇమడలేకపోయారు. మాహిమ్ లోని డి జె రూపాల్ కాలేజిలో సైకాలజీ డిగ్రీ చేస్తున్న మోనీషా అజ్గావోంకర్ కి ఈ సైకాలజీకి తనకి సరిపడదని అర్థం కావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. ది ఫోటో డైరీ ఫౌండర్ గా ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన మోనీషా ఒకప్పుడు తన చదువుకి సగంలోనే ఫుల్ స్టాప్ పెట్టేసి ఒక ఏడాది ఖాళీగా కూర్చుని తనకేది ఇష్టమో ఆలోచించారు.
ఆమెకి ఓ నోకియా ఫోన్ వుండేది. అప్పుడప్పుడే ఫోన్లలో కెమెరాలు వస్తున్న కాలమది. చేతిలో వున్న నోకియా 6600 ఫోన్ తో కనపడిన వాటినన్నటినీ ఫోటోలు తీయడం మొదలుపెట్టింది. అవి బాగున్నాయని అంతా అనడంతో నెమ్మదిగా తనలో ఓ ఫోటోగ్రాఫర్ వుందని మోనీషాకి అర్థమయింది. తన భవిష్యత్తును కెమెరాలో చూసుకుంది.
ఆ తర్వాత తన అభిరుచికి కొంత అధ్యయనం కూడా కావాలనిపించి, జెజె కాలేజీలో ఫోటోగ్రఫీ పార్ట్ టైమ్ కోర్సులో జాయిన్ అయ్యారు. నిజానికి ఆమె అక్కడ నేర్చుకున్నదానికంటే, ఆ తర్వాత ఫోటోగ్రాఫర్ గా తను అనుభవంలో నేర్చుకున్నది వేయిరెట్లు ఎక్కువే. స్కూలు, కాలేజీ అయినా.. తొలిపాఠాలు నేర్పగలవే కానీ, ప్రావీణ్యాన్ని ఇవ్వలేవని మోనీషా నమ్మకం. మన స్కిల్స్, మన పరిచయాలు.. అన్నీ మన ప్రతిభకి అద్దంపడతాయి. అందుకే మోనీషా పనిచేసే ప్రతిరోజు ఏదో ఒక కొత్త పాఠం నేర్చుకుంటూ వుంటారు. ఇప్పటికీ ఆమెకి ప్రతి ఫోటో తీసిన తర్వాత ఇంకొక యాంగిల్ లో అయితే, మరోలా లైటింగ్ చేసుంటే ఇంకా బావుండేదనిపిస్తూ వుంటుంది.
నిజానికి మోనీషా ఫోటోగ్రఫీ కెరీర్ కూడా అనుకోకుండానే మొదలైంది. తనకి బాగాఇష్టమైన ఓ ఫ్రెండ్ కి మ్యూజిక్ కన్సర్టలంటే ఇష్టం. ఆ ఫ్రెండుని ఇంప్రెస్ చేయడానికి మోనీషా కూడా కన్సర్ట్ లకు వెళ్లి వాటిని షూట్ చేసేది. అలా ఆమెకి ఇటు సంగీతం మీదా.. అటు ఫోటోగ్రఫీ మీదా కూడా మక్కువ పెరిగింది.
ఆ తర్వాత చిన్న చిన్న అసైన్ మెంట్లు చేసిన మోనీషా.. రోలింగ్ స్టోన్స్ , ఇతర పేజ్ 3 పార్టీస్ , ఫ్యాషన్ ఈవెంట్స్ కవర్ చేసారు. వాటిల్లో బాగా పేరొచ్చాక.. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వైపు వెళ్ళారు. అది కూడా ఒక ఫ్రెండ్ పెళ్ళిని కవర్ చేయడంతోనే మొదలైంది. అయితే, ఆ క్యాథలిక్ పెళ్ళి షూటింగ్ అనుభవమే.. ది ఫోటో డైరీ స్థాపనకు నాంది పలికింది...
మోనీషాకి ఫోటోగ్రఫీ అంటే ఎంత ఇష్టమో.. సంగీతం అంటే కూడా అంతే ఇష్టం.. ముఖ్యంగా మ్యూజిక్ కాన్సెర్ట్స్ కి అటెండ్ అవడం బాగా ఇష్టపడతారు. అక్కడికొచ్చే కళాకారులతో మాట్లాడుతున్నప్పుడు, సంగీతం గురించి, ఫోటోగ్రఫీ గురించీ కూడా చాలా విషయాలు తెలుస్తాయని మోనీషా చెప్తారు.
చాలా కన్సెర్ట్లు షూట్ చేసినా, ఎన్ హెచ్ 7ని మోనీషా తన ఫేవరెట్ గా చెప్తారు., ఈ మధ్యే ఢిల్లీ లో జరిగిన టెన్ హెడ్స్ ఫెస్టివల్ కూడా ఆమె కవర్ చేసారు
ఆ క్షణాన్ని మనం ఫీల్ అవ్వాలి.. అందులో మనం మమేకం కావాలి.. ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్ ని ఫాలో అవ్వాలి. ఈ మూడూ మంచి ఫోటో తీయడానికి మూడు సూత్రాలని మొనీషా చెప్తారు..
ఇందుకు మంచి ఉదాహరణ పెళ్ళిళ్ళు.. అందులో చాలా ఘట్టాలుంటాయి. కొన్ని కొన్ని క్షణాలు తర్వాత కాలంలో అపురూప జ్ఞాపకాలుగా మారతాయని అక్కడ వున్న వారికి కూడా తెలియదు. కానీ ఫోటోగ్రాఫర్ వాటిని పదిలంగా అందించాలి. ఆ క్షణాల్లో వుండే మాధుర్యాన్ని తన ఫోటోల్లో పదిల పరిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్తారు మోనీషా.
మోనీషా జీవితంలో మరిచిపోలేని మరో అనుభవం ఈ మధ్యే ఎదురైంది. ఆమె వజీర్ సినిమాకు అమితాబచ్చన్ ను ఫోటో షూట్ చేసింది. అంతటి లెజెండ్ ని షూట్ చేసిన ఆ క్షణాలు ఎంత గొప్పవో చెప్పలేనంటారామె. అనుభవం నేర్పే పాఠాల విలువేంటో బిగ్ బీని చూసాకే అర్థమయిందని మోనీషా గుర్తుచేసుకున్నారు..
ది ఫోటో డైరీ ని విస్తరించడం ఎలా?
ఫోటోగ్రఫీలో మోనీషా చేయని ప్రక్రియ లేదు. వెళ్ళని ఫీల్డ్ లేదు. అయితే, పెళ్ళిళ్ళు, కన్సర్ట్ లు, ఫ్యాషన్ ఈవెంట్స్ షూటింగ్ మోనీషా స్పెషలైజేషన్. ప్రత్యేకించి వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించినంత వరకు ది ఫోటో డైరీ లో చాలా స్పెషలైజేషన్స్ వున్నాయి.
ప్రీ వెడ్డింగ్ షూట్స్, మూవీస్, వెడ్డింగ్ మూవీస్,వెడ్డింగ్ పిక్చర్స్, ఇలా అన్నిరకాలూ అందించే ఒక వన్ స్టాప్ షాప్.. ది ఫోటో డైరీ. మిగిలిన వాటితో పోలిస్తే, ప్రస్తుతం ఆమెకి వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో తన క్రియేటివిటీకి ఎక్కువ అవకాశాలున్నాయనిపిస్తోంది. అందుకే దీనికే వీలైనంత టైమ్ కేటాయించాలను నిర్ణయించుకున్నారు. వెడ్డింగ్ లోనే మరిన్ని విభిన్నమై మార్కెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే అమెరికా లో కానీ, కెనెడాలో కానీ బ్రాంచ్ ప్రారంభించి అంతర్జాతీయంగా విస్తరించే ఆలోచనలో వున్నారు.