కలలను కథలుగా మారుస్తున్న సిద్ధార్థ జోషి
ప్రతీ ఒక్కరికీ కలలు, కోరికలు..చూసేవాళ్లకి అసాధ్యం అనిపించే ఆకాంక్షలు..మీ కలేంటో చెప్పండి అంటూ అడిగి తెలుసుకుంటున్న సిద్ధార్ధ..కలలు కనేవారికి, నెరవేర్చగలిగేవారికి వారధిగా మారే యత్నం..
పూనే రోడ్ల నుంచి... సింగపూర్ స్కైస్క్రాపర్స్ వరకూ.. సిద్ధార్ధ జోషి ఎవరిని కలిసినా అడిగే ప్రశ్న ఒకటే. మీ కల ఏంటో చెప్పండి అనే.! జీవితాలను ఫోటోల రూపంలో చిత్రీకరిస్తున్న సిద్ధార్ధ.. ఎప్పుడూ కొత్తగా ఏ ఫోటో తీయాలా.. ఏ కథని దృశ్యరూపంలో వర్ణించాలా అని ఆలోచిస్తుంటారు. వృత్తి రీత్యా ఇండస్ట్రియల్ డిజైనర్ అయినా... ఈయన ప్రఖ్యాత ట్రావెల్ బ్లాగ్ నిర్వాహకుడు, ఫోటోగ్రాఫర్ కూడా. తన చుట్టూ ఉండే వ్యక్తుల ఫోటోలు తీయడం, వారి కలల గురించి తెలుసుకోవడంతో సాధారణంగా మొదలైన ఈ ప్రయాణం... ఇప్పుడు సమాజంపై ప్రభావం చూపే ప్రాజెక్ట్ అయిన 'టెల్ మీ యువర్ డ్రీమ్'గా రూపాంతం చెందింది.
కలల కథలు మొదలయ్యిందిలా
“మా నాన్నగారి దగ్గర ఎప్పడూ కేమెరా ఉండేది. నా చేతికి కేమెరా అందింది, నాకు దానిపై ఇష్టం కలిగిందీ ఆయననుంచే. కాలంతోపాటు నేను ట్రావెలర్‌గా మారి మధుర క్షణాలను కేమేరాతో బంధించడం ప్రారంభించాను. ఒకరితో ఒకరు కలలు పంచుకోవడానికి.. కలుసుకోవడానికి కేమెరాని మంచి సాధనంగా ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. కథలను ఫోటోల రూపంలో భద్రపరచడం ద్వారా.. వాటిలో కొన్నిటినైనా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నాను” అంటూ ఫోటోగ్రఫీతో తన అనుబంధాన్ని వివరించారు సిద్ధార్ధ.
టెల్ మీ యువర్ డ్రీమ్
కిరాణా షాప్ వ్యక్తి, చాకలి, చెత్తను పోగు చేసేవ్యక్తి.. 'టెల్ మీ యువర్ డ్రీమ్' ప్రాజెక్ట్ ప్రారంభమైంది వీళ్లతోనే అంటున్నారు సిద్ధార్ధ. కలల గురించి చెప్పేటప్పుడు వారి మొహంలో కనిపించే అమాకత్వం, ఆశ, కోరికలను సిద్ధార్ధ చిత్రీకరిస్తారు. ఫోటోల సంఖ్య పెరుగుతున్న కొద్దీ.. సోషల్ మీడియాలో ఈ కాన్సెప్ట్‌కి ఫాలోయర్స్ సంఖ్య పెరగసాగింది. దీంతో సిద్ధార్ధ మరింత ప్రేరణ పొంది.. మరిన్ని ప్రాంతాలకు ప్రయాణించి.. కలలు, కోరికలను చిత్రీకరించడం ప్రారంభించారు. కొన్నాళ్లు గడిచేసరికి.. వీలైనంత వరకూ ఈ కలలను నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందని భావించడం మొదలుపెట్టారాయన. ఇప్పుడు చైతన్య మహిళా మండలితో కలిసి.. కలలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు సిద్ధార్ధ. సాధారణంగా ప్రజలెవరూ పట్టించుకోని విషయాలను ఫోటోగ్రాఫ్‌లు తీస్తారు.
మహరాష్ట్రలోని రెడ్ లైట్ ఏరియా, ఉత్తర్ ప్రదేశ్ రైతులతోపాటు ఉద్యోగరీత్యా సింగపూర్ వెళ్లాల్సి రావడంతో... అక్కడ కూడా తన ప్రాజెక్ట్ కొనసాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కలలను ఫోటోలుగా బంధిస్తున్నారు సిద్ధార్ధ. ఆయా స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల గురించి ప్రపంచానికి తెలియచేసి, నిధుల సేకరణలో వారికి సహాయం చేసేందుకు.. మరిన్ని సంస్థలతో కలిసి పని చేసేందుకు సిద్ధార్ధ ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇప్పటికీ.
# Tell me your dream 2015. What is your dream ? "నేను ఇప్పుడు చేస్తున్నవాటికే పరిమితం కాకుండా.. మరెన్నో సాధించాలని అనుకుంటున్నాను. ఓ హోటల్‌లో పని చేయాలని అనుకుంటున్నాను"అని చెబ్తున్నారు రాజేష్. పూనేలో బహ్రూపియా(వేషాలు వేసుకునే కళాకారుడు)గా పని చేస్తాడు రాజేష్. పూనేలోనే మరికొంతమంది బహ్‌రూపియాలతో కలిసి ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్న రాజేష్.. రోజంతా ఇతరులను డబ్బులు అభ్యర్ధిస్తూనే ఉంటాడు. భరతఖండంలోనే కనిపించే బహ్‌రూపియాలు.. కళకు ప్రాచుర్యం ఉన్న కొన్ని దశాబ్దాల క్రితం బాగా వెలుగొందారు. మృతస్థితికి చేరుకున్న ఈ కళను ఇంకా కొనసాగిస్తున్నవారు అతికొద్ది మందే. గతంలో వీరు ఇతరుల మాదిరిగా వేషభాషలు మార్చుకుని.. సామాజికంగా జరుపుకున్న కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేసేవారు. ఈ వేషధారణ ఎవరినైనా ఆకట్టుకుంటే వారి నుంచి రివార్డులు దక్కేవి. లేకుంటే బక్షీష్ రూపంలో కొంతమొత్తం గిట్టుబాటు అయ్యేది. 15ఏళ్ల రాజేష్.. కుటుంబంత సహా కర్నాటక నుంచి వచ్చి పూనేలో స్థిరపడ్డాడు. ఏడో తరగతి వరకూ చదివిన ఇతనికి... రోజూ తాను సంపాదించే మొత్తాన్ని లెక్కపెట్టుకునేందుకు విద్య ఉపయోగపడుతోంది. - నిరంతరాయంగా 365రోజులపాటూ.... కలలను పోగు చేసే టెల్ మీ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఇదొక భాగం. ప్రతీ రోజూ ఒక కల చొప్పున చేస్తున్న ఈ ప్రయత్నానికి అనేకమంది నుంచి మద్దతు లభిస్తోంది. ఒక ఫోటోతో స్టోరీని షేర్ చేయచ్చు. షేర్ చేసే ఆ ఫోటో ఎవరిదైనా కావచ్చు. [email protected]కు స్టోరీ మెయిల్ చేయడం లేదా.. ఫోటోని పంపినా చాలు.. అక్కడి నుంచి మేం చూసుకుంటాం అంటున్నాం-28 ఏప్రిల్ 2015)
అనుభవాలు
విభిన్న స్థాయిలు, వ్యక్తిత్వాలతో కూడిన మనుషులను కలవడం చాలా ఉత్సాహాన్నిస్తుందంటారు సిద్ధార్ధ్. ‘ఒకసారి చెత్తను పోగు చేసుకుంటున్న ఓ బాలుడిని కలిసి... అతని కల ఏంటి అని అడిగాను. తాను డాక్టర్ కావాలని అనుకుంటున్నట్లు చెప్పాడతను’అన్నారు సిద్ధార్ధ.
ఇలాంటి కలలు గుండెలను పిండేస్తాయి. అంతే కాదు వారికి ఏదో ఒక సాయం చేయాలనే ఆలోచన కలిగిస్తాయి. అలాగ గోవాలోని ఓ వృద్ధురాలు సిద్ధార్ధ మదిపై చెరగని ముద్ర వేసింది. ఆమె ఇంకా తన కళ్ల ముందు మెదులుతున్నట్లే ఉంటుందంటారాయన. “ఆమె ఓ పురాతన కాలం నాటి ఇంట్లో జీవిస్తోంది. తన జీవితం మొత్తం ఆ ఇంటిలోనే గడిపిన ఆమె... దాన్ని కాపాడుకునేందుకు జీవితం మొత్తం కష్టపడుతూనే ఉంది. అయితే అన్ని అనుభవాలు అందంగా ఉండవు. ఫోటోగ్రాఫ్ తీసుకునేందుకు అందరూ అనుమతించకపోవచ్చు. ఆమె చేసిందదే. కానీ ఇలాంటి నిరాకరించే అనుభవం ఎదురైనపుడు.. మరుసటి వ్యక్తిని కలిసేందుకు కొంత ఆందోళన చెందేవాడిని” అన్నారు సిద్ధార్ధ.
ఉత్తరాఖండ్‌కు చెందిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయిన సిద్ధార్ధ.. బీహార్‌లో జన్మించి, ఇప్పుడు పూనేలో నివసిస్తున్నారు. దేశంలోని పలు దిక్కులతో పరిచయం ఉండడంతో... తన ఆలోచనలు, పనితీరుతో... ఎంతో పరిణతి కనిపిస్తుది. ఈ కలలు, ఫోటోల ప్రయాణంలో చాలా నేర్చుకున్నానని చెబ్తున్నారు.
“ఎక్కువగా ప్రయాణాలు చేయడంతో.. ప్రజలను ఎలా ఉన్నవారిని అలాగే యాక్సెప్ట్ చేయగలుగుతాను. ప్రతీ ఒక్కరిలోనూ ఏదో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ విశాల ప్రపంచంలో ప్రతీ ఒక్కరి అభిప్రాయాలు, నమ్మకాలు విభిన్నంగా ఉంటాయి. ఈ ప్రపంచం ఎంతో భద్రతని అందిస్తుందని, ఎవరికైనా ఎక్కడినుంచి వచ్చినవారికైనా తమ ఆకాంక్షలను తెలిపేందుకు, సాధించుకునేందుకు అవకాశం ఇచ్చిందని అనిపిస్తుంది”-సిద్ధార్ధ జోషి.
ప్రేరణ కలిగింది ఇలా
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్ధి నుంచి స్ఫూర్తి పొందానంటారు సిద్ధార్ధ. “ సత్యార్ధి చేస్తున్న పనిని ఎంతగా ప్రశంసించినా తక్కువే. తనతో కలిసి పని చేయాలనేది నా కోరిక. అలాగే 'హెల్ప్‌ఏజ్ ఇండియా' కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుంది. నా కార్యక్రమానికి ఎంతో సహాయం చేస్తున్న హెల్ప్ఏజ్... ఈ ప్రాజెక్టుకు ఇన్‌స్టాగ్రామ్‌లో మద్దతునిస్తున్నారం”టూ తనకు ప్రేరణనిచ్చిన విషయాలను తెలిపారు సిద్ధార్ధ. ఈయన చేపట్టిన ప్రాజెక్ట్‌కు ఎంతో శక్తి ఉందని చెప్పాలి. ఓ వ్యక్తి అసాధారణ కలకు.. అతని నిజజీవితానికి సంబంధించిన ఫోటోను జోడించడంతో.. అది చూపించే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోంది.
ఆశ.. ఆకాంక్ష
" నేను పెద్దయ్యాక డాక్టర్ అవ్వాలన్నది నా కల. వారు చేస్తున్న పని చాలా ఉత్తమమైనది, గౌరవప్రదమైనది" -ఓంకార్ సునీల్ . 16ఏళ్ల వయసు గల ఇతను గత రెండు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. తల్లితో కలిసి హౌసింగ్ సొసైటీలు, కాలనీల్లో చెత్తను పోగు చేసి, మున్సిపాలిటీ గార్బేజ్ సెంటర్లలో డంప్ చేస్తుంటాడు. తను చేస్తున్న పనిపై చాలా వ్యతిరేతతో ఉన్నాడు. ముఖ్యంగా పాడైపోయిన ఆహారం, మురికి పట్టిపోయిన వస్తువులను తీసుకెళ్లాల్సి వచ్చినపుడు... మరింత వ్యతిరేకత పెరిగిపోతోందని చెప్పాడు. అయితే... బతకడానికి ఇంతకంటే ఏం చేయాలో అతనికి తెలీదు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛభారత్ గురించి ఓంకార్‌కి తెలుసు. ఆ కార్యక్రమం మొదలయ్యాక... తను చెత్త పోగు చేసే కాలనీల్లో ఏ ఒక్కరిలోనూ మార్పు వచ్చినట్లు అతను గుర్తించలేదు. విపరీతంగా మద్యానికి బానిసైన ఓంకార్ తండ్రిని... చివరికి అదే బలి తీసుకుంది. కుటుంబాన్ని పోషించడానికి తల్లితో కలిసి పని చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇతనికి ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. వారు ఇప్పుడింకా స్కూల్‌కి వెళుతున్నారు. ఉదయాన్నే చెత్త పోగు చేయడం పూర్తికాగానే.. ఓంకార్ కూడా పాఠశాలకు వెళ్లి చదువుకుంటాడు. తన కలను సాకారం చేసుకోవడానికి... చదువు చాలా ముఖ్యమనే విషయం అతనికి స్పష్టంగా తెలుసు. కొడుకు కోరికను నెరవేర్చి, మెడిసిన్ చదివించేందుకు .. ఆ తల్లి బ్యాంక్ ఖాతాలో డబ్బులు పొదుపు చేస్తోంది ఎప్పటి నుంచో. -10th July 2015 )
“చూడడానికి వీరి కలలు సింపుల్‌గానే కనిపిస్తాయి. కానీ వాటిని సాధించుకోవడానికి వారిలో కనిపించే తపన నన్ను ఆకర్షిస్తుంది. కొన్నిసార్లు హృదయాన్ని హత్తుకుంటే... ఒకోసారి గుండెలు పిండేసినంత బాధ కూడా కలుగుతుంది. చాలామంది తమ కలల గురించి చాలా సింపుల్‌గా చెప్పినా... ఇవి అసాధ్యం అనిపించే స్థాయిలోనే ఉంటున్నాయి అన్నారు సిద్ధార్ధ. తన ప్రాజెక్టు ద్వారా ఈ కలలను ప్రపంచానికి తెలియచెప్పి... వారి ఆకాంక్షలను నెరవేర్చే వ్యక్తుల చెంతకు తీసుకెళ్లగలగాలన్నది సిద్ధార్ధ ఆలోచన.
“ఈ కలలకు, వాటిని నెరవేర్చేగలిగే వ్యక్తులకు మధ్య అనుసంధానకర్తగా ఉండాలన్నది నా ఆకాంక్ష”అంటూ ముగించారు సిద్ధార్ధ జోషి
ప్రతీ ప్రయాణం కలతోనే ప్రారంభవుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా అత్యున్నత స్థాయికి చేరి... ఎందరికో కలలు, కోరికలు నెరవేర్చాలని ఆకాంక్షిద్దాం. వీలైతే చేతనైన సాయం చేద్దాం.