ముంబైవాసులకు కొత్త రుచులు అందించేందుకు లండన్ కొలువు వదులుకుంది..
కొన్నేళ్ల క్రితం తన తల్లి చనిపోయినప్పుడే గీతాంజలి రాంజీకి జీవితంపై విరక్తి పుట్టింది. లైఫ్ అంటే ఇంతేనా అనిపించింది. అందుకే తనకు నచ్చిన పనినే చేయాలనుకుంది. ప్రపంచ ప్రఖ్యాత బ్రిటన్ లోని కార్డిఫ్ స్కూల్ ఆప్ మేనేజ్మెంట్ లో చదువుకుంది. ఇంటర్నేషనల్ మార్కెటింగ్ అండ్ ఛేంజ్ మేనేజ్మెంట్ లో ఎంబీఏ పూర్తి చేసింది. అక్కడే మంచి ఉద్యోగం కూడా వచ్చింది. కొన్నాళ్లు ఉద్యోగం చేశాక జాబ్ వద్దనుకుంది. తనకు ఇష్టమైన ఫుడ్ విషయంలో ప్రయోగాలు చేయాలనుకుంది. దాన్నే కెరీర్ గా ఎంచుకుంది.
బ్రిటన్ లో ఎంబీఏ చదువుతున్నప్పుడు గీతాంజలి… మెక్ డొనాల్డ్ లో పార్ట్ టైం జాబ్ చేసింది. అక్కడే రెస్టారెంట్ బిజినెస్ పై అవగాహన వచ్చింది. బ్రిటన్ కు గుడ్ బై చెప్పాక ముంబై వచ్చి… 2014 డిసెంబర్ లో తాంజోర్ బై ఏంజీ పేరుతో ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ పెట్టింది. తమిళనాడులోని సంప్రదాయ తంజావూరు వంటకాలను ముంబైకర్లకు రుచి చూపిస్తోంది.
ముంబైలో ఇద్దరు ఉద్యోగులు ప్రియా షిండే, నమ్రతా పవార్ తో కలిసి వ్యాపారం ప్రారంభించారు. వంటల్లో 20 ఏళ్ల అనుభవమున్న కిషోర్ జాదవ్ ను హెడ్ చెఫ్ గా నియమించుకున్నారు. రెస్టారెంట్ బిజినెస్ లో ఈమెకు కుటుంబ సభ్యులు, స్నేహితులు సహకరించారు.
తొలినాళ్ల కష్టాలు
రెస్టారెంట్ ఎక్కడ పెట్టాలన్న విషయంలో తొలుత చాలా గందరగోళ పరిస్థితి ఎదుర్కొన్నారు. ఉద్యోగులను వెతుక్కోవడం, శిక్షణనివ్వడం, కిచెన్ ఆర్డర్ క్రియేషన్, మెటీరియల్ సేకరణ, ట్యాక్సేషన్, అకౌంటింగ్ అన్నీ సమస్యలే. అన్నింటికీ మించి… రెస్టారెంట్ నిర్వహణలో పురుషులదే ఆధిపత్యం. అయినా వెరవకుండా ఈ రంగంలో అడుగుపెట్టారు. విజయం సాధించారు.
“రెస్టారెంట్ బిజినెస్ అంటే పురుషులదే ఆధిపత్యం. మగవారి సహకారం ఏమాత్రం లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసిన మొదటి మహిళను నేను. అందుకే తొలినాళ్లలో చాలా సవాళ్లనే ఎదుర్కొన్నాను. మహిళతో మాట్లాడాలంటే పురుష కస్టమర్లు కొంత అసౌకర్యంగా ఫీలవుతారు. అయితే ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోందని గీతాంజలి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.
లాభాలు
తాంజోర్ రెస్టారెంట్ ఇప్పుడు మంచి లాభాలనే ఆర్జిస్తోంది. 40 శాతం ఆదాయం డోర్ డెలివరీ వల్లే వస్తోంది. కొలాబోలో రెస్టారెంట్ ఉంది. స్విగ్గీతో ఒప్పందం కుదుర్చుకుని ముంబై అంతటా డోర్ డెలివరీ చేస్తోంది.
మనదగ్గర రెస్టారెంట్ బిజినెస్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో ఈ పరిశ్రమ 48 బిలియన్ డాలర్లకు అంటే 3 లక్షల 20వేల కోట్ల రూపాయలు చేరుకుంది. ఇందులో క్యాజువల్ డైనింగ్ వాటా 70 శాతం. 12 శాతం బార్స్, క్లబ్స్, లాంజెస్, పబ్స్ ది. కేఫ్ లు 8 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. మిగతాదంతా హై-ఫై వ్యవహారం.
తాంజోర్ ఇప్పటివరకు 40 లక్షల రూపాయల వ్యాపారం చేసింది. రోజుకు వందకుపైగా డిషెస్ ను సర్వ్ చేస్తోంది. మొదటి ఏడాది బిజినెస్ కాస్త డల్ గా ఉన్నా… ఈ ఏడాది మాత్రం బాగా పుంజుకుంది. మార్కెటింగ్ పై గీతాంజలి దృష్టిపెట్టారు.
అచ్చమైన సంప్రదాయ ఆహారంపైనే దృష్టిపెట్టారు గీతాంజలి. ప్రజలకు తమ మూలాలు తెలిసొచ్చేలా ట్రెడిషనల్ ఫుడ్ అందిస్తానని చెప్పారు. మరో మూడు రెస్టారెంట్లు పెడతానని… పెట్టుబడిదారులకోసం చూస్తున్నానని చెప్పారు. సింగపూర్ , మలేషియాలోనూ రెస్టారెంట్లు తెరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
“తంజావూరు ప్రాంతంలో కుటుంబంలోని పెద్దలకు మాత్రమే తెలిసిన రెసిపీలు కొన్ని ఉంటాయి. వాటిని కుటుంబ సభ్యులకు మాత్రమే నేర్పిస్తారు. నేను అలా నేర్చుకునే ఈ రెస్టారెంట్ పెట్టాను. ఇలా ప్రతి ప్రాంతానికి ప్రత్యేక వంటకాలుంటాయి. వాటిని నేటి తరానికి రుచి చూపించాలన్నదే నా లక్ష్యం అంటారు గీతాంజలి.