గుర్తుండిపోయే వేడుకలా పుట్టిన రోజు

కొత్త ట్రెండ్‌కు తెరలేపిన ఈవైబ్ విజయవంతంగా స్టార్టప్‌ను నిర్వహిస్తున్న బెంగళూరు జంట

గుర్తుండిపోయే వేడుకలా పుట్టిన రోజు

Monday July 06, 2015,

2 min Read

పిల్లల పుట్టిన రోజు వేడుక జరిపేందుకు స్నేహితులు పడ్డ కష్టం చూశాకే బి.ఆంజనేయులు రెడ్డి, స్వాతి రెడ్డి ఈవైబ్‌ను ప్రారంభించారు. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, అతిథులకు గుర్తుండి పోయేలా పుట్టిన రోజు వేడుకలను ఈవైబ్ నిర్వహిస్తోంది. ఇంట్లో చిన్న పార్టీ అయినా, ఫంక్షన్ హాల్, హోటల్‌లో పెద్ద పార్టీ అయినా మేం రెడీ అంటోంది ఈ జంట. ఈవైబ్ సేవలు కావాల్సిన వారు కంపెనీ వెబ్‌సైట్లోకి వెళ్లి ప్యాకేజ్‌ను ఎంచుకుంటే చాలు.

ఎన్నో విశిష్టతలు

బర్త్ డే పార్టీ అంటే అందరి సమక్షంలో కేక్ కట్ చేయడం ఒక్కటే కాదు. ఈవైబ్ తోడైతే ఆ మజాయే వేరు. మెజీషియన్, స్టేజ్ పర్ఫార్మెన్స్, పప్పెట్ షో, బౌన్సింగ్ కాజిల్, మెర్రీ గో ఎరౌండ్, బెలూన్ షూటింగ్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ తోడవ్వాల్సిందే. పిల్లలు, పెద్దలు అమితంగా ఇష్టపడే పాప్‌కార్న్, కాటన్ క్యాండీ, ఐస్ గోలా, చాకొలేట్ ఫౌంటెయిన్ కూడా పార్టీలో ప్రత్యక్షమవుతుంది. టాటూ, క్యారికేచర్, ఫేస్ పెయింటింగ్, క్లే మోడలింగ్, నెయిల్ ఆర్టిస్టులు పార్టీని మరింత అందంగా తీర్చిదిద్దుతారు. కస్టమర్ కోరితే అందమైన, రుచికరమైన కేక్‌లు కూడా సరఫరా చేస్తారు.

image


రూ.200 కోట్లకు పరిశ్రమ

పరిశ్రమ అంచనా ప్రకారం 2013లో 15 నగరాల్లో బర్త్ డే పార్టీ ఆర్గనైజర్లు, బాంక్వెట్ హాల్స్ కోసం ఒక లక్షలకుపైగా ఎంక్వైరీలు వ చ్చాయి. ఏటా 12-18 శాతం వృద్ధి చెందుతోంది. ఒక్కో పార్టీకి సగటున రూ.20,000 ఖర్చు చేస్తున్నారట. అంటే మార్కెట్ విలువ రూ.200 కోట్లన్నమాట. పుట్టిన రోజు కార్యక్రమాన్ని వేడుకగా జరపడం ఇప్పుడు ట్రెండ్‌గా మారిందని అంటున్నారు స్వాతి. ఈ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో మార్కెట్ విలువ గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

బి ఆంజనేయులు రెడ్డి, ఈవైబ్ ఫౌండర్

బి ఆంజనేయులు రెడ్డి, ఈవైబ్ ఫౌండర్


ఇదీ కంపెనీ ప్రస్థానం

ఒక స్టార్టప్‌కు పనిచేస్తున్న సమయంలో తొలిసారిగా బి.ఆంజనేయులు రెడ్డి, స్వాతి రెడ్డి కలుసుకున్నారు. స్నేహం ప్రేమగా మారి పెళ్లి దాకా వెళ్లింది. ‘స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం కోసం స్కైప్‌లో స్వాతిని ఇంటర్వ్యూ చేశాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి ఈవైబ్‌ను ప్రారంభించి ఆంట్రప్రెన్యూర్స్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించాం’ అని చెప్పారు ఆంజనేయులు.

బిట్స్ పిలానీలో ఆంజనేయులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. స్టార్టప్ పరిశ్రమలో మూడేళ్ల అనుభం ఉంది. ఈవైబ్‌లో ఆయన డిజైన్, టెక్నాలజీ, వెండార్లతో భాగస్వామ్య బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యూఎస్‌ఏలో స్వాతి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదివారు. పరిశ్రమలో రెండేళ్ల అనుభవం ఉంది. ఈవైబ్‌లో కస్టమర్లు, కంటెంట్, నియామకాల బాధ్యతలను ఆమె చూస్తున్నారు.

2013 జూలైలో ఈవైబ్ ప్రారంభమైంది. మొదటి 9 నెలల్లోనే 200లకుపైగా కార్యక్రమాలను నిర్వహించింది. రూ.3 లక్షలకుపైగా ఆదాయాన్ని ఆర్జించింది. మార్కెటింగ్‌కు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండానే ఈ మొత్తాన్ని సాధించింది. సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్‌కు అధిక సమయం కేటాయించామని ఆంజనేయులు అంటున్నారు. ఇప్పుడు కంపెనీ ఊహించని స్థాయికి ఎదిగింది. 6,000లకు పైగా కుటుంబాలకు దగ్గరైంది.

ఈ స్టార్టప్‌కు పోటీ ఎవరూ లేరు. అయితే జస్ట్ డయల్, పార్టీ వెన్యూ అగ్రిగేటర్స్ వంటి కంపెనీలు, ఏజెన్సీలతో పోటీపడుతోంది. ప్రతి బుకింగ్‌పై వెండార్ల నుంచి ఈవైబ్ కమీషన్ పొందుతోంది. కస్టమర్ల స్పందన, వారి తీరు ఆధారంగా ప్యాకేజీల్లో మార్పులు చేస్తోంది. అంతేకాదు వెండార్ల ఎంపిక సైతం జాగ్రత్తగా చేపడుతోంది. ప్రస్తుతానికి బెంగళూరుకు పరిమితమైంది. రానున్న రోజుల్లో హైదరాబాద్‌తోసహా ఎనమిది నగరాలకు విస్తరించాలన్నది ప్రణాళిక. బస్ టికెటింగ్ పరిశ్రమ మాదిరిగానే పార్టీ ప్రొఫెషనల్స్ మధ్య ధరల పారదర్శకత రావడానికి మరింత సమయం పడుతుందని ఆంజనేయులు అంటున్నారు.