Telugu

బిలియన్ డాలర్ల మార్కెట్‌పై కన్నేసిన 'స్టఫ్‌డ్'

Krishnamohan Tangirala
30th Oct 2015
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

నెలకు 4 వేల ఆర్డర్లను కలిగి ఉన్న ఓ కంపెనీ 6500 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించడం సాధ్యమయ్యే పనేనా ? కానీ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ వ్యాపారంలో ఉన్న 'స్టఫ్‌డ్' మాత్రం ఇది సాధ్యమేనంటోంది. ఈ ఫీట్‌ని సాధ్యం చేసి చూపిస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు దీని వ్యవస్థాపకులు.

భారతీయ వంటకాలు, చైనీస్ రుచులు, పీజా బర్గర్లలో.. ఏది మంచి ఫుడ్ అంటే చెప్పడం చాలా కష్టమైన విషయం. ప్రత్యేకించి మన దేశంలో ఇలా ఓ నిర్ణయానికి రావడం సంక్లిష్టమైన అంశం. ప్రజల్లో గ్లోబలైజేషన్ బాగానే పెరిగినా.. రకరకాల వంటకాలు అందుబాటులోకి రావడం మాత్రం ఇంకా పూర్తిగా సాధ్యపడలేదు.

“ఓ షవర్మ కోసం పోవై నుంచి బాంద్రాలోని కార్టర్స్ బ్లూకి ప్రయాణించిన రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి” అంటున్నారు రిధిమా విజయ్.
image


పర్సుకు భారం కాకుండా ఓ మంచి షవర్మ కోసం, పాస్తా కోసం పడ్డ ఇబ్బందే.. భార్యాభర్తలైన రిధిమా, శ్రేయాన్స్ విజయ్‌లను.. ఓ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ చైన్ ప్రారంభం వైపు నడిపించింది. అదే 'స్టఫ్‌డ్'.

భారతీయ రుచులకు అనుగుణంగా ఉంటూ.. కొత్త రుచులను పరిచయం చేసే వంటకాలను అందించేందుకు ఈ జంట ప్రయత్నిస్తున్నారు. రెస్టారెంట్ కస్టమర్లకు మంచి ఫుడ్‌ని అందించడం కోసం విదేశీ పాస్తాలను కూడా తమ మెనూలో చేర్చారు.

“మేము అందించే పాస్తాలు.. దేశంలో ఎక్కడా క్విక్ సర్వీస్ రెస్టారెంట్లలో కనిపించవ”ని గర్వంగా చెబ్తున్నారు శ్రేయాన్స్

ఐఐటీ బాంబే నుంచి పట్టభద్రుడైన శ్రేయాన్స్.. 8 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా విధులు నిర్వహించారు. ఈయన భార్య రిధిమ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మాత్రమే కాదు.. ఈక్విటీస్ ట్రేడర్ కూడా. వీరిద్దరూ స్టఫ్‌డ్ వెంచర్‌ని ప్రారంభించేందుకు తమ ఉద్యోగాలను వదిలేశారు.

“మా మొదటి ఔట్‌లెట్‌ను అంధేరీ ఈస్ట్‌లో ప్రారంభించాం. మా వ్యాపారాన్ని చిన్నదిగానే మొదలుపెట్టినా కేవలం 4 నెలల్లోనే బ్రేక్ఈవెన్ సాధించాం” అని చెప్పారు శ్రేయాన్స్.

వ్యాపారం ఎలా ఉందంటే ?

స్టఫ్‌‌డ్ వెంచర్‌కు ప్రస్తుతం ముంబైలో 3 ప్రాంతాల్లో ఔట్‌లెట్స్ ఉన్నాయి. అంధేరీ ఈస్ట్, వెస్ట్, పోవై ప్రాంతాల్లో ఉన్న ఈ ఔట్‌లెట్స్‌ అన్నిటికీ కలిపి.. రోజుకు 150కి పైగా ఆర్డర్స్ వస్తున్నాయి. సగటున ఒక్కో ఆర్డర్ విలువ ₹రూ. 250.

“ప్రతీ ఔట్‌లెట్‌నుంచి నెలకు ₹10 లక్షల రూపాయల ఆదాయం వస్తోంది. మా ఖాతాదారుల్లో 60 శాతం రిపీటెడ్ కస్టమర్లే కావడం విశేషం” అంటున్నారు రిధిమా.

image


ఇతర రెడీ టూ ఈట్ విభాగంలో.. ఇండియన్, చైనీస్, పీజాలను తప్ప.. వేరొక వంటకాన్ని అందించే రెస్టారెంట్స్ ఏవీ ఇండియాలో లేవంటున్నారు ఈ జంట.

“ఈ విధానాన్ని మార్చడానికి మేం అడుగు పెట్టాం. ఈ తరహా వ్యాపారాల్లో షవర్మ, పాస్తాలకు మేం కేరాఫ్ అడ్రస్. రెగ్యులర్, లార్జ్ షవర్మలను అందించగల ఏకైక రెస్టారెంట్ మాదే. పాస్తాలు, సలాడ్స్ విభాగాల్లో కూడా వ్యాపారం ఆశాజనకంగానే ఉంది. క్యూఎస్ఆర్ రెస్టారెంట్ విభాగంలో.. ఫైన్ డైనింగ్ అనుభూతిని పంచేందుకు మేం ప్రయత్నిస్తున్నాం” అని చెప్పారు శ్రేయాన్స్.

ఫండింగ్ ఎలా ? అవకాశాలేంటి ?

రిక్వెజా కేపిటల్ నుంచి ఈ వెంచర్ తాజాగా రూ.2.5 కోట్ల నిధులను సమీకరించింది. మరో ఏడాది కాలంలో 8 నుంచి 10 ఔట్‌లెట్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ముందుగానే ప్యాక్ చేసిన ఆహార పదార్ధాల విక్రయ విభాగంలోకి ప్రవేశించేందుకు స్టఫ్‌డ్ ఉవ్విళ్లూరుతోంది. యువతరాన్ని ఆకట్టుకోవాలంటే ఈ సెగ్మెంట్ తప్పనిసరిగా ఉండాలన్నది వీరి ఆలోచన. క్విక్ సర్వీస్ రెస్టారెంట్ విభాగంలోకి వచ్చే ఫాస్ట్ ఫుడ్ చెయిన్స్.. మన దేశంలో ఏటా 30శాతం క్రమానుగత వార్షిక వృద్ధి రేటును సాధిస్తుండడం వీరికి ప్రోత్సాహం అందించే విషయం. అదే మొత్తం ఫుడ్ సర్వీస్ విభాగాన్ని పరిశీలిస్తే ఈ వృద్ధి రేటు కేవలం 10శాతం మాత్రమే. 2017నాటికి క్యూఎస్ఆర్ మనదేశంలో మార్కెట్ విలువ 1.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందనే అంచనాలున్నాయి.

యువర్ స్టోరీ ఏం చెబుతుందంటే..

నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం మన దేశంలో సగం మంది ప్రజలు.. మూడు నెలలకు ఒకసారైనా బయట భోజనాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అదే మెట్రో నగరాల విషయానికొస్తే.. ఈ సంఖ్య నెలకు 8 సార్లుగా ఉంది. నెలకు అమెరికా ప్రజలు 14 మార్లు, చైనాలో 9సార్లు బయటి ఫుడ్‌ని తీసుకుంటున్నారు.

క్యూఎస్ఆర్ సెగ్మెంట్‌లో ఇప్పటికీ విదేశీ బ్రాండ్ల హవానే ఎక్కువగా ఉంది. దేశీయంగా అభివృద్ధి చెందిన కంపెనీల సంఖ్య, మార్కెట్ వాటా చాలా తక్కువ. బయటి ఫుడ్‌ని తీసుకునే కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం, ఆర్థికంగా కొనుగోలు స్థాయి ఉండడం, పెరుగుతున్న ఆదాయ స్థాయిలు.. గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో భారతీయులను రెస్టారెంట్, ఫుడ్ హోమ్ డెలివరీ వైపు నడిపిస్తున్నాయి. క్విక్ సర్వీస్ రెస్టారెంట్ విభాగానికే పరిమితం కాకుండా.. తమకే ప్రత్యేకమైన రుచులు అందించేందుకు కూడా స్టఫ్‌డ్ ప్రయత్నించడం.. ఈ కంపెనీ వృద్ధికి మరింతగా సహకరించనుంది.

సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకుంటున్న ఆహార పదార్ధాల వ్యాపారాలు వెంచర్ కేపిటలిస్ట్‌లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 2015 తొలి అర్ధభాగంలో ఈ విభాగానికి భారీగా పెట్టుబడులు సమకూరాయి. గత మూడు నెలలుగా మాత్రం ఈ స్పీడ్ కొంత తగ్గిన మాట వాస్తవమే. ఈ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టిన సమయాన్ని బట్టి పరిశీలిస్తే.. గణనీయమైన ప్రగతి సాధించడానికి స్టఫ్‌డ్‌కి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి.

వెబ్‌‌సైట్

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags