వస్తు మార్పిడికి కొత్త హంగులు జోడించిన స్టార్టప్ 'బార్టర్ డాడీ'
వస్తుమార్పిడి వ్యవస్థ ఈనాటిది కాదు. క్రీస్తుపూర్వం 6000వ సంవత్సరం నుంచి మనకు తెలిసిందే. అసలు డబ్బు మారకం లేనపుడు మనకి తెలిసింది వస్తు మార్పిడే. ఎప్పుడో మెసపటోమియా నాగరికత నాటి ఈ ఆచారం. మళ్ళీ 1930లలో తీవ్ర ఆర్ధిక మాంద్యం ఏర్పడినపుడు మళ్ళీ కనిపించింది. అప్పట్లో తిండి గింజలు, ఇతరత్రా అవసరాలు తీర్చుకోవడానికి జనం ఈ వస్తు మార్పిడి మీదే ఆధారపడ్డారు.
శతాబ్దాల నాటి ఈ ఆచారం.. ఏనాడూ పూర్తిగా అంతరించిపోలేదు. ఏదో ఒక రూపంలో ఇంకా మన మధ్య కనిపిస్తూనే వుంది. నిన్న మొన్నటి తరాలు క్లాసు రూముల్లో పుస్తకాలు ఇచ్చిపుచ్చుకునే వాళ్ళు. అదే ఇప్పటి తరంలో అయితే, పోకిమన్ కార్డుల మార్పిడి నడుస్తోంది.
రియల్ ఎస్టేట్‌లో బార్టర్ బిజినెస్
ఇక బిజినెస్ సర్కిల్స్‌లో అయితే, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ బార్టర్ వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడతాయి. కోట్ల రూపాయల ఈ బిజినెస్‌లో బార్టర్ సిస్టం కనిపించడం ఆశ్చర్యకరమే అయినా, రియల్ ఎస్టేట్ రంగంలో పదేళ్ళకుపైగా పనిచేసిన హరీందర్ సింగ్‌కు బార్టర్ బిజినెస్ ఐడియా ఈ రంగం నుంచే వచ్చింది.
రియల్ ఎస్టేట్ కంపెనీలు మీడియా సంస్థలతో వస్తు మార్పిడి చేసుకుంటాయి. ఎందుకంటే, రియల్ ఎస్టేట్ కంపెనీలు, తాము సంపాదించే దాంట్లో 30 నుంచి 40 శాతం మళ్ళీ ప్రకటనలపై ఖర్చుచేయాలి. టెలివిజన్, రేడియో, పత్రికల్లో ప్రకటనలివ్వాలి. ఈ ఖర్చును తట్టుకోవడానికి ఆయా మీడియా సంస్థలకు ప్రకటనలకు బదులుగా తమ దగ్గర నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీలను ఇవ్వడం మొదలైంది. దీని వల్ల తమ ప్రాపర్టీని మార్కెట్ చేసుకోగలుగుతారు. ప్రకటనలకు డబ్బు చెల్లించాల్సిన అవసరం తప్పుతుంది.
ఈ బార్టర్ వ్యవహారాలు చూడడం కోసం టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఏకంగా 'బ్రాండ్ క్యాపిటల్' అనే ఒక సంస్థేవుంది. ఈ సంస్థ కింద 1000 కోట్లకు పైగా విలువైన ఆస్తులు వున్నాయి. ఇవన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రకటనలకు బార్టర్ పద్ధతిలో సేకరించినవే. అప్పట్లో తాను కూడా కొన్ని మీడియా సంస్థలతో ఇలాంటి డీల్స్ చేసానని హరీందర్ చెప్పారు.
బార్టర్ డాడీ.. ఒక ఐడియా
రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తూనే బార్టర్ గురించి ఐడియా వున్న, హరీందర్ .. పుస్తకాల్లాంటి కొన్ని సరుకులకు బార్టర్ సౌకర్యం కల్పించే కొన్ని ఆన్‌లైన్ స్టార్టప్స్‌ను చూసాడు. అయితే, ఈ పద్ధతిని కొన్నింటికే ఎందుకు పరిమితం చేయాలి. మనకేది తోస్తే, దాన్ని వస్తుమార్పిడి చేసుకోవచ్చు కదా..అన్న ఐడియా తోనే హరీందర్.. బార్టర్ డాడీని మొదలుపెట్టాడు.
ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అప్లయిన్సస్, ఇతరత్రా సేవలు.. ఇదీ అదీ అని కాదు. ఏది తోస్తే, దాన్ని బార్టర్‌కు పెట్టేందుకు వీలు కల్పించే బార్టర్ డాడీ.కామ్ పోర్టల్‌ని హరీందర్ తన మిత్రుడు దివ్యాంశు దేవగన్‌తో కలిసి మొదలుపెట్టాడు.
ఇప్పుడు ఒక వ్యక్తికి గుడ్‌గావ్‌లో ఇల్లు వుంటుంది. అతను బెంగళూరుకి మారాలని అనుకుంటాడు అనుకోండి. అతను అక్కడ తన ఇంటిని మరొకరికి అద్దెకి ఇవ్వాలి.. ఇక్కడ తాను మరొక ఇంట్లో అద్దెకి దిగాలి. ఇలా రెండు ట్రాన్సాక్షన్స్ చేసే బదులు, తనలాగే బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్ళే మరొక వ్యక్తికి తన ఇంటిని అద్దెకి ఇచ్చి, ఇక్కడ తాను అతని ఇంట్లో అద్దెకి దిగగలిగితే, ఈ సమస్య తేలికగా పరిష్కారమైపోతుంది. ఇదేమంత అసాధ్యమైన విషయం కాదు అని తన బిజినెస్ గురించి వివరించారు హరీందర్.
ప్రస్తుతం ఈ వెబ్‌సైట్‌లో ఆటోమొబైల్స్, బిజినెస్ అండ్ సర్వీసెస్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, హోం అండ్ ఫర్నిచర్, మొబైల్స్ అండ్ టాబ్లెట్స్, రియల్ ఎస్టేట్ లాంటి ఏడు క్యాటగరీలు వున్నాయి. వీటి కింద 3,500కు పైగా లిస్టింగ్స్ వున్నాయి. వీటిలో మొబైల్ ఫోన్ల నుంచి లగ్జరీ కార్ల వరకు.. 5 రూపాయల నుంచి 6 కోట్ల రూపాయల విలువైన వస్తువుల వరకూ ఎక్స్‌ఛేంజ్‌కి సిద్ధంగా వున్నాయి.
కేవలం వస్తువుల మార్పిడికే కాదు..ఇప్పుడు సేవల మార్పిడికి కూడా మంచి గిరాకీ వుంది. అసలే ప్రస్తుతం స్టార్టప్ సీజన్ నడుస్తోంది. ఒకరికి కోడింగ్‌లో ప్రావీణ్యం వుంటుంది. మరొకరికి మార్కెటింగ్ మీద పట్టుంటుంది. వీరిద్దరూ వారి సేవలు ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే, ఇద్దరి ప్రాజెక్టులూ సునాయసంగా పూర్తయిపోతాయని వివరించారు హరీందర్.
సమస్యలు, సవాళ్ళు
అయితే, ఇదంతా అనుకున్నంత తేలిక కాదు. బార్టర్ సిస్టంలో ప్రధానంగా రెండు సమస్యలుంటాయి. మొదటిది ఇద్దరి మధ్య బార్టర్ నడవాలంటే, ఇద్దరి దగ్గరా.. ఎదుటి వ్యక్తికి పనికొచ్చే వస్తువేదో ఉండాలి. ఇక రెండో సమస్య, అమ్మకం, కొనుగోలు ఒకేసారి జరగాలి. ఇద్దరిలో ఏ ఒక్కరూ తర్వాత ఇస్తానంటే కుదరదు.
ఒకరి దగ్గర పది వస్తువులు వున్నాయంటే, వాటి అన్నిటి అవసరం ఒకేలా వుండదు. ఈ సూత్రం పైనే బార్టర్ డాడీ ఆధారపడింది. మనకి తక్కువ ఉపయోగం అయినవి, ఎదుటి వారికి ఎక్కువ ఉపయోగపడొచ్చు. కనుక, మనకేవి ఉపయోగమే అవే వుంచుకోవడానికీ, సంపాదించడానికీ ఈ సైట్ ఉపయోగపడుతుంది.
ప్రస్తుతానికి ఈ వెబ్‌సైట్‌లో లిస్టింగ్స్‌కి ఇతర ఆన్ లైన్ క్లాసిఫైడ్ లిస్టింగ్స్‌కి పెద్ద తేడా ఏం లేదు. వాటిలో లాగానే ఇక్కడ కూడా తాము అమ్మాలనుకున్నటివాటినీ, ఎక్స్‌ఛేంజ్ చేయాలనుకునే వాటిని అడ్వర్టయిజ్ చేస్తారు. వాటి రేట్స్ కోట్ చేస్తారు. అయితే, త్వరలోనే బార్టర్ డాడీలో కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నారు. ఇక్కడ అడ్వర్టయిజర్లు తమ కస్టమర్లకు ఆప్షన్లు ఇచ్చే అవకాశం కూడా కల్పించబోతున్నారు.
మార్కెట్, పోటీ, భవిష్యత్ అవకాశాలు
ఇండియాలో ఆన్‌లైన్ షాపింగ్ పరిశ్రమ రోజురోజుకూ పెరుగుతోంది. 2016 నాటికి 1500 కోట్ల డాలర్లకు చేరుకుంటుందని గూగుల్ రిపోర్ట్ అంచనా. 2012లో 8 మిలియన్ల భారతీయులు ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే, ఇప్పుడు 35 మిలియన్ల మంది కర్చీఫ్ నుంచి కంప్యూటర్ వరకు సర్వస్వం ఆన్ లైన్‌లోనే కొంటున్నారని ఈ రిపోర్ట్ సారంశం.
ఇక పోటీ విషయానికొస్తే, అదల్ బదల్, బార్టర్ లాంటి కొన్ని పోర్టల్స్ వున్నాయి. అయితే, ప్రధాన నోటీ మాత్రం, ఓఎల్‌ఎక్స్, క్వికర్ లాంటి క్లాసిఫైడ్ సైట్స్ నుంచేనని హరీందర్ అంటారు.
భవిష్యత్‌పై హరీందర్‌కి పూర్తి నమ్మకం వుంది. ఆన్‌లైన్ ఎక్స్‌ఛేంజ్ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంటుంది. దీనికి సంబంధించి అవగాహన కల్పించాలి అంతే. రానున్న రోజుల్లో కొత్త వాటి అమ్మకాల కంటే, ఎక్స్‌ఛేంజ్ ట్రాన్సాక్షన్లు 10 రెట్లు ఎక్కువగా వుంటాయి. ఇప్పుడు కూడా ట్రక్కులు, బస్సులు, క్రేన్‌లు, ట్రాక్టర్లు, రోల్స్‌రాయిస్, బెంట్లీ, ఫెరారీ లాంటి లగ్జరీ కార్లు ఎక్స్‌ఛేంజికి సిద్ధంగా వున్నాయి. కనుక ఈ బిజినెస్ మోడల్‌లో అవకాశాలకు హద్దే లేదని హరీందర్ అశాభావం వ్యక్తం చేసారు.
యువర్ స్టోరీ అభిప్రాయం
ఈ ఆలోచన కొత్తదే. అయితే, ఇందులో లాభాలు రావడానికి కొంత టైం పడుతుంది. నిజజీవితంలో మనందరికీ బార్టర్ కొత్త కాదుకానీ, ఆన్‌లైన్‌లో ఇంకా అలవాటు కావాలి. ఇద్దరు వ్యక్తుల అవసరాలు, అంచనాలు ఒకేలా వుండడం చాలా అరుదే. అందుకే, ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు సేల్ కోట్‌ను కూడా ఇందులో పొందుపరిచారు. అంటే, ఒక వేళ బార్టర్ చేయడానికి ఎదుటి వ్యక్తి దగ్గర సరైన వస్తువేమీ లేకపోయినా, మనకి ఆ వస్తువు, దాని ధర నచ్చితే కొనుక్కోవచ్చు.
మొత్తం మీద ఓఎల్‌ఎక్స్, క్వికర్ లాంటి వెబ్‌సైట్లలో అదనంగా ఎక్స్‌ఛేంజ్ ఆప్షన్ వుంటే ఎలా వుంటుందో... అదే బార్టర్ డాడీ. దీని భవిష్యత్తు ప్రస్తుతానికైతే, పెద్ద జూదమే.