ప్రారంభమైన 45 రోజుల్లోనే 50 వేల డౌన్లోడ్స్.. వ్యోమో సంచలనం
కొంతకాలంగా దేశంలో ఆన్ – డిమాండ్ సర్వీసుకు గిరాకీ పెరిగింది. డ్రైవర్లు, టైలర్లు, టెక్నీషియన్లు, ప్లంబర్లు.. ఇలా అనేక వృత్తులవారు కావాలంటూ రోజూ అనేక ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. సమయపాలన పాటించడం, వెసులుబాటుకు అనుగుణంగా సేవలందించడం, సమర్థవంతంగా సరఫరా చేసే లక్షణం ఉన్న ఇలాంటి కంపెనీలకు ఆదరణ బాగా ఉంది.
ఈ సర్వీసులకు మాత్రమే కాకుండా సౌందర్య అలంకరణ సేవలకు కూడా ప్రాధాన్యం పెరిగింది. 4.8 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్న ఈ విభాగంలో సత్తా చాటేందుకు అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి. సెలూన్, బ్యూటీ విభాగంలో వ్యానిటీ క్యూబ్ (Vanity Cube), బుల్ బుల్ (Bulbul) తర్వాత బెంగళూరు కేంద్రంగా వ్యోమో (Vyomo) తన సేవలందించేందుకు ముందుకొచ్చింది.
లండన్ బిజినెస్ స్కూల్ లో చదివిన అభినవ్ ఖరే, పూనమ్ మార్వాల మానస పుత్రిక వ్యోమో. సౌందర్యాలంకరణకు సంబంధించిన అన్ని సేవలూ అందించడం వీళ్ల ప్రత్యేకత. వినియోగదారులకే కాకుండా బ్యూటీ ప్రొఫెషనల్స్‌కు కూడా ఇది సేవలందిస్తుంది. దీని ప్ర్రారంభం వెనుక నేపథ్యం గురించి వ్యవస్థాపకుడు, సీఈవో అభినవ్ ఖరే వివరిస్తూ.. “ సెలూన్‌కు రావడానికి మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.. లేదా మీ ఇంటిదగ్గరికే వచ్చి సేవలందించేందుకు కూడా మేం సిద్ధం. బ్యూటీ సర్వీస్ అవసరాలకు సంబంధించి మాకో మొబైల్ యాప్ ఉంది. 2015లో కంపెనీ మొబైల్ యాప్‌ను యువరాజ్ సింగ్ ప్రారంభించారు. తొలి 45 రోజుల్లోనే 53వేల మంది కస్టమర్లు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్లు ఉంటున్న ప్రదేశం నుంచే సెలూన్ ఎక్కడ ఉందో.. అందులో ఏఏ సర్వీసులు అందుతాయో తెలుసుకోవచ్చు. అంతేకాక వాటి ధరలు, పోల్చిచూసుకునే సదుపాయం, కస్టమర్ల అభిప్రాయాలు, స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
45 రోజుల్లో 17వేల కస్టమర్లు
ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో సుమారు 3వేల సెలూన్లు, స్పాలతో పాటు 15వందల మంది స్టైలిస్టులతో వ్యోమో ఒప్పందం కుదుర్చుకుంది. 17వేల మంది డౌన్‌లోడర్లలో 30 శాతం మంది వ్యోమో సర్వీసును ఉపయోగిస్తున్నవాళ్లే కావడం విశేషం. రెండు నెలలు కూడా గడవకముందే ఇంత గొప్ప విజయం ఎలా సాధించారని అడిగినప్పుడు అభినవ్ స్పందిస్తూ.. “ స్టైలిస్టులతో ఆదాయాన్ని పంచుకోవడం ద్వారా మా వ్యాపారం సాగుతుంది. అంటే ఇక్కడ స్టైలిస్టులకు నెలకు ఇంతని జీతం ఉండదు. ఇది వారి పనితీరుకు పూర్తి భిన్నం. ఇది వారి నెలవారీ ఆదాయాన్ని 50 వేల వరకూ తీసుకెళ్లింది. ఈ విధానమే మరింత మంది స్టైలిస్టులను ఆకట్టుకోవడానికి దోహదపడుతోంది” అన్నారు.
మౌఖిక ప్రచారమే వ్యోమోకు అత్యధిక ప్రచారం కల్పించింది. “ చాలా సందర్భాల్లో మేం కుటుంబ సభ్యులందరితో పని చేశాం లేదా స్నేహితుల సమూహానికి సేవలందించాం” అన్నారు అభినవ్.
కస్టమర్ ఈజ్ కింగ్
వినియోగదారుడు ఇచ్చే ఫీడ్ బ్యాక్.. వ్యాపారానికి చాలా ముఖ్యం అంటారు అభినవ్. “మేం ప్రతి సందర్భంలో కస్టమర్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటాం. కాల్ సెంటర్‌తో మాట్లాడిన ప్రతిసారీ సర్వే చేస్తుంటాం. మా టార్గెట్‌ను రీచ్ కావడానికి ఇవెంతో ఉపయోగపడతాయి. వినియోగదారుడు అందించిన డేటా ఆధారంగా మేం వ్యోమో 3.0ను రూపొందించాం. కస్టమర్‌కు పూర్తి సంతృప్తి కల్పించడం.. వారిలో మార్పు తీసుకురావడం.. వాళ్ల దగ్గరికే సేవలు తీసుకెళ్లడం మా లక్ష్యాలు..” అంటారు అభినవ్.
యువర్ స్టోరీ మాట
నెలవారీ ఆదాయంలో ఆహారం, ఆరోగ్యం తర్వాత సౌందర్యపోషణకోసం ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు ప్రజలు. సరాసరిన ఓ మహిళ నెలకు 2వేల నుంచి 3 వేల వరకూ సౌందర్యపోషణ ఖర్చు చేస్తోంది. కొన్ని సర్వేల ప్రకారం భారత్ లాంటి పెద్ద దేశాల్లో ఈ విభాగానికి ఎంతో భవిష్యత్తు ఉంది. ప్రస్తుతం ఇది 4.8 బిలియన్ల మార్కెట్ వద్ద కొనసాగుతున్నట్టు అంచనా. ఇది మరింత పెరగనుంది.
వ్యానిటీ క్యూబ్, బుల్ బుల్, బిగ్ స్టైలిస్ట్‌లతో వ్యోమో ఇప్పుడు పోడీ పడుతోంది. బ్యూటీ, స్పాలను ఇంటిగ్రేట్ చేస్తూ వ్యోమో యాప్ అభివృద్ధి చేసింది. ఇది ఇంటి దగ్గరికే సేవలందించేందుకు దోహదపడుతోంది. టెక్నాలజీని వినియోగించుకుంటూ బ్యూటీ, వెల్నెస్ రంగం దూసుకెళుతోంది. దీనికి భవిష్యత్తులో మరింత ఆదరణ లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.