Telugu

హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్స్‌పై కన్నేసిన అంతర్జాతీయ కంపెనీలు..

Chanukya
15th Jan 2016
 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్య సేవల సంస్థ కేర్‌ హాస్పిటల్స్‌ దుబాయ్ కంపెనీ చేతుల్లోకి వెళ్లిపోతోంది. దుబాయ్‌ కేంద్రంగా నడుస్తున్న ప్రైవేట్‌ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ అబ్రాజ్‌ గ్రూప్‌.. కేర్‌ హాస్పిటల్స్‌లో మెజార్టీ వాటాదారుగా అవతరించింది. ఇప్పటి వరకు కేర్‌‌లో వాటా ఉన్న అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌కు చెందిన 72 శాతం వాటాను తాము కొనుగోలు చేస్తున్నట్టు అబ్రాజ్‌ గ్రూప్‌ ప్రకటించింది. ఈ డీల్ విలువ సుమారు రూ.1800 కోట్లు ఉండొచ్చని ఇండస్ట్రీ నిపుణుల సమాచారం. ఈ వేల్యూయేషన్ ప్రకారం చూస్తే.. కేర్ ఎంటర్‌ప్రైజ్ విలువ సుమారు రూ.2400 కోట్లవరకూ ఉండొచ్చు. ఈ లెక్కన చూస్తే దేశీయ హెల్త్‌కేర్ ఇండస్ట్రీలో ఇదే ఇప్పటి వరకూ టాప్ డీల్.

image


2012లో కేర్‌లో అప్పటికే వాటాదారులైన రాకేష్ జున్‌జున్‌వాలా, నిమ్మగడ్డ ప్రసాద్ సహా మరికొంత మంది ఇన్వెస్టర్ల నుంచి అడ్వెంటా సంస్థ వాటా కొనుగోలు చేసింది. కొంత మొత్తాన్ని ఈక్విటీ రూపంలో కూడా పెట్టుబడి పెట్టింది. కేర్‌లో వాటా దక్కించుకునేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు పోటీపడ్డా చివరకు అబ్రాజ్ గ్రూప్ అత్యధిక వేల్యుయేషన్ చెల్లించి మరీ కొనుగోలు చేసింది. హెల్త్ కేర్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాలని చూస్తున్న అబ్రాజ్ సంస్థకు ఇప్పటికే బిఎస్ఆర్ హాస్పిటల్స్, రెయిన్‌బో హాస్పిటల్స్‌లో వాటాలు ఉన్నాయి.

image


కేర్‌ హాస్పిటల్స్‌ను డాక్టర్‌ బి.సోమరాజు మరికొంత మంది వైద్యులతో కలిసి 1997లో ఏర్పాటు చేశారు. హార్ట్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మొదలైన ఈ సంస్థ మెల్లిగా మల్టీ స్పెషాలిటీ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం దేశంలో అయిదో అతిపెద్ద కార్పొరేట్‌ వైద్యసేవల సంస్థగా అవతరించింది. హైదరాబాద్‌, విశాఖపట్నంతో పాటు దేశవ్యాప్తంగా 9 నగరాల్లో 18 ఆసుపత్రులు, 2,600 పడకలు ఉన్నాయి.

ఇప్పుడు అబ్రాజ్‌కు 72 శాతం వెళితే.. మిగిలిన 28 శాతం వాటాలో కొంత భాగం మాత్రమే డాక్టర్ సోమరాజుకు ఉంది. మిగిలిన స్టేక్‌లో కొంత మంది డాక్టర్లు, ఇతర సిబ్బందిది ఉంది.

ఇదే బాటలో ప్రధాన ఆస్పత్రులు

కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో 51 శాతం వాటాను కౌలాలంపూర్‌కు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్‌ కొనుగోలు చేసింది. 750 పడకలు గల ఈ ఆస్పత్రిలో మెజార్టీవాటాను రూ.300 కోట్లకు కొనుగోలు చేసినట్టు మార్కెట్ వర్గాల సమాచారం. అపోలో హాస్పిటల్స్‌లో కూడా ఐహెచ్‌హెచ్‌కు 10.5 శాతం వాటా ఉంది. కోల్‌కతా, హైదరాబాద్‌లలో రెండు ఫెసిలిటీస్‌ను ఐహెచ్‌హెచ్ - అపోలో కలిసి నిర్వహిస్తున్నాయి.

image


హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్‌ హాస్పిటల్స్‌లో 74 శాతం వాటాను మలేషియాకు చెందిన పార్క్‌వే హాస్పిటల్స్‌ కొనుగోలు చేసింది. పార్క్‌వేను కూడా హెల్త్‌కేర్ జెయింట్‌ ఐహెచ్‌హెచ్‌ నిర్వహిస్తోంది. ఈ డీల్ విలువ రూ.1800 కోట్ల వరకూ ఉండొచ్చని మార్కెట్ వర్గాల సమాచారం. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నైలలో గ్లోబల్ హాస్పిటల్స్ సేవలు అందిస్తోంది. గ్లోబల్ బెడ్ కెపాసిటీ దాదాపు 2000 వరకూ ఉంది. ఈ రెండు పెద్ద డీల్స్‌ 2015లోనే జరిగాయి.

చిన్నపిల్లల ఆస్పత్రి రెయిన్‌బోలో యూకెకు చెందిన సిడిసి అడ్వైజర్స్‌ 2013లోనే పెట్టుబడులు పెట్టింది. ఎంత వాటా అమ్మారు అనే విషయంపై స్పష్టత లేకపోయినప్పటికీ వంద కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేసినట్టు మాత్రం తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడతో కలిపి నాలుగు ఆస్పత్రులు నిర్వహిస్తున్న రెయిన్‌బో బెడ్ కెపాసిటీ 700పైనే ఉంది. 1999లో డా. దినేష్ కుమార్ చీర్ల, డా. రమేష్ కంచర్ల ఇద్దరూ కలిసి రెయిన్‌బో స్థాపించారు. వీరిద్దరికీ సంస్థలో 79 శాతం వాటా ఉంది.

image


ప్రఖ్యాత కీళ్ల మార్పిడి సర్జన్ డా. గురవారెడ్డికి చెందిన సన్ షైన్ హాస్పిటల్స్ (సర్వేజనా హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్)లో మైనార్టీ వాటాను ఇండియా లైఫ్‌సైన్సెస్‌ (ఇన్వ్‌అసెంట్ ఇండియా) ఫండ్ కొనుగోలు చేసింది. అయితే ఎంత వాటాను అమ్మారు అనే విషయాన్ని మాత్రం రెండు సంస్థలూ ధృవీకరించలేదు. ఈ డీల్ సుమారు రూ.100 కోట్ల వరకూ ఉండొచ్చు.

విజయవాడకు చెందిన కార్డియాక్ హాస్పిటల్స్ రమేష్ హాస్పిటల్స్‌లో కొద్ది వాటాను పిరమల్ గ్రూప్‌నకు చెందిన ఇండియా వెంచర్ అడ్వైజర్స్ కొద్దిగా వాటాను కలిగి ఉంది.

ప్రముఖ రీసెర్చ్ సంస్థ ప్రైజ్ వాటర్ కూపర్స్ రిపోర్ట్ ప్రకారం వివిధ దేశాల్లో 70 శాతం వైద్య సేవలన్నీ 20 నగరాలకే పరిమితమవుతున్నాయి. 2017 నాటికి మన దేశంలో కొత్తగా 6,50,000 బెడ్స్ అవసరముంటుంది. వీటి క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం దాదాపు 1,65,000 కోట్లు అవసరముంటుంది. అన్నింటింకంటే ముఖ్యంగా భారత్ లాంటి దేశంలో డిమాండ్ - సప్లై కొరత తీవ్రంగా ఉంది. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఒక్కో హాస్పిటల్ వివిధ పరికరాలపై భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. వీటి గురించి ఆలోచిస్తున్న కంపెనీలను ఎంపిక చేసుకుని మరీ విదేశీ సంస్థలు పెట్టుబడులు కుమ్మరిస్తున్నాయి. విదేశీ హాస్పిటల్స్‌తో పోలిస్తే తక్కువ వేల్యుయేషన్‌తో పాటు ఎక్కువ రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉండడంతో కంపెనీలు భారతీయ సంస్థలపై దృష్టిసారిస్తున్నాయి.

 • Share Icon
 • Facebook Icon
 • Twitter Icon
 • LinkedIn Icon
 • Reddit Icon
 • WhatsApp Icon
Share on
Report an issue
Authors

Related Tags