ఉద్యోగ ప్రయత్నాలను ఈజీ చేస్తున్న 'ఆసాన్ జాబ్స్'
'' నాన్నతో విడిపోయాక అమ్మే నన్ను పెంచి పెద్ద చేసింది. నేను మూడేళ్ళ వయసు వున్నపుడే మా నాన్న చనిపోయారు. ఆ తర్వాత రెండేళ్ళకు మా అమ్మ కూడా చనిపోయింది. అక్కడి నుంచి నా జీవితం అతీ గతీ లేకుండా సాగింది. స్నేహితుల కుటుంబాల దయ మీద వారాలు చేస్తూ గడిపాను. కొన్నిసార్లు ఏ అర్థ రాత్రో ఇంటికి చేరి నా జీవితం గురించి ఆలోచిస్తే, అంతా అగమ్య గోచరంగా వుండేది. అంతలోనే , ఇదంతా సర్దుకుని నాకో దారి దొరికే రోజు ఎంతో దూరం లేదన్న ఆశ చిగురించేది. ఇలాంటివే ఎన్నో కథలు.. జీవితాలు.. ఈ మధ్య ఆసాన్ జాబ్స్ వెబ్ సైట్ ఆసాన్ నహీ హై (అంత తేలిక కాదు) పేరుతో ఫేస్ బుక్‌లో ఓ క్యాంపెయిన్ నడిపింది. ఆ క్యాంపెయిన్ లో ప్రతి పేజి లోనూ ఇలాంటివే కథనాలు.
ఐఐటి ముంబై పూర్వ విద్యార్థి దినేష్ గోయెల్ 2014 నవంబర్‌లో ఆసాన్ జాబ్స్ .కామ్ వెబ్ సైట్‌ను ప్రారంభించాడు. అతని స్నేహితులు గౌరవ్ తోష్నివాల్, కునాల్ జాధవ్ కూడా ఇందులో భాగస్వాములు. గ్రే కాలర్డ్ మార్కెట్లో ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళకి సరైన దారి చూపించడమే వీళ్ల పని.
సొంతకాళ్ళ మీద నిలబడి మార్కెట్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న ఈ ముగ్గురు స్నేహితులకు రిక్రూట్‌మెంట్ మార్కెట్లో మంచి అవకాశాలు కనిపించాయి. నిజానికి దీని మార్కెట్ చాలా పెద్దది.. ఇక్కడ బిజినెస్ అభివృద్ధి చెందే అవకాశాలు కూడా అంతే ఎక్కువ. ఇప్పటికే ఈ రంగంలో బాబాజాబ్, నానో జాబ్ లాంటి కొన్ని సైట్లు వున్నాయి. దాదాపు వెయ్యి కేటగిరీలలో డ్రైవర్స్ నుంచి ఇంటిపని వాళ్ళ వరకు అనేక రకాలుగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో పాటు, BookMyBai లాంటి వెంచర్స్ ద్వారా సబ్ సెగ్మెంట్స్‌లోకి కూడా వెళ్తున్నారు.
ఆసాన్ జాబ్స్ మొదలైనప్పటి నుంచే మంచి ఆదరణ పొందుతోంది. ఈ సంస్థకు ఇప్పటికే 400 మంది క్లయింట్స్ ఉన్నారు. వారిలో గ్రోఫర్స్, యూరేకా ఫోర్బ్స్, ఐసిఐసిఐ బ్యాంక్, పార్సిల్డ్ లాంటి 220 మంది యాక్టివ్ క్లయింట్లు వున్నారు. డెలివరీ సిస్టమ్స్, ఫీల్డ్ సేల్స్ రంగంలో ఎక్కువగా క్లయింట్స్ ఉన్నారని దినేష్ చెబ్తారు. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫాంలో 75,000 మంది రిజిస్టర్డ్ యూజర్స్ వున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే వుంది.
ప్రస్తుతీం ఈ వెబ్ సైట్ సేవలు ముంబై, నవీ ముంబై, థానే నగరాల్లోనే అందుబాటులో వున్నాయి. దీన్ని త్వరలో ఢిల్లీ, బెంగళూరు నగరాలకు విస్తరించే ఆలోచనలున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర లోని ఎనిమిది జిల్లాల్లో ఈ సంస్థకు రెప్రెజెంటిటివ్స్ వున్నారు.
అడ్డంకులు
మార్కెట్లో ఎన్ని అవకాశాలున్నా.. ఈ స్టార్టప్‌కు ప్రారంభ కష్టాలు తప్పలేదు. వీళ్ల టార్గెట్ ఆడియన్స్‌లో 70 శాతం మంది ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న వాళ్ళే అయినా.. వాళ్ళందరికీ టెక్నాలజీలో పెద్ద అనుభవం లేదు. ఈ పరిస్థితిలో వాళ్ళందరికీ టెక్నాలజీ వివరించి, సైట్‌ను వాడేలా చేయడం అతి పెద్ద సవాలు. దీంతో పాటు, ఉద్యోగానికి అప్లై చేసే చాలా మంది ఇంటర్వ్యూ వరకు వెళ్ళరు. వెళ్ళిన వాళ్ళు.. క్లయింట్లకు నచ్చరు.
కీలక ఫండింగ్
ఈ జనవరిలో ఆసాన్ జాబ్స్ .. ఐడిజి వెంచర్స్, ఇన‌్వెంటస్ క్యాపిటల్ పార్ట్‌నర్స్ ద్వారా 15 లక్షల డాలర్ల ఫండింగ్ పొందింది. ఈ ఫండింగ్ తర్వాత మూడు లక్ష్యాలున్నాయని దినేష్ చెప్తున్నారు. మొదటిది టీమ్ బిల్డ్ చేసుకోవడం. ఏప్రిల్‌లో ఈ పని ముగిసింది. దాదాపు హెచ్‌ఓడిలంతా ఐఐటి నుంచి వచ్చిన వాళ్లే. ప్రస్తుతం ఆసాన్ జాబ్స్ లో 130 మంది ఉద్యోగులున్నారు. వారిలో 30 మంది టెక్నికల్ టీమ్. ఇక రెండో లక్ష్యం.. వ్యాపారాన్ని పెంచుకోవడం, మూడోది.. ఆఖరి లక్ష్యం.. ప్రోడక్ట్ డెవలప్ చేయడం..
ప్రోడక్ట్ రోడ్ మ్యాప్..
ఈ ప్రోడక్ట్‌ను అభివృద్ధి చేసే క్రమంలో ఆసాన్ జాబ్స్ మూడు నెలల పాటు, యూజబిలిటీ టెస్టులను నిర్వహించింది. వీటి ద్వారా వచ్చిన ఫలితాలను క్రోడీకరించి జులైలో వెబ్ సైట్‌కి ఒక రూపు తెచ్చారు. యూజర్స్‌కు అనువుగా వుండేలా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని దినేష్ చెప్పారు. మా టార్గెట్ ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని, వారి రోజు వారీ జీవన శైలిని గమనిస్తూ మా టెక్నాలజీని తీర్చిదిద్దాం అంటారు.
అందుకే కేవలం టెక్స్ట్ ఇవ్వడమే కాకుండా, ప్రతి జాబ్ గురించి 90 సెకన్లు ఆడియో వివరణ కూడా అందిస్తున్నారు. దీని వల్ల అభ్యర్థులు తమకు కావాల్సిన జాబ్ గురించి మరింత వివరంగా అర్థం చేసుకోగలుగుతారు.
ఇంగ్లీష్‌తో పాటు, హిందీ, మరాఠీలో కూడా ఈ సైట్ నడుస్తోంది. త‌్వరలో హిందీ, మరాఠీల్లో కూడా మొబైల్ యాప్స్ లాంఛ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు.
కస్టమర్ సపోర్ట్ కోసం చాట్ ఫెసిలిటీ కూడా మొదలుపెట్టారు. త్వరలోనే దీన్ని మరింత మెరుగు పరిచి.. నిర్ణీత పర్మిషన్స్‌తో సైట్లో వుండే వాళ్లంతా ఒకరితో ఒకరు చాట్ చేసుకునేందుకు వీలుగా సైట్‌ను డెవలప్ చేయబోతున్నారు.
ముందు... ముందు..
యూజర్స్ నేపథ్యం, ధృవీకరణ విషయంలో మరి కొన్ని కొత్త ఫీచర్స్‌ను పొందుపరిచేందుకు ఓ ఢిల్లీ బేస్డ్ కంపెనీ సాయం తీసుకుంటోంది ఆసాన్ జాబ్స్. అప్లై చేసి, ఇంటర్వ్యూలకు వెళ్లని వాళ్లకు రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చే ఫీచర్‌నూ డెవలప్ చేస్తున్నారు. అభ్యర్థులతో అవమానకరంగా , అభ్యంతరకరంగా ప్రవర్తించే సంస్థలకూ రెడ్ ఫ్లాగ్స్ ఇస్తున్నారు.
ప్రస్తుతం రెండో రౌండ్ ఫండింగ్ కోసం మరికొంత మంది భాగస్వాములతో చర్చలు జరుగుతున్నాయి. ఇది కూడా త్వరలోనే ఫలప్రదమవుతాయిని కంపెనీ ఆశాభావంతో ఉంది.