స్టార్టప్ ఫండింగ్ అగ్రిమెంట్ ఎలా చేసుకోవాలో తెలుసా ?
సంస్థ ఏర్పాటుకు సంబంధించిన నిబంధన జాబితా నుంచి వాటాదారుల ఒప్పందం వరకు ప్రయాణాన్ని.. నిశ్చితార్ధం నుంచి పెళ్లి వరకు జరిగే తంతుగా అభివర్ణించచ్చు. పెట్టుబడిదారుని నిబంధనల జాబితాపై స్టార్టప్ నిర్వాహకుడి సంతకంతో ఈ ప్రయాణం ప్రారంభమవుతుంది. అయితే షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్‌పై సంతకం చేశాకే ఈ డీల్ ఫైనల్ అవుతుంది. ఈ మధ్యలో జరిగే ప్రయాణంలో ముందుగా అనుకున్న ఎన్నో నియమ నిబంధనలకు మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. అనేక స్టార్టప్స్ గందరగోళానికి గురయ్యేది ఇక్కడే. మొదట రూపొందించిన టెర్మ్ షీట్‌నే తుది నియమావళిగా భావిస్తుంటారు. అయితే చివర్లో వారి చేతికి అందే ఒప్పందం ఎన్నో మార్పు చేర్పులతో ఉంటుంది. ఇరువర్గాల మధ్య ఈ సమయంలో సరైన సయోధ్య కుదరక.. అనేక డీల్స్ చివరి నిమిషంలో రద్దయిపోతుంటాయి.
నిజానికి టెర్మ్ షీట్స్, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్స్ విభిన్నమైనవి. ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన బేధాలను, అవి అలా మారడానికి గల కారణాలను.. ఈ ఆర్టికల్‌లో సవివరంగా తెలుసుకుందాం.
టెర్మ్ షీట్ అనగా ఏది ?
ఏదైనా సంస్థకు నిధులు అందించేందుకు ఇన్వెస్టర్‌కు, ఆ సంస్థకు మధ్య మొదటగా కుదిరే ఒప్పందానికి సంబంధించిన నిబంధనావళి టెర్మ్ షీట్. దీనికి కట్టుబడే ఉండాలనే నియమం ఏమీ లేదు. రెండు వర్గాల్లో ఎవరైనా దీన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. మరిన్ని చట్టబద్ధమైన డాక్యుమెంట్స్‌ను రూపొందించేందుకు ఇది ప్రాధమికంగా చాలా అవసరం. రెండు వర్గాల మధ్య ఒప్పందానికి సంబంధించిన కీలక అంశం టెర్మ్ షీట్. ఒక్క వాక్యంలో చెప్పాలంటే.. ఏ నిబంధనల ప్రకారం అయితే కంపెనీకి నిధులు అందిస్తారో.. వాటికి సంబంధించిన ఆఫర్ డాక్యుమెంట్ లాంటిది.
షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్ ఏది ?
స్టార్టప్, ఇన్వెస్టర్ల మధ్య తుది దస్తావేజు షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్. ఇది తప్పనిసరైనదే కాదు.. దీనికి చట్టపరంగా కూడా కట్టుబడి ఉంటాల్సి ఉంటుంది. కంపెనీ నిర్వహణ ఎలా ఉండాలి అనే అంశంపై.. వాటాదారులందరూ కలిసి, ఒప్పుకుని కుదుర్చుకున్న ఒప్పందమే షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్. ఆయా వాటాదారుల హక్కులు, అభ్యంతరాలకు సంబంధించిన డీటైల్స్ కూడా ఇందులో ఉంటాయి.
టెర్మ్ షీట్, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్ల నిర్వచనాలను పరిశీలించినా.. ఈ రెండింటి మధ్య చాలా సైద్ధాంతిక తేడాలున్నాయనే విషయం అర్ధమవుతుంది. అనేక సందర్భాల్లో టెర్మ్ షీట్‌లో ఉన్న నిబంధనలే.. షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్‌లోనూ ఉంటాయి. అయితే ఇలాగే ఉండాలనే నిబంధన ఏమీ లేదు. కొన్నిసార్లు మాత్రం చాలా ప్రధానమైన తేడాలు కనిపిస్తాయి. ఇంతగా వ్యత్యాసం కనిపించడానికి రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి.
ఇన్వెస్టర్ యాంగిల్
- స్టార్టప్‌పై ఇన్వెస్టర్ దృష్టి పెట్టాక ఏం జరుగుతుందంటే ?
టెర్మ్ షీట్‌పై సంతకం చేయగానే.. పెట్టుబడిదారుడు కంపెనీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తాడు. ఆయా ఒప్పందాలకు సంబంధించి, గతంలో స్టార్టప్ నిర్వాహకుడు అందించిన వివరాలను పూర్తి స్థాయిలో చెక్ చేసుకుంటారు. ఈ సమయంలో ఏవైనా దాచిపెట్టిన విషయాలు బైటపడితే మాత్రం.. తుది ఒప్పందంలో కీలకమైన మార్పులు సిద్ధం కావాల్సిందే.
ఇప్పుడు స్టార్టప్‌లను ఏర్పాటు చేస్తున్న టెక్నాలజీ నిపుణుల్లో.. గతంలో ఆర్థిక సంబంధిత విషయాల్లో అనుభవం లేనివారే ఎక్కువగా ఉంటున్నారు. వీరికి కంపెనీ నిర్వహణకు సంబంధించిన చట్టబద్ధమైన వ్యవహారాలపై ఏ మాత్రం అవగాహన ఉండడం లేదు.
ప్రాథమికంగా పాటించాల్సిన వార్షిక విషయాలను పూర్తి స్థాయిలో పాటించే కంపెనీలు కూడా కొన్ని ఉంటున్నాయి. అయితే.. కంపెనీని నడపడంలో అంతర్గతంగా అనుసరించాల్సిన విధానాల విషయంలో వీరి లోటుపాట్లు బైటపడుతున్నాయి. ఇన్వెస్టర్లు టర్మ్ షీట్‌లో కీలక మార్పులకు పట్టబట్టే.. కొన్ని సందర్భాలను తెలుసుకుందాం.
- సెక్రటరీ సంబంధిత వ్యవహరాలను ఏర్పాటు చేసుకోకపోవడం
- చట్టబద్ధ రిజిస్టర్లు, మినిట్ బుక్స్, తీర్మానాలు.. సరైన సమయంలో సరైన రీతిలో రికార్డ్ చేయకపోవడం
- మేథో సంబంధిత హక్కులు కంపెనీ దగ్గర లేకపోవడం
- ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన లైసెన్సులు, అనుమతులను పొందకపోవడం
- షేర్ హోల్డర్లు, డైరెక్టర్ల మధ్య అంతర్గత ఒప్పందాలు, కాంట్రాక్టుల విషయంలో స్పష్టత లేకపోవడం
- అదనపు ఫీజులు, జరిమానాలతో ప్రభుత్వానికి పత్రాలు దఖలు చేయడం
- వార్షిక పన్నులు, కంపెనీ రిజిస్ట్రేషన్ వ్యవహారాలు పూర్తి చేయకపోవడం
వీటితో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నా.. ఇవే ప్రధానంగా ప్రభావం చూపే అంశాలు. వీటన్నిటి విషయంలో నిర్వాహకులు అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. ముందుగానే అన్నిటినీ సిద్ధం చేసుకోవాలి.
స్టార్టప్ యాంగిల్
- చర్చలు - ఉప చర్చలు
థర్డ్ పార్టీల నుంచి, ముఖ్యంగా వెంచర్ కేపిటలిస్ట్‌ల నుంచి నిధుల సమీకరణ చేయడం చాలా క్లిష్టమైన వ్యవహారం. సీజనల్ వెంచర్ కేపిటలిస్ట్‌లతో ఒప్పందాలు చేసుకోగలగడం స్టార్టప్‌లకు అన్నిసార్లు సాధ్యమయ్యే విషయం కాదు. సాధారణంగా ఇన్వెస్టర్లు టెర్మ్ షీట్‌ను సినిమా ట్రైలర్‌లా భావిస్తుంటారు. వారి దృష్టిలో వారు చూసే ఎన్నో డాక్యుమెంట్లలో ఇది కూడా ఒకటి అంతే. వీరు అత్యధిక ప్రాధాన్యత నిచ్చేది షేర్‌హోల్డింగ్ అగ్రిమెంట్‌కు మాత్రమే. అందుకే దానిపైనే దృష్టి నిలుపుతారు.
షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్ స్థాయికి ఏదైనా డీల్ వచ్చే లోపు.. కొంత సమయం గడిచిపోతుంది. నిబంధనలు అంగీకరించకపోతే.. ఒప్పందం రద్దవుతుందేమో అనే భావన నిర్వాహకుల మదిలో ఉంటుంది. అయితే.. అన్ని సందర్భాల్లోనూ ఇదే జరుగుతుందని చెప్పనవసరం లేదు.. అలాగని దీన్ని వదిలేయకూడదు కూడా. స్టార్టప్ నిర్వాహకులు తాము కట్టుబడ్డ, అనుకున్న నిబంధనల విషయంలో కూడా వెనుకంజ వేసేది ఇలాంటి సమయంలోనే. దీనికి ఉండే ఏకైక పరిష్కారం ఆయా ఇన్వెస్టర్లకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకోవడమే. సరైన ఇన్వెస్టర్‌ను వెంచర్‌లోకి తెచ్చుకోవడం ద్వారా అదనపు బలం చేకూరుతుంది. పెట్టుబడులు సమీకరించేందుకు సంబంధించిన సమయాన్ని కూడా ముందుగానే సెట్ చేసుకోవాలి. నిధులు సేకరించడానికి.. ఎప్పుడూ ఏదో ఓ కారణం ఉంటూనే ఉంటుంది. కాని సరైన సమయాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
స్టార్టప్ ఇంకా ఓ స్థాయిని కూడా అందుకోకుండానే నిధులు సేకరించేందుకు సిద్ధమవుతుంటారు కొంతమంది. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్‌కు మొగ్గు ఉన్నట్లే.
ఉదాహరణకు ఓ మంచి కార్యాచరణతో ప్రణాళికను సిద్ధం చేసుకుని, మార్కెట్లో సత్తా చాటేందుకు అన్ని అవకాశాలు ఉన్న ఏదైనా ప్రోటోటైప్ స్టార్టప్‌ను, అప్పటికి ఆలోచన రూపంలో మాత్రమే ఉన్న స్టార్టప్‌లను తీసుకుందాం. మొదటి వెంచర్‌లో తక్కువ వాటాకు ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెట్టేందుకు వెంచర్ కేపిటలిస్ట్ సిద్ధమవుతాడు. రెండో వెంచర్ విషయంలో నిధులు తక్కువ, వాటా ఎక్కువ ఆఫర్ చేయాల్సి ఉంటుంది. అంటే.. పెట్టుబడులకు వెళ్లే ముందు టైమింగ్ చాలా ముఖ్యమని అర్ధం చేసుకోవాలి.
ముగింపుతో ముక్తాయింపు
స్టార్టప్-ఇన్వెస్టర్ల మధ్య అనుబంధానికి వాటాదారుల ఒప్పందం ఓ పునాది రాయి లాంటింది. ఇది ఏర్పాటు కావడానికి తగిన మెటీరియల్‌ను టెర్మ్ షీట్ సమకూరుస్తుంది. టెర్మ్ షీట్, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్.. ఈ రెండింటికీ సమ ప్రాధాన్యం ఇచ్చి సంతకాలు చేయాలి స్టార్టప్ నిర్వాహకులు.