రక్తదానానికి ఆన్లైన్ హంగులొద్ది వేలాది ప్రాణాలు కాపాడ్తున్న ఓ జంట
సమాజానికి మేలు చెయ్యాలని అనుకునే వారు చాలామందే ఉంటారు, కానీ ఆచరణలో పెట్టేవారు బహుకొద్ది మందే ఉంటారన్నది నిజం. డాట్ నెట్ ప్రపంచం తమకు అవగాహన లేని అంశమైనా, తోడుగా నిలిచిన స్నేహితుల, బంధువుల అండదండలతో , నిస్వార్ధంగా తాము పొదుపు చేసుకున్న డబ్బుని పెట్టుబడిగా పెట్టి ప్రస్తుతం, Indianblooddonors.com, Plateletdonors.org అనే వెబ్ సైట్స్ తో ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారు పాఒచా జంట.
రక్తం అవసరమైన వారికి స్వఛ్ఛంద రక్తదాతల వివరాలు అందించేందుకు వీలుగా http://www.indianblooddonors.com అనే ఓ వెబ్సైట్ రూపొందించి ఎందరికో సరైన సమయంలో రక్తం అందుబాటులోకి తెచ్చిన నాగపూర్ జంట ఖుస్రూ పాఒచా, ఆయన అర్ధాంగి ఫెర్మిన్ పాఒచాల కథ ఇది. వీరు స్థాపించి నడిపిస్తున్న ఈ వెబ్ సైట్ ఐడియా ఎందరో స్వఛ్ఛంద రక్త దాతల్ని ఒక వేదిక పైకి తీసుకొచ్చింది.
1999లో Indianblooddonors.com అనే వెబ్ సైట్‌ని 2012లో Plateletdonors.org అనే వెబ్‌సైట్‌ని రూపొందించి దేశంలో ఎందరో స్వఛ్ఛంద రక్తదాతలని అనుసంధానించి, రక్తం అవసరమైన వారికి ఈ దాతలను క్షణాల్లో సంప్రదించే వీలు కల్పించారు. వివరాల్లోకి వెళితే, నాగపూర్‌కి చెందిన ఖుస్రూ భారతీయ రైల్వే ఉద్యోగి కాగా ఫెర్మిన్ JN టాటా పార్సి గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తారు. వీరి జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలే ఈ దిశగా అడుగులు వేసేందుకు కారణమయ్యాయి.
1994 సెప్టెంబర్ నెలలో ఖుస్రూ నాయనమ్మ కిందపడిపోవడం వల్ల కోమాలోకి వెళ్ళింది. ఆమెను నాగపూర్‌లోని ఇందిరా మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీ, లో చేర్పించారు. ఓ రోజు తెల్లవారుఝామున 3:30కి ఖుస్రూ నాయనమ్మ ఉన్న ఫీమేల్ వార్డులో కలకలం మొదలయ్యింది. ఏమయ్యుంటుందో అని ఖుస్రూ, అక్కడ ఉన్న వారిని అడిగితే, నాభార్య ని చంపేసాడంటూ ఆర్తనాదాలు చేస్తూ, అక్కడి డ్యూటీ డాక్టర్ పై రోగి బంధువులు విరుచుకు పడుతున్నారు. అది చూసిన ఖుస్రూ అసలు జరిగిందేమిటంటూ డాక్టర్‌ను ఆరా తీస్తే, ఆమెకు హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉందనీ, రెండు యూనిట్ల రక్తాన్ని ఏర్పాటు చేయాలని రోగి బంధువులకి చెప్పామనీ, కానీ వారు ఆ రక్తాన్ని తీసుకురాలేకపోవడం వల్ల ట్రాన్స్ఫ్యూజన్ జరగక, ఆమె కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయారాని చెప్పాడు. ఈ ఘటన తనపై చాలా ప్రభావాన్ని చూపిందంటారు ఖుస్రూ.
1999 లో నాగపూర్‌లో ఒక వ్యక్తికి 'O' నెగటివ్ రక్తం కావాల్సి వచ్చి ప్రయత్నిస్తే ఏ ఒక్క బ్లడ్ బ్యాంక్‌లోనూ ఆ గ్రూపు అందుబాటులో లేదు. సకాలంలో O నెగటివ్ రక్తం ఇచ్చే దాత దొరక్క ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా తనను ఆలోచింపచేసిందనీ ఖుస్రూ చెప్పుకొచ్చారు. ఊళ్ళో వారి పరిస్థితే ఇలా ఉంటే వైద్యం కోసం వేరే ఊళ్ళకి వెళ్ళే వారి పరిస్థితి ఎలా ఉంటుందో, అక్కడ వారికి తెలిసిన వారు లేక వారు పడే పాట్లు ఇంకెంత ఘోరంగా ఉంటాయో అని మధన పడ్డారు. క్యాన్సర్‌తో బాధపడే వారికీ ఎక్కువగా రక్త మార్పిడి అవసరం, సికిల్‌సెల్ అనీమియాతో బాధపడే చిన్నారులకీ నెలకోసారి రక్త మార్పిడి చెయ్యాల్సి వస్తుందని తెలుసుకోవడం తనను ఆలోచింపచేసింది అంటారు.
ఈ విషయాలన్నీ తన అర్ధాంగితో చర్చించి, ఎంతో మంది స్వఛ్ఛంద రక్తదాతలు ఉన్న మన ప్రపంచంలో, ఇలా సరైన సమయంలో రక్త దాతలు దొరక్క రోగులు చనిపోకుండా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలని నిశ్చయించుకున్నారు. అయితే, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అనే సందిగ్ధంలో పడ్డారు. ఈ సమస్యకి ఓ పరిష్కారం చూపించే ఉపాయం ఆలోచించాలని అనుకున్నారు. ఆ రోజుల్లో అప్పుడప్పుడే ఎదుగుతోంది డాట్ కాం ప్రపంచం. ప్రతీ వారూ తమ సంస్థకి ఓ వెబ్ సైట్ కావాలనుకుంటున్న రోజులవి. ఈ వెబ్ సైట్ ఆలోచన వచ్చిన వైనాన్ని గుర్తు చేసుకుంటారు.
"నేను అప్పుడే ఇంటర్నెట్ వాడకం నేర్చుకున్న రోజులవి. గంటకి వంద రూపాయలు ఇచ్చి సైబర్ కేఫ్ వాడుకునేవారు. కెనడాలో ఉండే నా కజిన్‌కి ఈ-మెయిల్స్ పంపడానికి ఇంటర్నెట్ వాడుతుండే వాణ్ణి. ఓ రోజు ఇ మెయిల్స్ చెక్ చేసుకుంటుండగా, రక్తదాతనీ, రక్తం కావల్సిన పేషంట్లనీ ఓ చోట చేర్చే ఇలాంటి ప్లాట్ ఫారం ఒకటి క్రియేట్ చెయ్యచ్చుగా అనుకున్నాను. ఆలోచన రావడమే తడవుగా రక్తదాతలని, పేషంట్లనీ అనుసంధానించే వెబ్ సైట్ www.indianblooddonors.comకి రూపకల్పన చేశాను" అని అన్నారు.
ఈ వెబ్ సైట్ ప్రారంభించడానికి ఖుస్రూ జంట తాము దాచుకున్న సేవింగ్స్‌ని ఖర్చు చేశారు. "అసలు వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే ఏం చెయ్యాలో తెలీదు, ఎక్కడ నుంచి మొదలు పెట్టాలో అసలే అవగాహన లేదు. ఆ సమయంలో ఐటి రంగంలో పని చేస్తున్న నా సోదరుడి స్నేహితుడి సహాయం తీసుకున్నాం. ఇది సమాజ శ్రేయస్సుని కోరుకునే విషయానికి సంబంధించిన ప్రాజెక్టు కావడంతో అతను కేవలం 15,000 రూపాయలకు మాకు వెబ్ సైట్ చేసి ఇచ్చాడు. ఇక ఆ తర్వాత డొమైన్ వేట. ఆ రోజుల్లో ఆన్ లైన్లో డొమైన్ బుక్ చెయ్యడానికి నా దగ్గర క్రెడిట్ కార్డు లేదు. కెనడాలో ఉన్న నా కజిన్ సహాయంతో 1999 అక్టోబర్ 27న డొమైన్ రిజిస్టర్ చేశాం. ఆతర్వాత హోస్టింగ్ విషయానికి వచ్చేసరికి,www.interland.com లో హోస్ట్ చెయ్యమని చెప్పారు. అప్పట్లో అందుబాటులో ఉన్న ప్యాకేజీ రూ.10,000 కి SQL సర్వర్‌తో 250MB- మూడు నెలల కాలవ్యవధికి బుక్ చేశాం. ఇక, అసలైన పెట్టుబడి ఇంట్లో ఉండి మెయిల్స్ చెక్ చేసుకుని రెస్పాండ్ అవ్వడానికి కావాల్సిన ఓ కంప్యూటర్. అది కూడా రూ, 12,500 పెట్టి ఓ సెకండ్ హ్యాండ్‌ది కొన్నాం.
అలా 2000 జనవరిలో http://www.indianblooddonors.com/ వెబ్ సైట్ లాంచ్ చేశాం. అడ్వర్టైజింగ్ రంగంలో పని చేసే ఓ స్నేహితుడు మా వెబ్ సైట్ కి లోగోనీ, లాంచింగ్‌కి ఓ పోస్టర్ నీ, ఓ ప్రకటననీ డిజైన్ చేసి ఇచ్చాడు. అదృష్టవశాత్తూ, ప్రస్తుతం మా వెబ్ సైట్‌కి ముగ్గురు స్పాన్సరర్స్ దొరికారు. Net4India వారు హోస్టింగ్ సర్వీసు, Awaaz.de వాళ్ళు 07961907766 ఉచిత IVRS లైను ని ఇచ్చారు. అలాగే, Innoz.in వారు SMS హెల్ప్ లైన్ ఇస్తున్నారు. "
రక్తం అవసరమైన వారు 5 రకాలుగా దాతలను ఈ సైట్ ద్వారా సంప్రదించవచ్చు.
- 1. గూగుల్ ప్లే ద్వారా Indian Blood Donors ఆండ్రాయిడ్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని సహాయంతో, పేషంట్లు లేదా వారి బంధువులు వారి ప్రాంతంలోని రక్త దాతల్ని సంప్రదించే వీలు ఉంటుంది.
- 2. ఇంటర్నెట్ సౌకర్యం లేని, SMS వినియోగించడం రాని సామాన్య ప్రజానీకానికి సులువుగా ఉండేలా ఓ ఉచిత హెల్ప్ లైను ఉంది. ఇలాంటి వారు 07961907766 – అనే నంబరుకి కాల్ చేయవచ్చు. ఈ ఉచిత IVRS హెల్ప్ లైను ఇంగ్లీషు మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
- 3. 55444 అనే నంబరుకి BLOOD అని SMS చేసే సదుపాయం కూడా ఉంది.
(ఈ సౌకర్యం Aircel, Airtel, Vodafone, Tata Docomo వినియోగదారులకి అందుబాటులో ఉంది. ఐడియా సబ్ స్క్రైబర్స్ అయితే BLOOD అని 55577కి SMS చెయ్యాలి)
- 4. మీ పట్టణం/నగరం లో ఉన్న రక్త దాతల వివరాలు కావాలంటే ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్ లో అంటే, DONOR అని టైప్ చేసి మీ ప్రాంతపు STD కోడ్ మరియు కావాల్సిన రక్తం గ్రూపు ని తెలియచేస్తూ 9665500000 అనే నంబరు కి SMS చెయ్యాలి. DONOR (Std Code) (Blood Group)
- 5. మీ ఏరియాలో ఉన్న రక్త దాతల వివరాలు కావాలంటే ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్ లో అంటే, DONOR PIN అని టైప్ చేసి మీ ప్రాంతపు పిన్ కోడ్ మరియు కావాల్సిన రక్తం గ్రూపు ని తెలియచేస్తూ 9665500000 అనే నంబరు కి SMS చెయ్యాలి. DONOR PIN (Six Digit Postal Pin Code) (Blood Group)
ఈ వెబ్ సైట్ ప్రభావం జనాల్లో బాగా ఉందనడానికి ఓ చక్కటి నిదర్శనం, దేశవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు, వెబ్ సైట్ నుంచి పోస్టర్లు డౌన్లోడ్ చేసుకుని, రక్తదాతలకోసం ఈ వెబ్సైట్ చూడండి అంటూ ఆ పోస్టర్లని పలు హాస్పిటల్స్‌లో అందరికీ కనపడేలా ఏర్పాటు చేశారు. ఈ వెబ్ సైట్‌తో ఖుస్రూ జంటకి ఆదాయ పరంగా పెద్దగా ఒరిగేదేమీ లేకపోయిన సమాజానికి ఉపయోగపడే ఓ గొప్ప పని చేశామన్న సంతృప్తి వారికి అమూల్యమైన ఆనందాన్ని ఇచ్చింది. త్వరలో స్వఛ్ఛంద రక్తదాతల్ని కలిపే ఓ యాప్ కూడా డిజైన్ చేయాలన్న యోచనలో ఉన్నట్టు ఖుస్రూ చెప్పారు. అలాగే ఈ సంవత్సరం, భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖవారు indianblooddonors.com వెబ్సైట్ చేస్తున్న సేవలను గుర్తించి 2015 వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే రోజున అవార్డ్ ఆఫ్ ఎక్సెలెన్స్‌ను ప్రకటించి ప్రశంసా పత్రాన్ని అందించింది.