టెక్నాలజీ దారి పట్టిన మిఠాయిలు. ఒక్క షాపుతో మొదలై 41 స్టాల్స్‌కు పెరిగిన కాంతి స్వీట్స్
1957లో బెంగళూరులోని కెంపెగౌడ సర్కిల్‌లో ఓ చిన్నగదిలో మొదలైంది కాంతి స్వీట్స్. పండిట్ జ్యోతి స్వరూప్ శర్మ ప్రారంభించిన ఈ స్టాల్, 1973లో ఆయన చనిపోయాక ఆయన కుమారుడు రాజేంద్ర ప్రసాద్ చేతికి వచ్చింది. ఇక 2005 నుంచి శైలేంద్ర శర్మ ఈ ఫ్యామిలి బిజినెస్‌లో భాగస్వామిగా మారారు. అప్పుడు ఒక చిన్న గదిలో మొదలైన ఈ బిజినెస్ ఇప్పుడు మొత్తం 41 షాపులుగా విస్తరించింది. బెంగళూరులోని హైపర్ సిటీ మాల్‌లో ఒక కియాస్క్ కూడా వుంది.
చాలా పరిశ్రమల్లాగే, కాంతి స్వీట్స్ కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుని తమ బిజినెస్‌ను పెంచుకుంది. ఇందులో భాగంగా, అర్బన్ పైపర్, రోడ్ రన్నర్ లాంటి సంస్థలతో జతకలిసింది. ఈ మధ్యే రసమలాయి, సమోసా, కచోరి లాంటి స్వీట్స్ , హాట్స్‌ను కస్టమర్ల దగ్గరకే అందించేందుకు వీలుగా ఒక యాప్‌ను కూడా మార్కెట్ లోకి తెచ్చారు.
ఈ యాప్ ద్వారా, కాంతి స్వీట్స్ కస్టమర్లు.. తమకు దగ్గరలో కాంతి స్టాల్ ఎక్కడుందో కనుక్కోగలరు. అవసరమైతే, యాప్ నుంచే డెలివరీ ఆర్డర్ చేయొచ్చు. తమ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి నోటిఫికేషన్లు కూడా వస్తాయి. ఇదే యాప్ ద్వారా మేనేజ్మెంట్కి ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశం కూడా వుంటుంది. అలాగే, బెంగళూరు బయట వుండే వ్యక్తులు ఆర్డర్ చేయకుండా, యాప్‌లో జియోఫెన్సింగ్ ఏర్పాట్లు కూడా చేసారు.
సౌరబ్ గుప్తా మొదలుపెట్టిన అర్బన్ పైపర్.. కాంతి స్వీట్స్ లాంటి వ్యాపారస్తులు, తమ కస్టమర్లకు అధునాతన సదుపాయాలు కల్పించేందుకు చాలా ఉపయోగపడుతుంది. ఆరుగురితో కూడిన అర్బన్ పైపర్ టీమ్ చాప్ పాయింట్ లాంటి క్లయింట్లకు చాలా మంచి అప్లికేషన్లు రూపొందించింది. ఇక రోడ్ రన్నర్‌ను ఫ్లిప్ కార్ట్ మాజీ ఉద్యోగులు మోహిత్ కుమార్, అర్పిత్ దవె ప్రారంభించారు. దీని వల్ల కాంతి స్వీట్స్‌కు లాజిస్టిక్స్ ఇబ్బందులన్నీ తీరాయి. వీరికి ఈ మధ్యే సెకోయా క్యాపిటల్, నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్, బ్లూమ్ వెంచర్స్ నుంచి 11 మిలియన్ డాలర్ల ఫండింగ్ వచ్చింది.
ప్రస్తుతం ఇంకా సంప్రదాయ పద్ధతుల్లో వ్యాపారం చేస్తున్న వారు కూడా ఆ ముందు ముందు టెక్నాలజీని ఆశ్రయించక తప్పదని శైలేంద్ర యువర్ స్టోరీకి చెప్పారు. ఐఎస్‌ఓ 9001..2008, హెచ్‌ఎసిసిపి 22000..2005 సర్టిఫికెట్లున్న అతి కొద్ది స్వీట్ షాపుల్లో కాంతిస్వీట్స్ ఒకటి. ఈ సంస్థకు బెంగళూరులోని రాజాజి నగర్‌లో రోజుకి 150 రకాల్లో 6 టన్నుల స్వీట్లను తయారు చేసే 35 వేల చదరపు అడుగుల తయారీ కేంద్రం వుంది. స్వీట్లను తయారు చేయడంలో వీలైనంత ఎక్కువగా యంత్రాలను వాడడం వల్ల ఈ స్థాయిలో ఉత్పత్తి సాద్యమవుతోందని శైలేంద్ర చెప్పారు.
ఆహార పదార్ధాలకు సంబంధించిన మార్కెట్లో నమ్మకం , విశ్వాసం.. ఈ రెండే కీలకమని శైలేంద్ర నమ్ముతారు. అందుకే ముడిపదార్థాలన్నిటినీ బాగా నమ్మకమైన వారి దగ్గర నుంచే కొంటారు. ఈ నమ్మకం కోసమే గత 20, 25 ఏళ్ళుగా కొన్ని ముడిపదార్థాలను ఒకరి దగ్గరే కొంటున్న సందర్భాలు కూడా వున్నాయి. నెయ్యిని తమిళనాడు నుంచి, కుంకుమ పువ్వుని కాశ్మీర్, ఢిల్లీల నుంచి కార్న్ ఫ్లేక్స్, వేరుశనగ గుళ్ళని గుజరాత్ నుంచి తెప్పిస్తామని వివరించారు శైలేంద్ర.
ఇక స్వీట్స్‌లో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపించడానికి సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చి ఇన్స్‌టిట్యూట్ పైన ఆధార పడతారు. ఇందులో పనిచేసిన అనుభవం వున్న సైంటిస్టును కాంతిస్వీట్స్ తమ సంస్థలోనే నిమయించుకుని, తమ ఉత్పత్తుల నాణ్యతలో ఏ లోటూరాకుండా చూస్తోంది.
ఇక మొబైల్ యాప్ పెట్టాలనే ఆలోచన చాలా యథాలాపంగా వచ్చింది. ఇప్పటికే నగరంలో 40 చోట్ల ఔట్ లెట్స్ వున్నాయి కనుక, యాప్ ఒకటి వుంటే నగరంలో ఏ మూలకైనా సులభంగా డెలివరీ ఇవ్వొచ్చని భావించారు. అనుకున్నట్టుగానే, ఇప్పుడు 15 నిముషాల నుంచి రెండు గంటల్లోపు ఆర్డర్స్ ని డెలివర్ చేస్తున్నారు.
ఇప్పటిదాకా కాంతి స్వీట్స్ యాప్‌కు 1000 డౌన్ లోడ్స్ వున్నాయి. గతంలో పది నుంచి పన్నెండు ఆర్డర్స్ వస్తే, ఇప్పుడు ఆ సంఖ్య యాభైకి పెరిగింది. ఇందులో చాలా వరకు రిపీట్ ఆర్డర్సే. ప్రస్తుతం కాంతి స్వీట్స్ షాపులతో పోలిస్తే, యాప్‌లో తక్కువ రకాలే అందుబాటులో వుంటాయి. ఇది కూడా కావాలనే చేసారు. మామూలుగా స్వీట్ షాప్‌కి వచ్చే వాళ్ళు అక్కడున్న అనేక వెరైటీలను చూసి ఏది కొనాలో తేల్చుకోలేక పోతుంటారు. యాప్‌లో ఆ కష్టం లేకుండా, బాగా పాపులర్ అయిన రకాలనే పెట్టారు.
సవాళ్ళు
నిజానికి ఆహార పదార్ధాల మార్కెట్లో లాభాల మార్జిన్ బాగానే వుంటుంది. అయితే, అవి నిల్వ వుండే కాలం చాలా తక్కువ. స్వీట్స్ విషయంలో అది మరీ తక్కువ. ఈ బిజినెస్‌లో ఇదే పెద్ద సవాలు. ఏ ప్రాంతంలో ఎక్కువ ఏది అమ్ముడుపోతుందని తెలుసుకుని పదర్ధాలు తయారు చేయాల్సి వుంటుంది. ఇది అనుభవం ద్వారా తెలుసుకోవల్సిందే తప్ప వేరే దారి లేదు. ఉదాహరణకి కొన్ని చోట్ల జిలేబీలు బాగా అమ్ముడు పోతే, మరికొన్ని చోట్ల వాటిని అస్సలు కొనరు. అలాగే, పదార్ధాలు పాడయ్యే లోపు వాటన్నిటినీ అమ్మడం చాలా పెద్ద సవాలే అంటారు శైలేంద్ర.
పని తెలిసిన కార్మికులు దొరకడం కూడా ఈ రంగంలో కష్టమే. బేకరీలు, హోటల్స్‌కి అయితే, చెఫ్‌లకు సర్టిఫికేట్ కోర్సులుంటాయి. కానీ, సంప్రదాయ మిఠాయిల విషయంలో ఆ సౌకర్యం లేదు. ఇదొక తరతరాల వారసత్వ ప్రావీణ్యం. కొంత కాలం పనిచేస్తే, కొన్ని స్వీట్లు చేయడం వస్తుందేమో కానీ, కొన్నిటిని నేర్చుకోడం మాత్రం చాలా కష్టం.
యువర్ స్టోరీ అభిప్రాయం
సహజంగానే భారతీయులకు స్వీట్లంటే ఇష్టం. ఏడాది పొడుగునా మనకి ఏవో పండుగలువుంటూనే వుంటాయి. ఒక్కో పండక్కిఒక్కో రకమైన స్వీట్లు స్పెషల్‌గా వుంటాయి. అర్బన్ పైపర్, రోడ్ రన్నర్ లాంటి వెబ్ సైట్లతోపార్ట్‌నర్‌షిప్ వల్ల కాంతి స్వీట్స్ తమ బిజినెస్‌ను మరింత విస్తరించుకుని, మొబైల్ తరానికి చేరువైంది.
ఈ యాప్ వల్ల అప్పటికప్పుడు అయినా ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా మరుసటి రోజుకోసమైనా ఆర్డర్ చేసుకోవచ్చు. మనకి బోలెడు పండుగలు కాబట్టి, రాబోయే పండుగలకు ముందే ఆర్డర్ చేసుకోగలగడం ఒక మంచి వెసులు బాటేఅని చెప్పాలి.
భవిష్యత్ ప్రణాళిక
ప్రస్తుతం అర్బన్ పైపర్ లో క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం మాత్రమే వుంది. త్వరలోనే రేజర్ పే తో కలిసి పేమెంట్ గేట్ వే కూడా ప్రారంభించబోతోంది.. అర్బన్ పైపర్. త్వరలోనే ఒక డెస్క్ టాప్ వెబ్ సైట్, ఐఓఎస్ యాప్ ని కూడా సిద్ధం చేస్తున్నారు.