మీరు కాఫీ తాగి వచ్చేలోపు బైక్ సర్వీసింగ్ చేసిస్తారు..

18th Oct 2016
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close


బైక్ వాషింగ్ కి ఇస్తే కొన్ని గంటలు… సర్వీసింగ్ కి అయితే ఒక పూట వెయిట్ చేయాలి. అందుకే ఇందుకోసం చాలా మంది సెలవురోజునే ఎంచుకుంటారు. ఉదయం మెకానిక్ కు ఇస్తే మళ్లీ సాయంత్రమే డెలివరీ. అసలు మనం లేని సమయంలో బైక్ ను మెకానిక్ ఏం చేస్తాడోనని టెన్షన్. ఇలాంటి అనుభవాలనే ఎదుర్కొన్న ముగ్గురు ఐఐటియన్లు … ఎక్స్ ప్రెస్ బైక్ వర్క్స్ (EBW) పేరుతో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా బైక్ ను వాష్ చేసే మెషిన్ కనిపెట్టారు. సర్వీసింగ్ కూడా చికికెలో చేసేస్తారు.

బైక్ లవర్స్

నీరజ్ తక్సాండే, భూషణ్, జిగర్ ఓరా… జాన్ జిగిరీ దోస్తులు. ముగ్గురికీ బైక్స్ అంటే ప్రాణం. సెలవు రోజుల్లో బైక్స్ పైనే వివిధ ప్రాంతాలకు వెళ్లడం హాబీ. నీరజ్ ముంబై యూనివర్సిటీలో ఇంజనీరింగ్, ఐఐఎం ఇండోర్ లో ఎంబీఏ చదివారు. భూషణ్ ఐఐటీ ముంబైలో బీటెక్, ఎంటెక్ చేశారు. ఐఐటీ ముంబబైలో భూషణ్ క్లాస్ మేట్ జిగర్.

“ఉదయం బైక్ మెకానిక్ కి ఇచ్చేసి సాయంత్రం వరకు ఆగలేం. ఇప్పుడున్న స్పీడ్ లైఫ్ కు ఇండియన్ గ్యారేజ్ లు సరిపోవని తెలుసుకున్నాం. రెండు నిమిషాల్లోనే బైక్ వాష్ చేసే మెషీన్ ను కనిపెట్టాలనుకున్నాం. టీ తాగేలోపు సర్వీసింగ్ పూర్తి చేయాలి”-నీరజ్ 

జేపీ మోర్గాన్ లో జిగర్, తైవాన్ లో భూషణ్, ఎస్ఐ గ్రూప్ లో నీరజ్ పనిచేసేవారు. ఉద్యోగాలు చేస్తూ కూర్చుంటే తమ కలను , కోట్లాది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చలేమనుకున్నారు . అందుకే కొలువులకు టాటా చెప్పేశారు. 2013లో ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. రెండు నిమిషాల్లోనే బైక్ ను వాష్ చేసే EBW మెషిన్ కనిపెట్టారు. ఇందుకోసం ఎనిమిది నెలలు పట్టింది. ఎక్స్ ప్రెస్ బైక్ వర్క్స్ పేరుతో 2014 ఇండియా బైక్ వీక్ లో దీన్ని ప్రదర్శిస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఎలా సాధ్యమయ్యింది?

EBW ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బైక్ వాష్ మిషన్ గా గుర్తింపు పొందింది. ఎంత చెత్త బైక్ నైనా ఐదంటే ఐదే నిమిషాల్లో అద్దంగా మెరిసిపోయేలా చేస్తుంది. మామూలు బైక్ వాష్ కి అయితే రెండు నిమిషాలు చాలు.

ఇదంతా ఒక్కసారిగా అవలేదు. కొన్ని వేలసార్లు ట్రయల్ చేసి చూసుకున్నారు. వాటర్ ఫ్లో, ప్రెజర్ సరైన కాంబినేషన్ లో ఉండేలా మిషన్ రూపొందించారు. వారికున్న అనుభవంతో అత్యంత సమర్థవంతమైన వాషింగ్ సిస్టమ్ తయారు చేశారు. ప్రత్యేకంగా బయో షాంపూను కూడా తయారుచేశారు. అది నీటి వృథాను అరికడుతుంది. మామూలు మిషన్లతోకంటే EBW మెషిన్ వాడితే నాలుగోవంతు నీటితోనే బైక్ వాషింగ్ పూర్తవుతుంది. 

image


బిజినెస్ మోడల్

మెషిన్ కనిపెట్టాక కొన్ని మోడల్స్ మార్కెట్లోకి తెచ్చారు. ఒక్కో మెషిన్ పది లక్షలకు… ముంబైలోని సర్వీస్ సెంటర్లకు అమ్మారు. పెద్ద పెద్ద ఉద్యోగాలను వదలుకొని మెషిన్లు అమ్మడం దగ్గరే ప్రస్థానం ఆపేయలేరు కదా? అందుకే EBW స్టోర్ పేరుతో స్టార్టప్ ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా EBW బ్యానర్లో 360 డిగ్రీస్ బైక్ సర్వీస్ సెంటర్లను ప్రారంభించారు. ఫ్రాంఛైజ్ మోడల్ లో వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. సర్వీసింగ్ సెంటర్లకు మెషినరీ, ట్రైనింగ్, బ్రాండింగ్, సాఫ్ట్ వేర్ అందిస్తున్నారు. ఔత్సాహికులకు ఫ్రాంఛైజ్ ఇస్తూ పార్టనర్స్ గా చేర్చుకుంటున్నారు. సొంతంగా ఎనిమిది సర్వీసింగ్ సెంటర్లను రన్ చేస్తున్నారు. ఎక్స్ ప్రెస్ కేర్ పేరుతో వాషింగ్, మెయింటెనెన్స్, డయగ్నాస్టిక్ రిపోర్ట్స్ అందిస్తున్నారు. పూర్తిస్థాయిలో బైక్ హెల్త్ చెకప్ సేవలు అందిస్తున్నారు. మొత్తం బైక్ ను 40 విభాగాల్లో పరీక్షిస్తున్నారు. క్విక్ సర్వీస్ – ఫైవ్ మినిట్స్ ఆన్ రోడ్ అంటూ దూసుకెళ్తున్నారు. ఫ్రాంఛైజ్ పార్టనర్స్ కోసం పెట్రోల్ పంపులు, మాల్స్, కార్పొరేట్ పార్క్స్ ను సంప్రదిస్తూ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటున్నారు. పుణె, ఢిల్లీ, నాసిక్, ధన్ బాద్, హుబ్లీ, త్రిసూర్ లో ఫ్రాంఛైజ్ లను ఏర్పాటు చేశారు.

EBW మెషిన్లను హీరో, రాయల్ ఎన్ ఫీల్డ్, హోండా కంపెనీలు సైతం కొనుగోలు చేశాయి. మామూలుగా బైక్ సర్వీసింగ్ సెంటర్లలో ఐదారుగురు ఉద్యోగులుండాలి. EBW మెషిన్లను వాడితే ఇద్దరు లేదా ముగ్గురుంటే చాలు. అంటే మ్యాన్ పవర్ ను… ఖర్చును కూడా బాగా తగ్గించుకోవచ్చన్నమాట. ఒక్కో సర్వీస్ సెంటర్ లో 250 వాహనాలను పది గంటల్లోపే వాష్ చేసి రికార్డులను సృష్టిస్తోంది ఎక్స్ ప్రెస్ బైక్ వర్క్స్. దాదాపు రెండు లక్షల బైక్స్ కు సర్వీసింగ్ చేశారు… ఎక్కడా ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు.

EBW స్టోర్స్ శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. మూడు నెలలకు రెండు వందలశాతం సక్సెస్ కనిపిస్తోంది. ఈ స్టార్టప్ లో గత ఏడాది వ్యాపార ప్రముఖులు పెట్టుబడులు పెట్టారు. హీరో కార్ప్ లిమిటెడ్ అభిమన్యు ముంజాల్, టెంపుల్టన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఛైర్మన్ మార్క్ మోబస్ , కార్నేషన్ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కునాల్ ఖట్టార్ లాంటివారు ఇన్వెస్ట్ చేశారు.

image


బైక్ మార్కెట్

ప్రపంచంలోనే బైక్స్, కార్లు తయారు చేస్తున్న దేశాల్లో ఆరో స్థానంలో ఉంది భారత్. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కోటి 85లక్షల టూవీలర్స్ మార్కెట్లోకి వచ్చాయి. బైక్ ఇప్పుడు మధ్యతరగతి మనిషికి నిత్యావసర వస్తువుగా మారిపోయింది. దేశంలో బైక్ సర్వీసింగ్ మార్కెట్ విలువ 13వేల 6 వందల కోట్ల రూపాయలు. ఈ మార్కెట్ లో తమదైన మార్క్ వేలాయలనుకుంటున్నారు ఎక్స్ ప్రైస్ బైక్ వర్క్స్ వ్యవస్థాపకులు.

“బెంగళూరు, కోచి, కోయంబత్తూర్, నాగపూర్, విజయవాడ సహా పలు నగరాల్లో 2016లోనే స్టోర్స్ ప్రారంభిస్తాం. వెంటనే 50 సర్వీసింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం. పూణెలో ఇప్పటికే 25 ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ను సైతం అందిపుచ్చుకుంటాం. విదేశాల్లోనూ EBW సెంటర్స్ ఏర్పాటు చేస్తాం”- నీరజ్
  • +0
Share on
close
  • +0
Share on
close
Share on
close
Report an issue
Authors

Related Tags

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి

Our Partner Events

Hustle across India