సర్వీస్ అపార్ట్‌మెంట్ల నిర్వాహణలో ఆమెకు ధీటైన పోటీయే లేదు !
'' గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు గుండె ధైర్యం ఉన్నవాళ్లే ముందుకు సాగుతారు ''. ఇదీ హైదరాబాద్‌లో స్వాన్ సూట్స్ డైరెక్టర్ అయిన రంజనా నాయిక్ .. ఇంటర్వ్యూ మొదట్లో చెప్పిన మాట. స్వాన్ సూట్స్ అనేది హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో అత్యాధునిక సర్వీస్ అపార్టుమెంట్లను నిర్వహించే సంస్థ. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఒక తల్లిగా, ఒక సక్సెస్‌ఫుల్ ఆంట్రప్రెన్యూర్‌గా, స్టార్టప్స్‌కు మెంటార్‌గా ఎన్నో విభాగాల్లో తన సత్తా చూపించారు.
ఈ స్థాయికి రావడం వెనుక రంజనా చాలా ఆటంకాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఒకప్పటి సహోద్యోగి అయిన ఓ వ్యక్తి నుంచి ఆమె 2006లో హైదరాబాద్ సర్వీస్ అపార్ట్‌మెంట్ ఫ్రాంచైజీని తీసుకున్నారు. అతను బెంగళూరు మరియు హైదరాబాద్‌లలో సర్వీస్ అపార్ట్‌మెంట్లను అద్దెకిచ్చే వ్యాపారాన్ని నడుపుతుండేవారు. అప్పట్లో వీటికి బూమ్ బాగుండడంతో వీటివైపు మొగ్గుచూపారు రంజనా. ఆ సమయంలో 10 లగ్జరీ అపార్ట్‌మెంట్లలో 30 రూములు ఉండేవి.
మొదటి సంవత్సరంలో వ్యాపారం మంచి రాబడులు సాధించినప్పటికీ, రెండో సంవత్సరం నుంచి పరిస్థితి మారుతూ వచ్చింది. మార్కెటింగ్ కోసం పూర్తిగా వాళ్ల మీదే ఆధారపడడంతో అంతా దైవాధీనంగా మారింది. అప్పటికే వ్యాపారం ఆమె చేతుల్లోంచి జారిపోతోందని తనకు అర్థమైంది. ఈ లోపు ఆమె వ్యాపార భాగస్వామి హైదరాబాద్ మార్కెట్ నుండి పూర్తిగా వైదొలిగారు. దీంతో ఆమె వాటా కింద ఐదు అపార్ట్‌మెంట్లలో 15 రూములు మిగిలాయి.
అదే సమయంలో స్టాండర్ట్ ఛార్టర్డ్ బ్యాంక్ వారి టెలికాం కాలింగ్ ఏజెన్సీని కూడా ఆమె నిర్వహించేవారు. అందుకే దీనిపై ఎక్కువగా దృష్టిసారించలేకపోయారు. రెండు పడవల ప్రయాణంతో సర్వీస్ అపార్ట్‌మెంట్ల నిర్వాహణలో ఎదురుదెబ్బలు తగిలాయి.
ఈ కష్టాలకు తోడు.. 2006 లోనే ఆమెకి పాప పుట్టడం.. తన ఆలనాపాలనకు సమయం కేటాయించాల్సి రావడంతో.. చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెబ్తారు రంజనా.
పోయిన చోటే వెతుక్కున్నారు
జీవితంలో దేన్నీ అంత సులువుగా పోనివ్వకూడదు అంటారు. ఒక వేళ చేజారితో.. పోయిన చోటే వెతుక్కోవాలి అంటారు. అందుకే రంజనా సరికొత్తగా జీవితాన్ని మొదలుపెట్టాలనుకున్నారు. సర్వీస్ అపార్ట్‌మెంట్ల నిర్వాహణా రంగంలో పరిశోధన చెయ్యడానికి.. అవగాహన పెంచుకునేందుకు రెండేళ్లు కేటాయించారు. పాప నిద్రపోయిన సమయంలోనే ఫోన్ కాల్స్ తీసుకోవడం లేదా పాపని కూడా సైట్ వద్దకి తీసుకువెళ్లడం చేసేవారు. మొత్తానికి రంజనా మార్కెట్‌ని అర్ధం చేసుకోగలిగారు. అప్పటినుండి ఆక్యుపెన్సీ రేటు కూడా పెరగడం మొదలైంది. దీంతో వ్యాపారం 15 గదుల స్థాయి నుంచి 40 గదుల స్థాయికి పెరిగింది.
గోల్డ్‌మాన్ సాక్స్ భారత్ సహా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10,000 మంది మహిళా ఆంట్రప్రెన్యూర్లని స్పాన్సర్ చేస్తుంది. ప్రముఖ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వీరికి మన దేశంలో భాగస్వామిగా వ్యవహరిస్తూ.. శిక్షణనిస్తుంది. ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకుని.. ఎంపికయ్యారు రంజనా. వ్యాపారాన్ని పెంచే విధానాలు, నిర్వహణ పరిజ్ఞానం, ఆంట్రప్రెన్యూర్‌షిప్ మీద నిశిత దృష్టిని ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకునే అవకాశం ఉంది.
అక్కడ ఆమె చాలా మంది మహిళలను కలిశారు. ఉన్న అవకాశాలను తెలుసుకున్నారు. వ్యాపారం ఎలా చెయ్యాలనే దాని గురించి ఒక సరికొత్త ఆలోచన కలిగింది. ఆ కోర్సు నాకు చాలా మంచి చేసింది అంటారు.. అప్పటినుండే పైకి ఎదిగిన రంజనా.
ఆమె విద్యా నేపథ్యం
హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగి, పెళ్లాడిన రంజనా... లైఫ్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్ చేసారు. ఆ వెంటనే ఆమె తన కెరీర్‌ని ప్రారంభించారు. కార్పొరేట్ కమ్యునికేషన్స్‌లో డిప్లొమా కూడా పొందారు. సేల్స్ అండ్ మార్కెటింగ్ కెరీర్‌లో ఉన్నప్పుడు ఆమె కంపెనీలకి ప్రొఫెషనల్ సేల్స్ ప్రోగ్రామ్స్‌ని అమ్మేవారు. కానీ ఆ కంపెనీ 30 నెలల్లోనే మూతపడింది.
ఆమె తండ్రి ఒక ఫార్మసిస్ట్‌గా, తల్లి ఒక ప్రిన్సిపల్‌గా, సోదరుడు ఇంజనీర్‌గా పనిచేసేవారు. “చదువుకుంటే చాలా సులువుగా ఒక వృత్తిలో స్థిరపడవచ్చు. కాకపోతే నాకు కొనడం, అమ్మడం అనే అంశం మీద చాలా ఆసక్తి కలగడం వల్ల అదే మొదటగా నా వ్యాపార విషయమైంది ” అంటారు రంజనా. అప్పుడు ఆమె ఎన్ఐఐటి సెంటర్ హెడ్‌గా జాయిన్ అయ్యారు. ఆమె ఎన్ఐఐటి లో పనిచేస్తున్నప్పుడే ఆమెకు కాబోయే భర్తని కలుసుకున్నారు. ఆయన కూడా తన అన్నయ్య స్నేహితుడే.
స్వాన్ సూట్స్ రూపంలో పికప్ అయిన వ్యాపారం
2009వ సంవత్సరంలో, స్వాన్ సూట్స్ మంచి జోరుతో మొదలైంది. వ్యాపారం బాగా పెరిగింది. రంజనాలోని ఆంట్రప్రెన్యూర్‌కి వ్యాపారం మీద గట్టి పట్టు సాధించాలంటే ఖచ్చితంగా ఏమి చెయ్యాలో స్పష్టంగా అర్థమైంది. హాలిడే ట్రావెలర్స్, ఎన్ఆర్ఐలు, కార్పొరేట్ల మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు స్వాన్ సూట్స్ దాదాపు 250 కంపెనీలతో కలసి పనిచేస్తోంది. వారి అతిథులందరికీ వీరి సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌లోనే ప్రత్యేకంగా బస ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కంపెనీ హైదరాబాద్‌లో నాలుగు చోట్లలో 95 మంచి గదులను నిర్వహిస్తోంది.
మల్టీ టాస్కింగ్ మనకే సాధ్యం
సిఎన్‌బిసి ఎమర్జింగ్ ఇండియా ’మహిళ’ విభాగంలో ఫైనలిస్టుల్లో ఒకరుగా నిలిచారు రంజన. ఐఎస్‌బి ద్వారా నామినేట్ అయిన వైటల్ వాయిసెస్‌లో సభ్యురాలు కూడా. మహిళా స్టార్టప్స్‌కి మెంటరింగ్ సహకారం అందించే చెరీ బ్లైర్ ఫౌండేషన్‌కి మెంటార్‌గా కూడా ఉన్నారు. రష్మీ బన్సాల్ రాసిన పుస్తకం “ఫాలో ఎవ్రీ రైన్ బో” లో ఎంపిక చేసిన 25 మంది భారతీయ ఆంట్రప్రెన్యూర్ల స్ఫూర్తి గాధల్లో ఆమె కథ కూడా ఒకటి.
స్టార్టప్ మొదలుపెట్టేవాళ్లందరికీ ఆమె ఒక సలహా ఇస్తారు. '' మీ సమస్యలని సొంతం చేసుకోవడం చాలా ముఖ్యం. వ్యాపార దృక్పథంలోనే సమస్య ఉంటుంది తప్పితే వ్యాపారంతో ఉండదు. విజయం అంత సులువుగా రాదు. కేవలం కఠిన శ్రమ,నిబద్ధతల వల్లే ఇది సాధ్యం. అంతే కానీ అదృష్టమొక్కటే పనిచెయ్యదు.''
“పని చెయ్యడానికి బయటికి వచ్చి ఇంటిని కూడా చక్కగా నిర్వహించుకునే మహిళలే నాకు రోల్ మోడల్. రెండు చోట్లా మన అవసరం చాలా ఉంటుంది. అది ఎంత కష్టంతో కూడుకున్నదో నాకు బాగా తెలుసు. అయినా ఆ మల్టీ టాస్కింగ్ మనతోనే సాధ్యం ”, అంటూ ముగించారు రంజనా.